'మమ్మల్ని క్షమించండి.. మేము మీతోనే'
న్యూఢిల్లీ: 'మమ్మల్ని క్షమించండి.. మీ పట్ల మాకు ద్వేషం లేదు. మీరంటే గౌరవం. మేము మీతోనే ఉంటాం. మీపై మా చర్యలకు చింతిస్తున్నాం' అని మాజీ సైనికోద్యోగులపై ఢిల్లీ పోలీస్ అధికారి ఎంకే మీనా ప్రేమ కురిపించారు. గత శుక్రవారం(ఆగస్టు14)నాడు వన్ ర్యాంక్-వన్ పెన్షన్(ఒకే హోదా-ఒకే పింఛను) పథకాన్ని తక్షణమే ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ మాజీ సైనిక ఉద్యోగులు చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసు బలగాలను ప్రయోగించి బలవంతంగా భగ్నం చేయడంపై మీనా ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు సైనిక వ్యవస్థ అంటే విపరీతమైన గౌరమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్మీలో ఉన్న వారైనా.. రిటైర్మెంట్ తీసుకుని విధులకు దూరంగా ఉన్న వారైనా తమకు అమితమైన భక్తి భావముందని తెలిపారు. కేవలం కొన్ని అనివార్య పరిస్థితుల్లో వారిపై బలప్రయోగం చే్యాల్సి వచ్చినందుకు చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. వన్ ర్యాంక్- వన్ పెన్షన్ పై రక్షణ మంత్రి మనోహర్ పరికర్ స్సష్టమైనా హామీ ఇచ్చినా.. వారు తమ నిరసనను తీవ్రం చేయడంతోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. ఆగస్టు 24 వరకూ మాజీ సైనికోద్యోగులను తమ నిరసనను వాయిదా వేయమని పారికర్ తెలిపారన్నారు.ఈ స్కీమ్ పై ఆగస్టు 23 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నందున అప్పటి వరకూ నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేయాలని మాజీ సైనికోద్యుగులకు పారికర్ భరోసా ఇచ్చిన సంగతిని మీనా ఈ సందర్భంగా ప్రస్తావించారు.