మాటలింకా పూర్తిగా రాకుండానే, ఇంకా బుడి బుడి అడుగులతో తడబడుతుండగానే తనకు తోచినవిధంగా బాస్కెట్ బాల్ ఆటాడుతూ అందరినీ అలరించిన ఒక బుడతడు ఇకపై నిరంతరం ఆ బాస్కెట్ బాల్ క్రీడనే శ్వాసిస్తాడని, భవిష్యత్తులోఆ రంగాన్నే శాసిస్తాడని, దిగ్గజంగా వెలుగు లీనుతాడని ఎవరూ ఊహించలేరు. తన ఆటతో మైదానంలోని ప్రేక్షకులను మాత్రమే కాదు... సకల రంగ దిగ్గజాలను సైతం అబ్బురపరిచిన కోబీ బ్రయంట్ నాలుగు పదుల వయసులోనే సోమవారం ఒక హెలికాప్టర్ ప్రమాదంలో తనువు చాలించిన తీరు అందరినీ విషాదంలో ముంచింది. తనెంతో ఇష్టపడే తన కుమార్తె పదమూడేళ్ల జియానాకూ, ఆమె సహచర క్రీడాకారులకూ బాస్కెట్ బాల్‌లో శిక్షణనిచ్చి, వారి ఆటను స్వయంగా చూడటానికి ఆ టీంతో కలిసి హెలికాప్టర్‌లో వెడుతూ వారంద రితోపాటు కోబీ దుర్మరణం పాలయ్యాడు. కోబీ లాంటి క్రీడాకారులు అరుదుగా ఉద్భవిస్తారు. ఏ రంగంపైన అయినా ఇష్టం పెంచుకోవడం అందులో ప్రవేశించడానికి ఏదోమేరకు తోడ్పడవచ్చు. కానీ ఆ రంగంలో కొనసాగాలన్నా, దూసుకుపోవాలన్నా, శిఖరాగ్ర స్థాయిలో నిలవాలన్నా నిరంత రమైన కఠోర సాధన అవసరం. అన్నిటికీ మించి క్రమశిక్షణ ముఖ్యం.
నాన్న జెల్లీ బీన్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు కావడంతో కోబీని ఆ రంగం చిరుప్రాయంనాడే ఆకర్షించింది. ఆయన దగ్గర నేర్చు కున్న మెలకువలు పాఠశాల జట్టులో ప్రవేశించడానికి ఎంతోకొంత ఉపయోగపడివుండొచ్చు. కానీ హైస్కూల్ జట్టు నుంచి పదిహేడేళ్ల చిరుప్రాయంలో నేరుగా ప్రతిష్టాత్మకమైన జాతీయ బాస్కెట్ బాల్ అసోసియేషన్(ఎన్‌బీఏ)కు 1996లో ఎంపిక కావడం మాత్రం పూర్తిగా కోబీ ప్రదర్శించిన ప్రతిభా పాటవాల పర్యవసానమే. బాస్కెట్ బాల్ రంగంలోకి తుపానులా వచ్చిపడిననాడే ఆ ఆటలో అంతక్రితం మైకేల్ జోర్డాన్, విల్ట్ చాంబర్లిన్‌లు నెలకొల్పిన అద్భుతమైన రికార్డుల్ని అధిగమించాలని... కరీం అబ్దుల్ జబ్బార్ కన్నా ఎక్కువ పాయింట్లు సాధించాలని... బిల్ రసెల్‌కి మించిన టైటిళ్లు సొంతం చేసుకోవాలని కోబీ నిర్ణయించుకున్నాడు. కానీ ఒంటినిండా అయిన గాయాల కారణంగా మైకేల్ జోర్డాన్ సాధిం చిన ఆరు టైటిళ్ల స్థాయికి ఈవలే ఉండిపోక తప్పలేదు. ఆ సంగతలావుంచి కోబీ బ్రయాంట్ ఆ ఆటనొక తపస్సుగా భావించి, రోజుకు ఏకబిగిన ఎనిమిది గంటలు అందులోనే మునిగితేలాడు. మెలకువలన్నీ నేర్చుకున్నాడు. వాటికి తన సునిశిత నైపుణ్యాన్ని జోడించాడు.
కనుకనే ఒకసారి బంతి చేతికి చిక్కిందంటే దాన్ని ప్రత్యర్థి పక్షంలో ఎవరికీ అందనీయకుండా, మెరుపు వేగంతో ముందుకు దూసుకుపోవడం, బాస్కెట్‌లో అలవోకగా దాన్ని జారవిడవడం కోబీకి మాత్రమే సాధ్యమయ్యేది. చూసేవారందరినీ మంత్రముగ్ధుల్ని చేసేది. చుట్టుముట్టినవారెవరికీ అందకుండా పాదరసంలా జారి పోయే కోబీ బ్రయాంట్ తీరు ఎవరికీ అంతుచిక్కేది కాదు. రెండు దశాబ్దాలపాటు తన క్రీడా పాటవంతో అందరినీ అలరించాక, ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచాక 2016లో అతను రిటైరైన ప్పుడు కోబీ ఖాతాలో అయిదు ఎన్‌బీఏ టైటిళ్లు, రెండు ఒలింపిక్ స్వర్ణాలు, 33,643 పాయింట్లు ఉన్నాయి. ఒక మ్యాచ్‌లో 81 పాయింట్లు సాధించి టాప్ ఫైవ్‌లో ఒకడిగా నిలిచాడు. తన కెరీర్‌లో అయిదుసార్లు 60 పాయింట్లకంటే ఎక్కువ సాధించిన చరిత్ర కూడా కోబీదే. 2016లో ఆడిన ఆఖరా టలో సైతం ఆ లక్ష్యాన్ని అందుకోవడం అతని విశిష్టత. కోబీ ఆట అందరినీ కట్టిపడేయడానికి, విస్మ యపరచడానికి ప్రత్యేక కారణముంది. ఆటలోకి దిగాక కేవలం పాయింట్లు సాధించడానికి మాత్రమే కోబీ పరిమితం కాడు. ఆట ఆరంభంలోనే దాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తెచ్చుకుంటాడు.
ఆద్యం తమూ అది తనచుట్టూ తిరిగేలా చేసుకుంటాడు. అతనిలోని ఈ లక్షణమే ప్రపంచవ్యాప్తంగా లక్షలా దిమందిని ఆకర్షించింది. వ్యక్తిగా కూడా కోబీ కొన్ని విలువలకు కట్టుబడినవాడు. అందుకే హైస్కూల్ నుంచి వచ్చినప్పుడు తనకు అవకాశమిచ్చిన లేకర్స్ జట్టుతోనే రిటైరయ్యేవరకూ నిలిచి, ఆడిన ప్రతిసారీ తన సర్వశక్తులూ దానిపైనే కేంద్రీకరించాడు. వేరే సంస్థలు లేకర్స్‌ను మించి ఇస్తామని ఆశపెట్టినా లొంగలేదు. కనుకనే కోబీతోపాటే ఆయన వాడిన 8, 24 నంబర్ల జెర్సీలకు లేకర్స్ రిటైర్మెంట్ ఇచ్చేసింది. తన ప్రతిభను దాచుకోవడం, దాన్ని సొమ్ము చేసుకోవాలని చూడటం కోబీకి పొసగనివి. అందుకే సహచర పురుష, మహిళ క్రీడాకారుల ఆటను గమనించడం, అందులోని లోటు పాట్లేమిటో వారికి తెలియజేసి, వారు ఎదగడానికి దోహదపడటం ఆయన ప్రత్యేకత. అందుకే కోబీ సీనియర్లు, సహచర క్రీడాకారులు, అతని అనంతరకాలంలో ఆ రంగంలోకొచ్చినవారు అతన్ని ప్రేమగా స్మరించుకున్నారు. ఇది కోబీ వ్యక్తిత్వాన్ని పట్టిచూపే అంశం.
కోబీ జీవితంలో ఎత్తుపల్లాలు లేవని కాదు. ఆటాడే క్రమంలో అయిన గాయాలు ఆయన్ను ఇబ్బందిపెట్టాయి. ఎన్నోసార్లు మోకాళ్ల వద్ద, చీలమండ దగ్గర గాయాలై ఆట విడుపు తప్పలేదు. తన ప్రాణసమానమైన ఆటకు వీడ్కోలు పలికే వేళ దాన్నుద్దేశించి ‘డియర్ బాస్కెట్ బాల్’ అంటూ కోబీ రాసిన కవిత అతనిలోని క్రీడాకారుడు పుట్టి పెరిగి దిగ్గజంగా రూపొందిన వైనాన్ని వివరిస్తుంది. దాని ఆధారంగా మరో ఇద్దరితో కలిసి తాను నిర్మించిన యానిమేషన్ చిత్రానికి 2018లో ఆస్కార్ అవార్డు లభించింది. ఈ స్వల్ప నిడివి చిత్రం కోబీలోని భిన్న కోణాన్ని ఆవిష్కరించింది. అమెరికా బాస్కెట్‌బాల్‌లో ఈమధ్య మెరుగైన ఆటగాళ్ల జాడ కనబడటం లేదని చాలామందిలో బెంగ పట్టు కుంది. ఒకప్పుడు న్యూయార్క్, లాస్‌ఏంజెలెస్, షికాగో, ఫిలడెల్ఫియా తదితరచోట్ల వీక్షకుల్ని ఉర్రూ తలూగించి కట్టిపడేసిన క్రీడాకారులు ఇప్పుడు ఎక్కడా కానరావడం లేదన్న చింత అందరిలోవుంది. ఇలాంటి తరుణంలో బాస్కెట్‌బాల్‌ను తన జీవితంలో భాగంగా కాదు... దాన్నే జీవితంగా భావించి చివరివరకూ తన సర్వస్వాన్నీ అందుకోసమే ధారపోసిన ‘బ్లాక్ మాంబా’ కోబీ వంటి దిగ్గజం కను మరుగు కావడం విచారకరం. ఆ లోటును పూడ్చడం ఎవరికీ సాధ్యం కాదు.
Comments
Please login to add a commentAdd a comment