
భారత గ్రాండ్‌మాస్టర్ ఖాతాలో మూడో విజయం
మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నీ
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి జోరు కొనసాగుతోంది. మంగోలియాకు చెందిన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) బత్కుయాగ్ మున్‌గున్‌తుల్‌తో ఆదివారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో నల్ల పావులతో ఆడిన హంపి 33 ఎత్తుల్లో గెలుపొందింది. ఈ టోర్నీలో హంపికిది మూడో విజయం కావడం విశేషం. మరో మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హంపి 4.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
భారత్‌కే చెందిన మరో స్టార్ గ్రాండ్‌మాస్టర్, హైదరాబాద్‌కు చెందిన ద్రోణవల్లి హారిక, ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్‌ల మధ్య జరిగిన ఆరో రౌండ్ గేమ్ ‘డ్రా’గా ముగిసింది. 27 ఎత్తులయ్యాక గేమ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు రెండో పరాజయాన్ని చవిచూసింది. జు జినెర్ (చైనా)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో వైశాలి 41 ఎత్తుల్లో ఓడిపోయింది.
మెలియా సలోమి (జార్జియా)తో జరిగిన మరో గేమ్‌లో పొలీనా షువలోవా (రష్యా) 45 ఎత్తుల్లో గెలిచింది. నుర్గుల్ సలీమోవా (బల్గేరియా), అలీనా కష్లిన్‌స్కాయా (పోలాండ్) మధ్య జరిగిన మరో గేమ్ 67 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. పది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్‌లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. ఆరో రౌండ్ తర్వాత జు జినెర్ ఐదు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
దివ్య దేశ్‌ముఖ్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో, ద్రోణవల్లి హారిక మూడు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. నేడు జరిగే ఏడో రౌండ్ గేముల్లో సలోమితో సలీమోవా; అలీనాతో వైశాలి; జు జినెర్‌తో హంపి; మున్‌గున్‌తుల్‌తో దివ్య దేశ్‌ముఖ్; పొలీనాతో హారిక తలపడతారు.