
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ ఐదో అంచె టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి విజేతగా నిలిచింది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి హంపి, చైనా గ్రాండ్‌మాస్టర్ జు జినెర్ 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే ఈ టోర్నీలో నల్ల పావులతో ఎక్కువ గేమ్‌లు (5) ఆడినందుకు హంపికి టైటిల్ ఖరారుకాగా... నల్ల పావులతో తక్కువ గేమ్‌లు (4) ఆడిన జు జినెర్ రన్నరప్‌గా నిలిచింది.
భారత్‌కే చెందిన దివ్య దేశ్‌ముఖ్ 5.5 పాయింట్లతో మూడో స్థానంలో, ద్రోణవల్లి హారిక 4.5 పాయింట్లతో నాలుగో స్థానంలో, వైశాలి 4 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచారు. 10 మంది మేటి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. ఎనిమిది రౌండ్లు ముగిశాక 6 పాయింట్లతో హంపి, జినెర్ సమఉజ్జీగా ఉన్నారు. చివరి రౌండ్ గేముల్లో హంపి 84 ఎత్తుల్లో సలీమోవా (బల్గేరియా)పై, జినెర్ 76 ఎత్తుల్లో పొలీనా (రష్యా)పై గెలిచారు.
దివ్య (భారత్)–అలీనా పోలాండ్) గేమ్ 42 ఎత్తుల్లో... హారిక శ్రీ(భారత్)–మున్‌గున్‌తుల్ (మంగోలియా) గేమ్ 40 ఎత్తుల్లో... వైశాలి (భారత్)–సలోమి (జార్జియా) గేమ్ 37 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. 2024–2025 గ్రాండ్ ప్రి సిరీస్‌లో మొత్తం ఆరు టోర్నీలు ఉండగా... ఇప్పటికి ఐదు ముగిశాయి. ఒక్కో ప్లేయర్ గరిష్టంగా మూడింటిలో పాల్గొనాలి. హంపికి సంబంధించి మూడు టోర్నీలు ముగిశాయి.
ఓవరాల్ పట్టికలో హంపి 279.17 పాయింట్లతో రెండో స్థానంలో... గొర్యాక్‌చినా (రష్యా) 308.34 పాయింట్లతో అగ్రస్థానంలో ... జినెర్ 235 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. జినెర్‌కు మరో టోర్నీ మిగిలి ఉంది. టాప్–2లో నిలిచిన వారు వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధిస్తారు.
