కశ్యప్ ‘కనకం’ మోగించె... | Commonwealth Games: Parupalli Kashyap Wins Gold in Men's Badminton Singles Event | Sakshi
Sakshi News home page

కశ్యప్ ‘కనకం’ మోగించె...

Published Mon, Aug 4 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM

కశ్యప్ ‘కనకం’ మోగించె...

కశ్యప్ ‘కనకం’ మోగించె...

అంచనాలను నిజం చేస్తూ భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.

గురువుతో కానిది శిష్యుడు సాధ్యం చేసి చూపించాడు. 32 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. సత్తా ఉన్నా... గొప్ప విజయాలు సాధించడం లేదని తనపై ఉన్న అపప్రథను తొలగించుకున్నాడు. గ్లాస్గో వేదికపై తెలుగు తేజం పారుపల్లి కశ్యప్ మెరిశాడు. అంతిమ సమరంలో ఆధిక్యం దోబూచులాడినా... సంయమనం కోల్పోకుండా... సావధాన ఆటతీరుతో తన రాకెట్ ప్రతాపాన్ని చూపించాడు.
నాలుగేళ్ల క్రితం న్యూఢిల్లీలో ‘కంచు’తో సరిపెట్టుకున్న కశ్యప్ ఈసారి ‘కనకం’ మోగించాడు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు పసిడి ముగింపు ఇవ్వడమే కాకుండా ప్రకాశ్ పదుకొనే, సయ్యద్ మోడిలాంటి దిగ్గజాల సరసన చేరాడు.
మరోవైపు మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడి రజతంతో సంతృప్తి పడగా... సింగిల్స్‌లో సింధు, గురుసాయిదత్ నెగ్గిన కాంస్యాలతో భారత్ ఈసారీ తమ ఖాతాలో నాలుగు పతకాలు జమ చేసుకుంది.
 

పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం
32 ఏళ్ల తర్వాత ఈ ఘనత
మహిళల డబుల్స్‌లో జ్వాల జోడికి రజతం
గ్లాస్గో: అంచనాలను నిజం చేస్తూ భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో పసిడి పతకం నెగ్గిన మూడో భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ కశ్యప్ 21-14, 11-21, 21-19తో డెరెక్ వోంగ్ (సింగపూర్)పై గెలిచాడు. 2010 న్యూఢిల్లీ గేమ్స్‌లో కాంస్యం నెగ్గిన కశ్యప్ ఈసారి స్వర్ణ పతకాన్ని సాధించడం విశేషం. ప్రకాశ్ పదుకొనే (1978), సయ్యద్ మోడి (1982)ల తర్వాత  కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు స్వర్ణం అందించిన మూడో ప్లేయర్‌గా 27 ఏళ్ల ఈ హైదరాబాదీ ఘనత సాధించాడు. కశ్యప్ గురువు పుల్లెల గోపీచంద్ 1998 కౌలాలంపూర్ గేమ్స్‌లో కాంస్యం సాధించగా... పసిడి పతకం నెగ్గి కశ్యప్ తన కోచ్ కలను నిజం చేశాడు.
 
నిలకడగా ఆడి...
ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) గైర్హాజరీలో... ఈ క్రీడల్లో టైటిల్ ఫేవరెట్‌గా అడుగుపెట్టిన కశ్యప్ అంతిమ సమరంలో ఉత్కంఠభరిత క్షణాలను అధిగమించి అనుకున్న ఫలితాన్ని సాధించాడు. పదునైన స్మాష్‌లు, నెట్‌వద్ద అప్రమత్తత, కోర్టుకిరువైపులా చురుకైన కదలికలతో నిలకడగా పాయింట్లు నెగ్గిన కశ్యప్ కేవలం 15 నిమిషాల్లోనే తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.
 
తడబాటుకు లోనై...
తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన కశ్యప్ రెండో గేమ్‌లో మాత్రం తడబాటుకు లోనయ్యాడు. కశ్యప్ లోపాలను పసిగట్టిన వోంగ్ పక్కా వ్యూహంతో ఈ గేమ్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. అనవసర తప్పిదాలతో కశ్యప్ కూడా తన ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకోవడంతో రెండో గేమ్‌ను వోంగ్ 17 నిమిషాల్లో నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు.

కీలకదశలో పైచేయి...
నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్‌కు పోరాడారు. ఒకదశలో కశ్యప్ 8-11తో వెనుకబడినా ఒత్తిడికి లోనుకాకుండా నిగ్రహంతో ఆడుతూ స్కోరును 14-14తో సమం చేయగలిగాడు. ఆ తర్వాత షటిల్‌ను సరిగ్గా అంచనా వేస్తూ కీలకదశలో పాయింట్లు నెగ్గుతూ కశ్యప్ 19-16తో మూడు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే వోంగ్ మరో మూడు పాయింట్లు నెగ్గి స్కోరును సమం చేశాడు. కానీ ఉత్కంఠభరిత క్షణాల్లో కశ్యప్ సంయమనంతో ఆడి వరుసగా రెండు పాయింట్లు సంపాదించి తన కెరీర్‌లో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేశాడు.
 
జ్వాల జోడికి నిరాశ
నాలుగేళ్ల క్రితం న్యూఢిల్లీ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన భారత మహిళల డబుల్స్ జోడి గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం అదే ఫలితాన్ని గ్లాస్గోలో పునరావృతం చేయలేకపోయింది. ఫైనల్లో జ్వాల-అశ్విని జంట 17-21, 21-23తో వివియన్ కా మున్ వూ-ఖె వూ వూన్ (మలేసియా) జోడి చేతిలో ఓడిపోయింది. రెండో గేమ్‌లో జ్వాల జోడికి ఐదు గేమ్ పాయింట్లు లభించినా ఫలితం లేకపోయింది. భారత్ తరఫున పురుషుల సింగిల్స్‌లో గురుసాయిదత్, మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు కాంస్య పతకాలు గెలిచిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా ఈ క్రీడల్లో భారత బ్యాడ్మింటన్‌కు నాలుగు పతకాలు వచ్చాయి.
 
రూ. 25 లక్షల నజరానా
కశ్యప్‌కు రూ. 25 లక్షలు, గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్పలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు, కాంస్య పతక విజేతలు పి.వి.సింధు, గురుసాయిదత్‌లకు రూ. 5 లక్షల చొప్పున... క్వార్టర్స్‌లో ఓడిన  కె.శ్రీకాంత్, పి.సి.తులసిలకు లక్ష రూపాయల చొప్పున అందజేయనున్నట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా తెలిపారు.
 
హెచ్‌డీబీఏ ‘లగ్జరీ కారు’...

హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం (హెచ్‌డీబీఏ) తరఫున కశ్యప్‌నకు లగ్జరీ కారును బహుమతిగా అందించనున్నట్లు హెచ్‌డీబీఏ అధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ ప్రకటించారు.
 
అభినందనల వెల్లువ...
కశ్యప్‌ను ఆంధ్రపదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర రావు అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. తద్వారా రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని వారు కోరారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా కశ్యప్‌కు అభినందనలు తెలిపారు.

నా కల నిజమైంది
దేశం తరఫున స్వర్ణం గెలవాలని నా చిన్నప్పుడు అనుకునేవాడిని. ఇప్పుడు ఆ కల నెరవేరింది. ఇంత పెద్ద మ్యాచ్‌లో గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ టోర్నీకి వచ్చేటప్పుడు పసిడి గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నా శక్తి మేరకు ఆడలేదనే అనుకుంటున్నా. అయినా పతకం సాధించా. ఈ విజయం నాకు చాలా ముఖ్యం. చాలా అవసరం కూడా. పతకం గెలవడం ద్వారా నాపై ఉన్న అంచనాలను అందుకున్నా. భవిష్యత్‌లో మరిన్ని పెద్ద టోర్నీలు, చాంపియన్‌షిప్‌లు సాధించాలని కోరుకుంటున్నా.     - కశ్యప్
 
‘మావాడి కష్టం ఫలించింది’

‘కశ్యప్‌ది చాలా కష్టపడే తత్వం. భారీ విజయాలు రాకపోయినా ఇన్నేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నాడు. ఆరంభంలో చాలా బాగా ఆడటం, టోర్నీ సెమీస్‌లోనో, ఫైనల్లోనో బలమైన ప్రత్యర్థితో పోరాడి ఓడటం చాలాసార్లు జరిగింది. విజయం అంచుల దాకా వచ్చి దురదృష్టవశాత్తూ గెలవలేకపోవడం ఎన్నో పెద్ద ఈవెంట్‌లలో జరిగింది. ఈసారి మాత్రం వాడి శ్రమకు తగిన ఫలితం లభించింది. అందుకే కామన్వెల్త్ స్వర్ణంతో మేం చాలా సంతోషంగా ఉన్నాం.

ఢిల్లీలో కూడా చాలా కొద్దితేడాతో ఫైనల్ అవకాశం కోల్పోయాడు. ఇప్పుడు ఏకంగా బంగారు పతకమే దక్కింది. ఇంకా చెప్పాలంటే అతనిలో ప్రతిభ, టెక్నిక్‌కు లోటు లేదు. కానీ ఫలితమే కాస్త ఆలస్యమైంది. వాడికి ‘ఆస్థమా’ సమస్య ఉన్నా కేవలం ఆటపై అంకితభావంతోనే దానిని అధిగమించాడు. చాలా రోజుల తర్వాత  మా కుటుంబంలో ఈ విజయం ఆనందం పంచింది.’
     - ఉదయశంకర్, సుభద్ర (కశ్యప్ తల్లిదండ్రులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement