
నిపుణుల కొరతతోనే సమస్య
మానవ వనరుల ప్రొఫెషనల్స్ వెల్లడి
లింక్డ్‌ఇన్ నివేదిక
న్యూఢిల్లీ: దేశీయంగా చాలా కార్పొరేట్ కంపెనీలు కృత్రిమ మేథ (ఏఐ) వినియోగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. అయితే, ఈ టెక్నాలజీ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేగలిగే నిపుణుల కొరత పెద్ద సమస్యగా ఉంటోంది. ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాం లింక్డ్‌ఇన్ నిర్వహించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం తమకు వచ్చే దరఖాస్తుల్లో, ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ ఉండే దరఖాస్తులు సగానికన్నా తక్కువగా ఉంటున్నాయని దేశీయంగా 54 శాతం మంది హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్‌ఆర్) ప్రొఫెషనల్స్ వెల్లడించారు. సరైన సాంకేతిక నైపుణ్యాలున్న వారిని (61 శాతం మంది), సాఫ్ట్ స్కిల్స్ ఉన్న వారిని (57 శాతం మంది) దొరకపుచ్చుకోవడం నియమాకాలపరంగా అతి పెద్ద సవాలుగా ఉంటోందని పేర్కొన్నారు.
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇంజినీరింగ్ వంటి టెక్నికల్/ఐటీ నైపుణ్యాలు (44 శాతం), ఏఐ నైపుణ్యాలు (34 శాతం), కమ్యూనికేషన్ .. సమస్యల పరిష్కార నైపుణ్యాలు (33) గల అభ్యర్థులు అతి కష్టం మీద దొరుకుతున్నారు.
అర్హులైన అభ్యర్ధులు దొరక్కపోవడంతో హైరింగ్ ప్రక్రియ విషయంలో కంపెనీలు మరింత ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఉద్యోగానికి కావాల్సిన అర్హతల్లో కనీసం 80 శాతం ఉన్న అభ్యర్ధులనే పరిగణనలోకి తీసుకుంటామని 55 శాతం మంది, వారినే హైరింగ్ చేసుకుంటామని 54 శాతం మంది హెచ్‌ఆర్ నిపుణులు తెలిపారు. సర్వే డేటా, లింక్డ్‌ఇన్ ప్లాట్‌ఫాంలో వివరాల విశ్లేషణ ఆధారంగా రిపోర్ట్ తయారైంది. 1,991 మంది సీ–సూట్ ఎగ్జిక్యూటివ్‌లతో పాటు వెయ్యి మందికి పైగా ఉద్యోగులుండే సంస్థలకు సంబంధించి 300 మంది పైచిలుకు చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్స్ ఈ సర్వేలో పాల్గొన్నారు.
నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు ..
→ నియామకాల తీరుతెన్నులను, ప్రతిభావంతులకు శిక్షణనివ్వడం మొదలైన అంశాలను ఏఐ సమూలంగా మార్చేస్తోంది. అయితే ఏఐని కేవలం ఆషామాïÙగా వినియోగించుకోవడం వల్ల ఉపయోగం లేదు. వ్యాపార వృద్ధికి దాన్ని ఉపయోగించుకోవడం కీలకం. చాలా మటుకు కంపెనీలు ఏఐ సాధనాలను తయారు చేసుకోవడంపైనే భారీగా పెట్టుబడులు కుమ్మరిస్తున్నాయని, కానీ వాటిని పూర్తి స్థాయిలో వినియోగించగలిగే సరైన నిపుణులు అంతగా ఉండటం లేదని నివేదిక వివరించింది. దీనితో గేమ్ చేంజింగ్ అవకాశం చేజారిపోతోందని పేర్కొంది.
→ దీన్ని అధిగమించాలంటే వ్యాపార సంస్థలు నియామకాల విషయంలో నైపుణ్యాలకు ప్రాధాన్యతనిచ్చే ధోరణితో వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త ఆవిష్కరణలకు ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడినప్పటికీ, సృజనాత్మకత, కమ్యూనికేషన్, భాగస్వామ్యం వంటి మానవ నైపుణ్యాలవల్లే పోటీ సంస్థలకన్నా మెరుగ్గా కంపెనీలు పురోగమించగలవు.
→ నైపుణ్యాల్లో అంతరాలను భర్తీ చేసేందుకు భారతీయ కంపెనీలు శిక్షణపై మరింతగా దృష్టి పెట్టాలి. ఏఐ గురించి నేర్చుకోవడం, అభివృద్ధి చేయడంపై ఇన్వెస్ట్ చేస్తే .. వినియోగం పెరగడానికి ఉపయోగపడుతుంది.
హెల్త్‌కేర్ ఏఐతో జీడీపీకి ఊతం
2025లో 30 బిలియన్ డాలర్ల వరకు జత
ఇన్‌ఫ్రా పరిమితులు అధిగమించాలి, సిబ్బందికి శిక్షణనివ్వాలి
డెలాయిట్ నివేదిక
న్యూఢిల్లీ: ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేథని (ఏఐ) విస్తృతంగా ఉపయోగించడం వల్ల స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) 2025లో మరో 25–30 బిలియన్ డాలర్ల విలువ జత కాగలదని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఒక నివేదికలో తెలిపింది. ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్న ఇండియాఏఐ మిషన్, డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత చట్టం 2023 మొదలైనవి డిజిటల్ హెల్త్‌కేర్ వ్యవస్థకు ఊతమిస్తున్నాయని వివరించింది. నివేదిక ప్రకారం ఆరోగ్య సంరక్షణ విభాగంలో ఏఐ వినియోగం 40 శాతం పైగా ఉంటోంది. ఇది ఎఫ్‌ఎంసీజీ (30 శాతం), తయారీ (25 శాతం) కన్నా అధికం కావడం గమనార్హం.
ఏఐ ఆధారిత వైద్యపరీక్షలు, మెడ్‌టెక్ ఆవిష్కరణలు, డిజిటల్ హెల్త్ రికార్డులు తదితర అంశాల కారణంగా భారతీయ డిజిటల్ హెల్త్‌కేర్ వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోందని డెలాయిట్ ఇండియా లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ ఇండస్ట్రీ లీడర్ జయ్‌దీప్ ఘోష్ తెలిపారు. అయితే, ఏఐ సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోవాలంటే నియంత్రణ విధానాలు, సిబ్బందికి శిక్షణ, మౌలిక సదుపాయాలపరమైన పరిమితులు మొదలైన సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు, పురోగామి పాలసీలపై దృష్టి పెట్టడం ద్వారా ఏఐ ఆధారిత హెల్త్‌కేర్ విభాగంలో భారత్ అంతర్జాతీయంగా అగ్రగామిగా ఎదగవచ్చని ఘోష్ చెప్పారు.
బ్యాంకింగ్‌తో పోలిస్తే పురోగతి నెమ్మదే..
ఏఐ కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాలతో పోలిస్తే హెల్త్‌కేర్‌లో కృత్రిమ మేథ వినియోగం చాలా నెమ్మదిగా ఉంటోందని నివేదిక తెలిపింది. డేటా భద్రతపై అనుమానాలు, బహుళ నియంత్రణ సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉండటం, ఏఐలో శిక్షణ పొందిన నిపుణుల కొరత తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించింది. సర్జికల్ కన్జూమబుల్స్ విభాగంలో భారత్ నికరంగా ఎగుమతిదారుగానే ఉంటున్నప్పటికీ హైటెక్ వైద్య పరికరాల కోసం ఇంకా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోందని నివేదిక వివరించింది. దేశీయంగా తయారీని పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తోందని పేర్కొంది. శిక్షణ, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు, పాలసీపరమైన సంస్కరణలతో ఏఐ వినియోగం మరింత వేగవంతం కాగలదని వివరించింది. ఇది సాంకేతికంగా అధునాతనమైన, స్వయం సమృద్ధి గల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు వేస్తుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment