Classical Chess Tournament
-
‘మళ్లీ నా సమయం వచ్చింది’
పుణే: క్లాసికల్ ఫార్మాట్లో మెరుగైన ప్రదర్శన చేయడం ఆనందంగా ఉందని... భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి పేర్కొంది. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ ఐదో అంచె టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి హంపి విజేతగా నిలిచింది. 9 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో చైనా గ్రాండ్‌మాస్టర్ జు జినెర్‌తో కలిసి హంపి 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే నల్లపావులతో ఎక్కువ గేమ్‌లు ఆడినందుకు హంపికి టైటిల్ దక్కింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ స్పందిస్తూ... ‘క్లాసికల్లో మెరుగైన ప్రదర్శన చేయక చాలా రోజులైంది. గతేడాది మొత్తం ఈ ఫార్మాట్లో నా తడబాటు సాగింది. దీంతో ఎన్నో పరాజయాలు ఎదుర్కోవాల్సి వచ్చిoది. అందుకే ఇందులో టైటిల్ గెలవడం ఆనందాన్ని పెంచింది. ర్యాపిడ్ వరల్డ్ టైటిల్ గెలిచినప్పటి నుంచి నా ఆటతీరు మెరుగైంది. తిరిగి నా టైమ్ వచ్చినట్లు అనిపిస్తోంది. రెండోసారి ర్యాపిడ్ టైటిల్ సాధించిన అనంతరం నాలో కొత్త ఉత్తేజం వచ్చింది. చిన్నప్పుడు ఆడిన ఆటకు ఇప్పుడు ఆడుతున్న ఆటకు చాలా తేడా ఉంది. ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దానికి తగ్గట్లు మనం కూడా మారాలి. నాకంటే దాదాపు 20 ఏళ్లు చిన్నదైన ప్రత్యర్థితో పోటీపడి గెలవడం బాగుంది’ అని వెల్లడించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోని 38 ఏళ్ల హంపి... క్యాండిడేట్స్ టోర్నీకి ఎంపిక గురించి పెద్దగా ఆలోచించడం లేదని చెప్పింది. ప్రస్తుతానికి అమెరికా, నార్వేలో జరగనున్న టోర్నీలపైనే దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. సాధారణంగా దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థులను పడగొట్టే హంపి... తాజా టోర్నీలో మాత్రం ఆచితూచి ఆడింది. వివాదాలకు దూరంగా ఉండే... హంపికి సరైన సపోర్టింగ్ వ్యవస్థ ఉంటే మరిన్ని ఫలితాలు సాధిస్తుందని పుణే గ్రాండ్‌మాస్టర్ అభిజీత్ కుంటే అభిప్రాయపడ్డాడు. కెరీర్లో లెక్కకు మిక్కిలి టైటిల్స్ గెలిచిన హంపి క్యాండిడేట్స్ ప్రపంచ టైటిల్ మాత్రం ఒడిసి పట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో అభిజీత్ మాట్లాడుతూ.. ‘హంపీ చాలా చక్కగా ఆడుతోంది. ఆమె ఆటలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. చాలా ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కానీ ప్రపంచ టైటిల్ సాధించేందుకు ఇదొక్కటే సరిపోదు. నిష్ణాతులైన బృందం ఆమెకు తోడ్పాటు అందించాలి. ఇప్పుడు ఆమె ఆటతీరు బాగలేదని కాదు కానీ... బలమైన మెంటారింగ్ అవసరం’ అని అన్నాడు. -
గుకేశ్ ఎనిమిదో ‘డ్రా’
సెయింట్ లూయిస్: సింక్ఫీల్డ్ కప్ అంతర్జాతీయ క్లాసికల్ చెస్ టోర్నమెంట్లో ఇద్దరు భారత గ్రాండ్‌మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద వరుసగా ఎనిమిదో ‘డ్రా’ నమోదు చేశారు. ఫలితంగా ఈ ఇద్దరికి విజేతగా నిలిచే అవకాశాలకు తెరపడింది. నెదర్లాండ్స్ గ్రాండ్‌మాస్టర్ అనీశ్ గిరితో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో నల్ల పావులతో ఆడిన ప్రపంచ చాంపియన్‌షిప్ చాలెంజర్ గుకేశ్ 23 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన గేమ్‌ను తెల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద 28 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. పది మంది మేటి గ్రాండ్మస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో ఎనిమిదో రౌండ్ తర్వాత మాక్సిమి లాచెర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్), నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్), గుకేశ్, వెస్లీ సో (అమెరికా), ప్రజ్ఞానంద 4 పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... గుకేశ్ ఐదో ర్యాంక్‌లో, ప్రజ్ఞానంద ఏడో ర్యాంక్‌లో నిలిచారు. ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ అలీరెజా ఫిరూజా 5.5 పాయింట్లతో మరో రౌండ్ మిగిలి ఉండగానే విజేతగా అవతరించాడు. 4.5 పాయింట్లతో కరువానా రెండో స్థానంలో ఉన్నాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో వెస్లీ సోతో గుకేశ్; నొదిర్‌బెక్‌తో నిపోమ్‌నిషి (రష్యా); కరువానాతో అనీశ్ గిరి; ఫిరూజాతో ప్రజ్ఞానంద; మాక్సిమితో డింగ్ లిరెన్ తలపడతారు. -
ప్రజ్ఞానంద, గుకేశ్ గేమ్ ‘డ్రా’
సెయింట్ లూయిస్: సింక్ఫీల్డ్ కప్ క్లాసికల్ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేశ్ వరుసగా మూడో ‘డ్రా’ నమోదు చేసుకున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన మూడో గేమ్ 62 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద కాటాలాన్ ఓపెనింగ్‌తో గేమ్‌ను ప్రారంభించాడు.మరోవైపు గుకేశ్ తొలి నాలుగు నిమిషాల్లోనే 18 ఎత్తులు పూర్తి చేయగా... ఆచితూచి ఆడిన ప్రజ్ఞానంద 18 ఎత్తులకు ఒక గంట సమయం తీసుకున్నాడు. 34వ ఎత్తుల్లో గుకేశ్ తప్పిదం కారణంగా ప్రజ్ఞానందకు గెలుపు దారులు తెరుచుకున్నాయి. అయితే ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవడంలో ప్రజ్ఞానంద విఫలమయ్యాడు.చివరకు ఇద్దరూ గేమ్‌ను ‘డ్రా’గా ముగించేందుకు అంగీకరించారు. మూడో రౌండ్ తర్వాత గుకేశ్, ప్రజ్ఞానంద ఖాతాలో 1.5 పాయింట్లు ఉన్నాయి. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా గుకేశ్ నాలుగో ర్యాంక్‌లో, ప్రజ్ఞానంద ఏడో ర్యాంక్‌లో ఉన్నారు.