కేంద్ర మంత్రి సుజనా చౌదరి
విశాఖపట్నం: ఎన్‌ఐఓలో నిపుణల కొరతను యువ శాస్త్రవేత్తలతో భర్తీ చేస్తామని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాఖ సహాయమంత్రి వై.సుజనా చౌదరి తెలిపారు. శనివారం ఆయన ఎన్‌ఐఒ శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. విశాఖ తీరం కోతకు గురవుతున్న నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు, కమిటీ నివేదిక తదితర అంశాలపై చర్చించారు. తర్వాత తుపాను హెచ్చరికల కేంద్రంలో అధికారులతో భేటీ అయ్యారు.
విజయనగరంలో ఉపరితల వాతావరణ పరిశోధనా సెంటర్ ఏర్పాటు, కడప పార్ట్‌టైమ్ అబ్జర్వేటరీని క్లాస్-1 అబ్జర్వేటరీగా అప్‌గ్రేడ్, రాష్ట్రంలో అదనంగా మరో 50 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ఏర్పాటు, రాజమండ్రి విమానాశ్రయంలో ఉన్న మెట్ అబ్జర్వేటరీని అప్‌గ్రేడ్, విజయవాడలో భూకంప పరిశోధనా సెంటర్‌కు స్థలం కేటాయింపు, విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రంలో సినర్జీ స్టేషన్, నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్ కనెక్షన్ ఆవశ్యకతలను కేంద్రం అధికారులు కేంద్రమంత్రికి వివరించారు. అనంతరం సుజనా చౌదరి విలేకరులతో మాట్లాడారు.
తుఫాన్ల రాకపై వాతావరణ శాఖ శాస్త్రవేత్తల ముందస్తు అంచనాలు సరిగానే ఉంటున్నాయని, కానీ డిజాస్టర్ మేనేజిమెంట్ వ్యవస్థ లేక సరైన రీతిలో అంచనాలు వేయలేకపోతున్నారని వివరించారు. అందువల్లే డిజాస్టర్ మేనేజిమెంట్ విభాగాన్ని వాతావరణశాఖకు అనుసంధానం చేయాలని యోచిస్తున్నామని వెల్లడించారు. కొత్తగా ఒక్కో డాప్లర్ రాడార్ సెంటర్ ఏర్పాటుకు రూ.20 కోట్లు అవసరమని, ఈ లెక్కన దేశం మొత్తమ్మీద ఎంత అవసరమో బ్లూప్రింట్ తయారు చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు.
దేశంలోని తీరప్రాంతానికి వాటిల్లే ముప్పుపై రేఖను రూపొందించేందుకు 2010లో ఓ సంస్థకు బాధ్యతలు అప్పగించారని, కానీ అది పూర్తి చేయక పోవడంతో మరో సంస్థకు అప్పగించాలని యోచిస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు కె.హరిబాబు, ఎం.శ్రీనివాస రావు, ఎన్‌ఐఒ సైంటిస్ట్ ఇన్‌చార్జి వి.ఎస్.ఎన్.మూర్తి, తుఫాన్ హెచ్చరికల కేంద్రం డెరైక్టర్ కె.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌ఐఓలో నిపుణల కొరత తీరుస్తాం
Published Sun, May 17 2015 2:51 AM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM
Advertisement
Advertisement