చాంపియన్ ప్లేయర్... ఒలింపిక్స్ గోల్డెన్ స్టార్... ఆస్కార్ అవార్డ్ విన్నర్... బాస్కెట్ బాల్ లెజెండ్ కోబీ బ్రయాంట్ జీవన ప్రయాణం విషాదాంతమైంది. హెలికాప్టర్ ప్రమాదంలో ఈ అమెరికన్ సూపర్‌స్టార్ దుర్మరణం పాలయ్యాడు. అతనితో పాటు 13 ఏళ్ల కుమార్తె జియానా కూడా మరణించడం అభిమానుల్ని తీవ్రంగా కలచివేసింది. క్రీడాలోకాన్ని కన్నీట ముంచిన ఈ పిడుగులాంటి వార్తపై ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
లాస్‌ఏంజిల్స్: అమెరికాను... ఎన్‌బీఏనే కాదు... యావత్ క్రీడా ప్రపంచాన్నే దుఃఖ సాగరంలో ముంచేసే వార్త ఇది. 41 ఏళ్ల బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబీ బ్రయాంట్ భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. పైలట్, బ్రయాంట్ సహా 9 మందితో లాస్ ఏంజిల్స్ నుంచి బయలుదేరిన సికోర్‌స్కై ఎస్–76 హెలికాప్టర్ కాలిఫోర్నియా సమీపంలోని క్యాలాబసస్ కొండను ఢీకొట్టింది. వెంటనే అది పేలడంతో ప్రయాణిస్తున్న వారంతా దుర్మరణం పాలయ్యారు.
మృతుల్లో బ్రయాంట్ టీనేజ్ కుమార్తె 13 ఏళ్ల జియానా కూడా ఉంది. మాంబా స్పోర్ట్స్ అకాడమీలో తన కూతురు జియానా బాస్కెట్‌బాల్ మ్యాచ్ ఉండటంతో అందులో పాల్గొనడానికి కోబీ హెలికాప్టర్‌లో బయలుదేరాడు. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మారుమూల కొండప్రాంతంలో పెను ప్రమాదానికి గురైంది. ఈ విషాదవార్త అమెరికాను శోకసంద్రంలో ముంచేసింది. అక్కడి ఆకాశహర్మ్యాలు బ్రయాంట్ జెర్సీ రంగు లైట్లతో సంతాపసూచకంగా వెలిగాయి. కోబీ బ్రయాంట్ మ్యాచ్‌లు ఆడే సమయంలో 8 లేదంటే 24 నంబర్లతో కూడిన పర్పుల్, గోల్డ్, వైట్ కలర్ జెర్సీలను ధరించేవాడు.
ఎత్తయిన టవర్స్ ఈ రంగు లైట్లతో నివాళి ప్రకటించగా... చాలా మంది అమెరికన్లు, బాస్కెట్‌బాల్ అభిమానులు వీధుల్లో గుమిగూడి పుష్పగుచ్ఛాలతో నివాళులు అర్పించారు. ఓ దిగ్గజం విషాదాంతంపై అందరూ శోకతప్త హృదయంతో స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్) దాకా... క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్, టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి అందరూ బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబీ బ్రయాంట్ మరణాన్ని జీర్ణించుకోలేక బరువెక్కిన గుండెలతో సంతాపం ప్రకటించారు.
ఎవరీ బ్రయాంట్... ఏమిటీ ఫాలోయింగ్
క్రికెట్ కిక్‌లోనే ఉండే మనకు బ్రయాంట్ ఎవరో తెలియకపోవచ్చు. కానీ ఎన్‌బీఏ వైపు ఏ కాస్తో కూస్తో కన్నేసిన వారందరికీ బ్రయాంట్ సుపరిచితుడు. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) పోటీలను అమెరికాలో ఇష్టపడని వారుండరు. అందరూ మనసు పడే ఆ ఆటలో రెండు దశాబ్దాల పాటు (1996–2016) తన మెరుపు విన్యాసంతో ఆకట్టుకున్నాడు బ్రయాంట్. కోర్టులో అతని పాదరసంలాంటి కదలికలు గమనించినా... బాస్కెట్‌లో అలవోకగా బంతిని పడేయడం చూసినా... ఎవరికైనా అనిపించేదొక్కటే... ఈ ఆజానుబాహుడు బాస్కెట్‌బాల్ కోసమే పుట్టాడా అని! నిజమే ప్రతిష్టాత్మక ఎన్‌బీఏలో ఆ దిగ్గజ స్టార్ ప్రదర్శన అలా ఉంటుంది మరి! అన్నట్లు అతనేమీ పైచదువులు చదవనేలేదు. పాఠశాల విద్యతోనే పుస్తకాలతో కుస్తీ ముగిసింది. కానీ బాస్కెట్‌బాల్‌తో దోస్తీ మొదలయ్యాక పైపైకి... ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. స్కూల్ చదువు ముగిసిన వెంటనే 1996లో ఎన్‌బీఏలో చేరాడు.
కూతురు జియానాతో...
8, 24 జెర్సీల విలాపం
అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో 1978, ఆగస్టు 23న జన్మించిన బ్రయాంట్ హైస్కూల్ చదువు ముగియగానే 18 ఏళ్ల వయసులో నేరుగా ఎన్‌బీఏలో చేరాడు. అలా 1996లో ‘లాస్‌ఏంజిల్స్ లేకర్స్’ జట్టుకు ఆడటం మొదలుపెట్టిన ఈ ‘బ్లాక్ మాంబా’ (కోబీ ముద్దుపేరు) ఆఖరిదాకా ఆ ఫ్రాంచైజీని వీడలేదు. ఎవరెన్ని మిలియన్ డాలర్లతో ఆఫర్లు ఇచ్చినా... లేకర్స్ తరఫునే తన కెరీర్ ఆసాంతం ఆడటం విశేషం. కోబీ ‘షూటింగ్ గార్డ్’ స్థానంలో 8 లేదంటే 24వ జెర్సీ నంబర్లతో బరిలోకి దిగేవాడు. తన విజయవంతమైన 20 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఘన తలు, రికార్డులు సాధించాక 2016లో గుడ్‌బై చెప్పాడు.
►సుదీర్ఘ కెరీర్‌లో కోబీ 33,643 పాయింట్లు చేయడం విశేషం. ఎన్‌బీఏలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాళ్లలో టాప్–5 (నాలుగో)లో నిలిచాడు. ఒక్క మ్యాచ్‌లోనే 81 పాయింట్లు సాధించిన రికార్డు బ్రయాంట్‌ది. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తుండే ఈ ఆజానుబాహుడు కోర్టులో బంతినందుకుంటే మాత్రం స్కోర్ చేయకుండా ఉండడు. ఎన్‌బీఏలో తన లేకర్స్ జట్టును ఐదుసార్లు (2000, 2001, 2002, 2009, 2010) చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. 2008లో ‘అత్యంత విలువైన ఆటగాడు’గా అవార్డు అందుకున్న బ్రయాంట్ 18 సార్లు ఎన్‌బీఏ ఆల్‌స్టార్స్ జట్టు సభ్యుడిగా ఎంపికయ్యాడు. 2000 నుంచి 2016 వరకు వరుసగా 17 సార్లు ఈ ఘనతకెక్కాడు.
►తన దేశం ‘టీమ్ అమెరికా’కు 2007 నుంచి 2012 వరకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ కాలంలోనే బీజింగ్ (2008), లండన్ (2012) ఒలింపిక్స్‌ల్లో అమెరికా జట్టు బంగారు పతకం గెలుపొందడంలో కీలకపాత్ర పోషించాడు. ఇంతటి ఘనచరిత్రను లిఖించుకున్న బ్రయాంట్‌కు గౌరవసూచకంగా లాస్‌ఏంజిల్స్ లేకర్స్ జట్టు 8, 24 నంబర్ జెర్సీలకు 2017లో రిటైర్మెంట్ ఇచ్చేసింది. ఇప్పుడు ఆ రెండు జెర్సీలకు ప్రాణముంటే గనక తమ ప్రియమైన ఆటగాడి మరణాన్ని జీర్ణించుకోలేక విలపించేవేమో!
►కోబీ బ్రయాంట్‌ది ప్రేమ వివాహం. 2001లో డ్యాన్సర్ వానెస్సా లైన్‌ను కోబీ వివాహం చేసుకున్నాడు. వారికి నలుగురు ఆడ పిల్లలు. నటాలియా (17 ఏళ్లు), జియానా (13 ఏళ్లు), బియాంకా (3 ఏళ్లు), క్యాప్రి (7 నెలలు). హెలికాప్టర్ ప్రమాదంలో రెండో అమ్మాయి జియానా మృతి చెందింది.
►2016లో బాస్కెట్‌బాల్‌కు వీడ్కోలు పలికాక కోబీ బ్రయాంట్ పలు వ్యాపారాలు మొదలుపెట్టాడు. 2018లో ‘డియర్ బాస్కెట్‌బాల్’ పేరుతో కోబీ బ్రయాంట్ నిర్మించిన యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌కు ఆస్కార్ అవార్డు కూడా లభించడం విశేషం.
కోబీ గ్రేటెస్ట్ బాస్కెట్‌బాల్ ప్లేయర్. అతనితో పాటు టీనేజ్ కుమార్తె మృతి చెందారనే భయంకరమైన వార్త నన్ను విషాదంలో ముంచింది. అతని ఆత్మకు శాంతి చేకూరాలని, తన కుటుంబానికి దేవుడు అండగా నిలవాలని ప్రార్థిస్తున్నా. –అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
బాస్కెట్‌బాల్ కోర్టులో బ్రయాంట్ ఓ లెజెండ్. ప్రమాదంలో అతని కూతురు కూడా మరణించడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. –అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా
బ్రయాంట్ నాకు సోదరుడితో సమానం. అలాంటివాడు ఇలా ఆకస్మికంగా మృతిచెందాడనే వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. –బాస్కెట్‌బాల్ లెజెండ్ జోర్డాన్
నేను లేకర్స్‌కు వీరాభిమానిని. బ్రయాంట్ వల్లే ఎన్‌బీఏలో లేకర్స్ చారిత్రక విజయాలెన్నో సాధించింది. శారీరకంగా, మానసికంగా ఎంతో బలమైన ఆటగాడు కోబీ. అలాంటి ప్లేయర్ ఇలా మనకు ఆకస్మికంగా దూరమవడం బాధాకరం. –విఖ్యాత గోల్ఫర్ టైగర్ వుడ్స్
కోబీ, అతని కుమార్తె జియానా మరణించారనే విషాద వార్త నన్ను తీవ్రంగా బాధించింది. అతని కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. –సచిన్
నేను ఉదయాన్నే లేచి ఎన్నోసార్లు కోబీ బ్రయాంట్ మ్యాచ్‌లను చూశాను. అతని మరణవార్తతో దిగ్భ్రాంతికి గురయ్యా. ఆ ప్రమాదంలో అతని కుమార్తె కూడా మృతి చెందడంతో నా గుండె పగిలింది. అతని ఆత్మకు శాంతి చేకూరాలి. దేవుడు వారి కుటుంబానికి ధైర్యమివ్వాలి. –విరాట్ కోహ్లి
బ్రయాంట్ నా ఫేవరెట్. కుమార్తెతో సహా అతను మరణించాడనే వార్తతో నేను షాక్‌కు గురయ్యాను. అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా. –తెలంగాణ మంత్రి కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment