Defense officials
-
మాజీ సైనికులకు కార్పొరేట్ ‘సెల్యూట్’!
రక్షణ దళాల్లో పనిచేసి రిటైర్ అయిన మాజీ సైనికోద్యోగులకు కార్పొరేట్ కంపెనీలు రారమ్మంటూ రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా అలవోకగా పని చేసే శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, ప్రాజెక్టుల అమలులో కచ్చితత్వం వంటి ప్రత్యేక నైపుణ్యాలను ఉపయోగించుకోవడంపై ఫోకస్ చేస్తున్నా యి. కొన్ని విభాగాల్లో నిపుణుల కొరతను అధిగమిస్తున్నాయి. దేశంలో మాజీ సైనికుల వెంట పడుతున్న టాప్ కంపెనీలు, బడా కార్పొరేట్ సంస్థల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో ఏకంగా 2,000 మంది మాజీ సైనికోద్యోగులను నియమించుకుంది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య మూడో వంతు ఎక్కువ. దీంతో ఈ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో రక్షణ దళాల మాజీ సిబ్బంది 7,500 మందికి ఎగబాకారు. ఇంత భారీ సంఖ్యలో ఎక్స్–సర్వీస్‌మెన్ ఉన్న కంపెనీగా కూడా రిలయన్స్ రికార్డు సృష్టించింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం టాటా గ్రూప్ కంపెనీలు, మారుతీ తో పాటు అదానీ గ్రూప్, ఆర్పీజీ గ్రూప్, వేదాంత, సొడెక్సో, ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ వంటి సంస్థలు సైతం మాజీ సైనిక సిబ్బందిని నియమించుకుంటున్న జాబితాలో టాప్‌లో ఉన్నాయి. ఏటా 60,000 మంది పదవీ విరమణ... త్రివిధ దళాల్లో (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) ఏటా పదవీ విరమణ చేస్తున్న రక్షణ సిబ్బంది సంఖ్య దాదాపు 55,000–60,000 వరకు ఉంటుందని అంచనా. వీరిలో ఆఫీసర్ ర్యాంకుల్లో ఉన్నవారు 1,200–1,300 (సుమారు 2%) మంది వరకు ఉంటారు. అంతేకాకుండా, 50 ఏళ్లు పైబడిన చాలా మంది అధికారులు స్వచ్ఛందంగా రిటైర్ అయ్యేందుకు మొగ్గు చూపుతుండటం విశేషం. ఇలా వైదొలగుతున్న వారిలో ఎక్కువగా రిలయన్స్, అదానీ, ఎల్అండ్ టీ, టాటా గ్రూప్ వంటి బడా కార్పొరేట్ కంపెనీల్లో హెచ్ఆర్, అడ్మిన్, సరఫరా వ్యవస్థలు ఇతరత్రా విధుల్లో చేరుతున్నారని త్రివిధ దళాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం చీఫ్ మెంటార్, పూర్వ అధ్యక్షుడు కమోడోర్ సుదీర్ పరకాల చెబుతున్నారు. సరుకు రవాణా (లాజిస్టిక్స్), ఈ–కామర్స్, వేర్–హౌసింగ్ పరిశ్రమతో పాటు ఆటోమొబైల్, తయారీ, విద్యుదుత్పత్తి, టెలికం వంటి రంగాల్లో ఎక్స్–సరీ్వస్మెన్కు దండిగా అవకాశాలు లభిస్తున్నాయి. ఇంజనీరింగ్, మెషీన్ విభాగాలు, అడ్మినిస్ట్రేషన్ విధుల్లో ఎక్కువగా నియమించుకుంటున్నాయి. ప్రత్యేక సామర్థ్యాలు ప్లస్... మాజీ సైనికోద్యోగులకు అత్యుత్తమ ఫిట్‌నెస్‌కు తోడు క్రమశిక్షణ వంటి ప్రత్యేకతల కారణంగా సంస్థకు అదనపు బలం చేకూరుతోందని రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులను పక్కాగా అమలు చేసే సామర్థ్యం, సంక్లిష్ల పరిస్థితులను అధిగమించే నైపుణ్యాలు, ప్రతికూల ప్రదేశాలను తట్టుకుని పని చేసే ధైర్య సాహసాలు... కంపెనీలు ఏరికోరి మరీ వారిని నియమించుకునేలా చేస్తున్నాయన్నారు. దీనివల్ల వైవిద్యంతో పాటు కొన్ని విభాగాల్లో నిపుణుల కొరత కూడా తీరుతుందనేది హైరింగ్ నిపుణుల మాట. ‘రక్షణ దళాల్లో ఏళ్ల తరబడి పనిచేసేటప్పుడు అలవడిన క్రమశిక్షణ, వారికి ఇచ్చే కఠోర శిక్షణ కారణంగా మాజీ సైనిక సిబ్బందికి ప్రత్యేక సామర్థ్యాలు అలవడతాయి. ముఖ్యంగా సమస్యల పరిష్కార తీరు, టీమ్ వర్క్, మల్టీ టాస్కింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి విషయాల్లో వారు ఆరితేరి ఉంటారు. అందుకే టాటా, ఆదిత్య బిర్లా, రిలయన్స్, ఎల్అండ్టీ, వేదాంత గ్రూప్ వంటి బడా కార్పొరేట్లు మాజీ సైనికుల హైరింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి’ అని సియెల్ హెచ్ఆర్ అంటోంది.ఓఎన్జీసీ: కంపెనీ నిబంధనల మేరకు మాజీ సైనికోద్యోగులకు ఎగ్జిక్యూటివ్ స్థాయి నియామకాల్లో 5 ఏళ్ల వయో సడలింపును ప్రకటించింది. రిలయన్స్: గత ఆర్థిక సంవత్సరంలో 2,000 మంది మాజీ సైనికులను నియమించుకుంది. ఈ సంఖ్య 7,500కు చేరింది.వేదాంత: రక్షణ దళాల మాజీ సిబ్బంది నియామకం కోసం 2023–24లో ప్రత్యేక పాలసీ చర్యలు చేపట్టింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
పుల్వామా’ కుటుంబాలకు కోటి ఎక్స్‌గ్రేషియా
న్యూఢిల్లీ: పుల్వామాలో ఉగ్రదాడిలో అసువులు బాసిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు సర్వీస్ నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించినట్లు భద్రతాదళాధికారి ఒకరు చెప్పారు. వీటితోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను అదనంగా అందజేస్తామన్నారు. ఇందులో సీఏపీఎఫ్‌కి చెందిన సిబ్బంది విధి నిర్వహణ లో మృతి చెందినపుడు కేంద్రం ప్రకటించే ఎక్స్‌గ్రేషియా కింద రూ.35 లక్షలు, నష్ట నివారణ నిధి కింద రూ.21.50 లక్షలు, ‘భారత్ కే వీర్’నిధి కింద రూ.15 లక్షలు, ఎస్బీఐ పారామిలిటరీ సేవల బీమా నుంచి రూ.30 లక్షలు చెల్లించారు. ‘కొన్ని సంస్థలు జవాన్ల పిల్లల విద్యా బాధ్యతలను తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి’అని ఆయన చెప్పారు. కొన్ని సందర్భాల్లో మృతి చెందిన జవాన్ల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించాయని, వారు సీఆర్పీఎఫ్లోని ఉద్యోగాలకూ అర్హులేనన్నారు. -
అధికారులకు రక్షణ లేదు...ఆడవారికి భద్రత లేదు
టీడీపీ ప్రభుత్వంలో క్షీణించిన శాంతిభద్రతలు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి : తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారులకు రక్షణ లేదు.. ఆడవారికి భద్రత లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) ధ్వజమెత్తారు. శాంతిభద్రతలు క్షీణించడంతో రాష్ట్ర ప్రజలు అభద్రతతో ఆందోళనతో బతకాల్సివస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈమేరకు సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని తన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. విజయవాడలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి తమ కార్యకర్తలు చెప్పినట్లు అధికారులు పనులు చేయాలని ఆదేశాలు జారీచేసినప్పుడే ఇలాంటి ఘటనలు జరుగుతాయని తాము హెచ్చరించామన్నారు. తహశీల్దార్ వనజాక్షిపై దాడిచేసిన ఎమ్మెల్యేతో పాటు అధికార పార్టీనేతలను సాక్షాతూ ముఖ్యమంత్రే వత్తాసు పలికి ప్రభుత్వాస్తులను కాపాడిన అధికారులను తప్పుపడితే ఇక క్రింద స్థాయిలోకి ఏవిధమైన సంకేతాలు వెల్తాయని ప్రశ్నించారు. పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాలలో రెవెన్యూ అధికారులపై దాడులు చేసిన సమయంలో కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఆత్మకూరు ఘటనలు పునరావృత్తమయ్యేవి కాదన్నారు. ప్రభుత్వం ఎంతసేపటికి తమ నాయకులు కార్యకర్తల జుబులు నింపడనే విధంగా ఇసుక, మైనింగ్, మట్టి మాఫియాలను ప్రోత్సహిస్తూ అధికారులును భయబ్రాంతులకు గురిచేస్తుందని విమర్శించారు. రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలను ప్రోత్సహించకూడదని, విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరాలని అభిలషించి విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దారన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యాలయాల్లో కుల రాజకీయాలును ప్రోత్సహిస్తుండడంతో విద్యార్థిని రిషితేశ్వరి మృతి వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిషితేశ్వరి మృతికి కారణమైన వారిని కటినంగా శిక్షించడంతో పాటు విద్యాలయాల్లో రాజకీయాలను కుల సంఘాలను చేరనీయకుండా చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో సూచించారు. -
మహిళా మేలుకో.. చట్టం తెలుసుకో
‘ఆకాశంలో సగం.. అన్నింటా సగం’ అంటూ మహిళలను ఒకవైపు ఆకాశానికి ఎత్తేస్తున్నా.. మరోవైపు రోజురోజుకూ వారిపై దాడులు పెరిగిపోతున్నాయి. భ్రూణహత్యలు, అత్యాచారాలు, గృహహింస తదితర వేధింపులు అధికమవుతున్నాయి. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త చట్టాలు తెస్తున్నా వీటిపై సరైన అవగాహన లేక ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోతున్నాయి. మహిళలకు సంబంధించిన ప్రతీ అంశానికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది. వీటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక కమిషన్.. గత ప్రభుత్వం మహిళా, శిశు రక్షణ, హక్కుల్ని పర్యవేక్షించేందుకు ఒక చైర్పర్సన్, ఆరుగురు సభ్యులతో కలిసి ఒక ప్రత్యేక క మిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సమాజంలో మహిళల సమానత్వం, వారి అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. వీటిపట్ల మహిళల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. కమిషన్ పరిధిలోకి వచ్చే ఫిర్యాదులపై విచారణ సాగిస్తుంది. గృహహింస నిరోధక చట్టం.. ఈ చట్టం ప్రకారం మహిళలు రక్షణ కోసం పోలీసు, రక్షణ అధికారులు, స్త్రీ, శిశు సంక్షేమ పథక సంచాలకులు, గుర్తింపు పొందిన సర్వీసు ప్రొవైడర్లు మొదలైన వారిని ఆశ్రయించవచ్చు. రక్షణ, నివాసం, ద్రవ్య, సంతాన, నష్ట పరిహారం మొదలైనవి పొందొచ్చు. ప్రాజెక్ట్ డెరైక్టర్, స్త్రీ-శిశు సంక్షేమశాఖ వారిని ఆశ్రయిస్తే సమస్యపై స్పందన లభిస్తుంది. కౌన్సెలింగ్ కేంద్రం, న్యాయ స్థానాలను ఆశ్రయించి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయించవచ్చు. బాధితులకు న్యాయం కోరే హక్కు కల్పిస్తుంది. నిర్భయ చట్టం.. ఇటీవల అమ్మాయిలు, మహిళలపై లైంగిక దాడులు ఎక్కువయ్యాయి. యాసిడ్ ఘటనలు పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాల్ని తీసుకురావాలని గత ప్రభుత్వాలు ఈ చట్టాన్ని తీసుకువచ్చాయి. మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక దాడులు, వేధింపులు, కిడ్నాప్, హింస తదితర అంశాలు ఈ చట్టం కిందికి వస్తాయి. నేరాలకు పాల్పడిన వారికి ఈ చట్టం ప్రకారం తీవ్రమైన శిక్షలు ఉంటాయి. ఫిర్యాదుల కోసం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సంప్రదించాలి. మహిళల అక్రమ రవాణా.. పెరుగుతున్న జనాభా కారణంగా ఏర్పడిన నిరుద్యోగం, ఆహార కొరత, పోటీవల్ల మహిళల అక్రమ రవాణా జరుగుతోంది. ఉద్యోగాల ఎర వేసి వారిని వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారు. బయటికి చెప్తే పరువుతీస్తామని భయపెట్టి కుట్రలకు పాల్పడుతున్నారు. మరోవైపు చిన్న పిల్లల అక్రమ రవాణా, అవయవ అక్రమ రవాణా కోసం కిడ్నాప్‌లు జరుగుతున్నాయి. ఇలాంటివాటిపై ప్రాంతీయ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలి. లింగనిర్ధారణ.. గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ద్వారా భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. చట్ట ప్రకారం భ్రూణహత్యలకు పాల్పడినా, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా శిక్షార్హులవుతారు. అనుమతుల్లేకుండా ల్యాబ్‌లు నిర్వహించే వారిపై ఫిర్యాదు చేయొచ్చు. మరోవైపు ఆడపిల్లలు పుట్టారని వారిని చెత్తకుప్పల్లో, ముళ్లపొదల్లో పారవేసే ఘటనలు గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల ఎక్కువయ్యాయి. ఇలాంటివాటిపై జిల్లా వైద్య ఆర్యోగ శాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలి. బాలల రక్షణ.. యేటా జరుగుతున్న నేరశాతంలో అగ్రభాగం లైంగిక వేధింపులదే. వేధింపులు తాళలేక మహిళలు, బాలికలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లైంగిక వేధింపుల నుంచి 18 ఏళ్ల లోపు బాల బాలికలకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. బాల్యవివాహాలను అరికడుతుంది. 18 ఏళ్ల లోపు బాలికలు, 21ఏళ్లలోపు బాలురకు వివాహం చేస్తే చట్టరీత్యా నేరం. వీటితోపాటు విద్య, రక్షణ, భాగస్వామ్యపు, జీవించే హక్కు తదితర హక్కులను ఈ చట్టం ద్వారా పొందొచ్చు. బాల కార్మిక వ్యవస్థను నిరోధించవచ్చు. 14 ఏళ్లలోపు పిల్లల్ని పనిలో పెట్టుకుంటే శిక్షలు తప్పవు. నిర్బంధ ఉచిత విద్య.. ఈ చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల బాలికలు తప్పనిసరిగా విద్యనభ్యసించాల్సిందే. వ్యక్తిగత వికాసం, లింగ వివక్ష, నిర్మూలన, సంపూర్ణ విద్య, భద్రమైన భవిత, సంపూర్ణ అక్షరాస్యత, సర్వశిక్షణ అభియాన్‌లో భాగంగా బాలికల జాతీయ విద్యా కార్యక్రమం అమలు చేస్తున్నారు. బడీడు పిల్లలు పాఠశాలలో ఉండాలన్నది దీని ఉద్దేశం. వీటికోసం సంబంధిత జిల్లా విద్యాసంస్థ కార్యాలయంలో సంప్రదించాలి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, నీళ్లు, నిధులు, ఉద్యోగాలతో పాటు మహిళల రక్షణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధానంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక, యాసిడ్ దాడులు, బాల్యవివాహాలు, గృహహింస, మహిళల అక్రమ రవాణా వంటి విషయాలను సీరియస్‌గా తీసుకోనుంది. మహిళా చైతన్యం కోసం సరికొత్త పథకాలు తీసుకురావాలని భావిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలోనూ.. ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వీటిపై స్పష్టమైన ప్రకటన చేశారు.