బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో 3 పతకాలు చేరాయి. బుధవారం జరిగిన పోటీల్లో జూడోలో రజతం... వెయిట్‌లిఫ్టింగ్, స్క్వాష్‌లలో కాంస్యాలు దక్కగా... ఇతర క్రీడాంశాల్లో మన ఆటగాళ్లు ముందంజ వేశారు. స్వర్ణం బరిలోకి దిగిన భారత జూడోకా తులిక మన్ తుది పోరులో తడబడింది. మహిళల ప్లస్ 78 కేజీల ఫైనల్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌కు చెందిన సారా అడ్‌లింగ్టన్ చేతిలో తులిక ఓటమి పాలైంది.
పురుషుల స్క్వాష్‌లో భారత ఆటగాడు సౌరవ్ ఘోషాల్ కొత్త చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో స్క్వాష్ సింగిల్స్‌లో విభాగంలో కాంస్యం రూపంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ప్రపంచ 15వ ర్యాంకర్ సౌరవ్ 11–6, 11–1, 11–4 తేడాతో మాజీ నంబర్‌వన్ జేమ్స్ విల్‌స్ట్రాప్ (ఇంగ్లండ్)ను చిత్తు చేశాడు. 2018 క్రీడల్లో దీపిక పల్లికల్‌తో కలిసి సౌరవ్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రజతం గెలుచుకున్నాడు.
వెయిట్‌లిఫ్టింగ్ 109 కేజీల విభాగంలో లవ్‌ప్రీత్ స్నాచ్‌లో వరుసగా మూడు ప్రయత్నాల్లో ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ 157, 161, 163 కేజీల బరువునెత్తాడు. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా వరుసగా 185, 189 కేజీల తర్వాత 192 కేజీలతో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. మొత్తం (163+192)355 కేజీలతో ప్రీత్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. ఈ విభాగంలో జూనియర్ పెరిక్లెక్స్ (కామెరూన్; 361 కేజీలు) స్వర్ణం సాధించగా, జాక్ ఒపెలాజ్ (సమోవా; 358 కేజీలు) రజతం గెలుచుకున్నాడు. అయితే మహిళల 87+ కేజీల కేటగిరీలో పూర్ణిమ పాండేకు నిరాశే ఎదురైంది. మూడు ప్రయత్నాలు కూడా పూర్తి చేయలేకపోయిన ఆమె ఆరో స్థానంతో ముగించింది.
వెయిట్‌లిఫ్టింగ్‌పై ‘లవ్’తో...
లవ్‌ప్రీత్ సింగ్ స్వస్థలం అమృత్‌సర్ సమీపంలోని బల్ సచందర్ గ్రామం. 13 ఏళ్ల వయసులో కొందరి స్నేహితుల కారణంగా వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకున్న అతను ఆ తర్వాత దానినే కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఊర్లో చిన్న టైలర్ దుకాణం నడిపే తండ్రి కృపాల్ సింగ్‌కు కొడుకును క్రీడాకారుడిగా మార్చే శక్తి లేదు. ముఖ్యంగా అతని ‘డైట్’కు సంబంధించి ప్రత్యేకంగా ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయలేని పరిస్థితి. చాలా మందిలాగే దీనిని లవ్‌ప్రీత్ బాగా అర్థం చేసుకున్నాడు.
అందుకే తన ప్రయత్నం తండ్రికి భారం కారాదని భావించి ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు కొంత డబ్బు సంపాదించుకునే పనిలో పడ్డాడు. అందుకే అమృత్‌సర్‌లోని హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లో పని చేయడం ప్రారంభించాడు. పెద్ద వ్యాపారులకు అమ్మకాల్లో సహాయంగా ఉంటే రూ. 300 వచ్చేవి. వీటిని తన డైట్, ప్రొటీన్స్ కోసం లవ్‌ప్రీత్ వాడుకున్నాడు. అయితే అతని శ్రమ, పట్టుదల వృథా పోలేదు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం మొదలు పెట్టిన తర్వాత వరుస విజయాలు వచ్చాయి. ఈ ప్రదర్శన కారణంగా భారత నేవీలో ఉద్యోగం లభించింది.
దాంతో ఆర్థికపరంగా కాస్త ఊరట దక్కడంతో అతను పూర్తిగా తన ఆటపై దృష్టి పెట్టాడు. ఆ తర్వాత పటియాలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్‌ఐఎస్)లోని జాతీయ క్యాంప్‌కు ఎంపిక కావడంతో అతని రాత పూర్తిగా మారిపోయింది. 2017లో ఆసియా యూత్ చాంపియన్ షిప్‌లో కాంస్యంతో తొలిసారి గుర్తింపు తెచ్చుకున్న అతను జూనియర్ కామన్వెల్త్ చాంపియన్ షిప్‌లో స్వర్ణం సాధించడంతో వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు
కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన మొదటి పతకం 24 ఏళ్ల లవ్‌ప్రీత్ స్థాయిని పెంచింది.
నిఖత్, హుసాముద్దీన్‌లకు పతకాలు ఖాయం
బాక్సింగ్ క్రీడాంశంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్ (50 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు), హరియాణా అమ్మాయి నీతూ (48 కేజీలు) సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో నికోల్ క్లయిడ్ (నార్తర్న్ ఐర్లాండ్)ను ఓడించగా... హుసాముద్దీన్ 4–1తో ట్రైఅగేన్ మార్నింగ్ ఎన్‌డెవెలో (నమీబియా)పై, నిఖత్ 5–0తో హెలెన్ జోన్స్ (వేల్స్)పై గెలిచారు.
రజతంతో సరి
కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు ఈసారి రజత పతకంతో సరిపెట్టుకుంది. 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన టీమిండియా ఈసారి ఫైనల్లో 1–3తో మలేసియా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 18–21, 15–21తో టెంగ్ ఫాంగ్ చియా–వుయ్ యిక్ సో ద్వయం చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 22–20, 21–17తో జిన్ వె గోపై నెగ్గి స్కోరును 1–1తో సమం చేసింది. మూడో మ్యాచ్‌లో 14వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ 19–21, 21–6, 16–21తో ప్రపంచ 42వ ర్యాంకర్ జె యోంగ్ ఎన్జీ చేతిలో ఓడిపోయాడు. నాలుగో మ్యాచ్‌లో థినా మురళీథరన్–కూంగ్ లె పియర్లీ ద్వయం 21–18, 21–17తో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంటను ఓడించి మలేసియాకు స్వర్ణ పతకాన్ని ఖాయం చేసింది. కాంస్య పతక పోరులో సింగపూర్ 3–0తో ఇంగ్లండ్‌ను ఓడించింది.
Comments
Please login to add a commentAdd a comment