సాక్షి, హైదరాబాద్: అబ్ కి బార్ కిసాన్ సర్కార్ పిలుపు అందుకొని రైతురాజ్య స్థాపన కోసం దేశ జవాన్లు ముందుకు రావడం గొప్ప పరిణామమని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు చెందిన ఫౌజీ జనతా పార్టీ కార్యదర్శి, మాజీ సైనికుడు సునిల్ బాపురావు పగారెతోపాటు పలువురు మాజీ సైనికాధికారులు హైదరాబాద్‌లో కేసీఆర్ సమక్షంలో ఆదివారం బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పరివర్తన చెందిన భారతదేశంతోనే గుణాత్మక మార్పు సాధ్యమని, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాన్ని నలుమూలలా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. సంప్రదాయ పద్ధతుల్లో ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలనను సమూలంగా మార్చుకొని రైతుల సంక్షేమం, అభివృద్ధి, సబ్బండ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పార్టీ నేతలంతా ముందుకు సాగాలన్నారు.
తెలంగాణలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించిన సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోనూ వాటిని అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో మార్పునకు దోహదం చేసే దిశగా వీర సైనికులై కర్తవ్య నిర్వహణను కొనసాగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment