
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడుసార్లు ప్రసంగించిన తొలి భారతీయ యువతిగా లా ఆఫీసర్ దీపికా దేశ్వాల్ చరిత్ర సృష్టించింది.
కాలేజీ రోజుల నుంచి సేవాపథంలో నడుస్తున్న దిల్లీకి చెందిన దీపిక ఎంతోమంది బాధితులకు అండగా నిలిచి, ఎన్నోరకాల సేవాకార్యక్రమాల్లో పాల్గొంది.
నలుగురిని ఒకటి చేసి తన దారిలో నడిచేలా చేసింది...
పీహెచ్‌డీ స్కాలర్ అయిన దీపికా దేశ్వాల్‌కు చదువు మాత్రమే ప్రపంచం కాదు. కాలేజీ రోజుల నుంచి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. కోవిడ్ కల్లోల కాలంలో సామాజిక సేవా కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొంది. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వందలాదిమందికి సహాయం అందించింది. స్నేహితులు, బంధువులను కూడా తన సేవాకార్యక్రమాలలో భాగం చేసింది.
అన్నదానం నుంచి అనుకోకుండా ఆపదలో చిక్కుకున్న వారికి సహాయం చేయడం వరకు ఎన్నో చేసింది.
తన జీతం మొత్తం కరోనా బాధితుల చికిత్స కోసం విరాళంగా ఇచ్చేది. ఆమె తండ్రి కూడా తన జీతంలోని కొంతమొత్తాన్ని విరాళంగా ఇచ్చేవాడు.
ఏ అవసరం ఎప్పుడు వచ్చినా ఫోన్ చేయమంటూ ఎంతోమందికి తన ఫోన్ నంబర్ ఇచ్చింది. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఫోన్ వచ్చినా పరుగులు తీసేది. బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలిచేది.
సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్న 80 మంది అమ్మాయిలకు అండగా నిలిచి, నేరస్థులు అరెస్ట్ అయేలా ఉద్యమించింది. వ్యభిచార కూపంలో చిక్కుకున్న అమ్మాయిలను రక్షించి వారికి పునరావాసం ఏర్పాటయ్యేందుకు కృషి చేసింది.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగానికి మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది.
మహిళా సాధికారత నుంచి మానవ హక్కుల వరకు ఎన్నో కార్యక్రమాలలో క్రియాశీల పాత్ర పోషించిన దీపికకు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడోసారి ప్రసంగించే అరుదైన అవకాశం లభించింది. గత రెండు సమావేశాల్లో ‘మానవ హక్కులు–మహిళా హక్కులు’ అంశంపై మాట్లాడి 150 దేశాలకు చెందిన ప్రతినిధుల ద్వారా ప్రశంసలు అందుకుంది.
మనసున్న దీపిక ఆటల్లోనూ బంగారం అనిపించుకుంది.‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’ లో రెజ్లింగ్, జూడోలలో ఆరుసార్లు బంగారు పతకం గెలుచుకుంది. ఆత్మరక్షణకు సంబంధించి అమ్మాయిల కోసం రకరకాల వర్క్‌షాప్‌లు నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment