
న్యూయార్క్: అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం, దివంగత కోబీ బ్రయాంట్ ఎన్‌బీఏ అరంగేట్ర మ్యాచ్‌లో వేసుకున్న జెర్సీ రికార్డు ధరకు అమ్ముడైంది. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) తొలి పోరులో బ్రయాంట్ ధరించిన జెర్సీ... శుక్రవారం నిర్వహించిన వేలంలో 70 లక్షల డాలర్ల (రూ. 59 కోట్ల 76 లక్షలు)కు అమ్ముడైంది.
ఎన్‌బీఏ చరిత్రలో గొప్ప ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న కోబీ... 2020లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. ఆ ఘటనలో బ్రయాంట్ కూతురు గియానాతో పాటు మరో ఏడుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎన్‌బీఏలో భాగంగా బ్రయాంట్ 1996–97 సీజన్‌లో లాస్ ఏంజెలిస్ లేకర్స్ తరఫున అరంగేట్రం చేశాడు. 2007–08 సీజన్‌లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్న సందర్భంలో... బ్రయాంట్ సంతకం చేసిన జెర్సీ గతంలో 5.85 మిలియన్ డాలర్ల (రూ. 49 కోట్ల 93 లక్షల)కు అమ్ముడుపోగా... ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది.
18 ఏళ్ల వయసులో తొలి మ్యాచ్ ఆడిన కోబీ 8వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగి... ఆరు నిమిషాల పాటు ఆడి ఖాతా తెరువలేకపోయాడు. ‘ఈ జెర్సీ ఓ కుర్రాడి సహజసిద్ధ సామర్థ్యానికి, ఆ తర్వాత దిగ్గజ ప్రస్థానానికి మధ్య వారధి. ఒక లెజెండ్‌కు చెందిన అరుదైన, అసాధారణ వస్తువు’ అని వేలం నిర్వహించిన సోథెబైస్ సంస్థ వెల్లడించింది.
ఓవరాల్‌గా క్రీడాకారుల జెర్సీల వేలంలో... బేబ్ రూత్ జెర్సీ (24 మిలియన్ డాలర్లు), మైకేల్ జోర్డాన్ ఎన్‌బీఏ జెర్సీ (10.1 మిలియన్ డాలర్లు), డీగో మారడోనా అర్జెంటీనా జెర్సీ (9.3 మిలియన్ డాలర్ల) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.