professionals shortage
-
మాజీ సైనికులకు కార్పొరేట్ ‘సెల్యూట్’!
రక్షణ దళాల్లో పనిచేసి రిటైర్ అయిన మాజీ సైనికోద్యోగులకు కార్పొరేట్ కంపెనీలు రారమ్మంటూ రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా అలవోకగా పని చేసే శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, ప్రాజెక్టుల అమలులో కచ్చితత్వం వంటి ప్రత్యేక నైపుణ్యాలను ఉపయోగించుకోవడంపై ఫోకస్ చేస్తున్నా యి. కొన్ని విభాగాల్లో నిపుణుల కొరతను అధిగమిస్తున్నాయి. దేశంలో మాజీ సైనికుల వెంట పడుతున్న టాప్ కంపెనీలు, బడా కార్పొరేట్ సంస్థల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో ఏకంగా 2,000 మంది మాజీ సైనికోద్యోగులను నియమించుకుంది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య మూడో వంతు ఎక్కువ. దీంతో ఈ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో రక్షణ దళాల మాజీ సిబ్బంది 7,500 మందికి ఎగబాకారు. ఇంత భారీ సంఖ్యలో ఎక్స్–సర్వీస్‌మెన్ ఉన్న కంపెనీగా కూడా రిలయన్స్ రికార్డు సృష్టించింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం టాటా గ్రూప్ కంపెనీలు, మారుతీ తో పాటు అదానీ గ్రూప్, ఆర్పీజీ గ్రూప్, వేదాంత, సొడెక్సో, ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ వంటి సంస్థలు సైతం మాజీ సైనిక సిబ్బందిని నియమించుకుంటున్న జాబితాలో టాప్‌లో ఉన్నాయి. ఏటా 60,000 మంది పదవీ విరమణ... త్రివిధ దళాల్లో (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) ఏటా పదవీ విరమణ చేస్తున్న రక్షణ సిబ్బంది సంఖ్య దాదాపు 55,000–60,000 వరకు ఉంటుందని అంచనా. వీరిలో ఆఫీసర్ ర్యాంకుల్లో ఉన్నవారు 1,200–1,300 (సుమారు 2%) మంది వరకు ఉంటారు. అంతేకాకుండా, 50 ఏళ్లు పైబడిన చాలా మంది అధికారులు స్వచ్ఛందంగా రిటైర్ అయ్యేందుకు మొగ్గు చూపుతుండటం విశేషం. ఇలా వైదొలగుతున్న వారిలో ఎక్కువగా రిలయన్స్, అదానీ, ఎల్అండ్ టీ, టాటా గ్రూప్ వంటి బడా కార్పొరేట్ కంపెనీల్లో హెచ్ఆర్, అడ్మిన్, సరఫరా వ్యవస్థలు ఇతరత్రా విధుల్లో చేరుతున్నారని త్రివిధ దళాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం చీఫ్ మెంటార్, పూర్వ అధ్యక్షుడు కమోడోర్ సుదీర్ పరకాల చెబుతున్నారు. సరుకు రవాణా (లాజిస్టిక్స్), ఈ–కామర్స్, వేర్–హౌసింగ్ పరిశ్రమతో పాటు ఆటోమొబైల్, తయారీ, విద్యుదుత్పత్తి, టెలికం వంటి రంగాల్లో ఎక్స్–సరీ్వస్మెన్కు దండిగా అవకాశాలు లభిస్తున్నాయి. ఇంజనీరింగ్, మెషీన్ విభాగాలు, అడ్మినిస్ట్రేషన్ విధుల్లో ఎక్కువగా నియమించుకుంటున్నాయి. ప్రత్యేక సామర్థ్యాలు ప్లస్... మాజీ సైనికోద్యోగులకు అత్యుత్తమ ఫిట్‌నెస్‌కు తోడు క్రమశిక్షణ వంటి ప్రత్యేకతల కారణంగా సంస్థకు అదనపు బలం చేకూరుతోందని రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులను పక్కాగా అమలు చేసే సామర్థ్యం, సంక్లిష్ల పరిస్థితులను అధిగమించే నైపుణ్యాలు, ప్రతికూల ప్రదేశాలను తట్టుకుని పని చేసే ధైర్య సాహసాలు... కంపెనీలు ఏరికోరి మరీ వారిని నియమించుకునేలా చేస్తున్నాయన్నారు. దీనివల్ల వైవిద్యంతో పాటు కొన్ని విభాగాల్లో నిపుణుల కొరత కూడా తీరుతుందనేది హైరింగ్ నిపుణుల మాట. ‘రక్షణ దళాల్లో ఏళ్ల తరబడి పనిచేసేటప్పుడు అలవడిన క్రమశిక్షణ, వారికి ఇచ్చే కఠోర శిక్షణ కారణంగా మాజీ సైనిక సిబ్బందికి ప్రత్యేక సామర్థ్యాలు అలవడతాయి. ముఖ్యంగా సమస్యల పరిష్కార తీరు, టీమ్ వర్క్, మల్టీ టాస్కింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి విషయాల్లో వారు ఆరితేరి ఉంటారు. అందుకే టాటా, ఆదిత్య బిర్లా, రిలయన్స్, ఎల్అండ్టీ, వేదాంత గ్రూప్ వంటి బడా కార్పొరేట్లు మాజీ సైనికుల హైరింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి’ అని సియెల్ హెచ్ఆర్ అంటోంది.ఓఎన్జీసీ: కంపెనీ నిబంధనల మేరకు మాజీ సైనికోద్యోగులకు ఎగ్జిక్యూటివ్ స్థాయి నియామకాల్లో 5 ఏళ్ల వయో సడలింపును ప్రకటించింది. రిలయన్స్: గత ఆర్థిక సంవత్సరంలో 2,000 మంది మాజీ సైనికులను నియమించుకుంది. ఈ సంఖ్య 7,500కు చేరింది.వేదాంత: రక్షణ దళాల మాజీ సిబ్బంది నియామకం కోసం 2023–24లో ప్రత్యేక పాలసీ చర్యలు చేపట్టింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
చైనా నిపుణులకు వీసాల జోరు పెంచండి
న్యూఢిల్లీ: చైనా నిపుణుల కొరత దేశీ కంపెనీలను వేధిస్తోంది. ముఖ్యంగా టాటా పవర్ సోలార్, రెన్యూ ఫోటోవోల్టాయిక్ , అవాడా ఎలక్ట్రో వంటి సోలార్ మాడ్యూల్ తయారీదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో చైనా ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల వీసా అప్లికేషన్లను వేగంగా అనుమతించాలంటూ ఆయా కంపెనీలు ప్రభుత్వాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చైనా నుంచి నిపుణుల రాక ఆలస్యం కావడంతో పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు అనుగుణంగా కార్యకలాపాలను పెంచలేకపోతున్నామని కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ మూడు కంపెనీలు తమ సోలార్ మాడ్యూల్ ప్లాంట్లలో అవసరమైన 36 మంది చైనా నిపుణుల కోసం బిజినెస్ వీసాల కోసం ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేయగా.. ఇప్పటిదాకా వాటికి అనుమతులు రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో టాటా పవర్ సోలార్ అత్యధికంగా 20 మంది చైనా నిపుణుల కోసం వీసాలివ్వాల్సిందిగా కోరింది. ఈ కంపెనీ తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో 4 గిగావాట్ల (జీడబ్ల్యూ) గ్రీన్‌ఫీల్డ్ సోలార్ సెల్, 4 జీడబ్ల్యూ సామర్థ్యం గల సోలార్ మాడ్యూల్ తయారీ ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. దీనికోసం సుమారు రూ. 3,000 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఇక రెన్యూ పవర్ గుజరాత్‌లోని ధోలెరాలో, అవాడా కంపెనీ ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్లో సోలార్ సెల్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. 500 జీడబ్ల్యూ లక్ష్యం.. 2030 నాటికి దేశంలో సౌరశక్తి, గాలి వంటి పునరుత్పాదక వనరుల ద్వారా 500 జీడబ్ల్యూ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి అధునాతన పరికరాలు, సాంకేతికత కోసం చైనా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ తయారీ ఎగుమతుల్లో చైనా ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. చైనాతో సరిహద్దు వివాదాలు ముదరడంతో పాటు కోవిడ్ మహమ్మారి విరుచుకుపడటంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు చైనా యాప్‌లను నిషేధించింది. పెట్టుబడులపై కూడా డేగకన్ను వేస్తోంది ప్రభుత్వం. చైనీయులు భారత్‌లో రాకపోకలను కూడా కఠినతరం చేసింది. దీనివల్ల ప్రాజెక్టులు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యంతో పాటు వ్యయాలు పెరిగిపోయేందుకు దారితీస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
డేటా సైన్స్ నిపుణులకు తీవ్ర కొరత
ముంబై: దేశంలో డేటాసైన్స్ నిపుణులకు తీవ్ర కొరత నెలకొంది. ఎడ్టెక్ కంపెనీ ‘గ్రేట్ లెరి్నంగ్’ ఒక అధ్యయనం నిర్వహించగా.. కంపెనీల హైరింగ్ మేనేజర్లలో (నియామకాలను చూసేవారు) 92 శాతం మంది డేటా సైన్స్ నిపుణుల విషయంలో డిమాండ్–సరఫరా మధ్య భారీ అంతరం ఉన్నట్టు చెప్పారు. 57 శాతం మంది ప్రారంభస్థాయి నిపుణుల విషయంలో అంతరం ఉందని చెప్పగా.. 27 శాతం మంది మేనేజర్లు మధ్యస్థాయి ఉద్యోగాలైన టీమ్‌లీడ్ (బృంద నాయకులు), ప్రాజెక్ట్ మేనేజర్ నిపుణుల విషయంలో కొరత ఉన్నట్టు తెలిపారు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) నైపుణ్యాలకు కొరత ఉందని 15 శాతం మంది హైరింగ్ మేనేజర్లు తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుల కొరత ఉందని 12 శాతం మంది మేనేజర్లు చెప్పారు. ఆ తర్వాత ఆటోమేషన్, కంప్యూటర్ విజన్, అనలైటిక్స్ నిపుణుల సరఫరా తగినంత లేదని మేనేజర్లు పేర్కొన్నారు. 100కు పైగా కంపెనీలకు చెందిన హెచ్ఆర్ మేనేజర్ల అభిప్రాయాలను ఈ అధ్యనంలో భాగంగా గ్రేట్ లెరి్నంగ్ తెలుసుకుంది. ‘‘ప్రతీ పరిశ్రమ డిజిటల్ దిశగా మారిపోతోంది. డేటా సైన్స్ కార్యకలాపాల్లో భాగమైన ఎన్ఎల్పీ, ఏఐఎంఎల్, బిగ్‌డేటా, ఆటోమేషన్‌కు డిమాండ్ అధిక స్థాయిల్లో ఉంది. ఈ నూతన అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుగా మన విద్యా ప్రమాణాలను మెరుగుపరచుకోవడంతోపాటు.. ఉద్యోగులకు శిక్షణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది’’ అని గ్రేట్ లెరి్నంగ్ సహ వ్యవస్థాపకుడు హరి కృష్ణన్ నాయర్ తెలిపారు. డేటా సైన్స్ నిపుణుల నియామకాల్లో బెంగళూరు టాప్‌లో ఉండగా.. తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. -
ఎన్‌ఐఓలో నిపుణల కొరత తీరుస్తాం
కేంద్ర మంత్రి సుజనా చౌదరి విశాఖపట్నం: ఎన్‌ఐఓలో నిపుణల కొరతను యువ శాస్త్రవేత్తలతో భర్తీ చేస్తామని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాఖ సహాయమంత్రి వై.సుజనా చౌదరి తెలిపారు. శనివారం ఆయన ఎన్ఐఒ శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. విశాఖ తీరం కోతకు గురవుతున్న నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు, కమిటీ నివేదిక తదితర అంశాలపై చర్చించారు. తర్వాత తుపాను హెచ్చరికల కేంద్రంలో అధికారులతో భేటీ అయ్యారు. విజయనగరంలో ఉపరితల వాతావరణ పరిశోధనా సెంటర్ ఏర్పాటు, కడప పార్ట్‌టైమ్ అబ్జర్వేటరీని క్లాస్-1 అబ్జర్వేటరీగా అప్‌గ్రేడ్, రాష్ట్రంలో అదనంగా మరో 50 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ఏర్పాటు, రాజమండ్రి విమానాశ్రయంలో ఉన్న మెట్ అబ్జర్వేటరీని అప్‌గ్రేడ్, విజయవాడలో భూకంప పరిశోధనా సెంటర్‌కు స్థలం కేటాయింపు, విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రంలో సినర్జీ స్టేషన్, నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ కనెక్షన్ ఆవశ్యకతలను కేంద్రం అధికారులు కేంద్రమంత్రికి వివరించారు. అనంతరం సుజనా చౌదరి విలేకరులతో మాట్లాడారు. తుఫాన్ల రాకపై వాతావరణ శాఖ శాస్త్రవేత్తల ముందస్తు అంచనాలు సరిగానే ఉంటున్నాయని, కానీ డిజాస్టర్ మేనేజిమెంట్ వ్యవస్థ లేక సరైన రీతిలో అంచనాలు వేయలేకపోతున్నారని వివరించారు. అందువల్లే డిజాస్టర్ మేనేజిమెంట్ విభాగాన్ని వాతావరణశాఖకు అనుసంధానం చేయాలని యోచిస్తున్నామని వెల్లడించారు. కొత్తగా ఒక్కో డాప్లర్ రాడార్ సెంటర్ ఏర్పాటుకు రూ.20 కోట్లు అవసరమని, ఈ లెక్కన దేశం మొత్తమ్మీద ఎంత అవసరమో బ్లూప్రింట్ తయారు చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. దేశంలోని తీరప్రాంతానికి వాటిల్లే ముప్పుపై రేఖను రూపొందించేందుకు 2010లో ఓ సంస్థకు బాధ్యతలు అప్పగించారని, కానీ అది పూర్తి చేయక పోవడంతో మరో సంస్థకు అప్పగించాలని యోచిస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు కె.హరిబాబు, ఎం.శ్రీనివాస రావు, ఎన్ఐఒ సైంటిస్ట్ ఇన్చార్జి వి.ఎస్.ఎన్.మూర్తి, తుఫాన్ హెచ్చరికల కేంద్రం డెరైక్టర్ కె.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.