మాజీ సైనికులకు కార్పొరేట్‌ ‘సెల్యూట్‌’! | corporate Companies red carpet for ex-servicemens | Sakshi
Sakshi News home page

మాజీ సైనికులకు కార్పొరేట్‌ ‘సెల్యూట్‌’!

Published Wed, Jul 31 2024 5:36 AM | Last Updated on Wed, Jul 31 2024 8:02 AM

corporate Companies red carpet for ex-servicemens

రక్షణ దళాల మాజీ సిబ్బందికి కంపెనీల రెడ్‌ కార్పెట్‌

నిపుణుల కొరతకు చెక్‌

శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ బలం

జాబితాలో టాటా, రిలయన్స్, మారుతీ, ఓఎన్‌జీసీ తదితర దిగ్గజాలు  

రక్షణ దళాల్లో పనిచేసి రిటైర్‌ అయిన మాజీ సైనికోద్యోగులకు కార్పొరేట్‌ కంపెనీలు రారమ్మంటూ రెడ్‌  కార్పెట్‌ వేస్తున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా అలవోకగా పని చేసే శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, ప్రాజెక్టుల అమలులో కచ్చితత్వం వంటి ప్రత్యేక నైపుణ్యాలను ఉపయోగించుకోవడంపై ఫోకస్‌ చేస్తున్నా యి. కొన్ని విభాగాల్లో  నిపుణుల కొరతను అధిగమిస్తున్నాయి. 

దేశంలో మాజీ సైనికుల వెంట పడుతున్న టాప్‌ కంపెనీలు, బడా కార్పొరేట్‌ సంస్థల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అతిపెద్ద కార్పొరేట్‌ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో ఏకంగా 2,000 మంది మాజీ సైనికోద్యోగులను నియమించుకుంది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య మూడో వంతు ఎక్కువ. దీంతో ఈ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో రక్షణ దళాల మాజీ సిబ్బంది 7,500 మందికి ఎగబాకారు.

 ఇంత భారీ సంఖ్యలో ఎక్స్‌–సర్వీస్‌మెన్‌ ఉన్న కంపెనీగా కూడా రిలయన్స్‌ రికార్డు సృష్టించింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం టాటా గ్రూప్‌ కంపెనీలు,  మారుతీ తో పాటు అదానీ గ్రూప్, ఆర్‌పీజీ గ్రూప్, వేదాంత, సొడెక్సో, ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ వంటి సంస్థలు సైతం మాజీ సైనిక సిబ్బందిని నియమించుకుంటున్న జాబితాలో టాప్‌లో ఉన్నాయి. 

ఏటా 60,000 మంది పదవీ విరమణ... 
త్రివిధ దళాల్లో (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌) ఏటా పదవీ విరమణ చేస్తున్న రక్షణ సిబ్బంది సంఖ్య దాదాపు 55,000–60,000 వరకు ఉంటుందని అంచనా. వీరిలో ఆఫీసర్‌ ర్యాంకుల్లో ఉన్నవారు 1,200–1,300 (సుమారు 2%) మంది వరకు ఉంటారు. అంతేకాకుండా, 50 ఏళ్లు పైబడిన చాలా మంది అధికారులు స్వచ్ఛందంగా రిటైర్‌ అయ్యేందుకు మొగ్గు చూపుతుండటం విశేషం. 

ఇలా వైదొలగుతున్న వారిలో ఎక్కువగా రిలయన్స్, అదానీ, ఎల్‌అండ్‌ టీ, టాటా గ్రూప్‌ వంటి బడా కార్పొరేట్‌ కంపెనీల్లో హెచ్‌ఆర్, అడ్మిన్, సరఫరా వ్యవస్థలు ఇతరత్రా విధుల్లో చేరుతున్నారని త్రివిధ దళాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం చీఫ్‌ మెంటార్, పూర్వ అధ్యక్షుడు కమోడోర్‌ సుదీర్‌ పరకాల చెబుతున్నారు.  సరుకు రవాణా (లాజిస్టిక్స్‌), ఈ–కామర్స్, వేర్‌–హౌసింగ్‌ పరిశ్రమతో పాటు ఆటోమొబైల్, తయారీ, విద్యుదుత్పత్తి, టెలికం వంటి రంగాల్లో ఎక్స్‌–సరీ్వస్‌మెన్‌కు దండిగా అవకాశాలు లభిస్తున్నాయి. ఇంజనీరింగ్, మెషీన్‌ విభాగాలు, అడ్మినిస్ట్రేషన్‌ విధుల్లో ఎక్కువగా నియమించుకుంటున్నాయి. 

ప్రత్యేక సామర్థ్యాలు ప్లస్‌... 
మాజీ సైనికోద్యోగులకు అత్యుత్తమ ఫిట్‌నెస్‌కు తోడు క్రమశిక్షణ వంటి ప్రత్యేకతల కారణంగా సంస్థకు అదనపు బలం చేకూరుతోందని రిలయన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులను  పక్కాగా అమలు చేసే సామర్థ్యం, సంక్లిష్ల పరిస్థితులను అధిగమించే నైపుణ్యాలు, ప్రతికూల ప్రదేశాలను తట్టుకుని పని చేసే ధైర్య సాహసాలు... కంపెనీలు ఏరికోరి మరీ వారిని నియమించుకునేలా చేస్తున్నాయన్నారు. దీనివల్ల వైవిద్యంతో పాటు కొన్ని విభాగాల్లో నిపుణుల కొరత కూడా తీరుతుందనేది హైరింగ్‌ నిపుణుల మాట. 

‘రక్షణ దళాల్లో ఏళ్ల తరబడి పనిచేసేటప్పుడు అలవడిన క్రమశిక్షణ, వారికి ఇచ్చే కఠోర శిక్షణ కారణంగా మాజీ సైనిక సిబ్బందికి ప్రత్యేక సామర్థ్యాలు అలవడతాయి. ముఖ్యంగా సమస్యల పరిష్కార తీరు, టీమ్‌ వర్క్, మల్టీ టాస్కింగ్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి విషయాల్లో వారు ఆరితేరి ఉంటారు. అందుకే టాటా, ఆదిత్య బిర్లా, రిలయన్స్, ఎల్‌అండ్‌టీ, వేదాంత గ్రూప్‌ వంటి బడా కార్పొరేట్లు మాజీ సైనికుల హైరింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి’ అని సియెల్‌ హెచ్‌ఆర్‌  అంటోంది.

ఓఎన్‌జీసీ:  కంపెనీ నిబంధనల మేరకు మాజీ సైనికోద్యోగులకు ఎగ్జిక్యూటివ్‌ స్థాయి నియామకాల్లో 5 ఏళ్ల వయో సడలింపును ప్రకటించింది.  
రిలయన్స్‌: గత ఆర్థిక సంవత్సరంలో 2,000 మంది మాజీ సైనికులను నియమించుకుంది. ఈ సంఖ్య 7,500కు చేరింది.
వేదాంత: రక్షణ దళాల మాజీ సిబ్బంది నియామకం కోసం 2023–24లో ప్రత్యేక పాలసీ చర్యలు చేపట్టింది.

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement