
కరాచీ: సుప్రసిద్ధ హాకీ టోర్నమెంట్ ‘అజ్లాన్ షా కప్’లో పాకిస్తాన్ జట్టు ఈసారి పోటీపడే అవకాశాన్ని కోల్పోయింది. టోర్నీ నిర్వాహకులకు పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పీహెచ్‌ఎఫ్) బకాయి పడటంతో.. మలేసియా హాకీ సమాఖ్య (ఎమ్‌హెచ్‌ఎఫ్) ఆహ్వానాన్ని నిలిపివేసింది. రెండేళ్ల క్రితం 2023లో జరిగిన టోర్నీకి సంబంధించిన రూ. 8, 83, 582 (10,349 అమెరికా డాలర్లు) బకాయిల్ని జోహర్ హాకీ సంఘం (జేహెచ్‌ఏ)కు ఇంకా చెల్లించలేదు.
అందుకే ఈసారి పాకిస్తాన్‌కు ఆహ్వానాన్ని పంపడంలేదని నిర్వాహకులు తెలిపారు. జేహెచ్‌ఏ నిబంధనల ప్రకారం ఆ టోర్నీలో పాల్గొనే జట్ల సభ్యులకు మాత్రం ఆతిథ్య ఏర్పాట్లు చేస్తారు.
అంతేగాని వారి వెంట వచ్చే కుటుంబసభ్యులు, హాకీ సమాఖ్య ఉన్నతాధికారులు వస్తే బస, స్థానిక రవాణా, ఇతరాత్ర ఖర్చుల్ని వారే భరించాల్సివుంటుంది. 2023 అక్టోబర్‌లో జరిగిన టోర్నీకి సంబంధించి ఆటగాళ్ల కుటుంబసభ్యులు, హాకీ అధికారులకు అయిన ఖర్చుల్ని చెల్లించలేదు.
ఇందుకు సంబంధించి ఇదివరకే మలేసియా హాకీ, జేహెచ్‌ఏ వర్గాలు పాకిస్తాన్ సమాఖ్యకు లేఖ రాసినప్పటికీ చెల్లింపులు మాత్రం చేయలేదు. కుటుంబసభ్యులు, సమాఖ్య అధికారులు ఆటగాళ్లకు బస కల్పించిన లగ్జరీ హోటల్స్‌లోనే గడిపారు. దీనిపై జోహర్ సంఘం మలేసియా సమాఖ్యకు తెలపడంతో బకాయిలు రాబట్టేందుకు పీహెచ్‌ఎఫ్‌తో సంప్రదింపులు జరుపుతోంది.
ఇదీ చదవండి: మూడు విభాగాల్లోనూ శ్రీజ పరాజయం
ట్యూనిస్: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ట్యూనిస్ కంటెండర్ టోర్నమెంట్‌లో భారత రెండో ర్యాంకర్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైన శ్రీజ... మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కే చెందిన సత్యన్ జ్ఞానశేఖరన్‌తో కలిసి క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది. సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 35వ ర్యాంకర్ శ్రీజ 6–11, 9–11, 8–11తో ప్రపంచ 76వ ర్యాంకర్ క్రిస్టినా కాల్‌బెర్గ్ (స్వీడన్) చేతిలో ఓడిపోయింది.
23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీజ తన సర్వీస్‌లో 12 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్‌లో 11 పాయింట్లు సాధించింది. భారత నంబర్‌వన్, ప్రపంచ 30వ ర్యాంకర్ మనిక బత్రా కూడా అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. భారత్‌కే చెందిన దియా చిటాలె 12–10, 5–11, 9–11, 11–4, 11–4తో మనిక బత్రాను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. క్వాలిఫయింగ్ ద్వారా మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన దియా 38 నిమిషాల్లో మనికను ఓడించింది.
తన సర్వీస్ 29 పాయింట్లు సాధించిన దియా ప్రత్యర్థి సర్వీస్‌లో 19 పాయింట్లు సొంతం చేసుకుంది. భారత్‌కే చెందిన మరో ప్లేయర్ యశస్విని ఘోర్పడే తొలి రౌండ్‌లో 7–11, 6–11, 9–11తో అనె యుసెవా (జపాన్) చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో శ్రీజ–సుతీర్థ ముఖర్జీ (భారత్) ద్వయం 11–7, 8–11, 8–11, 10–12తో జు కిహు–యాంగ్ హుజి (చైనా) జంట చేతిలో పరాజయం పాలైంది.
మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో శ్రీజ–సత్యన్ జ్ఞానశేఖరన్ ద్వయం 11–6, 11–9, 11–9తో దిమిత్రి లెవాజెక్– ఇజబెలా (సెర్బియా) జోడీపై గెలిచింది. అనంతరం క్వార్టర్ ఫైనల్లో శ్రీజ–సత్యన్ 6–11, 11–2, 18–16, 2–11, 4–11తో భారత్‌కే చెందిన మనుష్ షా–దియా చిటాలె చేతిలో ఓడిపోయారు.
హర్మీత్ ముందంజ
పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్ హర్మీత్ దేశాయ్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... మానవ్ ఠక్కర్, సత్యన్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. హర్మీత్ 11–6, 11–8, 11–7తో వు యిఫె (చైనా)పై గెలుపొందాడు. మానవ్ 11–8, 6–11, 7–11, 8–11తో మటియాస్ ఫాల్క్ (స్వీడన్) చేతిలో, సత్యన్ 6–11, 5–11, 11–6, 11–9, 9–11తో నవీద్ షమ్స్ (ఇరాన్) చేతిలో పరాజయం పాలయ్యారు.