Ex-servicemen
-
మాజీ సైనికులకు కార్పొరేట్ ‘సెల్యూట్’!
రక్షణ దళాల్లో పనిచేసి రిటైర్ అయిన మాజీ సైనికోద్యోగులకు కార్పొరేట్ కంపెనీలు రారమ్మంటూ రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా అలవోకగా పని చేసే శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, ప్రాజెక్టుల అమలులో కచ్చితత్వం వంటి ప్రత్యేక నైపుణ్యాలను ఉపయోగించుకోవడంపై ఫోకస్ చేస్తున్నా యి. కొన్ని విభాగాల్లో నిపుణుల కొరతను అధిగమిస్తున్నాయి. దేశంలో మాజీ సైనికుల వెంట పడుతున్న టాప్ కంపెనీలు, బడా కార్పొరేట్ సంస్థల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో ఏకంగా 2,000 మంది మాజీ సైనికోద్యోగులను నియమించుకుంది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య మూడో వంతు ఎక్కువ. దీంతో ఈ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో రక్షణ దళాల మాజీ సిబ్బంది 7,500 మందికి ఎగబాకారు. ఇంత భారీ సంఖ్యలో ఎక్స్–సర్వీస్‌మెన్ ఉన్న కంపెనీగా కూడా రిలయన్స్ రికార్డు సృష్టించింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం టాటా గ్రూప్ కంపెనీలు, మారుతీ తో పాటు అదానీ గ్రూప్, ఆర్పీజీ గ్రూప్, వేదాంత, సొడెక్సో, ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ వంటి సంస్థలు సైతం మాజీ సైనిక సిబ్బందిని నియమించుకుంటున్న జాబితాలో టాప్‌లో ఉన్నాయి. ఏటా 60,000 మంది పదవీ విరమణ... త్రివిధ దళాల్లో (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) ఏటా పదవీ విరమణ చేస్తున్న రక్షణ సిబ్బంది సంఖ్య దాదాపు 55,000–60,000 వరకు ఉంటుందని అంచనా. వీరిలో ఆఫీసర్ ర్యాంకుల్లో ఉన్నవారు 1,200–1,300 (సుమారు 2%) మంది వరకు ఉంటారు. అంతేకాకుండా, 50 ఏళ్లు పైబడిన చాలా మంది అధికారులు స్వచ్ఛందంగా రిటైర్ అయ్యేందుకు మొగ్గు చూపుతుండటం విశేషం. ఇలా వైదొలగుతున్న వారిలో ఎక్కువగా రిలయన్స్, అదానీ, ఎల్అండ్ టీ, టాటా గ్రూప్ వంటి బడా కార్పొరేట్ కంపెనీల్లో హెచ్ఆర్, అడ్మిన్, సరఫరా వ్యవస్థలు ఇతరత్రా విధుల్లో చేరుతున్నారని త్రివిధ దళాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం చీఫ్ మెంటార్, పూర్వ అధ్యక్షుడు కమోడోర్ సుదీర్ పరకాల చెబుతున్నారు. సరుకు రవాణా (లాజిస్టిక్స్), ఈ–కామర్స్, వేర్–హౌసింగ్ పరిశ్రమతో పాటు ఆటోమొబైల్, తయారీ, విద్యుదుత్పత్తి, టెలికం వంటి రంగాల్లో ఎక్స్–సరీ్వస్మెన్కు దండిగా అవకాశాలు లభిస్తున్నాయి. ఇంజనీరింగ్, మెషీన్ విభాగాలు, అడ్మినిస్ట్రేషన్ విధుల్లో ఎక్కువగా నియమించుకుంటున్నాయి. ప్రత్యేక సామర్థ్యాలు ప్లస్... మాజీ సైనికోద్యోగులకు అత్యుత్తమ ఫిట్‌నెస్‌కు తోడు క్రమశిక్షణ వంటి ప్రత్యేకతల కారణంగా సంస్థకు అదనపు బలం చేకూరుతోందని రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులను పక్కాగా అమలు చేసే సామర్థ్యం, సంక్లిష్ల పరిస్థితులను అధిగమించే నైపుణ్యాలు, ప్రతికూల ప్రదేశాలను తట్టుకుని పని చేసే ధైర్య సాహసాలు... కంపెనీలు ఏరికోరి మరీ వారిని నియమించుకునేలా చేస్తున్నాయన్నారు. దీనివల్ల వైవిద్యంతో పాటు కొన్ని విభాగాల్లో నిపుణుల కొరత కూడా తీరుతుందనేది హైరింగ్ నిపుణుల మాట. ‘రక్షణ దళాల్లో ఏళ్ల తరబడి పనిచేసేటప్పుడు అలవడిన క్రమశిక్షణ, వారికి ఇచ్చే కఠోర శిక్షణ కారణంగా మాజీ సైనిక సిబ్బందికి ప్రత్యేక సామర్థ్యాలు అలవడతాయి. ముఖ్యంగా సమస్యల పరిష్కార తీరు, టీమ్ వర్క్, మల్టీ టాస్కింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి విషయాల్లో వారు ఆరితేరి ఉంటారు. అందుకే టాటా, ఆదిత్య బిర్లా, రిలయన్స్, ఎల్అండ్టీ, వేదాంత గ్రూప్ వంటి బడా కార్పొరేట్లు మాజీ సైనికుల హైరింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి’ అని సియెల్ హెచ్ఆర్ అంటోంది.ఓఎన్జీసీ: కంపెనీ నిబంధనల మేరకు మాజీ సైనికోద్యోగులకు ఎగ్జిక్యూటివ్ స్థాయి నియామకాల్లో 5 ఏళ్ల వయో సడలింపును ప్రకటించింది. రిలయన్స్: గత ఆర్థిక సంవత్సరంలో 2,000 మంది మాజీ సైనికులను నియమించుకుంది. ఈ సంఖ్య 7,500కు చేరింది.వేదాంత: రక్షణ దళాల మాజీ సిబ్బంది నియామకం కోసం 2023–24లో ప్రత్యేక పాలసీ చర్యలు చేపట్టింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
రైతురాజ్యం కోసం జవాన్ల ముందడుగు గొప్ప పరిణామం
సాక్షి, హైదరాబాద్: అబ్ కి బార్ కిసాన్ సర్కార్ పిలుపు అందుకొని రైతురాజ్య స్థాపన కోసం దేశ జవాన్లు ముందుకు రావడం గొప్ప పరిణామమని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు చెందిన ఫౌజీ జనతా పార్టీ కార్యదర్శి, మాజీ సైనికుడు సునిల్ బాపురావు పగారెతోపాటు పలువురు మాజీ సైనికాధికారులు హైదరాబాద్‌లో కేసీఆర్ సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పరివర్తన చెందిన భారతదేశంతోనే గుణాత్మక మార్పు సాధ్యమని, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాన్ని నలుమూలలా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. సంప్రదాయ పద్ధతుల్లో ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలనను సమూలంగా మార్చుకొని రైతుల సంక్షేమం, అభివృద్ధి, సబ్బండ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పార్టీ నేతలంతా ముందుకు సాగాలన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించిన సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోనూ వాటిని అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో మార్పునకు దోహదం చేసే దిశగా వీర సైనికులై కర్తవ్య నిర్వహణను కొనసాగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి పాల్గొన్నారు. -
ఎక్స్ సర్వీస్‌మెన్ డేటాబేస్ మాయం
న్యూఢిల్లీ: 45 లక్షల మంది త్రివిధ దళాల మాజీ సిబ్బందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని తిరిగి ఇవ్వలేదంటూ ఒక ప్రైవేటు సంస్థపై ఢిల్లీలో కేసు నమోదు అయింది. రక్షణ శాఖ ఫిర్యాదు మేరకు ‘స్కోర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్(ఎస్‌ఐటీఎల్)’ సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నౌకాదళ మాజీ అధికారి లోకేశ్ బత్రా ఈ వివరాలను సమాచార హక్కుచట్టం(ఆర్టీఐ) ద్వారా సంపాదించారు. ఎక్స్ సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్(ఈసీహెచ్ఎస్) అమలు కోసం స్మార్ట్ కార్డ్స్‌ను రూపొందించేందుకు ఎస్‌ఐటీఎల్‌కు 2010లో కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇందులో భాగంగా, సాయుధ దళాల మాజీ సిబ్బంది వ్యక్తిగత సమాచారాన్ని వారికి ఇచ్చారు. 2015లో ఆ కాంట్రాక్ట్ ముగిసింది. ఆ తరువాత, డేటాలో మార్పుచేర్పులకు అవసరమైన సోర్స్ కోడ్, కీ సహా మొత్తం డేటాబేస్‌ను రక్షణ శాఖకు తిరిగి ఇచ్చేయాల్సి ఉంది. కానీ, ఎస్‌ఐటీఎల్ అలా చేయలేదు. కనీసం ఆ డేటా తమ వద్ద లేదన్న విషయాన్ని కూడా ఆ సంస్థ చెప్పడం లేదని పేర్కొంది. -
ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ కోరుతూ రిలే దీక్షలు
ఇందిరాపార్కు (హైదరాబాద్) : ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ సైనికులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. నగరంలోని ఇందిరాపార్కులో పలువురు మాజీ సైనికులు మంగళవారం దీక్షలకు దిగారు. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాల మాజీ సైనిక అధికారి విద్యాసాగర్ పాల్గొన్నారు. తమ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని ఆయన కోరారు. -
'మమ్మల్ని క్షమించండి.. మేము మీతోనే'
న్యూఢిల్లీ: 'మమ్మల్ని క్షమించండి.. మీ పట్ల మాకు ద్వేషం లేదు. మీరంటే గౌరవం. మేము మీతోనే ఉంటాం. మీపై మా చర్యలకు చింతిస్తున్నాం' అని మాజీ సైనికోద్యోగులపై ఢిల్లీ పోలీస్ అధికారి ఎంకే మీనా ప్రేమ కురిపించారు. గత శుక్రవారం(ఆగస్టు14)నాడు వన్ ర్యాంక్-వన్ పెన్షన్(ఒకే హోదా-ఒకే పింఛను) పథకాన్ని తక్షణమే ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ మాజీ సైనిక ఉద్యోగులు చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసు బలగాలను ప్రయోగించి బలవంతంగా భగ్నం చేయడంపై మీనా ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సైనిక వ్యవస్థ అంటే విపరీతమైన గౌరమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్మీలో ఉన్న వారైనా.. రిటైర్మెంట్ తీసుకుని విధులకు దూరంగా ఉన్న వారైనా తమకు అమితమైన భక్తి భావముందని తెలిపారు. కేవలం కొన్ని అనివార్య పరిస్థితుల్లో వారిపై బలప్రయోగం చే్యాల్సి వచ్చినందుకు చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. వన్ ర్యాంక్- వన్ పెన్షన్ పై రక్షణ మంత్రి మనోహర్ పరికర్ స్సష్టమైనా హామీ ఇచ్చినా.. వారు తమ నిరసనను తీవ్రం చేయడంతోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. ఆగస్టు 24 వరకూ మాజీ సైనికోద్యోగులను తమ నిరసనను వాయిదా వేయమని పారికర్ తెలిపారన్నారు.ఈ స్కీమ్ పై ఆగస్టు 23 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నందున అప్పటి వరకూ నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేయాలని మాజీ సైనికోద్యుగులకు పారికర్ భరోసా ఇచ్చిన సంగతిని మీనా ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
'త్వరలో శుభవార్త వింటారు'
లక్నో: వన్ ర్యాంకు వన్ పెన్షన్(ఓఆర్ఓపీ)పై త్వరలో శుభవార్త వింటారని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఓఆర్ఓపీ అమలు చేయాలని పదవీ విరమణ చేసిన సైనికోద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం గత నెలరోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. 'ఓఆర్ఓపీ అమలు అనేది రక్షణశాఖ అంతర్గత వ్యవహారం. దీనిపై కసరత్తు దాదాపు కొలిక్కివచ్చింది. దీనికి చాలా సమయం పడుతుంది. అయినప్పటికీ ఓఆర్ఓపీపై త్వరలోనే గుడ్ న్యాస్ వింటారు' అని పారికర్ వ్యాఖ్యానించారు. ఓఆర్ఓపీ అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఇంతకుముందు స్పష్టం చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ సైనిక ఉద్యోగులకు పీఆర్సీ సిఫారసు ఆధారంగా పెన్షన్లు ఇస్తున్నారు.