ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల కొరతతో ప్రాజెక్టులకు దెబ్బ
ప్రభుత్వానికి సోలార్ మాడ్యూల్ తయారీదారుల వినతి
న్యూఢిల్లీ: చైనా నిపుణుల కొరత దేశీ కంపెనీలను వేధిస్తోంది. ముఖ్యంగా టాటా పవర్ సోలార్, రెన్యూ ఫోటోవోల్టాయిక్ , అవాడా ఎలక్ట్రో వంటి సోలార్ మాడ్యూల్ తయారీదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో చైనా ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల వీసా అప్లికేషన్లను వేగంగా అనుమతించాలంటూ ఆయా కంపెనీలు ప్రభుత్వాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
చైనా నుంచి నిపుణుల రాక ఆలస్యం కావడంతో పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు అనుగుణంగా కార్యకలాపాలను పెంచలేకపోతున్నామని కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ మూడు కంపెనీలు తమ సోలార్ మాడ్యూల్ ప్లాంట్లలో అవసరమైన 36 మంది చైనా నిపుణుల కోసం బిజినెస్ వీసాల కోసం ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేయగా.. ఇప్పటిదాకా వాటికి అనుమతులు రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఇందులో టాటా పవర్ సోలార్ అత్యధికంగా 20 మంది చైనా నిపుణుల కోసం వీసాలివ్వాల్సిందిగా కోరింది. ఈ కంపెనీ తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో 4 గిగావాట్ల (జీడబ్ల్యూ) గ్రీన్‌ఫీల్డ్ సోలార్ సెల్, 4 జీడబ్ల్యూ సామర్థ్యం గల సోలార్ మాడ్యూల్ తయారీ ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. దీనికోసం సుమారు రూ. 3,000 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఇక రెన్యూ పవర్ గుజరాత్‌లోని ధోలెరాలో, అవాడా కంపెనీ ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్‌లో సోలార్ సెల్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి.
500 జీడబ్ల్యూ లక్ష్యం..
2030 నాటికి దేశంలో సౌరశక్తి, గాలి వంటి పునరుత్పాదక వనరుల ద్వారా 500 జీడబ్ల్యూ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి అధునాతన పరికరాలు, సాంకేతికత కోసం చైనా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ తయారీ ఎగుమతుల్లో చైనా ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. చైనాతో సరిహద్దు వివాదాలు ముదరడంతో పాటు కోవిడ్ మహమ్మారి విరుచుకుపడటంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు చైనా యాప్‌లను నిషేధించింది. పెట్టుబడులపై కూడా డేగకన్ను వేస్తోంది ప్రభుత్వం. చైనీయులు భారత్‌లో రాకపోకలను కూడా కఠినతరం చేసింది. దీనివల్ల ప్రాజెక్టులు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యంతో పాటు వ్యయాలు పెరిగిపోయేందుకు దారితీస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment