
పుణే: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్‌లో తొలి రోజు నలుగురు భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి రమేశ్‌బాబు తమ తొలి గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... ద్రోణవల్లి హారిక పరాజయం చవిచూసింది. ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ విజయంతో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్ గేముల్లో భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ వైశాలితో నల్లపావులతో ఆడిన ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ హంపి 53 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది.
చైనా గ్రాండ్‌మాస్టర్ జు జినెర్ 53 ఎత్తుల్లో హారికపై గెలుపొందింది. నుర్గుల్ సలీమోవా (బల్గేరియా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో పోటీపడ్డ దివ్య దేశ్‌ముఖ్ 53 ఎత్తుల్లో నెగ్గడం విశేషం. భారత ప్లేయర్ల గేమ్‌లన్నీ 53 ఎత్తుల్లోనే ముగియడం గమనార్హం. ఇతర తొలి రౌండ్ గేముల్లో బత్కుయాగ్ మున్‌గున్‌తుల్ 85 ఎత్తుల్లో మెలియా సలోమీ (జార్జియా)పై, పొలీనా షువలోవా (రష్యా) 57 ఎత్తుల్లో అలీనా కష్లిన్‌స్కాయా (పోలాండ్)పై గెలుపొందారు. మొత్తం 10 మంది ప్లేయర్ల మధ్య తొమ్మిది రౌండ్‌లపాటు ఈ టోర్నీ జరగనుంది.