judo
-
Paris Paralympics 2024: భారత్ ఖాతాలో 25వ పతకం
పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ ఖాతాలో 25వ పతకం చేరింది. పురుషుల జూడో 60 కేజీల జే1 విభాగంలో కపిల్ పర్మార్ కాంస్య పతకం సాధించాడు. పారాలింపిక్స్ జూడోలో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. కాంస్య పతకం కోసం జరిగిన పోటీలో పర్మార్.. బ్రెజిల్‌కు చెందిన ఎలిల్టన్ డి ఒలివియెరాపై విజయం సాధించాడు. Kapil paaji tussi chha gaye! 💯🙌Defeating WR 2 Elielton De Oliveira, Kapil Parmar secures India's first-ever Paralympic medal in Judo! 🔥#ParalympicGamesParis2024 #ParalympicsOnJioCinema #JioCinemaSports #Judo pic.twitter.com/HrnycLbP4I— JioCinema (@JioCinema) September 5, 2024కపిల్ ఒలివియెరాపై కేవలం 33 సెకెన్లలో విజయం సాధించడం విశేషం. కపిల్ కాంస్యంతో భారత్ కాంస్య పతకాల సంఖ్య 11కు చేరింది. ఇప్పటివరకు భారత్ 5 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్య పతకాలు సాధించింది. -
Deepika Deshwal: ముచ్చటగా మూడోసారి...
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడుసార్లు ప్రసంగించిన తొలి భారతీయ యువతిగా లా ఆఫీసర్ దీపికా దేశ్వాల్ చరిత్ర సృష్టించింది. కాలేజీ రోజుల నుంచి సేవాపథంలో నడుస్తున్న దిల్లీకి చెందిన దీపిక ఎంతోమంది బాధితులకు అండగా నిలిచి, ఎన్నోరకాల సేవాకార్యక్రమాల్లో పాల్గొంది. నలుగురిని ఒకటి చేసి తన దారిలో నడిచేలా చేసింది... పీహెచ్డీ స్కాలర్ అయిన దీపికా దేశ్వాల్కు చదువు మాత్రమే ప్రపంచం కాదు. కాలేజీ రోజుల నుంచి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. కోవిడ్ కల్లోల కాలంలో సామాజిక సేవా కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొంది. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వందలాదిమందికి సహాయం అందించింది. స్నేహితులు, బంధువులను కూడా తన సేవాకార్యక్రమాలలో భాగం చేసింది. అన్నదానం నుంచి అనుకోకుండా ఆపదలో చిక్కుకున్న వారికి సహాయం చేయడం వరకు ఎన్నో చేసింది. తన జీతం మొత్తం కరోనా బాధితుల చికిత్స కోసం విరాళంగా ఇచ్చేది. ఆమె తండ్రి కూడా తన జీతంలోని కొంతమొత్తాన్ని విరాళంగా ఇచ్చేవాడు. ఏ అవసరం ఎప్పుడు వచ్చినా ఫోన్ చేయమంటూ ఎంతోమందికి తన ఫోన్ నంబర్ ఇచ్చింది. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఫోన్ వచ్చినా పరుగులు తీసేది. బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలిచేది. సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్న 80 మంది అమ్మాయిలకు అండగా నిలిచి, నేరస్థులు అరెస్ట్ అయేలా ఉద్యమించింది. వ్యభిచార కూపంలో చిక్కుకున్న అమ్మాయిలను రక్షించి వారికి పునరావాసం ఏర్పాటయ్యేందుకు కృషి చేసింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగానికి మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది. మహిళా సాధికారత నుంచి మానవ హక్కుల వరకు ఎన్నో కార్యక్రమాలలో క్రియాశీల పాత్ర పోషించిన దీపికకు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడోసారి ప్రసంగించే అరుదైన అవకాశం లభించింది. గత రెండు సమావేశాల్లో ‘మానవ హక్కులు–మహిళా హక్కులు’ అంశంపై మాట్లాడి 150 దేశాలకు చెందిన ప్రతినిధుల ద్వారా ప్రశంసలు అందుకుంది. మనసున్న దీపిక ఆటల్లోనూ బంగారం అనిపించుకుంది.‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’ లో రెజ్లింగ్, జూడోలలో ఆరుసార్లు బంగారు పతకం గెలుచుకుంది. ఆత్మరక్షణకు సంబంధించి అమ్మాయిల కోసం రకరకాల వర్క్‌షాప్‌లు నిర్వహించింది. -
లైంగిక వేధింపుల కేసులో జూడో కోచ్‌పై కేసు నమోదు
విజయవాడ: లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో జూడో స్పోర్ట్స్ కోచ్ శ్యామ్యూల్స్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .తమను లైంగికంగా వేధించాడంటూ పలువురు విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో శ్యామ్యూల్స్ రాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మద్యం మత్తులో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణపై కేసు నమోదైంది. తమపై బెదిరింపు చర్యలకు కూడా దిగాడని విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరికైనా చెబితే జీవితం నాశనం చేస్తానని తమను కోచ్ శ్యామ్యూల్స్ రాజు బెదిరించినట్లు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. జూడో నేషనల్ మ్యాచ్‌లో భాగంగా చెన్నైకు వెళుతున్న క్రమంలోనే కోచ్ వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. మెడికల్ టెస్టుల కోసం విజయవాడలో ఆగగా ట్రైన్ మిస్ అయిన క్రమంలో స్టేట్ జూడో ఇన్సిస్ట్యూట్‌కు తీసుకువెళ్లి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. -
హైదరాబాద్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర
-
Commonwealth Games 2022: తులిక తెచ్చిన రజతం
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో 3 పతకాలు చేరాయి. బుధవారం జరిగిన పోటీల్లో జూడోలో రజతం... వెయిట్‌లిఫ్టింగ్, స్క్వాష్‌లలో కాంస్యాలు దక్కగా... ఇతర క్రీడాంశాల్లో మన ఆటగాళ్లు ముందంజ వేశారు. స్వర్ణం బరిలోకి దిగిన భారత జూడోకా తులిక మన్ తుది పోరులో తడబడింది. మహిళల ప్లస్ 78 కేజీల ఫైనల్ మ్యాచ్‌లో స్కాట్లాండ్కు చెందిన సారా అడ్లింగ్టన్ చేతిలో తులిక ఓటమి పాలైంది. పురుషుల స్క్వాష్‌లో భారత ఆటగాడు సౌరవ్ ఘోషాల్ కొత్త చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో స్క్వాష్ సింగిల్స్‌లో విభాగంలో కాంస్యం రూపంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ప్రపంచ 15వ ర్యాంకర్ సౌరవ్ 11–6, 11–1, 11–4 తేడాతో మాజీ నంబర్‌వన్ జేమ్స్ విల్స్ట్రాప్ (ఇంగ్లండ్)ను చిత్తు చేశాడు. 2018 క్రీడల్లో దీపిక పల్లికల్‌తో కలిసి సౌరవ్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రజతం గెలుచుకున్నాడు. వెయిట్‌లిఫ్టింగ్ 109 కేజీల విభాగంలో లవ్‌ప్రీత్ స్నాచ్‌లో వరుసగా మూడు ప్రయత్నాల్లో ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ 157, 161, 163 కేజీల బరువునెత్తాడు. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా వరుసగా 185, 189 కేజీల తర్వాత 192 కేజీలతో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. మొత్తం (163+192)355 కేజీలతో ప్రీత్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. ఈ విభాగంలో జూనియర్ పెరిక్లెక్స్ (కామెరూన్; 361 కేజీలు) స్వర్ణం సాధించగా, జాక్ ఒపెలాజ్ (సమోవా; 358 కేజీలు) రజతం గెలుచుకున్నాడు. అయితే మహిళల 87+ కేజీల కేటగిరీలో పూర్ణిమ పాండేకు నిరాశే ఎదురైంది. మూడు ప్రయత్నాలు కూడా పూర్తి చేయలేకపోయిన ఆమె ఆరో స్థానంతో ముగించింది. వెయిట్‌లిఫ్టింగ్‌పై ‘లవ్’తో... లవ్‌ప్రీత్ సింగ్ స్వస్థలం అమృత్సర్ సమీపంలోని బల్ సచందర్ గ్రామం. 13 ఏళ్ల వయసులో కొందరి స్నేహితుల కారణంగా వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకున్న అతను ఆ తర్వాత దానినే కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఊర్లో చిన్న టైలర్ దుకాణం నడిపే తండ్రి కృపాల్ సింగ్‌కు కొడుకును క్రీడాకారుడిగా మార్చే శక్తి లేదు. ముఖ్యంగా అతని ‘డైట్’కు సంబంధించి ప్రత్యేకంగా ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయలేని పరిస్థితి. చాలా మందిలాగే దీనిని లవ్‌ప్రీత్ బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే తన ప్రయత్నం తండ్రికి భారం కారాదని భావించి ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు కొంత డబ్బు సంపాదించుకునే పనిలో పడ్డాడు. అందుకే అమృత్‌సర్‌లోని హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లో పని చేయడం ప్రారంభించాడు. పెద్ద వ్యాపారులకు అమ్మకాల్లో సహాయంగా ఉంటే రూ. 300 వచ్చేవి. వీటిని తన డైట్, ప్రొటీన్స్ కోసం లవ్‌ప్రీత్ వాడుకున్నాడు. అయితే అతని శ్రమ, పట్టుదల వృథా పోలేదు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం మొదలు పెట్టిన తర్వాత వరుస విజయాలు వచ్చాయి. ఈ ప్రదర్శన కారణంగా భారత నేవీలో ఉద్యోగం లభించింది. దాంతో ఆర్థికపరంగా కాస్త ఊరట దక్కడంతో అతను పూర్తిగా తన ఆటపై దృష్టి పెట్టాడు. ఆ తర్వాత పటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లోని జాతీయ క్యాంప్‌కు ఎంపిక కావడంతో అతని రాత పూర్తిగా మారిపోయింది. 2017లో ఆసియా యూత్ చాంపియన్ షిప్లో కాంస్యంతో తొలిసారి గుర్తింపు తెచ్చుకున్న అతను జూనియర్ కామన్వెల్త్ చాంపియన్ షిప్లో స్వర్ణం సాధించడంతో వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన మొదటి పతకం 24 ఏళ్ల లవ్‌ప్రీత్ స్థాయిని పెంచింది. నిఖత్, హుసాముద్దీన్‌లకు పతకాలు ఖాయం బాక్సింగ్ క్రీడాంశంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్ (50 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు), హరియాణా అమ్మాయి నీతూ (48 కేజీలు) సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో నికోల్ క్లయిడ్ (నార్తర్న్ ఐర్లాండ్)ను ఓడించగా... హుసాముద్దీన్ 4–1తో ట్రైఅగేన్ మార్నింగ్ ఎన్‌డెవెలో (నమీబియా)పై, నిఖత్ 5–0తో హెలెన్ జోన్స్ (వేల్స్)పై గెలిచారు. రజతంతో సరి కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు ఈసారి రజత పతకంతో సరిపెట్టుకుంది. 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన టీమిండియా ఈసారి ఫైనల్లో 1–3తో మలేసియా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 18–21, 15–21తో టెంగ్ ఫాంగ్ చియా–వుయ్ యిక్ సో ద్వయం చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 22–20, 21–17తో జిన్ వె గోపై నెగ్గి స్కోరును 1–1తో సమం చేసింది. మూడో మ్యాచ్‌లో 14వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ 19–21, 21–6, 16–21తో ప్రపంచ 42వ ర్యాంకర్ జె యోంగ్ ఎన్జీ చేతిలో ఓడిపోయాడు. నాలుగో మ్యాచ్‌లో థినా మురళీథరన్–కూంగ్ లె పియర్లీ ద్వయం 21–18, 21–17తో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంటను ఓడించి మలేసియాకు స్వర్ణ పతకాన్ని ఖాయం చేసింది. కాంస్య పతక పోరులో సింగపూర్ 3–0తో ఇంగ్లండ్‌ను ఓడించింది. -
CWG 2022: మరో మూడు పతకాలు ఖాయం చేసిన భారత అథ్లెట్లు
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల వేటలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే (ఆరో రోజు) భారత్ ఖాతాలో 14 పతకాలు చేరగా, మరో 3 పతకాలు జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. తదుపరి మ్యాచ్‌ల్లో భారత అథ్లెట్లు ఓడినప్పటికీ కనీసం ఓ రజతం, రెండు కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరనున్నాయి. మహిళల జూడో 78 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన తులికా మాన్ సిల్వర్ మెడల్‌పై కర్చీఫ్ వేయగా.. పురుషుల బాక్సింగ్ 57 కేజీల విభాగంలో హుసముద్దీన్ ముహమ్మద్ కనీసం కాంస్యం, మహిళల 45-48 కేజీల విభాగంలో నీతు మరో కాంస్యాన్ని ఖరారు చేశారు. ఇదిలా ఉంటే, కామన్వెల్త్ క్రీడల ఆరో రోజు లవ్‌ప్రీత్ సింగ్ కాంస్యం సాధించడంతో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. ఒక్క వెయిట్ లిఫ్టింగ్లోనే భారత్ 9 పతకాలు సాధించడం విశేషం. మిరాబాయ్ చాను (గోల్డ్), జెరెమీ లాల్రిన్నుంగ (గోల్డ్), అచింట షెవులి (గోల్డ్), సంకేత్ సర్గార్ (సిల్వర్), బింద్యా రాణి (సిల్వర్), వికాస్ ఠాకుర్ (సిల్వర్), గురురాజ పుజారి (బ్రాంజ్), హర్జిందర్ కౌర్ (బ్రాంజ్), లవ్‌ప్రీత్ సింగ్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. మిగతా ఐదు పతకాల్లో జూడోలో 2 (సుశీలా దేవీ సిల్వర్, విజయ్ కుమార్ యాదవ్ బ్రాంజ్), లాన్స్ బౌల్స్‌లో ఒకటి (గోల్డ్), టేబుల్ టెన్నిస్‌లో ఒకటి (గోల్డ్), బ్యాడ్మింటన్‌లో ఒకటి (సిల్వర్) గెలిచారు. ఇక పతకాల పట్టిక విషయానికొస్తే.. 5 స్వర్ణాలు , 5 రజతాలు, 4 కాంస్య పతకాలు సాధించిన భారత్ ఈ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. 106 పతకాలతో (42 గోల్డ్, 32 సిల్వర్, 32 బ్రాంజ్) ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ 86 (31 గోల్డ్, 34 సిల్వర్, 21 బ్రాంజ్), న్యూజిలాండ్ 26 (13 గోల్డ్, 7 సిల్వర్, 6 బ్రాంజ్), కెనడా 46 (11 గోల్డ్, 16 సిల్వర్, 19 బ్రాంజ్), సౌతాఫ్రికా 16 (6 గోల్డ్, 5 సిల్వర్, 5 బ్రాంజ్) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో నిలిచాయి. చదవండి: కంటతడి పెట్టిన కిదాంబి శ్రీకాంత్.. స్వర్ణం చేజారాక తీవ్ర భావోద్వేగం -
ముప్పై నాలుగేళ్ల సర్వీసు.. లేడి సింగం
ముప్పై నాలుగేళ్ల్ల సర్వీసులో దాదాపు ఎనిమిది లక్షల మంది అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణనిచ్చారు ఆమె. మహిళలకు ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించిన వర్కషాప్లను నిర్వహిస్తుంటారు. ఢిల్లీలోని కమ్లా మార్కెట్లోని పింక్ చౌకిలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులను నిర్వహిస్తున్న కిరణ్‌సేథీ నేరాలకు అడ్డుకట్టవేయడంలో లేడీ సింగం అని పేరుతెచ్చుకున్నారు, సామాజిక సేవలోనూ తన పాత్ర పోషిస్తూ అభినందనలు అందుకుంటున్నారు. ‘నా ఉద్యోగమే సామాజిక సేవ. సమాజ సేవ చేయలేని వ్యక్తి పోలీసు ఉద్యోగం కూడా సరిగా చేయలేడు. ముప్పై నాలుగేళ్ల క్రితం నా బ్యాచ్ నుంచి వచ్చిన మొదటి మహిళా పోలీసును. జాయిన్ అయినప్పుడు మా పోలీస్‌స్టేషన్‌లో ఉన్న బోర్డుపై ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాశారు’ అని చెబుతారు కిరణ్ సేథీ. కరాటేలో శిక్షణ 1992లో జూడోలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఈ లేడీ సింగం మహిళా కానిస్టేబుళ్లకే కాదు, పురుషులకూ జూడో–కరాటేలో శిక్షణ ఇస్తుంటారు. ‘ఆరుగురు సైనికులకు కూడా శిక్షణ ఇచ్చాను. చదువులో కూడా రాణించాలనుకున్నాను. అందుకు ఐదు పీజీలు పూర్తిచేశాను. గుండాలకు ఎదురెళ్లి ఓ రోజు డ్యూటీకి వెళుతున్నప్పుడు ఒకమ్మాయిని బలవంతంగా ఆటోలో కూర్చోబెట్టడం చూశాను. వెళ్లి అడిగితే బెదిరింపులతో పాటు బ్లేడ్‌తో దాడికి దిగారు. ఆ రోజు నేను సివిల్ డ్రెస్‌లో ఉన్నాను. దీంతో గుండాల బెదిరింపు మరింత ఎక్కువయ్యింది. ఒకరోజు పార్కులో చిన్నారులు ఆడుకుంటున్నారు, మహిళలు నడుస్తున్నారు. అలాంటి ప్లేస్‌లో ఒక వ్యక్తి తన ప్రైవేట్ పార్ట్‌ను చూపించి, వేధించడం దృష్టికి వచ్చింది. వెంటనే అక్కడికక్కడే బుద్ధి చెప్పడంతో పాటు కటకటాల వెనక్కి పంపించాను. ఒక్కోసారి రోజుకు మూడు నాలుగు కేసులు వస్తుంటాయి. రాత్రి, పగలు అని ఉండదు. ఆనందం ముఖ్యం అలాగని, వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బందిలో పెట్టుకోకూడదు. ఆహ్లాదంగానే ఉంచాలి. మహిళా పోలీసులకు కుటుంబం మద్దతు చాలా అవసరం ఉంటుంది. కుటుంబానికి తగినంత సమయం కేటాయించడంతో పాటు, తమ విధులను అర్ధమయ్యే విధంగా చెప్పాల్సి ఉంటుంది. లోలోపల ఆనందంగా ఉన్న వ్యక్తి ఇతరులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టరు. ఎవరికి వారు తమ కోసం కొంత సమయం కేటాయించుకోవాలి. మన శరీరమే దేవాలయం. ఎంత శుద్ధిగా ఉంటే, మన చుట్టూ పరిసరాలను కూడా అంతే బాగా ఉంచగలుగుతాం. పనిలో త్వరగా అలసిపోవడం జరగదు. సాధారణంగా రోజూ ఉదయం ఐదు గంటల నుంచి ఓ గంట సేపు యోగా, మరో గంట చదువు ఉంటుంది. ఆ తర్వాత విధుల్లో భాగంగా ఉంటూనే స్ట్రీట్ చిల్డ్రన్ని పోలీస్ స్టేషన్‌కి పిలిపించి చదువు చెప్పించడం, మహిళలకు హస్తకళల పట్ల శిక్షణ, అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించడం చేస్తుంటాను. సంస్కరణ బాధ్యత నేరస్తులను పట్టుకున్నప్పుడు వారిని ముందు సంస్కరించాలనుకుంటాను. జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాననుకున్నవారికి అవకాశం ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాలు అందజేసేలా చూడటం బాధ్యతగా తీసుకుంటాను. ఆ విధంగా శత్రువులు అనుకున్నవారు కాస్తా మిత్రులు అయ్యారు’ అని వివరిస్తారు కిరణ్ సేథీ. -
ఒలింపిక్స్: కాలర్ పట్టి ఆటగాడి చెంపలు వాయించిన కోచ్
టోక్యో: విశ్వ క్రీడా పోటీలు జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతుండగా క్రీడాకారులు ప్రతిభ చాటేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రీడా పోటీల్లో కొన్ని ఆసక్తికర సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓ క్రీడాకారుడిని కోచ్ రెండు చెంపలు వాయించి పోటీలకు పంపించాడు. కోచ్ కొడుతుంటే ప్లేయర్ ఏమనకుండా ఓకే అంటూ బరిలోకి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అసలు కోచ్ ఎందుకు కొట్టారు? అనే సందేహం అందరిలో ఆసక్తి రేపుతోంది. మీరు చదివి తెలుసుకోండి.. ఎందుకో.. ఒలింపిక్స్‌లో జూడో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో జర్మనీకి చెందిన జూడో స్టార్ మార్టినా ట్రాడోస్ పాల్గొంది. రింగ్‌లోకి వెళ్లేముందు కోచ్ క్లాడియో పుస రెండు చేతులతో కాలర్ పట్టుకుని చెంపలపై వేగంగా కొట్టాడు. అక్కడున్న వారికి షాకింగ్ అనిపించింది. అయితే మార్టినా మాత్రం ఒకే అనుకుంటూ రింగ్‌లోకి వెళ్లింది. బరిలో దిగేముందు కోచ్ క్లాడియో ఇలా చేయడం ఆమెకు అలవాటు అని మార్టినా తెలిపింది. ప్రత్యర్థితో తలపడేలా ఉత్సాహంగా ఉండేందుకు ఇలా చేశారని పేర్కొంది. ఇది తనకు తప్పక అవసరమని చెప్పుకొచ్చింది. రెండు చెంపలు కొట్టడంతో నిద్రమబ్బు వదిలి బరిలో పతకం కొట్టేలా గురి ఉండేందుకు ఇలా కోచ్ చేశారు. A czo tu się odpoliczkowało w ogóle?! pic.twitter.com/mX2r9rMMTA — Mischa Von Jadczak (@michaljadczak) July 27, 2021 -
125 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో ఇలా తొలిసారి..
టోక్యో: 125 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన పోటీల్లో జపాన్‌కు చెందిన అన్నాచెల్లెలు పసిడి పతకం సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. జుడోలో వీరిద్దరూ ఒకేరోజు బంగారు పతకాలు సాధించి ఒలింపిక్స్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 21 ఏళ్ల ఉటా అబే మహిళల 52 కేజీల కేటగిరీలో బంగారు పతకం సాధించగా, అంతకు కొన్ని గంటల ముందే ఆమె సోదరుడు హిఫుమి అబే 66 కేజీల పురుషుల ఫైనల్లో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఇలా తోబుట్టువులు ఒకే రోజు పసిడి పతకాలు సాధించడం ఒలింపిక్స్ చరిత్ర ఇదే తొలిసారి. కాగా, ఫ్రాన్స్‌కు చెందిన అమండైన్ బుచర్డ్‌తో జరిగిన పోరులో ఉటా విజయం సాధించగా, ఆమె సోదరుడు 23 ఏళ్ల హిఫుమి అబే జార్జియాకు చెందిన వాజా మార్గ్వెలాష్విలితో జరిగిన పోరులో విజయం సాధించి పసిడిని పట్టేశాడు. కాగా, ఈ ఇద్దరు అన్నా చెలెల్లు తాము పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే ఏకంగా పసిడి పతాకాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో ప్రస్తుత ఒలింపిక్స్‌లో జపాన్ పసిడి పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఓవరాల్‌గా ఆతిధ్య దేశం ఖాతాలో ఆరు పతకాలు(5 స్వర్ణాలు సహా ఓ రజతం) చేరాయి. -
జూడో క్లాస్; బాలుడిని 27 సార్లు నేలకేసి కొట్టాడు
తైపీ: జూడో క్లాస్ ఏడేళ్ల బాలుని నిండు ప్రాణాలు తీసింది. జూడోక్లాస్ అంటూ కోచ్ 27 సార్లు ఆ బాలుడిని నేలకేసి కొట్టడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. 70 రోజుల పాటు కోమాలో ఉన్న ఆ బాలుడికి కొన్ని రోజులగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. అప్పటినుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా.. ఉన్నట్టుండి బాలుడి శరీరంలో కొన్ని కీలక అవయవాలు పనిచేయడం మానేశాయి. దీంతో తల్లిదండ్రుల అనుమతితో వైద్యులు బాలుడిని వెంటిలేటర్ పైనుంచి తొలగించారు. ఆ తర్వాత కాసేపటికే ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన తైవాన్‌లో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. ఏడేళ్ల హువాంగ్ జూడో నేర్చుకోవడానికి ఏప్రిల్ నెలలో హో అనే కోచ్ వద్ద చేరాడు. జూడో బాగా రావాలంటే శారీరకంగా బలంగా ఉండాలని అక్కడికి వచ్చే పిల్లలకు చెబుతూ వారిపై ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తూ వేధించేవాడు. గత ఏప్రిల్ 21న హువాంగ్ను టార్గెట్ చేసిన కోచ్ హో వాడిని పిలిచి జూడో మూమెంట్స్ అంటూ నేలకేసి కొట్టడం ప్రారంభించాడు. 12సార్లు కిందపడేసిన తర్వాత హువాంగ్ తల నొప్పిగా ఉందంటూ వాంతి చేసుకున్నాడు. ఆ తర్వాత తనను వదిలేయాలంటూ ఎంత ప్రాధేయపడినా కోచ్ కనికరించలేదు. మొత్తంగా 27 సార్లు నేలకేసి కొట్టడంతో ఆ బాలుడు సృహతప్పి పడిపోయాడు. దీంతో హువాంగ్ ప్రాణాలు పోయాయేమోన్న భయంతో హో అక్కడి నుంచి పారిపోయాడు. క్లాస్‌లో ఉన్న మిగతా పిల్లలు పోలీసులకు సమాచారం అందించడంతో హువాంగ్ను ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే కోమాలోకి వెళ్లిపోయిన ఆ బాలుడు 72 రోజలు పాటు మంచంపై నిర్జీవంగా పడి ఉన్నాడు. కాగా బుధవారం హువాంగ్‌కు ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో పాటు అవయవాలు పనిచేయకపోవడంతో వెంటిలేటర్ నుంచి తొలగించిన కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. కోచ్ హోపై కేసు నమోదు చేసిన పోలీసులు తమ విచారణను కొనసాగిస్తున్నారు. చదవండి: వాంటెడ్ క్రిమినల్‌గా ‘మార్క్ జుకర్‌బర్గ్’.. పట్టిస్తే రూ.22కోట్లు -
ఇద్దరికి వైరస్... జట్టు మొత్తం వైదొలిగింది
న్యూఢిల్లీ: అయ్యో వైరస్... ఆడనీయవు, అర్హత కానీయవు. టోక్యో ఒలింపిక్స్ వేటలో పడేందుకు క్వాలిఫయింగ్ టోర్నీలో తలపడాల్సిన భారత జూడో జట్టు చివరి నిమిషంలో వైదొలిగింది. కిర్గిజిస్తాన్ దాకా వెళ్లిన 15 మంది సభ్యులు గల భారత జట్టు పోటీలకు దూరమైంది. ఈ బృందంలోని ఇద్దరు ప్లేయర్లు అజయ్, రీతూలకు కరోనా సోకింది. ఈ నెల 4న భారత జట్టు ఆసియా ఓసియానియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో పాల్గొనేందుకు బిష్కెక్ (కిర్గిజిస్తాన్)కు వెళ్లింది. అయితే మొదట 15 మంది జూడోకాలకు, నలుగురు కోచ్‌లకు నిర్వహించిన తొలి పరీక్షల్లో అంతా నెగెటివ్‌గానే బయటపడ్డారు. కానీ టోర్నీకి కాస్త ముందుగా 5న నిర్వహించిన పరీక్షల్లో అజయ్, రీతూ పాజిటివ్ అని తేలింది. కరోనా నేపథ్యంలోని టోర్నీ నిబంధనల ప్రకారం జట్టులో ఏ ఒక్కరికి కోవిడ్ సోకినా... మొత్తం జట్టంతా పోటీల నుంచి తప్పుకోవాలి. -
ఓవరాల్ చాంపియన్ నిజాం కాలేజి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి జూడో టోర్నమెంట్లో నిజాం కాలేజి జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. జీహెచ్ఎంసీ సలార్–ఎ–మిలత్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో నిజాం కాలేజి ప్లేయర్లు 4 స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. 60 కేజీల విభాగంలో బి. పున్నం చంద్ర, 66 కేజీల విభాగంలో నిజాముద్దీన్, 81 కేజీల విభాగంలో కె. శివ, 90 కేజీల విభాగంలో ముజాహిద్ రోస్ఖాన్ నిజాం కాలేజి తరఫున పసిడి పతకాలను దక్కించుకున్నారు. 55 కేజీల విభాగంలో సయీద్ జుంబాలి (బద్రుకా), ఎం.ఏ హనన్ (అన్వర్–ఉల్–ఉలూమ్), ఎస్. రామాంజనేయ (సెయింట్ మేరీస్), కె. ఉదయ్ కిరణ్ (సీబీఐటీ) వరుసగా తొలి నాలుగు స్థానాలను సాధించారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా జూడో సంఘం అధ్యక్షులు శ్యామ్ అగర్వాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఐసీటీ కార్యదర్శులు ప్రొఫెసర్ బి. సునీల్ కుమార్, కె.దీప్లా తదితరులు పాల్గొన్నారు. ఇతర వెయిట్ కేటగిరీల విజేతల వివరాలు 60 కేజీలు: 1. బి. పున్నం చంద్ర (నిజాం కాలేజి), 2. అబ్దుర్ రషీద్, 3. మొహమ్మద్ అర్ఫత్ అలీ (అరోరా డిగ్రీ కాలేజి). 66 కేజీలు: 1. నిజాముద్దీన్ (నిజాం కాలేజి), 2. కె. సాయి కుమార్ (ఐఐఎంసీ), 3. ఎం. శరణ్ బసప్ప (బీజేఆర్ కాలేజి). 73 కేజీలు: 1. సాజిద్ అలీ ఖాన్ (అన్వర్– ఉల్–ఉలూమ్), 2. షేక్ మొయిన్ (బీజేఆర్ డిగ్రీ కాలేజి), 3. షేక్ మొహమ్మద్ అబ్దుల్లా (టీఎంఎస్‌ఎస్). 81 కేజీలు: 1. కె. శివ కుమార్ (నిజాం కాలేజి), 2. బి. సాయి తరుణ్ (బీజేఆర్ కాలేజి), 3. అలీ అమూదీ (టీఎంఎస్‌ఎస్). 90 కేజీలు: 1. ముజాహిద్ రోస్ఖాన్ (నిజాం కాలేజి), 2. సైఫుద్దీన్ మొహమ్మద్ ఖాజా (ఎంజే ఇంజనీరింగ్ కాలేజి), 3. మొహమ్మద్ షానవాజ్ (అన్వర్– ఉల్– ఉలూమ్). 100 కేజీలు: 1. కె. కేశవ్ కుమార్ (బద్రుకా), 2. జునైద్ మొహమ్మద్ యూసుఫ్ (విద్యా దాయని), 3. మొహమ్మద్ అమీర్ ఖాన్ (అన్వర్– ఉల్–ఉలూమ్). -
దొంగాట
⇔ ప్రతిభకు పాతరేస్తూ సర్టిఫికెట్ల ప్రదానం ⇔ ఫెన్సింగ్.. జూడో.. సాఫ్ట్‌బాల్ ⇔ అసోసియేషన్ల పాత్రపై అనుమానం ⇔ ఈ ఏడాది స్పోర్ట్స్ కోటాలో మెడిసిన్‌కు 15 మంది విద్యార్థులు ⇔ నేతల జోక్యంతో గుట్టుగా వ్యవహారం ⇔ ఉన్నత స్థాయి విచారణతో కలకలం మెడిసిన్ కోటా లక్ష్యంగా క్రీడలు ⇔ జూడో ఓపెన్ కేటగిరీ కింద జిల్లాకు చెందిన రెడ్డప్పరెడ్డి 100 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని సాధిస్తే.. దీన్ని చిత్తూరు జిల్లాకు చెందిన రుత్విక్ అనే విద్యార్థికి కట్టబెట్టారు. ప్రస్తుతం ఈ విద్యార్థి ఎస్వీ మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదువుతుండటం గమనార్హం. ⇔ క్రీడా వ్యాపారం అనంతను కుదిపేస్తోంది. దొడ్డిదారిలో మెడిసిన్ సీటు దక్కించుకునేందుకు ఆడిన ‘ఆట’.. ప్రతిభ కలిగిన విద్యార్థుల కంట తడి పెట్టిస్తోంది. గెలుపొందిన క్రీడాకారులకు.. సర్టిఫికెట్‌లోని పేర్లకు పొంతన లేకుండా సాగించిన దొంగాట క్రీడాలోకంలో చర్చనీయాంశంగా మారింది. స్పోర్ట్స్ అసోసియేషన్ నాయకులు.. ప్రజాప్రతినిధుల కన్నుసన్నల్లోనిదే ఈ తంతు. అనంతపురం సప్తగిరి సర్కిల్: ప్రతిభకు స్పోర్ట్స్ కోటా పాతరేసింది. మెడిసిన్ సీటు సాధించడమే లక్ష్యంగా కొందరు తల్లిదండ్రులు, స్పోర్ట్స్ అసోసియేషన్ల ప్రతినిధులతో పాటు నేతలు రంగ ప్రవేశం చేయడంతో సర్టిఫికెట్ల వ్యాపారం మొదలైంది. అనంతపురంలోనే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించి సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. క్రీడాకారుడు ఒకరయితే.. సర్టిఫికెట్‌ను మరో విద్యార్థి పేరిట ఇవ్వడం ద్వారా దొంగాటకు తెర తీశారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రధాన క్రీడా మైదానం కేంద్రంగా ఈ తంతు సాగింది. చిత్తూరుకు చెందిన రుత్విక్ విషయంలో ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, యూత్ అఫైర్స్‌కు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బట్టబయలయింది. ఇంటర్ పూర్తి చేసిన ఈ విద్యార్థి సీనియర్ నేషనల్ క్రీడాంశాల్లో పాల్గొనేందుకు అనర్హుడు. అయితే ధనార్జనే ధ్యేయంగా ఇతనికి సర్టిఫికెట్‌ను ప్రదానం చేయడం గమనార్హం. గతేడాది తెలంగాణలో నిర్వహించిన స్పోర్ట్స్ కోటా సీట్ల విషయంలో ఆ ప్రాంత రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ధన్కిషన్ను దోషిగా తేల్చారు. ఈ ఏడాది అనంతపురం జిల్లా కేంద్రంగా ప్రధాన క్రీడాంశాలైన ఫెన్సింగ్.. జూడో.. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ల రాష్ట్ర కార్యదర్శుల పాత్ర జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నకిలీ ధ్రువీకరణ పత్రాల జారీ వెనుక వీరి హస్తం ఉందనే అనుమానం పలువురు క్రీడాకారులతో పాటు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. నలుగురు బోగస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్‌లో మెడిసిన్‌కు 0.05 స్పోర్ట్స్ కోటాలో 16 మెడిసిన్, 4 డెంటల్ సీట్లు కేటాయిస్తుం ది. ఇందులో మిగతా క్రీడాంశాలతో పోలిస్తే ఫెన్సింగ్, జూడో, సాఫ్ట్‌బాల్ క్రీడాకారులకే అధిక లబ్ధి చేకూర్చడం అనుమానాలకు తావిస్తోంది. ఇదే విషయమై గత ఏడాది పలువురు తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడంతో విచారణకు ఈ ఏడాది ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటయింది. ఆ మేరకు నలుగురు క్రీడాకారులు బోగస్ అని వెల్లడయింది. ఈ ఏడాది స్పోర్ట్స్ కోటాలో 15 మంది రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల నిర్వహణకు సంబం ధించి స్పోర్ట్స్ అథారిటీకి, ఒలంపిక్స్ అసోసియేషన్‌కు పూర్తి నివేదికలను, రెఫరీల వివరాలను అం దించాల్సి ఉంది. అయితే అంతర్జాతీయ క్రీడలకు వెళ్లే క్రీడాకారులకు ఇండియా ఫెడరేషన్, యూత్ అఫైర్స్ నుంచి ఎలాంటి అప్రూవల్ ఉండదు. అ యినప్పటికీ అంతర్జాతీయ క్రీడలకు ఆయా జిల్లా ల నుంచి క్రీడాకారులను పంపుతుండటం గమనార్హం. గత ఏడాది వరకు ఎంసెట్‌కు ఎంత మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారనే వివరాలు కూడా ఆయా జిల్లాల క్రీడా ప్రాధికార సంస్థ వద్ద లేకుండానే క్రీడాకారులకు హైదరాబాద్, విజయవాడలోని ప్రధాన కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ఏడాది అనంతపురం జిల్లా నుంచి 15 మంది క్రీడాకారులు ఎంసెట్‌కు స్పోర్ట్స్ కోటాలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో ఎంత మంది అర్హులనే విషయం విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. నేతకు సలాం క్రీడల్లో రాజకీయ జోక్యం మీతిమిరితే ప్రతి భ పక్కకు తప్పుకుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మంత్రి పరిటాల సునీ త కుమారుడు శ్రీరాంను జిల్లా ఒలంపిక్స్ సంఘం అడ్హాక్ కమిటీ అధ్యక్షునిగా గత జూలైలో ఎన్నుకోవడంలో ఫెన్సింగ్, జూ డో, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ల రాష్ట్ర కార్యదర్శులు కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అండదండలు ఉండటంతోనే నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో క్రీడా ప్రతినిధులు దూకుడు ప్రదర్శించినట్లు చర్చ జరుగుతోంది. జిల్లాకు చెందిన ముఖ్య ప్రభుత్వ శాఖల అధికారుల పిల్లలకు నకిలీ సర్టిఫికెట్లను కట్టబెట్టిన నేపథ్యంలో ఈ దొంగాట గుట్టుగా సాగినట్లు సమాచారం. -
జాతీయ స్థాయికి ఎంపికైన జూడో క్రీడాకారిణి
ఆత్మకూరు(ఎం): మండలంలోని రహీంఖాన్‌పేటకు చెందిన బిల్ల అశ్విత జూడో పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపిక అయ్యారు. సెప్టెంబర్ 27న బీబీనగర్ మండలం వెంకిర్యాలలో నల్లగొండ జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జూడో పోటీల్లో ఆత్మకూరు(ఎం) మండలం నుంచి రహీంఖాన్‌పేటకు చెందిన బిల్ల అశ్విత పాల్గొన్నారు. బిల్ల అశ్విత జూడో క్రీడలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యారు. ఈ నెల 1, 2, 3తేదీల్లో వరంగల్ సిటిజన్ క్లబ్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయికి ఎంపికైంది. ఆమె త్వరలో పాట్నాలో జరుగనున్న జూడో క్రీడల్లో పాల్గొననున్నారు. -
జూడో విజేత అనంతపురం
– రెండు స్థానంలో కర్నూలు, మూడో స్థానంలో చిత్తూరు నందికొట్కూరు: రాష్ట్ర స్థాయి సబ్ జూడో పోటీల్లో అనంతపురం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. నందికొట్కూరు పట్టణంలోని మార్కెట్ యార్డులో మూడు రోజులుగా ఉత్కంఠగా జరుగుతున్న పోటీలు ఆదివారం ముగిశాయి. శ్రీకాకుళం మినహా మిగతా 12 జిల్లాలో దాదాపు 288 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. పలు విభాగాల్లో నిర్వహించిన బాలురు, బాలికల పోటీల్లో అనంతపురం క్రీడాకారులు సత్తా చాటి విజేతగా నిలిచారు. కర్నూలు జిల్లా క్రీడాకారులు రెండో స్థానంలో, చిత్తూరు జిల్లా క్రీడాకారులు మూడో స్థానంలో నిలిచారు. వచ్చే నెల 13వ తేదీ నుంచి బీహార్ రాష్ట్రం పాట్నాలో జాతీయ స్థాయి సబ్ జూడో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ జూడో అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్ నాంశెట్టి చెప్పారు. రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఈనెల 20వ తేదీ నుంచి అనంతపురంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేతలు కట్టమంచి జనార్దన్‌రెడ్డి, పుల్లయ్య, శ్రీనివాసరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి, ఎంపీపీ ప్రసాదరెడ్డి, మాలమహానాడు డివిజన్ అధ్యక్షులు అచ్చన్న, టీడీపీ యూత్ డివిజన్ నాయకులు రవికుమార్‌రెడ్డి, జవ్వాజి సుంకన్నగౌడు సేవా సమితి అధ్యక్షులు శ్రీకాంత్‌గౌడు, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్.రవికుమార్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా సబ్ జూడో పోటీలు
నందికొట్కూరు: స్థానిక మార్కెట్ యార్డులో రాష్ట్రస్థాయి సబ్జూడో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శనివారం పోటీలను మార్కెట్ యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగు పడతాయన్నారు. గెలుపోటమలు సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. ఎంపీపీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ పట్టుదలతో సాధన చేసి క్రీడల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. సబ్జూడో పోటీల్లో 12 జిల్లాలకు చెందిన బాలబాలికలు పాల్గొన్నారు. శనివారం పోటీల్లో మొదటి స్థానంలో అనంతపురం జిల్లా, రెండో స్థానంలో కర్నూలు జిల్లా, మూడో స్థానంలో చిత్తూరు జిల్లాలు నిలిచాయి. రాష్ట్ర జూడో అధ్యక్షుడు వెంకట్, కార్యదర్శి బాబు, జిల్లా కార్యదర్శి శ్రీధర్, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్. రవికుమార్, నాగరాజు, రిటైర్డు పీడీ శివశంకరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇద్దరి విద్యార్థులకు గాయాలు.. పోటీల్లో చిత్తూరు జిల్లా బైరాగిపట్టెడ మహత్మాగాంధీ మున్సిపాల్ కార్పొరేషన్ హైస్కూల్ విద్యార్థి వినోద్‌కు కుడి చేయి విరిగింది. వెస్ట్ గోదావరికి చెందిన శివగణేష్‌కు కుడి భుజం బోను విరిగింది. పట్టణంలోని వాసవి వైద్యశాల్లో తాత్కాలిక చికిత్సలు నిర్వహించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు మెరుగైన వైద్యం కోసం 108 ద్వారా విద్యార్థులను తరలించారు. -
అమ్మాయిలకు జూడో, కరాటేలో శిక్షణ
ఆత్మరక్షణ కోసం ఉత్తరప్రదేశ్‌లోని 90 వేల మంది అమ్మాయిలకు జూడో, కరాటేలలో శిక్షణ ఇవ్వనున్నట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు అక్కడి మాధ్యమిక విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఈ శిక్షణ ఇవ్వాలి. అన్ని పాఠశాలల్లో ఉన్న విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్యలలో శిక్షణ ఇప్పించడం వెంటనే మొదలుపెట్టాలని మాధ్యమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ ఆదేశించారు. 2014-15 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాలతో పాటు ఈ శిక్షణను కూడా ఒక భాగంగా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొన్ని నెలల క్రితమే ఈ విషయమై అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ జూడో సమాఖ్య ప్రధాన కార్యదర్శి మునవ్వర్ అంజార్‌ను సలహాదారుగా నియమించారు.