nio
-
ఒక్కసారి చార్జ్ చేస్తే వెయ్యి కి.మీ ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లోకి మరో విద్యుత్ కారు రాబోతోంది. ప్రఖ్యాత టెస్లా కార్ల కంపెనీకి పోటీగా చెప్పుకుంటున్న చైనా కంపెనీ నియో ‘ఈటీ7’పేరుతో కొత్త కారును ఆవిష్కరించింది. అయితే.. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న పలు విద్యుత్ కార్ల మాదిరిగా మాత్రం కాదండోయ్! దీనికి చాలా ప్రత్యేకతలున్నాయి.. ముందుగా చెప్పుకోవాల్సింది దీని మైలేజీ గురించే.. ఒకసారి చార్జ్ చేస్తే ఎకాఎకిన ఈ కారు 621 మైళ్లు ప్రయాణిస్తుంది. అంటే.. దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం అన్నమాట. ఇందుకోసం ఈటీ7లో 150 కిలోవాట్/గంటల బ్యాటరీని ఏర్పాటు చేశారు. అలాగే అవసరమైనప్పుడు కొన్ని నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీలను మార్చేసుకోవచ్చు. పూర్తిస్థాయిలో పనిచేసేటప్పుడు ఈ కారు 480 కిలోవాట్లు లేదా 643 హార్స్పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులోనూ 180 కిలోవాట్లు ముందు చక్రాల ద్వారా పుడితే వెనుక చక్రాల ద్వారా 300 కిలోవాట్ల శక్తి ఉత్పత్తి అవుతుంది. కేవలం 3.9 సెకన్లలో సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చు. కారు మొత్తమ్మీద దాదాపు 33 కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్నివైపులా చూసేందుకు ఇందులో 11.9 మెగాపిక్సెళ్ల సామర్థ్యమున్నవీ ఉన్నాయి. దీంతో పాటు హై రెజల్యూషన్ లైడార్లు, 5 మిల్లీమీటర్ల వేవ్ రాడార్లు, 12 వరకు అల్ట్రాసానిక్ సెన్సార్లు, 2 పొజిషినింగ్ యూనిట్లు, వీ2ఎక్స్, ఏడీఎంఎస్లతో ఈ ఈటీ7ను డ్రైవర్ అవసరం లేకుండా కూడా నడిపేందుకు అవకాశముంది. ఈ సెన్సార్లు, కెమెరాలన్నీ కలిపి ప్రతి సెకనుకు 8 గిగాబైట్ల సమాచారం ఉత్పత్తి చేస్తుంటే వీటిని ప్రాసెస్ చేసేందుకు ఎన్విడియా డ్రైవ్ ఓరిన్ ప్రాసెసర్లు 4 ఉపయోగిస్తారు. టెస్లా కారులో వాడే కంప్యూటింగ్ శక్తికి ఇది 7 రెట్లు ఎక్కువ. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఏడాది ఈ ఈటీ7 మార్కెట్లోకి రానుంది. ఈ కార్లకు అవసరమైన బ్యాటరీలను చార్జ్ చేసేందుకు నియో పవర్ స్వాప్ 2.0 పేరుతో ఓ వ్యవస్థను సిద్ధం చేసింది. రోజుకు 312 బ్యాటరీలను చార్జ్ చేయగలగడం దీని ప్రత్యేకత. -
ఎన్‌ఐఓలో నిపుణల కొరత తీరుస్తాం
కేంద్ర మంత్రి సుజనా చౌదరి విశాఖపట్నం: ఎన్‌ఐఓలో నిపుణల కొరతను యువ శాస్త్రవేత్తలతో భర్తీ చేస్తామని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాఖ సహాయమంత్రి వై.సుజనా చౌదరి తెలిపారు. శనివారం ఆయన ఎన్ఐఒ శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. విశాఖ తీరం కోతకు గురవుతున్న నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు, కమిటీ నివేదిక తదితర అంశాలపై చర్చించారు. తర్వాత తుపాను హెచ్చరికల కేంద్రంలో అధికారులతో భేటీ అయ్యారు. విజయనగరంలో ఉపరితల వాతావరణ పరిశోధనా సెంటర్ ఏర్పాటు, కడప పార్ట్‌టైమ్ అబ్జర్వేటరీని క్లాస్-1 అబ్జర్వేటరీగా అప్‌గ్రేడ్, రాష్ట్రంలో అదనంగా మరో 50 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ఏర్పాటు, రాజమండ్రి విమానాశ్రయంలో ఉన్న మెట్ అబ్జర్వేటరీని అప్‌గ్రేడ్, విజయవాడలో భూకంప పరిశోధనా సెంటర్‌కు స్థలం కేటాయింపు, విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రంలో సినర్జీ స్టేషన్, నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ కనెక్షన్ ఆవశ్యకతలను కేంద్రం అధికారులు కేంద్రమంత్రికి వివరించారు. అనంతరం సుజనా చౌదరి విలేకరులతో మాట్లాడారు. తుఫాన్ల రాకపై వాతావరణ శాఖ శాస్త్రవేత్తల ముందస్తు అంచనాలు సరిగానే ఉంటున్నాయని, కానీ డిజాస్టర్ మేనేజిమెంట్ వ్యవస్థ లేక సరైన రీతిలో అంచనాలు వేయలేకపోతున్నారని వివరించారు. అందువల్లే డిజాస్టర్ మేనేజిమెంట్ విభాగాన్ని వాతావరణశాఖకు అనుసంధానం చేయాలని యోచిస్తున్నామని వెల్లడించారు. కొత్తగా ఒక్కో డాప్లర్ రాడార్ సెంటర్ ఏర్పాటుకు రూ.20 కోట్లు అవసరమని, ఈ లెక్కన దేశం మొత్తమ్మీద ఎంత అవసరమో బ్లూప్రింట్ తయారు చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. దేశంలోని తీరప్రాంతానికి వాటిల్లే ముప్పుపై రేఖను రూపొందించేందుకు 2010లో ఓ సంస్థకు బాధ్యతలు అప్పగించారని, కానీ అది పూర్తి చేయక పోవడంతో మరో సంస్థకు అప్పగించాలని యోచిస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు కె.హరిబాబు, ఎం.శ్రీనివాస రావు, ఎన్ఐఒ సైంటిస్ట్ ఇన్చార్జి వి.ఎస్.ఎన్.మూర్తి, తుఫాన్ హెచ్చరికల కేంద్రం డెరైక్టర్ కె.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.