మహిళా మేలుకో.. చట్టం తెలుసుకో | government introduces a special Special Commission to protect Women's rights | Sakshi
Sakshi News home page

మహిళా మేలుకో.. చట్టం తెలుసుకో

Published Thu, Jun 19 2014 11:51 PM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM

మహిళా మేలుకో.. చట్టం తెలుసుకో - Sakshi

మహిళా మేలుకో.. చట్టం తెలుసుకో

‘ఆకాశంలో సగం.. అన్నింటా సగం’ అంటూ మహిళలను ఒకవైపు ఆకాశానికి ఎత్తేస్తున్నా.. మరోవైపు రోజురోజుకూ వారిపై దాడులు పెరిగిపోతున్నాయి.  భ్రూణహత్యలు, అత్యాచారాలు, గృహహింస తదితర వేధింపులు అధికమవుతున్నాయి. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త చట్టాలు తెస్తున్నా వీటిపై సరైన అవగాహన లేక ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోతున్నాయి. మహిళలకు సంబంధించిన ప్రతీ అంశానికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది. వీటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
 
ప్రత్యేక కమిషన్..
గత ప్రభుత్వం మహిళా, శిశు రక్షణ, హక్కుల్ని పర్యవేక్షించేందుకు ఒక చైర్‌పర్సన్, ఆరుగురు సభ్యులతో కలిసి ఒక ప్రత్యేక క మిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సమాజంలో మహిళల సమానత్వం, వారి అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. వీటిపట్ల మహిళల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. కమిషన్ పరిధిలోకి వచ్చే ఫిర్యాదులపై విచారణ సాగిస్తుంది.
 
గృహహింస నిరోధక చట్టం..
ఈ చట్టం ప్రకారం మహిళలు రక్షణ కోసం పోలీసు, రక్షణ అధికారులు, స్త్రీ, శిశు సంక్షేమ పథక సంచాలకులు, గుర్తింపు పొందిన సర్వీసు ప్రొవైడర్లు మొదలైన వారిని ఆశ్రయించవచ్చు. రక్షణ, నివాసం, ద్రవ్య, సంతాన, నష్ట పరిహారం మొదలైనవి పొందొచ్చు. ప్రాజెక్ట్ డెరైక్టర్, స్త్రీ-శిశు సంక్షేమశాఖ వారిని ఆశ్రయిస్తే సమస్యపై స్పందన లభిస్తుంది. కౌన్సెలింగ్ కేంద్రం, న్యాయ స్థానాలను ఆశ్రయించి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయించవచ్చు. బాధితులకు న్యాయం కోరే హక్కు కల్పిస్తుంది.
 
 నిర్భయ చట్టం..
ఇటీవల అమ్మాయిలు, మహిళలపై లైంగిక దాడులు ఎక్కువయ్యాయి. యాసిడ్ ఘటనలు పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాల్ని తీసుకురావాలని గత ప్రభుత్వాలు ఈ చట్టాన్ని తీసుకువచ్చాయి. మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక దాడులు, వేధింపులు, కిడ్నాప్, హింస తదితర అంశాలు ఈ చట్టం కిందికి వస్తాయి. నేరాలకు పాల్పడిన వారికి ఈ చట్టం ప్రకారం తీవ్రమైన శిక్షలు ఉంటాయి. ఫిర్యాదుల కోసం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సంప్రదించాలి.
 
 మహిళల అక్రమ రవాణా..

 పెరుగుతున్న జనాభా కారణంగా ఏర్పడిన నిరుద్యోగం, ఆహార కొరత, పోటీవల్ల మహిళల అక్రమ రవాణా జరుగుతోంది. ఉద్యోగాల ఎర వేసి వారిని వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారు. బయటికి చెప్తే పరువుతీస్తామని భయపెట్టి కుట్రలకు పాల్పడుతున్నారు. మరోవైపు చిన్న పిల్లల అక్రమ రవాణా, అవయవ అక్రమ రవాణా కోసం కిడ్నాప్‌లు జరుగుతున్నాయి. ఇలాంటివాటిపై  ప్రాంతీయ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలి.
 
లింగనిర్ధారణ..
గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ద్వారా భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. చట్ట ప్రకారం భ్రూణహత్యలకు పాల్పడినా, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా శిక్షార్హులవుతారు. అనుమతుల్లేకుండా ల్యాబ్‌లు నిర్వహించే వారిపై ఫిర్యాదు చేయొచ్చు. మరోవైపు ఆడపిల్లలు పుట్టారని వారిని చెత్తకుప్పల్లో, ముళ్లపొదల్లో పారవేసే ఘటనలు గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల ఎక్కువయ్యాయి. ఇలాంటివాటిపై జిల్లా వైద్య ఆర్యోగ శాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలి.
 
 బాలల రక్షణ..
యేటా జరుగుతున్న నేరశాతంలో అగ్రభాగం లైంగిక వేధింపులదే. వేధింపులు తాళలేక మహిళలు, బాలికలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లైంగిక వేధింపుల నుంచి 18 ఏళ్ల లోపు బాల బాలికలకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. బాల్యవివాహాలను అరికడుతుంది. 18 ఏళ్ల లోపు బాలికలు, 21ఏళ్లలోపు బాలురకు వివాహం చేస్తే చట్టరీత్యా నేరం. వీటితోపాటు విద్య, రక్షణ, భాగస్వామ్యపు, జీవించే హక్కు తదితర హక్కులను ఈ చట్టం ద్వారా పొందొచ్చు. బాల కార్మిక వ్యవస్థను నిరోధించవచ్చు. 14 ఏళ్లలోపు పిల్లల్ని పనిలో పెట్టుకుంటే శిక్షలు తప్పవు.  
 
 నిర్బంధ ఉచిత విద్య..
ఈ చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల బాలికలు తప్పనిసరిగా విద్యనభ్యసించాల్సిందే. వ్యక్తిగత వికాసం, లింగ వివక్ష, నిర్మూలన, సంపూర్ణ విద్య, భద్రమైన భవిత, సంపూర్ణ అక్షరాస్యత, సర్వశిక్షణ అభియాన్‌లో భాగంగా బాలికల జాతీయ విద్యా కార్యక్రమం అమలు చేస్తున్నారు. బడీడు పిల్లలు పాఠశాలలో ఉండాలన్నది దీని ఉద్దేశం. వీటికోసం సంబంధిత జిల్లా విద్యాసంస్థ కార్యాలయంలో సంప్రదించాలి.
 
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం..
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, నీళ్లు, నిధులు, ఉద్యోగాలతో పాటు మహిళల రక్షణను  ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధానంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక, యాసిడ్ దాడులు, బాల్యవివాహాలు, గృహహింస, మహిళల అక్రమ రవాణా వంటి విషయాలను సీరియస్‌గా తీసుకోనుంది. మహిళా చైతన్యం కోసం సరికొత్త పథకాలు తీసుకురావాలని భావిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలోనూ.. ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వీటిపై స్పష్టమైన ప్రకటన చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement