
భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి
పుణే: క్లాసికల్ ఫార్మాట్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం ఆనందంగా ఉందని... భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి పేర్కొంది. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ ఐదో అంచె టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి హంపి విజేతగా నిలిచింది. 9 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో చైనా గ్రాండ్‌మాస్టర్ జు జినెర్‌తో కలిసి హంపి 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే నల్లపావులతో ఎక్కువ గేమ్‌లు ఆడినందుకు హంపికి టైటిల్ దక్కింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ స్పందిస్తూ... ‘క్లాసికల్‌లో మెరుగైన ప్రదర్శన చేయక చాలా రోజులైంది.
గతేడాది మొత్తం ఈ ఫార్మాట్‌లో నా తడబాటు సాగింది. దీంతో ఎన్నో పరాజయాలు ఎదుర్కోవాల్సి వచ్చిoది. అందుకే ఇందులో టైటిల్ గెలవడం ఆనందాన్ని పెంచింది. ర్యాపిడ్ వరల్డ్ టైటిల్ గెలిచినప్పటి నుంచి నా ఆటతీరు మెరుగైంది. తిరిగి నా టైమ్ వచ్చినట్లు అనిపిస్తోంది. రెండోసారి ర్యాపిడ్ టైటిల్ సాధించిన అనంతరం నాలో కొత్త ఉత్తేజం వచ్చింది. చిన్నప్పుడు ఆడిన ఆటకు ఇప్పుడు ఆడుతున్న ఆటకు చాలా తేడా ఉంది. ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దానికి తగ్గట్లు మనం కూడా మారాలి.
నాకంటే దాదాపు 20 ఏళ్లు చిన్నదైన ప్రత్యర్థితో పోటీపడి గెలవడం బాగుంది’ అని వెల్లడించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోని 38 ఏళ్ల హంపి... క్యాండిడేట్స్ టోర్నీకి ఎంపిక గురించి పెద్దగా ఆలోచించడం లేదని చెప్పింది. ప్రస్తుతానికి అమెరికా, నార్వేలో జరగనున్న టోర్నీలపైనే దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. సాధారణంగా దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థులను పడగొట్టే హంపి... తాజా టోర్నీలో మాత్రం ఆచితూచి ఆడింది. వివాదాలకు దూరంగా ఉండే... హంపికి సరైన సపోర్టింగ్ వ్యవస్థ ఉంటే మరిన్ని ఫలితాలు సాధిస్తుందని పుణే గ్రాండ్‌మాస్టర్ అభిజీత్ కుంటే అభిప్రాయపడ్డాడు.
కెరీర్‌లో లెక్కకు మిక్కిలి టైటిల్స్ గెలిచిన హంపి క్యాండిడేట్స్ ప్రపంచ టైటిల్ మాత్రం ఒడిసి పట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో అభిజీత్ మాట్లాడుతూ.. ‘హంపీ చాలా చక్కగా ఆడుతోంది. ఆమె ఆటలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. చాలా ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కానీ ప్రపంచ టైటిల్ సాధించేందుకు ఇదొక్కటే సరిపోదు. నిష్ణాతులైన బృందం ఆమెకు తోడ్పాటు అందించాలి. ఇప్పుడు ఆమె ఆటతీరు బాగలేదని కాదు కానీ... బలమైన మెంటారింగ్ అవసరం’ అని అన్నాడు.