
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది క్రితం...భారత స్క్వాష్ (Squash) స్టార్ సౌరవ్ ఘోషాల్ (Sourav Ghoshal) ఆటకు గుడ్‌బై చెప్పాడు. ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) టూర్‌లో భాగంగా చికాగోలో జరిగిన విండీ సిటీ ఓపెన్‌లో ఆడిన తర్వాత అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే 38 ఏళ్ల ఘోషాల్ ఇప్పుడు మళ్లీ ఆటగాడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు.
రిటైర్మెంట్ వదిలి మైదానంలో పోటీ పడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గత నెలలో పీఎస్‌ఏలో సభ్యుడిగా తన పేరు నమోదు చేసుకున్న ఘోషాల్ చాలెంజర్ ఈవెంట్ ఆక్టేన్ సిడ్నీ క్లాసిక్‌లో బరిలోకి దిగుతున్నాడు. ‘టోర్నీల కోసం చేసే ప్రయాణాలు, ఆ పోటీని నేను మళ్లీ ఆస్వాదించాలనుకుంటున్నా.
గత 20 ఏళ్లలో ఆటగాడిగా ఉన్నప్పుడు గడిపిన సమయంతో పోలిస్తే ఈ సారి 10 నెలల్లోనే అంతకంటే ఎక్కువ సమయంలో ఇంట్లో ఉన్నాను.
ఈ సమయంలో భార్యాపిల్లలతో సంతోషంగా గడిపా. కనీసం మరో మూడేళ్లు ఆడగల సత్తా నాలో ఉందని భావిస్తున్నా. విరామ సమయంలో నా కెరీర్‌ను విశ్లేషించేందుకు ప్రయత్నించా. కాబట్టే ఇంకా ఆడాలనిపించింది. ఈ రెండో భాగం మొదటిదానికంటే బాగుంటుందని ఆశిస్తున్నా’ అని ఘోషాల్ చెప్పాడు.
భారత్ తరఫున ఆడాలని...
ఈ సారి పీఎస్‌ఏ టోర్నీలకంటే అంతర్జాతీయ ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే తన మొదటి ప్రాధాన్యతగా అతను పెట్టుకున్నాడు. పురుషుల విభాగంలో భారత అత్యుత్తమ స్క్వాష్ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఘోషాల్... సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో కలిపి కామన్వెల్త్ క్రీడల్లో 1 రజతం, 2 కాంస్యాలు, ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 5 కాంస్యాలు గెలుచుకున్నాడు.
భారత్ తరఫున దాదాపు అన్ని ఘనతలు అతని పేరిటే ఉన్నాయి. ‘పీఎస్‌ఏ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా భారత్ తరఫున మాత్రం ఆడుతూ ఉండాలని భావించా. అయితే పీఎస్‌ఏలో కొనసాగితేనే జాతీయ జట్టు తరఫున ఎంపికయ్యే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అర్థమైంది.
భారత్ తరఫున ఇంకా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాననే నమ్మకం ఉంది. కొన్ని నెలల క్రితమే నా శిక్షణను మళ్లీ ప్రారంభించా. ఆరంభంలో ఫిట్‌నెస్‌పై మాత్రమే దృష్టి పెట్టి ఆపై సాధన కొనసాగించా. దాదాపు ఆరు నెలల మైదానానికి దూరమై మళ్లీ ఆడటం అంత సులువు కాదు’ అని ఘోషాల్ పేర్కొన్నాడు.
ఒలింపిక్స్ ఆశలు...
2026 కామన్వెల్త్ క్రీడల నుంచి స్క్వాష్‌ను తప్పించినా... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో స్క్వాష్‌ను చేర్చడం కూడా ఘోషాల్ భవిష్యత్తుపై ఆశలు పెంచింది. ‘కామన్వెల్త్ క్రీడల్లో మేం స్వర్ణం సాధించలేదు. ఈ సారి గెలవవచ్చని ఆశించా. అయితే ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి ఏమీ చేయలేం.
ఆసియా క్రీడల్లో మాత్రం రాణించే అవకాశం ఉంది. ఒలింపిక్స్‌లో పతకం అనేది నిజంగానే పెద్ద లక్ష్యం. నేను మన దేశం తరఫున ఆడిన పతకం గెలవగలిగితే అంతకన్నా గొప్ప విషయం ఉండదు. కానీ దానికి దాదాపు మూడేళ్లుకు పైగా సమయం ఉంది. ఇప్పటికిప్పుడైతే అంత దూరం ఆలోచించడం లేదు’ అని ఘోషాల్ అభిప్రాయపడ్డాడు. ఆక్టేన్ సిడ్నీ క్లాసిక్ టోర్నీలో తాను విజయం సాధిస్తానని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment