womens rights
-
పుట్టిన రోజు వేడుకలకూ నోచుకోలేదు
ఈ ఫొటో చూస్తే మీకేమనిపిస్తోంది? ఏదో హెయిరాయిల్ ప్రకటనలా ఉంది కదా! కానీ నిజానికి అదో బర్త్‌డే పార్టీ. అత్యంత రహస్యంగా చేసుకున్న పార్టీ. అందులో పాల్గొన్న అమ్మాయిలంతా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ముఖాలు కనబడకుండా జాగ్రత్త పడ్డారు. బర్త్‌డే పార్టీ అంత రహస్యంగా చేసుకోవడమెందుకు? వేరే ఏ దేశంలోనైనా అవసరం లేదు. కానీ ఆఫ్గానిస్తాన్‌లో మాత్రం అది అత్యవసరం! తాలిబన్ల పాలనలో అక్కడి మహిళలు, బాలికల దుస్థితికి అద్దం పడుతున్న ఈ ఫొటోను ఇరాన్–కెనడియన్ ఫొటో జర్నలిస్ట్ కియానా హయేరి తీశారు. ఇలాంటి చిత్రాల సమాహారాన్ని ‘నో విమెన్స్ లాండ్’ పేరిట ఈ నెల పారిస్‌లో ప్రదర్శించనున్నారు.ఏడు ప్రావిన్సులు తిరిగి... ఫ్రెంచ్ పరిశోధకురాలు మెలిస్సా కార్నెట్తో హయేరి 2018 నుంచి కలిసి పని చేస్తున్నారు. వారు కొన్నేళ్లుగా అఫ్గాన్‌లోనే ఉంటున్నారు. 2021లో అమెరికా సైన్యం అఫ్గాన్‌ను వీడటం, దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడం వంటి పరిణామాలకు వాళ్లు ప్రత్యక్ష సాక్షులు. నానాటికీ దిగజారుతున్న పరిస్థితులు వారిని భయపెట్టాయి. మహిళల హక్కులను గౌరవిస్తామని కల్లబొల్లి ప్రతిజ్ఞలు చేసిన తాలిబన్లు చివరికి వాళ్లకు అసలు ప్రజా జీవితమే లేకుండా చేశారు. ప్రాథమిక హక్కులతో సహా సర్వం కాలరాశారు. మహిళల గొంతు వినపడటమే నిషేధం. ముసుగు లేకుండా, మగ తోడు లేకుండా గడప దాటడానికి లేదు! బాలికల చదువుకు పాఠశాల స్థాయితోనే మంగళం పాడారు. బహిరంగ ప్రదేశాల్లో సంగీతం, నృత్యం నిషేధం. అఫ్గాన్ మహిళల దుస్థితిని బయటి ప్రపంచానికి చూపేందుకు హయేరి, కార్నెట్ ఏడు ప్రావిన్సుల్లో పర్యటించారు. ఎంతోమంది మహిళలను కలిశారు.ఆశలకు ప్రతీకలు కూడా... ఎంతసేపు అణచివేత గురించే ఎందుకు చెప్పాలి? అందుకే అఫ్గాన్ బాలికలు, మహిళలకు భవిష్యత్తు మీదున్న ఆశను కూడా హయేరి, కార్నెట్ ఫొటోల్లో బందించారు. తమ చీకటి జీవితాల్లో వెలుగులు నింపే వేడుకలను వాళ్లు జరుపుకొంటున్నారో చెబుతున్నారు. ప్రస్తుతం అఫ్గాన్‌లో బాలికలు, స్త్రీలకు సంబంధించి చిన్న వేడుక అయినా అది నేరుగా తాలిబన్ ప్రభుత్వాన్ని ధిక్కరించడమే. అందుకే బాలికలు పుట్టిన రోజులు, పెళ్లిళ్ల వంటి వేడుకల్లో స్నేహితులను కలుస్తున్నారు. వాటి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది ప్రమాదాలు తెచ్చి పెడుతుందని తెలిసీ రిస్క్ చేస్తున్నారు. మహిళలు గుర్తింపుకే నోచుకోని చోట ఇలాంటి చిన్న వేడుకైనా పెద్ద ప్రతిఘటనే! చిరునవ్వులు చిదిమేస్తున్న కాలంలో ఆనందాన్ని ప్రదర్శించడం కూడా తిరుగుబాటే. అందుకే నిరసనను వ్యక్తం చేసే ఏ అవకాశాన్నీ మహిళలు వదులుకోవడం లేదంటున్నారు. హయేరి, కార్నెట్.తాలిబన్లలోనూ విభేదాలు!మహిళలను తీవ్రంగా అణచివేయడంపై తాలిబన్లలోనే వ్యతిరేకత పెరుగుతోంది! అతివాది అయిన దేశాధినేత షేక్ హైబతుల్లా అఖుందా జాదా నిర్ణయాలను తాలిబన్లలోనే ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ వంటివాళ్లు బాలికలు, యువతుల విద్య కోసం ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికలకు ఆరో తరగతి తర్వాత కూడా విద్యను అందించే అండర్ గ్రౌండ్ పాఠశాలలపై తాలిబన్లలోని కొన్ని విభాగాలు దృష్టి సారించినట్టు కార్నెట్ పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఆమె మహిళా హక్కుల పరిరక్షకురాలు’
న్యూఢిల్లీ: జస్టిస్ హిమా కోహ్లి ఒక మహిళా జడ్జి మాత్రమే కాదని స్త్రీ హక్కుల పరిరక్షణకు తీవ్రంగా పాటుపడ్డారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కితాబిచ్చారు. సెప్టెంబరు 1న రిటైరవుతున్న హిమా కోహ్లి గౌరవార్థం సీజేఐ శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఆమె రిటైరయ్యాక సర్వోన్నత న్యాయస్థానంలో ఇద్దరు మహిళా న్యాయమూర్తులు.. జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ బేలా ఎం. త్రివేదిలు ఉంటారు. ‘జస్టిస్ కోహ్లితో కలిసి ధర్మాసనంపై కూర్చోవడం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. హిమా.. మీరొక మహిళా జడ్జి మాత్రమే కాదు.. స్త్రీల హక్కుల పరిరక్షకురాలు కూడా’ అని సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చంద్రచూడ్, హిమాకోహ్లిలు బ్యాచ్మేట్లు కావడం గమనార్హం. న్యాయం కోసం జస్టిస్ కోహ్లి తన జీవితాన్ని ధారబోశారని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అన్నారు. 2006 మే నెలలో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులైన హిమా కోహ్లి.. 2007 ఆగస్టులో శాశ్వత జడ్జి అయ్యారు. జనవరి 7, 2021న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 ఆగస్టు 31న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. -
Deepika Deshwal: ముచ్చటగా మూడోసారి...
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడుసార్లు ప్రసంగించిన తొలి భారతీయ యువతిగా లా ఆఫీసర్ దీపికా దేశ్వాల్ చరిత్ర సృష్టించింది. కాలేజీ రోజుల నుంచి సేవాపథంలో నడుస్తున్న దిల్లీకి చెందిన దీపిక ఎంతోమంది బాధితులకు అండగా నిలిచి, ఎన్నోరకాల సేవాకార్యక్రమాల్లో పాల్గొంది. నలుగురిని ఒకటి చేసి తన దారిలో నడిచేలా చేసింది... పీహెచ్డీ స్కాలర్ అయిన దీపికా దేశ్వాల్కు చదువు మాత్రమే ప్రపంచం కాదు. కాలేజీ రోజుల నుంచి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. కోవిడ్ కల్లోల కాలంలో సామాజిక సేవా కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొంది. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వందలాదిమందికి సహాయం అందించింది. స్నేహితులు, బంధువులను కూడా తన సేవాకార్యక్రమాలలో భాగం చేసింది. అన్నదానం నుంచి అనుకోకుండా ఆపదలో చిక్కుకున్న వారికి సహాయం చేయడం వరకు ఎన్నో చేసింది. తన జీతం మొత్తం కరోనా బాధితుల చికిత్స కోసం విరాళంగా ఇచ్చేది. ఆమె తండ్రి కూడా తన జీతంలోని కొంతమొత్తాన్ని విరాళంగా ఇచ్చేవాడు. ఏ అవసరం ఎప్పుడు వచ్చినా ఫోన్ చేయమంటూ ఎంతోమందికి తన ఫోన్ నంబర్ ఇచ్చింది. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఫోన్ వచ్చినా పరుగులు తీసేది. బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలిచేది. సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్న 80 మంది అమ్మాయిలకు అండగా నిలిచి, నేరస్థులు అరెస్ట్ అయేలా ఉద్యమించింది. వ్యభిచార కూపంలో చిక్కుకున్న అమ్మాయిలను రక్షించి వారికి పునరావాసం ఏర్పాటయ్యేందుకు కృషి చేసింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగానికి మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది. మహిళా సాధికారత నుంచి మానవ హక్కుల వరకు ఎన్నో కార్యక్రమాలలో క్రియాశీల పాత్ర పోషించిన దీపికకు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడోసారి ప్రసంగించే అరుదైన అవకాశం లభించింది. గత రెండు సమావేశాల్లో ‘మానవ హక్కులు–మహిళా హక్కులు’ అంశంపై మాట్లాడి 150 దేశాలకు చెందిన ప్రతినిధుల ద్వారా ప్రశంసలు అందుకుంది. మనసున్న దీపిక ఆటల్లోనూ బంగారం అనిపించుకుంది.‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’ లో రెజ్లింగ్, జూడోలలో ఆరుసార్లు బంగారు పతకం గెలుచుకుంది. ఆత్మరక్షణకు సంబంధించి అమ్మాయిల కోసం రకరకాల వర్క్‌షాప్‌లు నిర్వహించింది. -
రేణు ది గ్రేట్
భయంతో కూడిన మౌనం కంటే నిర్భయమైన నిరసన ఆయుధం అవుతుంది. రేణు పాసవాన్ విషయంలో ఇదే జరిగింది. చిన్న వయసులోనే తనకు పెళ్లి ప్రయత్నాలు జరిగాయి. ‘నేను చదువుకోవాలి’ అని గట్టిగా నిర్ణయించుకొని తండ్రి ఆగ్రహానికి గురైంది. బిడ్డ మనసును అర్థం చేసుకున్న ఆ తండ్రి ‘సరే నీ ఇష్టం’ అనక తప్పలేదు. ఆరోజు భయపడి బాల్యవివాహానికి సిద్ధమై ఉంటే రేణు పాసవాన్ స్పీకర్, లైఫ్‌కోచ్, రైటర్, ఇన్ఫ్లూయెన్సర్గా ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకునేది కాదు. తాజాగా ఫాక్స్ స్టోరి ఇండియా ‘ఇండియాస్ 50 ఇన్స్పైరింగ్ వుమెన్ –2022’ జాబితాకు ఎంపికైంది రేణు... బిహార్‌లోని ముజాఫర్పూర్ జిల్లాలోని మిథాన్పుర అనే చిన్న గ్రామంలో పుట్టింది రేణు. ఆ ప్రాంతంలో బాల్యవివాహాలు సహజం. తనకు కూడా పెళ్లి చేసే ప్రయత్నాలు చేస్తే ఇంటి నుంచి పారిపోయింది. ఎక్కడో ఉన్న రేణును ఇంటికి తీసుకువచ్చిన తండ్రి ‘పెళ్లి అంటూ నిన్ను బాధ పెట్టను’ అన్నాడు. చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండేది రేణు. బయెటెక్నాలజీలో పట్టా పుచ్చుకుంది. పుణెలో ఎంబీఏ చేసింది. బెంగళూరులో బయోటెక్నాలజీ చదువుకునే రోజుల్లో హస్టల్లో అమ్మాయిలు రేణుకు దూరంగా ఉండేవారు. నిరక్ష్యం చేసేవారు. దీనికి కారణం తాను బిహారి కావడం! ఇక రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు బిహారీల పట్ల పోలీసులు వ్యవహరించే తీరు అమానుషంగా ఉండేది. ఇవన్నీ చూసిన తరువాత తనకు బాధగా అనిపించేది. ‘ఇన్పోసిస్’లో కొన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం చేసింది రేణు. తాను నడిచొచ్చిన దారిపై ఒకసారి పుణె క్యాంపస్‌లో ప్రసంగించింది. ఇది ఎంతోమందిని ఆకట్టుకుంది. ‘మీ జీవితానుభవాలకు ఎందుకు అక్షర రూపం ఇవ్వకూడదు! చాలా మందికి స్ఫూర్తి ఇస్తాయి’ అని చెప్పడంతో ‘లివ్ టూ ఇన్స్పైర్’ పేరుతో తొలి పుస్తకం రాసింది రేణు. బిహార్‌లోని మారుమూల గ్రామం నుంచి బెంగళూరులో ఉద్యోగం వరకు తన ప్రయాణానికి అక్షరరూపం ఇచ్చింది. ఈ పుస్తకం బాగా పాపులర్ అయింది. ఏవేవో జ్ఞాపకాలు చుట్టుముడుతుండగా ‘నేను చేయాల్సింది ఇంకా ఏదో ఉంది’ అనుకుంది రేణు. ‘లివ్ టూ ఇన్స్పైర్’ అనే సంస్థను స్థాపించి గ్రామాలలోని మహిళలు ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడడానికి అవసరమైన సహకారం అందిస్తోంది. కళాకృతుల తయారీలో మహిళలకు శిక్షణ ఇప్పిస్తోంది. దీంతో పాటు మహిళల హక్కుల కోసం పనిచేయడం మొదలుపెట్టింది. అలా ‘జి–100’ గ్రూప్‌లో చేరింది. బిహార్ నుంచి ఈ గ్రూప్‌లో చేరిన తొలి మహిళ రేణు. జి–100 అనేది ప్రపంచ వ్యాప్తంగా మహిళల హక్కుల కోసం గొంతు విప్పుతున్న మహిళా ఉద్యమకారుల పోరాట వేదిక. జి–100 గ్రూప్ ఛైర్మన్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రేణు పాసవాన్ లివ్ టూ ఇన్స్పైర్ తరువాత ది న్యూ, సస్టేనబుల్ డెవలప్మెంట్ అనే రెండు పుస్తకాలు రాసింది. ఇవి తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చాయి. ఐక్యరాజ్యసమితి ‘జెండర్ ఈక్వాలిటీ’కి సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే రేణు ‘షి ది చేంజ్’ టైటిల్‌కు ఎంపికైంది. ‘ఆ ఇంట్లో వ్యక్తులు కాదు సమస్యలు ఉంటాయి’ అని ఊరివాళ్లు అనుకునేవారు. ఎందుకంటే రేణు సోదరులు ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడేవాళ్లు. తల్లికి మానసిక సమస్యలు. వంట వండడం నుంచి బట్టలు ఉతకడం వరకు అన్నీ తన బాధ్యతలే అయ్యేవి. ఇలాంటి ఇంట్లో నుంచి వచ్చిన రేణు పాసవాన్ మోటివేషనల్ స్పీకర్‌గా, స్త్రీ హక్కుల ఉద్యమకార్యకర్తగా ప్రపంచవ్యాప్తగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రధాన కారణం పైకి ఎదిగినా పరాయికరణకు లోను కాకపోవడం. తన మూలాలు ఏమిటో మరవకపోవడం. -
50 శాతం మీ హక్కు: జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: యాభై శాతం రిజర్వేషన్లు మహిళల హక్కు అని, పోరాడి సాధించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ‘‘వేలాది సంవత్సరాల అణచివేత ఇక చాలు, న్యాయవ్యవస్థలోని అన్ని స్థాయిల్లోనూ మహిళలకు 50 రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది మీ హక్కు.. ఇదేదో దాతృత్వానికి సంబంధించిన అంశం కాదు. మీరు చింతిస్తూ కూర్చోకూడదు. ఆగ్రహంతో గట్టిగా నినదించాలి. 50 శాతం రిజర్వేషన్లు కావాలని బలంగా డిమాండ్ చేయాలి. నా మద్దతు మీకు ఉంటుంది’’ అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్‌లోని మహిళా న్యాయవాదులు ఆదివారం ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. న్యాయవాదుల్లో మహిళలు 15 శాతమే ‘‘దిగువ న్యాయస్థానాల్లో మహిళా జడ్జీలు కేవలం 30 శాతం లోపే ఉన్నారు. హైకోర్టుల్లో 11.5 శాతం ఉన్నారు. సుప్రీంకోర్టులో 11 నుంచి 12 శాతం ఉన్నారు. దేశంలోని మొత్తం 17 లక్షల న్యాయవాదుల్లో 15 శాతం మాత్రమే మహిళలున్నారు. బార్ కౌన్సిళ్లలో ఎన్నికైన ప్రతినిధుల్లో కేవలం 2 శాతం మాత్రమే మహిళలు. బార్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మహిళల ప్రాతినిధ్యం లేదు. దీన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైన దిద్దుబాటు చర్యల గురించి కార్యనిర్వాహక వ్యవస్థపై ఒత్తిడి తీసుకొస్తా. ఉన్నత న్యాయస్థానాల్లో అంతరాన్ని తగ్గించడానికి సహచర కొలీజియం సభ్యులు కూడా చొరవ చూపడం సంతోషంగా ఉంది. న్యాయవాద వృత్తిలోకి రావడానికి మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ అడ్డంకులు, లింగ వివక్ష ఎదుర్కొంటున్నారు. చాలామంది క్లయింట్లు పురుష న్యాయవాదులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కోర్టు గదుల్లో సౌలభ్యంగా లేని వాతావరణం, మౌలికవసతుల లేమి, రద్దీగా ఉండే కోర్టు గదులు, వాష్‌రూమ్స్ లేమి వంటివి మహిళలు న్యాయవాద వృత్తిలోకి రావడానికి అడ్డంకిగా ఉంటున్నాయి. 6 వేల ట్రయల్ కోర్టుల్లో 22 శాతం కోర్టుల్లో మహిళలకు మరుగుదొడ్లు లేవని నా సర్వేలో తేలింది. మహిళలకు మరింతగా స్వాగతం పలికే వాతావరణం కల్పించాలి. న్యాయ విద్యలో లింగ నిష్పత్తిపై దృష్టి సారించాలి. తొలి చర్యగా న్యాయ కళాశాలలు, యూనివర్సిటీలలో మహిళలకు తగినంతగా రిజర్వేషన్లు కలి్పంచాలి. మహిళా జడ్జీలు, లాయర్లు గణనీయంగా పెరుగుతారు. అన్ని రంగాల్లోకి మహిళలు వచ్చేలా స్ఫూర్తి కావాలి. న్యాయవాద వృత్తిలో లింగ అసమానతలు తొలగించడానికి తీసుకొనే చర్యలకు నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. సీనియర్ న్యాయవాదుల ఎంపికకు త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తాం. ప్రత్యక్ష విచారణ విషయానికొస్తే.. దీని వల్ల జడ్జీలకు ఎలాంటి ఇబ్బంది లేదు. లాయర్లకే ఒకింత ఇబ్బంది. దసరా తర్వాత ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని భావిస్తున్నాం. థర్డ్‌వేవ్ రాకూడదని ప్రారి్థద్దాం. ప్రత్యక్ష విచారణకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పట్ల అడ్వొకేట్ల అసోసియేషన్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాటిని సరిచేయాలని రిజిస్ట్రీని ఆదేశించా. మధ్యవర్తిత్వంపై శిక్షణ కార్యక్రమం త్వరలోనే ప్రారంభిస్తాం’’ అని సీజేఐ జస్టిస్ ఎన్ వీ రమణ పేర్కొన్నారు. వలస పాలకుల చట్టాలతో ఇబ్బందులు: జస్టిస్ పి.ఎస్.నరసింహ వలస పాలకుల హయాం నాటి కాలం చెల్లిన చట్టాలు, వాటికి ఇచ్చిన భాష్యాలతో భారత్ 70 ఏళ్లకు పైగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలను లోతుగా అధ్యయనం చేసి వాటికి కొత్త వివరణ ఇవ్వాల్సిన బాధ్యత న్యాయమూర్తులపైనే ఉందని అన్నారు. సుప్రీంకోర్టు బెంచ్‌లో నలుగురు మహిళా న్యాయమూర్తులు ఉండడం అసాధారణమైన విషయమన్నారు. కోర్టుల్లో 50 శాతానికి మహిళలు పరిమితమవకుండా ఇంకా ఎక్కువ మంది ఉండాలన్నదే తన ఆకాంక్షని చెప్పారు. ప్రతిభ ఆధారంగా ఎంత ఎక్కువ మంది మహిళలుంటే అంత మంచిదని, మగవారి కంటే మహిళలే లోతైన ఆలోచన చేస్తారని జస్టిస్ నరసింహ కొనియాడారు. -
Afghanistan: ఇంటికి పో.. ఇంకెప్పుడూ రాకు!
Afghanistan Crisis: కుక్కతోక వంకరేనని మరోమారు తాలిబన్లు రుజువు చేస్తున్నారు. దేశాన్ని అధీనం చేసుకున్న తొలి రోజుల్లో ఎంతో మారిపోయినట్లు ఫొజులిచ్చిన తాలిబన్ మూకలు క్రమంగా తమ పాత నిజ స్వరూపాలను బయటపెడుతున్నాయి. మహిళా హక్కులు కాపాడతామంటూ గంభీర ప్రకటనలిచ్చి రోజులు గడవకముందే మహిళలపై తీవ్ర అణిచివేత చూపుతున్నారు. దేశమంతా పలు ప్రాంతాల్లో స్త్రీలపై తాలిబన్ల అణిచివేత, అకృత్యాలపై వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా తుపాకీ గురిపెట్టి మరీ తనను టీవీలో కనిపించవద్దంటూ తాలిబన్లు ఆదేశించారని ప్రముఖ మహిళా టీవీ ప్రజెంటర్ మెహ్ ముర్సల్ అమిరి వెల్లడించారు. అఫ్గాన్ నేషనల్ టీవీకి చెందిన ఆర్టీఏ స్టూడియోస్‌లో ఆమె పనిచేస్తున్నారు. ఈ స్టూడియోను ఆక్రమించిన తాలిబన్లు ముర్సల్కు తుపాకీ గురిపెట్టి ‘‘ఇంటికి పో, అక్కడే ఉండు, ఇంకెప్పుడూ రాకు’’ అని బెదిరించారు. మేకప్ వేసుకున్నందుకు, హిజాబ్ ధరించనందుకు ఆమెను తీవ్రంగా దూషించారు. తోటి యాంకర్లను సైతం ఆఫీసుకు రావద్దని హెచ్చరించారు. ఒకపక్క మహిళా జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చి మారినట్లు చెప్పుకుంటున్న తాలిబన్లు మరోపక్క మహిళా జర్నలిస్టులపై దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంధకార భవితవ్యం... దేశంలో స్త్రీల భవిష్యత్ అంధకారంలోకి జారిందని ముర్సల్ ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరింత దిగజారుతాయని ఆందోళన చెందారు. లా డిగ్రీ చదువుతున్న ముర్సల్ టీవీలో వారానికి ఆరురోజుల పాటు సాగే 2 గంటల లైవ్‌షో నిర్వహిస్తారు. టీవీ ప్రేక్షకుల్లో ఆమెకు మంచి ఆదరణ ఉంది. ఎప్పటిలాగే ప్రోగ్రామ్ చేసేందుకు స్టూడియోకు వెళ్లానని, అనంతరం తాలిబన్లు స్టూడియో ను ఆక్రమించారని ముర్సల్ చెప్పారు. స్టేషన్లో ఉన్న మహిళలందరినీ వెంటనే వెళ్లిపోవాలని హుకుం జారీ చేసినట్లు తెలిపారు. పురుష సిబ్బందిలో చాలామందిని కూడా తాలిబన్లు తొలగించారని ఆమె చెప్పారు. ‘‘టీవీ స్టూడియోను చూస్తుంటే ఏదో మసీదులో కొందరు పురుషులు కూర్చొని షరియా చట్టం గురించి మాట్లాడుతున్నట్లు ఉంది. అసలు మహిళలనే వారు ప్రపంచంలో ఉన్నట్లే అనిపించడంలేదు. నాకు భవిష్యత్‌పై, ఇప్పుడు జరుగుతున్న విషయం బయటకు చెప్పడంపై భయంగా ఉంది. అయితే ఏమీ చేయ కుండా కూర్చోలేను. ఇదే సమయంలో నా భద్రత కోసం జాగ్రత్తపడాలి’’ అని వ్యాఖ్యానించారు. హక్కులు కోల్పోయాం పౌర పాలనలో తాను హిజాబ్ ధరించడానికి వ్యతిరేకమని, కానీ ప్రస్తుతం తన హక్కును లాగేసుకున్నట్లు అనిపిస్తోందని ముర్సల్ చెప్పారు. షరియా చట్టం అమలైతే తాము స్వేచ్ఛగా సంచరించే వీలుండదని, ఇంట్లోనే ఉండాలని, బయటకు వస్తే ముసుగుతో పాటు ఎవరో ఒక మగవారు తమవెంట ఉండాలని, అలాంటి జీవితాన్ని తాను కోరుకోవడం లేదని వాపోయారు. ఎక్కడికైనా పోదామంటే సరిహద్దులు మూసివేశారన్నారు. తాను ఇస్లాంకు వ్యతిరేకం కాదని, కానీ స్త్రీలు చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, పాడడంలో తప్పులేదన్నది తన అభిప్రాయమన్నారు. తనకు సైతం ఇదే అనుభవం ఎదురైందని మరో జర్నలిస్టు ఖదీజా చెప్పారు. తాలిబన్లు నియమించిన డైరెక్టర్‌తో మాట్లాడితే కార్యక్రమాలన్నీ మార్చివేశామని, ఇకపై మహిళా జర్నలిస్టులు, యాంకర్లు అవసరం లేదని చెప్పారని ఖదీజా తెలిపారు. మహిళా రాజకీయవేత్త సలీమా మజారీని తాలిబన్లు బంధించి ఉంటారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈమె తాలిబన్లను తీవ్రంగా విమర్శించేవారు. భయంలో మహిళా క్రీడాకారులు తోటివారిని కాపాడమని ‘ఫిఫా’కు కెప్టెన్ విజ్ఞప్తి అఫ్గానిస్తాన్‌లో ఉన్న తన బృంద సభ్యులను రక్షించాలని ఆదేశ మహిళా ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ షబ్నం మొబరెజ్ ఫిఫా(ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య)కు మొరపెట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు. కానీ తన టీమ్ మెంబర్స్ అఫ్గాన్‌లోనే ఉన్నారని, వారి భవితవ్యంపై భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌లో ఉన్న తన సహచరురాలితో జరిపిన సంభాషణను ఆమె బయటపెట్టారు. వారి పరిస్థితి బాగాలేదని, వారంతా భయంలో ఉన్నారని, ఫిఫా వారిని కాపాడాలని కోరారు. ఫుట్‌బాల్ ఆడినందుకు వారి అడ్రసులు వెతుక్కుంటూ వెళ్లి తాలిబన్లు చంపేస్తారని ఆందోళనగా ఉందన్నారు. పౌర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2007లో అఫ్గాన్ మహిళా ఫుట్‌బాల్ టీమ్ ఏర్పాటైంది. 2012లో ఖతార్‌పై గెలుపుతో ఈ టీమ్ తొలి విజయం నమోదు చేసింది. తాలిబన్ల పాలన వచ్చిన నేపథ్యంలో మహిళా క్రీడాకారులు తమ సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేయాలని, ఇంట్లో ఉన్న ప్రాక్టీస్ కిట్స్‌ను తగలబెట్టి జాగ్రత్త వహించాలని ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ ఖలీదా పోపల్ సూచించడం మహిళా క్రీడాకారుల్లో భయానికి అద్దం పడుతోంది. –నేషనల్ డెస్క్, సాక్షి -
వణుకుతున్న అఫ్గాన్ మహిళా లోకం
రెండు దశాబ్దాల తర్వాత మరోమారు పాలనా పగ్గాలు చేపట్టిన తాలిబన్లకు భయపడుతున్న ప్రజలు మాత్రం కట్టుబట్టలతో దేశం విడిచి పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ భవితవ్యం ఎలా ఉంటుంది? ముఖ్యంగా మహిళల పరిస్థితేంటి? అనే ప్రశ్నలకు తాలిబన్ల నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదు. అసలు వారికైనా ఈ విషయాలపై స్పష్టత ఉందో, లేదో తెలియదు. గత పాలన సందర్భంగా తాలిబన్లు స్త్రీలను ఎలా చూశారో అందరికీ తెలుసు. స్త్రీలకు విద్య నిషేధించడం, బురఖా తప్పనిసరి చేయడం, హక్కులను కాలరాయడం, లైంగికబానిసలుగా మార్చడం వంటివి తలుచుకొనే ప్రస్తుతం అఫ్గాన్ మహిళా సమాజం ఉలిక్కిపడుతోంది. ముఖ్యంగా 2001 తర్వాత జన్మించిన యువతకు వీరి ఆగడాలపై అవగాహన లేదు. ప్రస్తుతం తాము మారిపోయామని, మహిళా విద్యను కొనసాగిస్తామని తాలిబన్లు ప్రకటించుకుంటున్నా మహిళల భయం తీరడం లేదు. ఇప్పటిౖMðతే మహిళల పట్ల తాలిబన్లు ఎలాంటి విధాన నిర్ణయాలు ప్రకటించలేదు. కానీ జూలైలో బందక్షాన్, తఖార్ ప్రావిన్సులను ఆక్రమించుకున్న అనంతరం తాలిబన్లు ఇచ్చిన ఆదేశాలు గుర్తుకొచ్చి ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న 15ఏళ్లు దాటిన బాలికలు, 45 ఏళ్లలోపు వితంతువుల జాబితాను తమకివ్వాలని జూలైలో తాలిబన్లు స్థానిక నాయకులను ఆదేశించారు. తాలిబన్ ఫైటర్లను పెళ్లి చేసుకోవడానికి వీరు అవసరమని ఆజ్ఞలు ఇచ్చారు. ఆ ఆదేశాలు అమలయ్యాయా? అయితే అక్కడి ఆడవారి పరిస్థితి ఏంటి? అనే విషయాలపై ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. పేరుకు పెళ్లిళ్లు కానీ, ఇవన్నీ యువకులను తమలోకి ఆకర్షించేందుకు తాలిబన్లు చేసే యత్నాలన్నది అందరికీ తెలిసిన సంగతే! ఇలా పెళ్లైనవారు భార్య హోదా పొందకపోగా లైంగిక బానిసలుగా మారడం కద్దు. ఈ ఆదేశాలకు భయపడి చాలా ప్రాంతాల్లో ప్రజలు పారిపోయారు. కేవలం మూడు నెలల్లో దాదాపు 9 లక్షలమంది స్వస్థలాలను విడిచిపోయారంటే తాలిబన్ టెర్రర్ అర్థమవుతుంది. ఇదే తరహాను కొనసాగిస్తే ఇరవైఏళ్లపాటు అఫ్గాన్ మహిళాలోకం సాధించిన విజయాలన్నీ మట్టికొట్టుకుపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించేలా తాలిబన్లపై ఒత్తిడి తీసుకురావాలని, మహిళా హక్కుల పరిరక్షణకు ఐరాస, ప్రపంచ దేశాలు నడుం బిగించాలని, ఆంక్షలు తొలగించాలంటే స్త్రీస్వేచ్ఛకు లింకు పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) –నేషనల్ డెస్క్, సాక్షి -
అష్ట కాంతులు
న్యూయార్క్‌లో 1969 నుంచీ ‘నేషనల్ ఉమెన్స్ హాల్ ఆఫ్ ఫేమ్’ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ ఉన్న ప్రదేశంలో 173 ఏళ్ల క్రితం తొలిసారి మహిళా హక్కుల సదస్సు జరిగింది. ఆ సదస్సు జరిగిన స్థలం కావడం, రెండేళ్లకోసారి ఆ సంస్థ అమెరికాలోని ప్రసిద్ధ మహిళల్ని విశిష్ట వ్యక్తులుగా ఎంపిక చేసుకోవడం.. ఈ రెండు కారణాల వల్ల ‘హాల్ ఆఫ్ ఫేమ్’కి చారిత్రక ప్రాధాన్యం ఏర్పడి, ఆ హాల్‌కి (సంస్థకి) ఎంపికవడం ఒక ప్రతిష్ట అయింది. ప్రతి బేసి (సంఖ్య) సంవత్సరంలో ఈ ప్రతిష్టాత్మక ఎంపిక జరుగుతుంది. ఈ ఏడాది మిషెల్ బబామా, మరో ఏడుగురు మహిళలు హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం పొందారు. వచ్చే అక్టోబర్ 2 న ఈ ఎనిమిది మందిని నేషనల్ ఉమెన్స్ ఆఫ్ ఫేమ్ అధికారికంగా తన రికార్డులలో చేర్చుకుంటుంది. మొన్నటి మహిళా దినోత్సవం రోజు హాల్ ఆఫ్ ఫేమ్ వీళ్ల పేర్లను ప్రకటించింది. మిషెల్ ఒబామా (57) నలభై నాల్గవ అమెరికా ప్రథమ మహిళ. ఆ స్థానంలోకి వచ్చిన తొలి నల్లజాతి మహిళ కూడా. ‘21వ శతాబ్దపు అత్యంత ప్రభావశీలి అయిన ఆదర్శమూర్తి’ అని హాల్ ఆఫ్ ఫేమ్ మిషెల్‌ను అభివర్ణించింది. మిషెల్ మహిళలు, బాలికల హక్కుల ఉద్యమకారిణి, న్యాయవాది, రచయిత్రి. ప్రథమ మహిళగా ఉన్న ఎనిమిదేళ్ల కాలంలోనూ మిషెల్ శ్వేత సౌధానికి వన్నెతెచ్చారు. వైట్ హౌస్‌ను పీపుల్స్ హౌస్‌గా మార్చారు! ఆ తర్వాత కూడా మిషెల్ ప్రజా సంక్షేమం కోసమే పనిచూస్తూ ఉన్నారు. బాలల్లో స్థూలకాయం తగ్గించేందుకు ‘లెటజ్ మూవ్’, నిరుద్యోగ యువతకు మంచి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ‘రీచ్ హయ్యర్’, వృద్ధుల కోసం ‘జాయినింగ్ ఫోర్సెస్’, కౌమారదశలోని బాలిక ల విద్యకు ‘లెట్ గర్ల్స్ లెర్న్’.. ఇలా అనేక కార్యక్రమాలను రూపొందించారు మిషెల్. 2018లో ‘బికమింగ్’ అనే పేరుతో తన జ్ఞాపకాలను పుస్తకంగా తీసుకువచ్చారు. తన బెస్ట్ స్పోకెన్ వర్డ్ ఆల్బమ్‌కు 2020లో గ్రామీ అవార్డు పొందారు! హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం సంపాదించిన మిగతా ఏడుగురిలో రెబెక్కా హాల్స్టెడ్ (62) మిలటరీ అధికారి. జోయ్ హర్జో (69) కవయిత్రి, రచయిత్రి. ఇంద్రానూయీ (65) పెప్సీ కంపెనీ తొలి మహిళా సీఈవో. మియా హమ్ (48) సాకర్ లెజెండ్. జూడీ చికాకో (81) చిత్రకారిణి. తక్కిన ఇద్దరిలో ఆక్టేవియా ఇ బట్లర్ (1947–2006) సైన్స్ రైటర్. ఆమె గౌరవార్థం ఆమె పేరుతో నాసా ఇటీవలే అంగారకుడిపై పెర్సీ రోవర్ దిగిన చోటుకు నామకరణం చేసింది. ఆక్టేవియా ల్యాండింగ్ అంటారు ఇకపై ఆ ప్రదేశాన్ని! ఇక నాసా గణితశాస్త్ర వేత్త అయిన క్యాథరీన్ జాన్సన్ (1918–2020) ముప్పై ఐదేళ్ల పాటు నాసాలో పని చేశారు. మిషెల్ బబామా, మరో ఏడుగురు మహిళలు ఈ ఏడాది ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం పొందారు. వారిలో ఇద్దరు.. బెస్ట్ సెల్లింగ్ సైన్స్–ఫిక్షన్ రచయిత్రి ఆక్టేవియా, నాసా గణిత శాస్త్రవేత్త క్యాథరీన్ జాన్సన్‌లకు.. మరణానంతరం ఈ గౌరవం దక్కింది. -
హక్కుల కార్యకర్తకు ఆరేళ్ల జైలు
దుబాయ్ : సౌదీలో ప్రముఖ మహిళాహక్కుల కార్యకర్త లౌజైన్ అల్ హత్లౌల్కు సోమవారం సుమారు ఆరేళ్ల కారాగార శిక్ష విధించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. టెర్రరిజ వ్యతిరేక చట్టం కింద ఆమెకు శిక్ష పడినట్లు తెలిసింది. రెండున్నరేళ్లుగా ఆమె జైల్లోనే ఉన్నారు. అప్పటినుంచి ఆమె అరెస్టును హక్కుల సంఘాలు, యూఎస్ కాంగ్రెస్ సభ్యులు, యూరోప్ చట్టసభల సభ్యులు నిరసిస్తూనే ఉన్నారు. సౌదీలో మహిళలకు డ్రైవింగ్ చేసే హక్కు ఉండాలని లౌజైన్ గతంలో పోరాడారు. ఆమెకు విధించి శిక్షపై అంతర్జాతీయ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శిక్షను వెంటనే రద్దు చేయాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
కొత్తతరం సిద్ధమైంది
మహిళల హక్కుల కోసం, సమానత్వం కోసం, సాధికారత కోసం విప్లవించిన తొలి తరం మహిళా సామాజిక ఉద్యమకారిణి వసంత కన్నాభిరాన్! ‘చట్టం ఉందంటే చేతిలో ఆయుధం ఉన్నట్లే’ అంటున్న ఈ ఉద్యమశీలి.. స్వయంశక్తితో పోరాడే ఒక కొత్తతరం సిద్ధమైందనీ.. మున్ముందరి అన్ని మహిళా ఉద్యమాలకు ఈ తరం స్ఫూర్తినివ్వగలదని ఆకాంక్షిస్తున్నారు. వసంత కన్నాభిరాన్ పుట్టింది వెస్ట్ మారేడ్‌పల్లి, ఇప్పుడు ఉంటున్నది ఈస్ట్ మారేడ్‌పల్లి. పూర్తిగా హైదరాబాద్‌తోనే మమేకమైన జీవితం ఆమెది. పాఠశాల విద్య సికింద్రాబాద్‌లోని కీస్ హైస్కూల్లో. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్‌లో చదివిన తర్వాత తిరిగి హైదరాబాద్‌కి వచ్చి రెడ్డి కాలేజ్ (రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి ఉమెన్స్ కాలేజ్)లో లెక్చరర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. మహిళల హక్కుల కోసం ఉద్యమించిన తొలితరం మహిళ ఆమె. ఉద్యోగం, ఇల్లు, పిల్లల బాధ్యతలతోపాటు సామాజిక కార్యకర్తగా మారడానికి దారి తీసిన పరిస్థితులను, మహిళలకూ హక్కులుంటాయని గుర్తించని పితృస్వామ్య సమాజం నుంచి.. మహిళలు తమ హక్కులను సాధించుకుంటున్న నేటి సమాజం వరకు వచ్చిన మార్పులు, ఇప్పటి ‘మీ టూ’ స్వరాలు.. వీటి గురించి వసంత తన మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘మా తాత, చిన్న తాతలు కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనలో కీలక పాత్ర వహించారు. మా నానమ్మ పూర్తి సంప్రదాయవాది, ఆమె నిర్ణయించిన సిస్టమ్ ఇంట్లో కొనసాగేది. కానీ ఇంట్లో ఎప్పుడూ సిద్ధాంతపరమైన చర్చలు, మేధోమథనం జరుగుతుండేది. చిన్న తాతలు ఒకరు ఆంగ్లో ఇండియన్ని, ఇంకొకరు మహారాష్ట్ర అమ్మాయిని వివాహం చేసుకున్నారు. మా ఇంటి చుట్టూ బెంగాలీ, పార్సీ, మరాఠీ వాళ్లు నివసించేవాళ్లు. సమాజాన్ని చూసే దృష్టి కోణం విస్తృతం కావడానికి అవన్నీ కారణమే. అయితే పెళ్లి తర్వాత నేను లెక్చరర్‌గా, కన్నాభిరాన్ న్యాయవాదిగా జీవితాన్ని మొదలుపెట్టాం. అప్పట్లో ఉద్యమాల్లో పాల్గొనాలనే ఆలోచన లేదు. మాకు తెలిసిందల్లా భుక్తి కోసం ఉద్యోగం చేయడమే. మా జీవితం ఈ మలుపు తిరుగుతుందని ఊహించనే లేదు. ఎమర్జెన్సీ మార్చింది ఎమర్జెన్సీకి ముందు రోజుల్లో... అంటే 1969–70లలో పరిస్థితి రాజకీయంగా ఉద్రిక్తంగా ఉండేది. కమ్యూనిస్ట్ పార్టీ ఎంఎల్ కార్యకర్తలు వాళ్ల కేసులను వాదించడం గురించి తరచూ కన్నాభిరాన్ని కలిసేవాళ్లు. నాగిరెడ్డి, చండ్ర రాజేశ్వర్రావులాంటి వాళ్లంతా ఇంటికి వస్తుండేవారు. ఎమర్జెన్సీ వచ్చాక కన్నాభిరాన్ అకస్మాత్తుగా సెంటర్ పాయింట్ అయ్యారు. జ్వాలాముఖి వంటి వాళ్లు అరెస్టయ్యారు. వరవరరావు, గద్దర్, ప్రదీప్, మధుసూదన్ మొదలైన వాళ్లంతా అప్పుడే నాకు పరిచయమయ్యారు. రమా మెల్కోటే, వీణాశతృఘ్న, లలిత మొదలైన వాళ్ల మీద కుట్రకు పాల్పడ్డారనే తప్పుడు కేసులు నమోదయ్యాయి. అప్పుడు నా ఆలోచన పూర్తిగా మారిపోయింది. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందనిపించింది. టీచింగ్ కొనసాగిస్తూనే మెల్లగా ఉద్యమబాటలో అడుగులు వేశాను. స్టూడెంట్స్ పలకరింపు నవ్వులు నిజానికి నేను టీచింగ్‌లోకి వెళ్లాలనే సంకల్పంతో లెక్చరర్‌గా చేరలేదు. అన్ని ఉద్యోగాల్లాగానే అది కూడా అన్నట్లే చేరాను. పాఠాలు చెప్పడం మొదలు పెట్టిన తర్వాత టీచింగ్ మీద ప్రేమ పెరిగింది. రెడ్డి కాలేజ్‌లో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల పిల్లల కోసం 40 శాతం సీట్లు ఉండేవి. వాళ్లు ఎక్కువగా తెలుగు మీడియంలో చేరేవాళ్లు. సబ్జెక్టుని ఇంగ్లిష్ మీడియం క్లాసులో వివరించినంత డెప్త్‌గా తెలుగు మీడియంలో చెప్పడం కుదిరేది కాదు. వాళ్లను ప్రధాన స్రవంతి(భాష పరంగా వెనుకబాటు తనం నుంచి)లో కలిపే వరకు వాళ్ల గ్రహింపుశక్తికి మాత్రమే చెప్పాల్సి వచ్చేది. అయితే సంతోషం ఏమిటంటే... ఆ పిల్లలు మాక్కూడా ఇంగ్లిష్ మీడియం వాళ్లకు చెప్పినంత క్షుణ్ణంగా చెప్పమని అడిగారు. వాళ్లకు విషయాన్ని పూస గుచ్చినట్లు చెప్పడం కోసం నేను పెద్ద ఎక్సర్సైజ్ చేశాననే చెప్పాలి. దాంతో నాలో ట్రాన్స్లేషన్ లెవెల్స్ బాగా పెరిగాయి. ఒక విషయాన్ని తెలుగులో అనర్గళంగా మాట్లాడటమూ వచ్చేసింది. టీచింగ్‌ని 1985లో వదిలేసినప్పటికీ పర్యటనల్లో ఎక్కడైనా నన్ను చూడగానే నా స్టూడెంట్స్ నవ్వుతూ దగ్గరకు వచ్చేవారు. ఆ నవ్వులోనే వీళ్లు నా దగ్గర చదువుకున్నట్లున్నారని తెలిసిపోయేది. ఇలాంటి అనుభవాలన్నీ పాఠాలు చెప్పిన రోజులను గర్వంగా గుర్తు చేసుకునేట్లు చేస్తుంటాయి. యూఎన్ గుర్తించాకనే... ఐక్యరాజ్యసమితి 1975ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్‌గా ప్రకటించింది. అప్పటి వరకు మనదేశం అనే కాదు, ప్రపంచంలో ఎక్కడా మహిళల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. విమెన్ ఇష్యూస్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని తెలిసిందప్పుడే. మన దగ్గర కూడా మార్చి ఎనిమిదవ తేదీన మహిళల గురించి మాట్లాడుకోవడం మొదలైంది. వక్తగా చాలా సమావేశాల్లో ప్రసంగించాను. కానీ నేను చూసి, విని తెలుసుకున్న అంశాలనే మాట్లాడుతున్నాను తప్ప సమాజాన్ని అధ్యయనం చేసిన రచనలు చదవలేదప్పటికి. రాడికల్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ మీటింగ్‌లో ప్రసంగించడానికి ఆహ్వానం వచ్చినప్పుడు నాకు అంత లోతుగా తెలియదని చెప్పాను. ‘నేర్చుకోవడం ఎంత సేపు’ అంటూ ఎమ్వీ రామ్మూర్తి గారు ఐదారు పుస్తకాలు తెచ్చిచ్చారు. అలా పూర్తిస్థాయి సామాజిక ఉద్యమంలోకి వచ్చాను. ఫెమినిస్టు సాహిత్యం చదవడం నన్ను నేను వికసింప చేసుకోవడానికి దోహదం చేసింది. ఒక్కో సంఘటన ఒక్కో పాఠం రమ, వీణ, లలిత, సూజి, రత్నమాల అందరం కలిసి స్త్రీ శక్తి సంఘటన్ ప్రారంభించాం. అప్పటి నుంచి సమాజంలో బాధితులవుతున్న మహిళలకు అండగా నిలిచే ప్రయత్నంలో ఎన్ని నేర్చుకున్నామో చెప్పలేం. మధుర పదహారేళ్లమ్మాయి. పోలీస్ స్టేషన్ టాయిలెట్లో నలుగురు పోలీసులు రేప్ చేశారామెని. తప్పిపోయి దొరికిన ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేసి ఇంటికి పంపించారు పోలీసులు. ఆ సంఘటన మాకు ఎంత షాక్ అంటే... మనదేశంలో మహిళకు ఎంత న్యాయం జరుగుతుందో అర్థమైంది. ‘ఇలా కూడా జరుగుతుందా అనే సందేహం, ఎందుకు జరగదు; ఇప్పుడు జరిగింది అదేగా’ అని మాలో మేమే అనుకునేవాళ్లం. రమీజాబీ రేప్ కేస్‌తో నగరం అట్టుడిగిపోయింది. మతాలు, వర్గాలకతీతంగా స్పందించారంతా. ముక్తిధర్ కమిషన్ విచారణలో ఎంత విచిత్రాలంటే... ఒక్కొక్క సాక్షి వచ్చి (వాళ్లంతా పోలీసులు అన్ని కేసుల్లోనూ ప్రవేశపెట్టే ఆస్థాన సాక్షులే) రమీజాబీని బురఖా తియ్యమనేవాడు, ముఖం చూసి ‘అవును నేను ఈమెకు డబ్బిచ్చి హోటల్ గదిలో గడిపాను’ అని చెప్పి వెళ్లిపోయేవాడు. అంటే... మన సమాజంలో ఒక మహిళ తన గురించి తాను ఏం చెప్పిందనేది ముఖ్యం కాదు, పదిమంది మగాళ్లు ‘ఆమెతో గడిపాం’ అంటే.. అదే నిజం అంటారు. మేల్ సొసైటీ ఎంత బలంగా ఉండేదో చెప్పడానికి అదొక ఉదాహరణ. మహిళల కోసం పోరాడాలంటే మహిళా యాక్టివిస్టులందరం న్యాయశాస్త్రం చదవాల్సిన అవసరం ఉందనే మరో విషయం తెలుసుకున్నాం. చట్టం ఉందంటే... చేతిలో ఆయుధం ఉన్నట్లే! పబ్లిక్ డొమైన్, ప్రైవేట్ డొమైన్ అనే తేడా ఉండటం లేదు. ఇంట్లో మామ, బావ, మరుదులు వేధిస్తున్నారని చెప్పి కన్నీళ్లు పెట్టుకునే వాళ్లెందరో. ఇల్లు దాటి బయటకు వెళ్తే స్కూల్ టీచరు, పోలీసులు, ఉద్యోగంలో పై అధికారి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో తలదాచుకున్న అమ్మాయిల మీద వార్డెన్ లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా తమ పనుల కోసం ఇతర అధికారుల దగ్గరకు పంపించడం... ఇలా ప్రతి చోటా లైంగిక వేధింపులే ఎదురవుతున్నాయి. స్త్రీ గొప్పతనాన్ని స్తుతించడం ప్రసంగాలకే పరిమితం. ఆచరణలో ఉన్నదంతా స్త్రీని దేహంగా చూసే కరడుగట్టిన భావజాలమే. రాజస్తాన్‌లో బాల్యవివాహాలను అరికట్టడానికి ప్రయత్నించిన భన్వారీదేవి మీద అగ్రకులస్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ కేసు విచారణలో ఎంతటి అర్ధరహితమైన వాదన విన్నామంటే ‘అప్పర్ క్యాస్ట్ మెన్ వోన్ట్ రేప్ ఎ లోవర్ క్లాస్ వుమన్’ అన్నారు. మహిళను నీ స్థానం ఇదేనని నియంత్రించడానికి ఎప్పుడూ ఆమె మీద లైంగిక దాడినే ఆయుధంగా మార్చుకుంటోంది మగ సమాజం. ఆ పోరాటంతో వచ్చిన విశాఖ జడ్జిమెంట్.. పని ప్రదేశంలో లైంగిక వేధింపులను అరికట్టడానికి కొంతవరకు ఆసరా అవుతోంది. చట్టం వచ్చిన తర్వాత వేధింపులు ఆగిపోయాయా అనే కౌంటర్ ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది, విశాఖ అయినా, నిర్భయ చట్టం అయినా సరే... వాటికి ముందు లైంగిక దాడులు జరిగాయి, తరవాత కూడా జరుగుతున్నాయి. కానీ చట్టం ఉంటే చేతిలో ఆయుధం ఉన్నట్లే. వేధింపులకు పాల్పడే వాళ్లకి అది హెచ్చరికలా ఉంటుంది, వేధింపులకు గురయ్యే వర్గానికి ధైర్యాన్నిస్తుంది. మహిళల కోసం మహిళలే... వివక్షకు, వేధింపులకు లోనవుతున్న మహిళల కోసం ఎవరో ఒకరు పోరాడాల్సి వచ్చేది. ఇప్పుడు మహిళలు తెలివిమంతులయ్యారు. తమకు జరుగుతున్న అన్యాయం మీద ‘మీటూ’ అంటూ గళమెత్తగలుగుతున్నారు. కాలం మారిందనడానికి ఇదొక ప్రతీక. కంప్లయింట్ చేస్తే ఉద్యోగం పోతుందేమోననే భయం ఒకప్పుడు నోరు తెరవనిచ్చేది కాదు. ఆ ఉద్యోగాన్ని వదలడానికి సిద్ధమై కంప్లయింట్ చేసినా సరే... ఓల్డ్ బాయ్స్ క్లబ్ మగవాళ్లు ఇలాంటి విషయాలను త్వరగా సర్క్యులేట్ చేసుకుంటారు. ఆమెకి ఉద్యోగం ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు. ఉద్యోగం ఇవ్వాలంటే బేరం పెడతారు. అలాంటి అవరోధాలన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధమైంది కొత్త తరం. మహిళలు ఇంతకాలం ఓర్చుకున్నారు, సర్దుకుపోయారు, వేధింపులకు భయపడి ఇంట్లో కూర్చున్నారు. పడింది చాలు. ఇక గొంతు పెంచాలి, గొంతు విప్పిన అమ్మాయికి బాసటగా నిలవాలి. ఇప్పుడు మగవాళ్లు... ‘తప్పుడు ఆరోపణలు చేస్తే మా కెరీర్ ఏమైపోవాలి’ అని గొంతు చించుకుంటున్నారు. ‘నా మీద చెయ్యి వేశాడు’ ఒక మహిళ బాధ్యతరహితంగా ఆరోపించదు, ఆరోపించినా అది నూటికి ఒకటికంటే మించదు. ఆ ఒక్కరిని చూపించి 99 అసలైన ఆరోపణలను కొట్టి పారేయాలని చూసే ధోరణిని మార్చుకోవాలని చెబుతున్నాను. తరతరాల అణచివేతను తమకు తాముగా ఛేదించుకోగలిగిన శక్తిని పుంజుకున్నారు మహిళలు. ఇది స్వయంశక్తి ఉద్యమం. ఉద్దేశం నెరవేరే వరకు ఉద్యమించే స్త్రీ శక్తి’’. ఎంత వారలైనా... బుద్ధి మారదా ఢిల్లీలో ఒక పెద్ద ఆర్గనైజేషన్‌లో జెండర్ పాలసీ మీద మాట్లాడినప్పుడు ఓ కొత్త కోణం తెలిసింది. అక్కడి మహిళలతో మాట్లాడినప్పుడు సహోద్యోగులైన మగవాళ్లు తమను అదోలా చూడడం, అసభ్యకరమైన జోకులు వేయడం, తాకడానికి ప్రయత్నించడం వంటి ఇబ్బందులను చెప్పుకొచ్చారు. మగవాళ్లూ ఒక కంప్లైంట్ చేశారు! ఆడవాళ్లు సీట్లో పని చేసుకుంటూ మధ్యలో చేతులు పైకెత్తి జుట్టు సరిచేసుకుని క్లిప్ పెట్టుకుంటుంటారు. అప్పుడు వాళ్ల దేహాకృతి ఎక్స్పోజ్ అవుతుంటుంది, మాకది ఇబ్బంది కలిగిస్తోంది... అన్నారు. వెంటనే ఆ సంస్థ.. ఆడవాళ్లు వాష్‌రూమ్‌లోనే జుట్టు సరి చేసుకోవాలనే నిబంధన పెట్టారు. అయితే మగవాళ్లకు ఎటువంటి నియమావళినీ పెట్టలేదు. ఉన్నత విద్యావంతులు, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్లలో కూడా తమ ఆలోచనలను అదుపులో పెట్టుకోలేరా అనిపిస్తుంది. – వసంత కన్నాభిరాన్ సామాజిక ఉద్యమకారిణి – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
ప్ప్రశ్నించడం ఆపొద్దు
1950, 1960 సంవత్సరాల మధ్య ఎంతోమంది స్త్రీవాదుల ఉద్యమ ఫలితమే ఈ రోజున స్త్రీలందరూ బయటకొచ్చి మాట్లాడుతున్నారు. ఉదాహరణకు మా అమ్మమ్మ 4వ తరగతి వరకు చదివింది. మా అమ్మ డిగ్రీ వరకు, నేను పీ.జీ వరకు చదువుకున్నాం. ఆ రోజున స్త్రీల హక్కుల కోసం వాళ్లు చేసిన ఉద్యమాల ఫలితమే ఈ మార్పు. ఎంతోమంది రచయితలు, కళాకారులు కదం తొక్కి ఉద్యమం చేస్తే ఈ రోజున స్త్రీవాదం బలపడింది. ఆ ఉద్యమకారులందర్నీ నేను మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నాను. స్త్రీలందరూ ఉద్యమాలను అవహేళన చేయొద్దు. ప్రశ్నించటం ఆపకండి. -
అక్కడ ట్రంప్‌పై.. ఇక్కడ బెంగళూరుపై..!
బెంగళూరు: దేశంలోని దాదాపు యావత్తు మహిళా లోకం కదం తొక్కనుంది. తమపై దాడులు ఇక చాలంటూ గొంతెత్తి చెప్పనుంది. అసభ్యతకు పాల్పడేవారు, ఈ ఘటనలపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానాలు చేసేవారు ఇక ఖబడ్దార్ అంటూ భారీ ఎత్తున ర్యాలీకి సమాయత్తమవుతోంది. జనవరి 21న మొత్తం దేశంలోని మహిళలంతా తమ కంఠాన్ని మార్చ్ రూపంలో వచ్చి విప్పనున్నారు. బెంగళూరులోని మహిళల హక్కుల సంస్థ ఈ మార్చ్ దాదాపు 12 పెద్ద నగరాల్లో నిర్వహించాలని అనుకుంటోంది. బెంగళూరులోని ఎంజీ రోడ్డులో నూతన సంవత్సరం వేడుకల ప్రారంభం సందర్భంగా వేల మంది మహిళలు, యువతులపై లైంగిక వేధింపులు జరిగిన విషయం తెలిసిందే. దీనిపై తొలుత ఆ రాష్ట్ర నాయకులు చులకనగా మాట్లాడారు. మహిళల మనోభావాలు దెబ్బకొట్టేలా వ్యాఖ్యానించారు. దీంతో జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని ఆ రాష్ట్ర హోంమంత్రికి నోటీసులు జారీ చేసింది. ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువవుతున్నాయని, మహిళలు ప్రతి రోజు ఏదో ఒక దాడిని ఎదుర్కోవడంతోపాటు అదనంగా నాయకులతో కూడా చులకనైన మాటలు పడాల్సి వస్తుందని ఇక వీటిని ఏం ఉపేక్షించకూడదని వారు నిర్ణయించుకున్నారు. జనవరి 21న దేశంలోని మహిళలందరూ కలసి వీధుల్లోకి వచ్చి తమ డిమాండ్లు బహిరంగపర్చనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ‘ఐవిల్ గో ఔట్’ అనే యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం హల్ చల్ చేస్తోంది. అదే సమయంలో అమెరికాలో ట్రంప్‌కు వ్యతిరేకంగా ‘మిలియన్ ఉమెన్ మార్చ్’ జరుగుతుండటం విశేషం. దీంతో ఆ ర్యాలీకి సమాంతరంగా భారత్‌లో కూడా మహిళలు బెంగళూరు ఘటన, గతంలో జరిగిన ఘటనలు, వాటిపై నాయకులు అడ్డగోలు వ్యాఖ్యానాలకు వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో మార్చ్నిర్వహించాలని అనుకుంటున్నారు. -
పకడ్బందీగా మహిళల రక్షణ చట్టాల అమలు
సాక్షి, హైదరాబాద్: మహిళా హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఉన్న వివిధ చట్టాలను పకడ్బందీగా, మరింత ప్రభావవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వివిధ రంగాల ప్రతినిధులు జాతీయ మహిళా కమిష న్కు సూచించారు. మహిళలు ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లు, సమస్యలను అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సైబర్‌క్రైమ్‌కు ఎక్కువగా మహిళలే గురవుతున్నందున, వాటిని అదుపు చేసేందుకు నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలనే సూచనలు చేశారు. విద్య, ఉపాధి, వైద్య రంగాల్లో మహిళలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, వ్యవసాయ రంగంలోని మహిళల హక్కులను గుర్తించి సహాయ చర్యలను చేపట్టాలని, ఇళ్లల్లో పనిచేసే పనిమనుషుల సంక్షేమానికి, వివిధరూపాల్లో మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టేందుకు గృహహింస చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌లో జాతీయ, తెలంగాణ మహిళా కమిషన్ల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ మహిళా విధానం-2016 ముసాయిదాపై దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల ప్రతినిధులతో సంప్రదింపుల ప్రక్రియ నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, అండమాన్ నికోబార్, పుదుచ్చేరిల నుంచి మహిళాహక్కులు, సమస్యలపై పనిచేస్తున్న ఎన్జీవోలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లు, వివిధ సంఘాల ప్రతినిధులు, నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యకార్యదర్శి ప్రీతిమదన్, తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముందుగా ముసాయిదా జాతీయవిధానాన్ని గురించి వివరించారు. గురువారం సాయంత్రంలోగా జాతీయ మహిళా కమిషన్‌కు ముసాయిదా మార్పులు, చేర్పులపై తమ సలహాలు, సూచనలు తెలియజేస్తే, వాటిని పరిశీలించి జాతీయ విధానంలో చేరుస్తామని ప్రీతిమదన్ తెలిపారు. సమావేశంలో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్న పనేని రాజకుమారి, కేరళ మహిళా కమిషన్ చైర్పర్సన్ కేసీ రోసా కుట్టి, రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ ప్రశాంతి, డెరైక్టర్ విజేంద్ర బోయి తదితరులు పాల్గొన్నారు. రాజకీయ రిజర్వేషన్లు రాలేదా: ప్రీతిమదన్ లోక్‌సభ, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఎప్పుడు వాస్తవరూపం దాల్చుతాయో తెలియడం లేదని త్రిపురాన వెంకటరత్నం వ్యాఖ్యానించగా, ఈ రిజర్వేషన్లు వచ్చాయి కదా అని ప్రీతిమదన్ ప్రతిస్పందించారు. రాజకీయ రిజర్వేషన్లు ఎక్కడ వచ్చాయంటూ ఆమె వ్యాఖ్యలను త్రిపురానతోపాటు పలువురు విభేదించారు. దీనితో ఆమె సర్దుకుని పోటీ పడి హక్కులు సాధించుకోవాలన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి, మెరుగైన వైద్యంపై దృష్టి పెట్టాలని రమా మెల్కోటె సూచించారు. మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఉమాపతి సూచించారు. గ్రామ పంచాయతీలలోనే వీటిని అరికట్టేలా ప్రత్యేకచర్యలు, రైళ్లలో వీరి రవాణాను అడ్డుకునేందుకు టీసీలను భాగస్వాములను చేయాలన్నారు. -
‘భర్త పోషించలేకపోయినా.. భార్యకు మనోవర్తి’
న్యూఢిల్లీ: హిందూ ఉమ్మడి కుటుంబంలో ఒక హిందూ పురుషుడు శారీరక వైకల్యానికి గానీ, మానసిక వైకల్యానికి గానీ గురైనా, అదృశ్యమైనా, ప్రపంచాన్ని పరిత్యజించినా.. అతడి హిందూ భార్యకు జీవితాంతం సదరు పురుషుడి కుటుంబ సభ్యులే మనోవర్తిని చెల్లించాలని న్యాయ కమిషన్ సిఫారసు చేసింది. మహిళల హక్కుల పరిరక్షణ కోసం ఈ కొత్త నిబంధనను హిందూ దత్తత మరియు మనోవర్తి చట్టం 1956లో సెక్షన్ 18(4)గా చేర్చాలని ప్రతిపాదించింది. అయితే.. సదరు భర్త ఉమ్మడి కుటుంబం ఆస్తిలో తన వాటాను పొందివున్నట్లయితే ఈ నిబంధన వర్తించదని పేర్కొంది. భర్త కుటుంబ పోషణ అందించలేని పరిస్థితిల్లో ఉన్న హిందూ మహిళ హక్కును పరిరక్షించాలని భావిస్తున్నట్లు న్యాయమంత్రి సదానందగౌడకు సమర్పించిన తన నివేదికలో వివరించింది. ప్రస్తుత చట్టంప్రకారం.. భర్త కుటుంబానికి పోషణ అందించలేని స్థితిలో ఉన్నపుడు అతడు ఉమ్మడి కుటుంబ సభ్యుడు అయినప్పటికీ ఆ కుటుంబ సభ్యుల నుంచి మనోవర్తి పొందే హక్కు మహిళకు లేదని కమిషన్ పేర్కొంది. అలాంటి మహిళలకు ఉన్న ఉపశమనాలు.. తన భర్త తరఫున ఆస్తి వాటా కోసం దావా వేయటం లేదా విడాకుల కోసం దావా వేయటం మాత్రమేనని వివరించింది. గత ఏడాది ఒక కేసు విచారణ నేపథ్యంలో.. ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయ కమిషన్‌కు సూచించింది. ఈ నేపధ్యంలో కమిషన్ తాజా నిబంధనను సిఫారసు చేస్తూ నివేదిక సమర్పించింది. -
మహిళా హక్కుల సాధనకు మరో పోరాటం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆకాశంలో సగం మహిళలు అంటూ ప్రగల్బాలు పలికే పాలకులు తమకు చట్టబద్ధమైన హక్కులు కల్పించడంలో మాత్రం పురుషాధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారని, మహిళా సాధికారతను తుంగలో తొక్కుతున్నారని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గాదె ఝాన్సీ, చండ్ర అరుణ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్రభాగాన నిలిచి ఉద్యమాలు చేసిన మహిళలు తమ హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధమవుతున్నారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి 7 నెలలు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వం మహిళా కమిషన్ ఏర్పాటు చేయకపోవడం విచారకరమని అన్నారు. మహిళలకు ప్రభుత్వాలు ఇచ్చే ప్రాధాన్యత ఏపాటిదో దీన్నిబట్టి తెలుస్తోందన్నారు. మహిళా సమస్యల పరిష్కారానికి తమ సంఘం పోరాడుతోందని చెప్పారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంగా వారు ‘సాక్షి’తో మాట్లాడారు. 1973 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో మహిళా విద్యార్థినులపై వేధింపులు ఎక్కువ కావడంతో లలిత అనే విద్యార్థిని ఆధ్వర్యంలో ఏర్పాటైన అభ్యుదయ సంఘం.. 1974లో అన్ని రాష్ట్రాల్లో ప్రగతిశీల మహిళా సంఘంగా రూపాంతరం చెందిందని తెలిపారు. అదే సంవత్సరంలో ఖమ్మం నగరంలో కుటుంబ హింసపై పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించామని, మహిళలపై జరుగుతున్న వేధింపులపై ఈ సభలో సందేశం ఇచ్చామని చెప్పారు. ఈ సంఘం మహిళల కోసం.. వారి హక్కుల కోసం.. స్త్రీలలో సామాజిక చైతన్యం తీసుకురావడం కోసం కృషి చేస్తోందని తెలిపారు. సామ్రాజ్యవాద విష వలయంలో మహిళను ఒక వ్యాపార వస్తువుగా చూస్తున్నారని, దీనిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చామని చెప్పారు. 2003-04లో కేంద్ర ప్రభుత్వం గృహహింస ముసాయిదా చట్టం తీసుకొచ్చిందని, అయితే అందులో భర్త అప్పుడప్పుడు భార్యను కొట్టడం నేరం కాదని చెప్పడాన్ని వ్యతిరేకిస్తూ పీవోడబ్ల్యూ అనేక పోరాటాలు చేసిందని, దీని ఫలితంగానే చట్టంలో మార్పులు వచ్చాయని వివరించారు. ప్రభుత్వాలు మహిళల హక్కులపై ఎన్ని చట్టాలు చేసినా, వారికి ఉన్న హక్కులను మహిళలు తెలుసుకోలేకపోతున్నారని, దీనిపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ ఘటన తర్వాత ప్రభుత్వం నిర్భయ చట్టం రూపొందించిందని, ఈ చట్టం రూపకల్పనకు ముందు వర్మ కమిషన్ వేశారని, ఈ కమిషన్ మహిళలపై జరుగుతున్న హింస, దాడులకు కారణాలేంటి.. ఈ సంఘటనలపై సామాజిక ప్రభావం ఎలా ఉంది.. పోలీసుల ప్రవర్తన ఎలా ఉంది అనే వాటిపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందని, దీనిని పట్టించుకోకపోవడంతో నిర్భయ చట్టం తర్వాత కూడా మహిళలపై దాడులు ఆగలేదని పేర్కొన్నారు. 30 సంవత్సరాలుగా సంఘం ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న దాడులపైనే కాకుండా మహిళల ప్రధాన సమస్యలపై పోరాటానికి, వారిని చైతన్యం చేసేందుకు రాత్రి పాఠశాలలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వమే ఈ పాఠశాలలను ప్రస్తుతం యువజన విద్య పేరుతో నిర్వహిస్తోందన్నారు. అనేక మంది ఆకలితో చనిపోతుంటే పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చామని, దాని ద్వారా పనికి ఆహార పథకం ప్రారంభించారని, దీనిని ప్రస్తుతం ఉపాధి హామీ పథకంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే అది ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో ఇంకా జోగిని వ్యవస్థ ఉందని, ఈ మూఢాచారాల నుంచి మహిళలను విముక్తి చేసేందుకు ఉద్యమిస్తున్నామని చెప్పారు. పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రూపొందించిన చట్టాల నుంచి తప్పించుకునేందుకు పురుషులు కొత్త దారులు వెతుకుతున్నారని, కొందరు భార్యాబాధితుల పేరుతో సంఘాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారని అన్నారు. సమాజంలో మహిళలే వివక్షకు గురవుతుంటే పురుషులను ఎలా వేధిస్తారని ప్రశ్నించారు. 3,4,5 తేదీల్లో ఖమ్మంలో జరిగే పీవోడబ్ల్యూ రాష్ట్ర మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై చర్చిస్తామని తెలిపారు. బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని, పీకే హిందీ చిత్రంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశాలు ఏమీ లేవని, అయినప్పటికీ కొన్ని సంస్థలు, వ్యక్తులు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎంతో మేలు జరుగుతుందని ప్రజలు భావించారని, ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో మహిళా మంత్రి కాని, మహిళ కమిషన్‌ను కాని నియమించకపోవడం నిరాశను కల్పించిందని అన్నారు. -
మహిళల హక్కుల కోసం రాజీలేని పోరాటం
జనవరి 3వ తేదీ భారతీయ తొలి ఉపాధ్యాయు రాలు సావిత్రీబాయి ఫూలే 185వ జయంతి. స్త్రీలపై సామాజిక అణచివేత, కులవ్యవస్థ పీడన, దోపిడీకి వ్యతిరేకంగా ఆమె గత శతాబ్దంలోనే సామాజిక ఉద్యమాలను సాగించారు. సావిత్రీబాయి ఫూలే జయంతి రోజునే ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) ఖమ్మం జిల్లాలో 6వ రాష్ట్ర మహా సభలు జరుపుకోబోతోంది. జనవరి 3 నుంచి 5 వరకు జరుగనున్న ఈ మహాసభ తెలంగాణ రాష్ట్రంలో తొలి మహాసభ. 2006లో విశాఖపట్నం లో జరిగిన 5వ రాష్ట్ర మహాసభ నుంచి నిర్వహిం చిన కార్యక్రమాలను పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్ ఉద్యమ కర్తవ్యాలను రూపొందించుకో వడానికి ఖమ్మంలో 6వ మహాసభలను జరుపు కుంటోంది. ప్రగతిశీల మహిళా సంఘం 1974లో ఉస్మా నియా విశ్వవిద్యాలయంలో అభ్యుదయ మహిళా సంఘంగా ఆవిర్భవించింది. ప్రారంభమైనప్పటి నుంచి మహిళల సాధారణ సమ స్యలపై కేంద్రీకరించడమే కాకుం డా రమీజాబీ, మధురలపై అత్యా చారం వంటి సామాజిక సమస్య లపై పీఓడబ్ల్యూ తీవ్రంగా పోరా డింది. సారా వ్యతిరేక ఉద్యమం లో, మహిళల్ని వ్యభిచార కూపా ల్లోకి లాగే ముఠాలకు, అందాల పోటీలకు వ్యతిరేకంగా సంస్థ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టి అరెస్టయ్యారు. గిరిజన తండాల్లో ఆడపిల్లల్ని అమ్మే యడం, వారిని విదేశాలకు ఎగుమతి చేయడంలో డీజీపీ భార్య తోడ్పాటు వంటి ఘటనలపై ఆందో ళన చేపట్టింది. నిర్భయ ఘటనపై దేశవ్యాప్త ఉద్య మంలో పీఓడబ్ల్యూ భాగస్వామ్యం తీసుకుంది. చట్టాలను అమలు చేసే పోలీసులు, న్యాయమూ ర్తులు, రాజకీయ నేతలకు మహిళా దృక్పథాన్ని అల వర్చాల్సిన అవసరముందని ఎలుగెత్తింది. స్త్ర్రీలపై వివక్షతకు వ్యతిరేకంగానూ, గౌరవ ప్రదమైన జీవితం కోసం పీఓడ బ్ల్యూ పోరాడుతోంది. విద్యార్థిను లపై జరుగుతున్న అవమానాలకూ, వేధింపులకూ వ్యతిరేకంగా పీఓడ బ్ల్యూ తన పిడికిలి బిగించింది. మహిళలపై హింసకు వ్యతిరేకంగా, వరకట్న హత్యలు, అత్యాచారాలు, బాల్య వివాహాలు, అశ్లీలత సమస్య లపై ఉద్యమాలు నిర్మించింది. వివ క్షత, అవిద్య, దోపిడీ, అణచివేతలో మగ్గిపోతున్న మహిళల విముక్తికి సామాజిక మార్పు అవసరాన్ని గుర్తించి దాన్ని తన లక్ష్యంగా మార్చుకుంది. స్త్రీలు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే చైతన్యాన్ని అంది స్తూనే సమాజ మార్పు కోసం జరిగే పోరాటాల్లో మమేకమవుతోంది. నేడు సమాజంలో మహిళల మనుగడ, భద్రత, ఉపాధి ప్రశ్నార్థకంగా మారిన ప్రత్యేక పరిస్థితుల్లో ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ 6వ మహా సభను జరుపుకుంటున్నది. ఖమ్మం జిల్లాలో మహి ళలకు తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి ఉన్న పోరాట వారసత్వం స్ఫూర్తిని పీఓడబ్ల్యూ అందిపుచ్చుకుంటుంది. ఆనాడు రాంబాయమ్మ, గోదావరి లోయ ప్రతిఘటన పోరులో శాంతక్క, లలితక్క ప్రాణాలర్పించారు. పీఓడబ్ల్యూ జిల్లా నేతలు సుశేన, చింతా లక్ష్మిలను బూటకపు ఎన్‌కౌం టర్లలో పోలీసులు కాల్చిచంపారు. ప్రత్యేక తెలం గాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కూడా సంస్థ క్రియాశీ లకంగా ఉద్యమించింది. పార్లమెంటులో బిల్లుపె ట్టాలని ఆందోళన నిర్వహించింది. తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపులో అగ్రభాగాన ఉంది. మిలియన్ మార్చ్, సాగరహారం, రైల్ రోకో, బంద్ కార్యక్ర మాల్లో పాల్గొంది. స్త్రీలపై శారీరక, మానసిక హింస లను అరికట్టడానికి ఉద్యమాలను నిర్మించాల్సిన కర్త వ్యం మహిళా ఉద్యమంపై ఉంది. - జి. ఝాన్సీ పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు -
రెక్కలు తెగుతున్న హక్కులు
మహిళల హక్కులే మానవ హక్కులు- అని నినదించింది బీజింగ్ సదస్సు. మహిళలు, పిల్లల మీద జరుగుతున్న హింసను ప్రతిఘటిద్దాం - అంటోంది ఐక్యరాజ్యసమితి. అన్ని రంగాల్లో సమభాగస్వామ్యం మహిళల హక్కు - అని ఘోషిస్తున్నాయి అంతర్జాతీయ సదస్సులు. పితృస్వామ్య కుటుంబాలను కూల్చండి, ప్రజాస్వామ్య కుటుంబాలను నిర్మించండి- అని డిక్లరేషన్ ఇచ్చింది సెడా (కన్వెన్షన్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెనెస్ట్ ఉమెన్). ఈ అన్ని డిక్లరేషన్లలోనూ సంతకం చేసింది భారతదేశం. అయితే వాస్తవంలో ఏం జరుగుతోంది? వాటిని గుర్తు పెట్టుకుని నడుచుకుంటోందా? ‘మానవ హక్కుల దినోత్సవం’ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య మాటల్లో సింహావలోకనం చేసుకుందాం. మొన్న ఈ మధ్య వరంగల్‌లో పెళ్లి నిశ్చయమైన ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత వరుడి కుటుంబీకులు కట్నం ఇంకా ఎక్కువ కావాలని పట్టుబట్టడం, ఆ ఆర్థిక భారాన్ని తట్టుకునే పరిస్థితి ఆమె కుటుంబానికి లేకపోవడమే ఇందుకు కారణం. మానవ హక్కుల ఉల్లంఘన అంటే నేరుగా కొట్టి చంపడమే కాదు, మానసికంగా వేధించడం కూడా ఆమె జీవించే హక్కును కాలరాయడమే. పైగా 1961 వరకట్న నిషేధ చట్టం పేరుతో ఓ చట్టం ఉండగానే ఈ పరిస్థితి దాపురించింది. కూతురికి డబ్బిచ్చి పెళ్లి చేయడం నుంచి కోడలి నుంచి డబ్బు కోరుకోవడం వరకు చట్టం ఉల్లంఘనకు లోనవుతూనే ఉంది. అంతర్లీనంగా ఇది యువతి హక్కులను తమ చేతుల్లోకి తీసుకోవడమే. ఆ అమ్మాయి మరణానికి ప్రభుత్వం, పౌరసమాజం, కుటుంబ వ్యవస్థ కూడా బాధ్యత వహించాలి. ఉపాధ్యాయుడే హక్కులు కాలరాస్తే! కృష్ణా జిల్లాలో ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు, ఇంగ్లిష్ టీచరు ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలిక మీద అత్యాచారం జరుపుతూ ఆమె గర్భం దాలిస్తే అబార్షన్ చేయిస్తూ... చివరికి మూడవసారి అబార్షన్ సమయంలో ప్రాణాలు వదిలిందా బాలిక. ఒక ఉపాధ్యాయుడు... పైగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వం గుర్తించి గౌరవించిన ఆ మహోత్తముని చేతిలో ఓ అమాయక బాలిక జీవితం హరించుకుపోయింది. దళిత, గురుకుల, వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో బాలికలు అవాంఛిత గర్భాలు మోస్తూ అయిష్టంగా బిడ్డకు జన్మనివ్వడం, గర్భాన్ని మోయడం ఇష్టం లేక దొరికిన మందేదో తీసుకుని ఆరోగ్యాన్ని కోల్పోవడం వంటివన్నీ చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. ‘మహిళ ఒంటిని ఆమె అనుమతి లేకుండా తాకకూడదు’ అనే చట్టం ఒకటుందని వీరికి తెలియదా? మైనర్ బాలిక అయితే ఆమె అనుమతించినా సరే ఆమెతో లైంగిక చర్య తప్పు అని తెలుసు కదా! అయినా అత్యాచారాలకు పాల్పడుతున్నారంటే... ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యమా? ఇంతటి భరోసాని వారికెవరిచ్చారు? అనేక రకాలుగా జరుగుతున్న దాడుల నుంచి రక్షణ కోసం ఓ నిర్భయ చట్టం, ఓ 498ఎ, ఓ వరకట్న నిరోధక చట్టం... ఇన్నింటిని తెచ్చుకున్నప్పటికీ అవి మహిళకు తగినంత భరోసానివ్వక పోగా నేరస్థులకే భరోసానిస్తున్నాయి. ఏ సంస్కృతికి ఈ ప్రోత్సాహం! పాశ్చాత్య సంస్కృతిని ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ ఆ పాశ్చాత్య సంస్కృతి ప్రభావానికి మహిళ లోనవుతోందని తిరిగి ఆమెనే ఆరోపించే భరోసా పాలకులకు ఎవరిచ్చారు? హింస, తీవ్రమైన అభద్రత, పేదరికాల్లోకి నెట్టివేసే ఈ సంస్కృతిని భారతీయ మహిళ నిజంగా వీటిని కోరుకుంటోందా? ఎక్కడ ఉన్నా... ఎలా ఉన్నా! 1977-78లలో రమీజాబీ అత్యాచారాన్ని ఆమె వ్యక్తిగత అంశంగా కాక సామాజికాంశంగా పరిగణించాలని ఉద్యమించాయి ప్రజాసంఘాలు. ఉద్యమాన్ని అణచడానికి పేలిన తూటాలకు 27 మంది బలయ్యారు. నిర్భయ, అభయ... అందరి విషయాల్లోనూ ‘ఆమె ఎప్పడు, ఎక్కడ, ఎలా ఉన్నది’ అనే ప్రశ్నలు వేసే సమాజం... ‘ఆమె ఎప్పుడు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా ఆమె ఒంటి మీద చేయి వేసే హక్కు నీకు లేదు’ అని చెప్పడంలో విఫలమైంది. అమెరికా పగటి వేళ ఇక్కడ షిఫ్టుల్లో పని చేసే ఐటి అమ్మాయి అర్ధరాత్రి ప్రయాణం చేయకపోతే కుదురుతుందా? ‘మహిళలు రాత్రి వేళల్లో కూడా పని చేయాలి, వెనుకడుగు వేయవద్దు’ అని ప్రబోధించే పాలకులు మహిళలు రాత్రి పూట ప్రయాణించగలిగిన భద్రమైన రవాణా వ్యవస్థను రూపొందించడంలో విఫలమవుతున్నారు. ప్రజాసంఘాలు 1985లో మహిళల హక్కుల కోసం మహార్యాలీ చేసినప్పుడు నేను ఓ ప్లకార్డులో ‘సిగ్గుతో తలదించుకోవాల్సింది బాధితులు కాదు, నేరస్థులే’ అనే నినాదాన్నిచ్చాను. దాదాపుగా 30 ఏళ్ల కిందట మహిళ సంఘాలన్నీ ఆ నినాదంతో ర్యాలీ చేశాం. అప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లిన నినాదం తరం మారినా ఏ మాత్రం ప్రభావం చూపించకుండా... స్త్రీ హక్కును కాలరాసే హక్కు మగవారి చేతిలో ఉందనే భావజాలాన్నే పెంచి పోషిస్తోంది పౌర సమాజం. 498ఎ దుర్వినియోగం అంటూ గొంతు చించుకునే ముందు మహిళలు మానసిక, ఆర్థిక, మౌఖిక హింసల నుంచి రక్షణ పొందే చట్టాలు లేకపోవడంతో, చట్టబద్ధత, భద్రత లేనప్పుడు కొన్ని సందర్భాల్లో ఎక్కడో కొందరు మాత్రమే 498ఎని ఆశ్రయిస్తున్నారని కూడా గుర్తెరగాలి. వాటన్నింటికీ చట్టాలు ఉంటే ఈ దుర్వినియోగం ఉండదు. చట్టానికి తూట్లు పొడవడం కూడా హక్కుల ఉల్లంఘనే! ప్రేమను తిరస్కరించిందనే కారణంతో అమ్మాయి మీద దాడికి పాల్పడుతున్నారు. అదే అబ్బాయి నుంచి తిరస్కరణకు గురైన అమ్మాయిలు న్యాయం కోసం మౌనపోరాటాలు చేస్తున్నారు తప్ప భౌతిక దాడులకు దిగజారడం లేదు. స్త్రీ స్వేచ్ఛను, గౌరవాన్ని కోరుకుంటోంది. ‘హింస లేని జీవితం, హింసలేని శరీరం, హింస లేని కుటుంబం’ ఆమె హక్కు. వాటిని పాదుకొల్పే ప్రజాస్వామ్య కుటుంబాలను నిర్మిద్దాం. అన్ని రకాల ఆధిపత్యాలను, తిరస్కరణలను రద్దు చేద్దాం. శాంతియుత కుటుంబాల నిర్మాణమే నిజమైన మానవహక్కుల పరిరక్షణ. సంభాషణ : వాకా మంజులారెడ్డి -
బ్రిటన్‌లో సరస్వతీ పుత్రికల శకం!
బ్రిటన్‌లో చదువు విషయంలో అమ్మాయిలు దూసుకుపోతున్నారు. అబ్బాయిలతో పోటీ పడటం కాదు.. అబ్బాయిలను ఓడించి, అందనంత వేగంగా దూసుకుపోతున్నారు. అక్కడి యూనివర్సిటీల్లోని విద్యార్థినీ విద్యార్థుల సంఖ్యను బట్టి చూస్తే... ప్రస్తుతం అక్కడ సరస్వతీ పుత్రికల శకం నడుస్తోందని చెప్పవచ్చు. ప్రత్యేకించి పై చదువుల విషయంలో అమ్మాయిల హవా స్పష్టంగా కనిపిస్తోంది. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ల కోసం యూనివర్సిటీల్లో స్థానం సీట్లు సంపాదిస్తున్న వాళ్లలో, ఆ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వాళ్లలో అమ్మాయిల శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుత విద్యాసంవత్సరం లెక్కల ప్రకారం చూస్తే.. బ్రిటన్‌లోని టాప్ రేటెడ్ యూనివర్సిటీల్లో మొత్తం 4,12,170 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీరిలో 2,32,250 మంది అమ్మాయిలు ఉండగా, అబ్బాయిల సంఖ్య 1,79, 920 మంది మాత్రమే. తేడా దాదాపు 50 వేల మందిపైనే! ఈ ఏడాదికే కాదు.. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితే ఉంది. ప్రతియేటా గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటకు వస్తున్న వాళ్లలో అమ్మాయిల సంఖ్య 50 నుంచి 60 వేలు ఎక్కువగా ఉంటోంది. దీంతో క్లాసురూముల్లో అబ్బాయిలు మైనారిటీలు అయిపోయారు. అమ్మాయిలు మెజారిటీలు అయిపోయారు. మహిళా సాధికారతలో ఇది మరో ముందడుగు అనే అభిప్రాయం వినిపిస్తోందిప్పుడు. అమ్మాయిల్లో చదువు మీద పెరిగిన ఆసక్తికి.. వారి పట్టుదలకు ఇది నిదర్శనమని అంటున్నారు స్థానిక విద్యావేత్తలు, మహిళా హక్కుల ఉద్యమకారిణులు. నిజంగా ఇది మంచి పరిణామం కదా! -
మహిళా మేలుకో.. చట్టం తెలుసుకో
‘ఆకాశంలో సగం.. అన్నింటా సగం’ అంటూ మహిళలను ఒకవైపు ఆకాశానికి ఎత్తేస్తున్నా.. మరోవైపు రోజురోజుకూ వారిపై దాడులు పెరిగిపోతున్నాయి. భ్రూణహత్యలు, అత్యాచారాలు, గృహహింస తదితర వేధింపులు అధికమవుతున్నాయి. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త చట్టాలు తెస్తున్నా వీటిపై సరైన అవగాహన లేక ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోతున్నాయి. మహిళలకు సంబంధించిన ప్రతీ అంశానికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది. వీటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక కమిషన్.. గత ప్రభుత్వం మహిళా, శిశు రక్షణ, హక్కుల్ని పర్యవేక్షించేందుకు ఒక చైర్పర్సన్, ఆరుగురు సభ్యులతో కలిసి ఒక ప్రత్యేక క మిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సమాజంలో మహిళల సమానత్వం, వారి అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. వీటిపట్ల మహిళల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. కమిషన్ పరిధిలోకి వచ్చే ఫిర్యాదులపై విచారణ సాగిస్తుంది. గృహహింస నిరోధక చట్టం.. ఈ చట్టం ప్రకారం మహిళలు రక్షణ కోసం పోలీసు, రక్షణ అధికారులు, స్త్రీ, శిశు సంక్షేమ పథక సంచాలకులు, గుర్తింపు పొందిన సర్వీసు ప్రొవైడర్లు మొదలైన వారిని ఆశ్రయించవచ్చు. రక్షణ, నివాసం, ద్రవ్య, సంతాన, నష్ట పరిహారం మొదలైనవి పొందొచ్చు. ప్రాజెక్ట్ డెరైక్టర్, స్త్రీ-శిశు సంక్షేమశాఖ వారిని ఆశ్రయిస్తే సమస్యపై స్పందన లభిస్తుంది. కౌన్సెలింగ్ కేంద్రం, న్యాయ స్థానాలను ఆశ్రయించి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయించవచ్చు. బాధితులకు న్యాయం కోరే హక్కు కల్పిస్తుంది. నిర్భయ చట్టం.. ఇటీవల అమ్మాయిలు, మహిళలపై లైంగిక దాడులు ఎక్కువయ్యాయి. యాసిడ్ ఘటనలు పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాల్ని తీసుకురావాలని గత ప్రభుత్వాలు ఈ చట్టాన్ని తీసుకువచ్చాయి. మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక దాడులు, వేధింపులు, కిడ్నాప్, హింస తదితర అంశాలు ఈ చట్టం కిందికి వస్తాయి. నేరాలకు పాల్పడిన వారికి ఈ చట్టం ప్రకారం తీవ్రమైన శిక్షలు ఉంటాయి. ఫిర్యాదుల కోసం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సంప్రదించాలి. మహిళల అక్రమ రవాణా.. పెరుగుతున్న జనాభా కారణంగా ఏర్పడిన నిరుద్యోగం, ఆహార కొరత, పోటీవల్ల మహిళల అక్రమ రవాణా జరుగుతోంది. ఉద్యోగాల ఎర వేసి వారిని వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారు. బయటికి చెప్తే పరువుతీస్తామని భయపెట్టి కుట్రలకు పాల్పడుతున్నారు. మరోవైపు చిన్న పిల్లల అక్రమ రవాణా, అవయవ అక్రమ రవాణా కోసం కిడ్నాప్‌లు జరుగుతున్నాయి. ఇలాంటివాటిపై ప్రాంతీయ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలి. లింగనిర్ధారణ.. గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ద్వారా భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. చట్ట ప్రకారం భ్రూణహత్యలకు పాల్పడినా, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా శిక్షార్హులవుతారు. అనుమతుల్లేకుండా ల్యాబ్‌లు నిర్వహించే వారిపై ఫిర్యాదు చేయొచ్చు. మరోవైపు ఆడపిల్లలు పుట్టారని వారిని చెత్తకుప్పల్లో, ముళ్లపొదల్లో పారవేసే ఘటనలు గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల ఎక్కువయ్యాయి. ఇలాంటివాటిపై జిల్లా వైద్య ఆర్యోగ శాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలి. బాలల రక్షణ.. యేటా జరుగుతున్న నేరశాతంలో అగ్రభాగం లైంగిక వేధింపులదే. వేధింపులు తాళలేక మహిళలు, బాలికలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లైంగిక వేధింపుల నుంచి 18 ఏళ్ల లోపు బాల బాలికలకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. బాల్యవివాహాలను అరికడుతుంది. 18 ఏళ్ల లోపు బాలికలు, 21ఏళ్లలోపు బాలురకు వివాహం చేస్తే చట్టరీత్యా నేరం. వీటితోపాటు విద్య, రక్షణ, భాగస్వామ్యపు, జీవించే హక్కు తదితర హక్కులను ఈ చట్టం ద్వారా పొందొచ్చు. బాల కార్మిక వ్యవస్థను నిరోధించవచ్చు. 14 ఏళ్లలోపు పిల్లల్ని పనిలో పెట్టుకుంటే శిక్షలు తప్పవు. నిర్బంధ ఉచిత విద్య.. ఈ చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల బాలికలు తప్పనిసరిగా విద్యనభ్యసించాల్సిందే. వ్యక్తిగత వికాసం, లింగ వివక్ష, నిర్మూలన, సంపూర్ణ విద్య, భద్రమైన భవిత, సంపూర్ణ అక్షరాస్యత, సర్వశిక్షణ అభియాన్‌లో భాగంగా బాలికల జాతీయ విద్యా కార్యక్రమం అమలు చేస్తున్నారు. బడీడు పిల్లలు పాఠశాలలో ఉండాలన్నది దీని ఉద్దేశం. వీటికోసం సంబంధిత జిల్లా విద్యాసంస్థ కార్యాలయంలో సంప్రదించాలి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, నీళ్లు, నిధులు, ఉద్యోగాలతో పాటు మహిళల రక్షణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధానంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక, యాసిడ్ దాడులు, బాల్యవివాహాలు, గృహహింస, మహిళల అక్రమ రవాణా వంటి విషయాలను సీరియస్‌గా తీసుకోనుంది. మహిళా చైతన్యం కోసం సరికొత్త పథకాలు తీసుకురావాలని భావిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలోనూ.. ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వీటిపై స్పష్టమైన ప్రకటన చేశారు. -
వాయిస్ ఆఫ్ యూత్!
వయసుకు తగ్గట్టుగా వచ్చే హార్మోన్లు మనిషికి సహజసిద్ధంగా చాలా విషయాలను నేర్పిస్తాయి. అలాగే సంఘంలో బతుకుతున్నందుకు చదువు, ఉద్యోగం, శ్రమలకు సులువుగా అలవాటు పడిపోతాడు.. మరి ఇదే సంఘంలో బతుకీడుస్తూ కొంచెం వైవిధ్యంగా చదివే వాళ్లు, కొంచెం వైవిధ్యమైన ఉపాధిని చూసుకొనే వాళ్లు, కొంచెం వైవిధ్యంగా శ్రమ పడే వాళ్లు... ప్రత్యేకమైన వ్యక్తులు అవుతారు. గొప్ప గుర్తింపును తెచ్చుకొంటారు. అవకాశం కలిసొస్తే అంతర్జాతీయ స్థాయి పేరు ప్రఖ్యాతులను తెచ్చుకొంటారు. ఈ తరహాలో కొంచెం సృజన, మరికొంచెం బాధ్యత, కొంచెం ఆసక్తి మరికొంచెం అవసరంతో కొంతమంది మంచి ప్రయత్నాలు చేశారు. సమకాలీన సమాజాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న వారుగా, ప్రభావితం చేసే వ్యక్తులుగా పేరు తెచ్చుకొన్నారు. అలాంటి వారిలో కొందరు. వీళ్లంతా యువ డాక్యుమెంటరీ మేకర్లు. తమ చుట్టూ ఉన్న సమాజంలోని సమస్యలపై అధ్యయనం చేసి తమదైన శైలిలో దాన్ని సంస్కరించడానికి ప్రయత్నించిన వాళ్లు. పేరు: శ్రుతీ రాయ్, ఇండియా డాక్యుమెంటరీ పేరు: మైనా, ది లిటిల్ బ్రైడ్ బాల్య వివాహం. చాపకింద నీరులా ఇప్పటికీ మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. వ్యవస్థలో భాగమై అనేక మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తూ దుష్పరిణామాలకు కారణం అవుతున్న సమస్య ఇది. దేశంలోని ఒక మహానగరంలో చదువుతున్న యువతి శ్రుతీరాయ్. అక్కడే ఒక కార్పొరేట్ విద్యాలయంలో చదువుతున్న శ్రుతి ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా గ్రామానికి వెళితే అక్కడ చిన్న వయసు పిల్లలకే వివాహాలు అవుతున్నాయనే విషయం అర్థమైందట. ఈ విషయం గురించి పూర్తి వివరాల గురించి గూగుల్‌ను ఆశ్రయిస్తే ఎన్నో కఠోరమైన నిజాలు తెలిశాయి. వాటి గురించి తెలుసుకొన్న శ్రుతి ఆవేదనకు ప్రతిరూపమే ‘మైనా, ది లిటిల్ బ్రైడ్’. అప్పటికే మూవీ మేకింగ్ మీద అవగాహన కలిగిఉన్న ఈ టీనేజర్ యానిమేషన్ డాక్యుమెంటరీని రూపొందించింది. ‘సమాజంలో మార్పు తీసుకురావడానికి, ఏదో ఒక వైవిధ్యమైన ప్రయత్నం చేయాలనే ఆలోచనే ఈ డాక్యుమెంటరీకి మూలం. దీనికి మంచి గుర్తింపు రావడం ఆనందమే. అయితే నా డాక్యుమెంటరీ కొంతమందిపై ప్రభావం చూపి, కొంతమంది అమ్మాయిల జీవితాలు బాగు పడటానికి కారణం అయినా ఆనందమే..’’ అని అంటోంది శ్రుతి. పేరు: బిజిమనా ఫ్రాంకోయిస్, కెన్యా డాక్యుమెంటరీ పేరు: క్రై ఆఫ్ ది రెఫ్యుజీస్ ఈ ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది శరణార్థి శిబిరంలో ఉన్న మనిషే. ఇటు తమిళ ఈలం దగ్గర నుంచి అటు ఆఫ్రికన్ అంతర్యుద్ధాల బాధితుల వరకూ ఎవరి పరిస్థితిని చూసినా అర్థమవుతుంది ఈ విషయం. కష్టమో నష్టమో సొంత ఊరిలో ఉండి, సొంత వాళ్ల మధ్యనే ఉండి దాన్ని ఎదుర్కొంటునప్పుడు ఉండే స్థైర్యం వేరు, స్థానిక పరిస్థితుల ప్రభావంతోనో, యుద్ధ వాతావరణంలోనో, ప్రకృతి వైపరీత్యాలతోనో.. కష్టాలను ఎదుర్కోవడం వేరు. అలాంటి కష్టాల ప్రతిరూపమే ‘క్రై ఆఫ్ ది రెఫ్యూజీస్’. బిజిమనా ఫ్రాంకోయిస్ అనే ఈ కెన్యన్ యువకుడు తీశాడు ఈ డాక్యుమెంటరీని. వాలంటీర్‌గా కెన్యాలోని ఒక శరణార్థ శిబిరాన్ని సందర్శించినప్పుడు ఫ్రాంకోయిస్ కళ్లలోని తడికి ఆవిష్కారం ఈ సినిమా. సృజనాత్మకత ఉన్న యువతీయువకులు సమాజాన్ని ఎంతగానైనా ప్రభావితం చేయగలరనేది తన నమ్మకం అని, అందుకే తను ఈ ప్రయత్నం చేశానని, మరిన్ని ఇలాంటి ప్రయత్నాలు చేస్తానని ఫ్రాంకోయిస్ అంటాడు. పేరు: ఎరిని-రెనీ గట్సీ, గ్రీస్ డాక్యుమెంటరీ పేరు: డ్రాప్ ఇట్ ఈమె పేరు పలకడానికి మనకు కొంచెం కష్టం కానీ, ఆమె భావాన్ని మాత్రం డాక్యుమెంటరీని చూస్తే చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోతోంది, వలసలు ఎక్కువవుతున్నాయి. దీంతో కొన్ని దేశాలకే పరిమితం అయిన భిన్నత్వంలో ఏకత్వం అంతటా ఆవిష్కృతం అవుతుందనే భ్రమల్లో ఉన్నాం కానీ, తమదేశంలోనే జాతుల మధ్య అంతరాలున్నాయని, రేసిజం పుష్కలంగా ఉందని అంటుంది గ్రీస్‌కు చెందిన ఈ టీనేజర్. మనుషులు అలాంటి జాడ్యాలను వదులుకోవాలని, మనసుంటే అది చాలా సులభమైన విషయం అనే సందేశాన్ని ఇస్తూ ‘డ్రాప్ ఇట్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది రెనీ. భవిష్యత్తులో మానవహక్కులు, మహిళల హక్కులపై అవగాహనను పెంపొందించే పనిలో ఉంటానని, అందులో భాగంగా ఇండియాను ఒకసారి సందర్శించాలనేది తన ప్రణాళిక అని రెనీ వివరించింది. -
హింస లేని సమాజం కోసం పాటుపడండి
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : హింస లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. మానవ హక్కులే మహిళల హక్కులని నినదించారు. ప్రపంచ మానవహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఐద్వా ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఐద్వా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.దిల్షాద్, మహిళల హక్కుమాట్లాడుతూ దేశంలో పాశ్చాత్య సంస్కృతి పెరగడం వల్ల మహిళలపై దౌర్జన్యాలు, లైంగిక వేధింపులు, అక్రమ రవాణాలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలను వ్యాపార వస్తువుగా చిత్రీకరించే ధోరణి పెరిగిందన్నారు. సైబర్‌నేరాలు కూడా పెరిగిపోయాయని తెలిపారు. ‘నిర్భయ’ లాంటి చట్టాలు వచ్చినా మహిళలపై దాడులు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు ఎన్ని తెచ్చినా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే నిర్వీర్యం కాకతప్పదన్నారు. మహిళల రక్షణ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా నేతలు అరుణ, బి.లక్ష్మిదేవి, రామాంజినమ్మ, అనంతమ్మ, సరళ, క్రాంతి, భాగ్య, ఫరియాద్, సులోచన, విజయతోపాటు మహిళలు పాల్గొన్నారు.