
భారత్‌లో మాదిరిగానే అమెరికాలోనూ ఆదాయపు పన్నుకు సంబంధించి భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది అమెరికన్లకు పన్ను మినహాయింపునిచ్చే భారీ పన్ను ప్రణాళికను అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. సంవత్సరానికి 150,000 డాలర్ల కంటే తక్కువ సంపాదించేవారికి ఫెడరల్ పన్నులను తొలగించే యోచనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారని సీబీఎస్ ఇంటర్వ్యూలో లుట్నిక్ చెప్పారు .
'ట్రంప్ లక్ష్యం ఏమిటో నాకు తెలుసు. సంవత్సరానికి 150,000 డాలర్ల కంటే తక్కువ సంపాదించే ఎవరికైనా పన్ను ఉండకూడదు. అదే ఆయన (ట్రంప్) లక్ష్యం. దానికోసమే నేను పనిచేస్తున్నా' అని లుట్నిక్ తెలిపారు. లుట్నిక్ అక్కడితో ఆగలేదు. అమెరికన్ల పన్ను భారాలను మరింత తగ్గించే లక్ష్యంతో విస్తృత ఆలోచనలను తెరపైకి తెచ్చారు. పన్ను సంస్కరణలపై దూకుడు వైఖరి ఉంటుందని ఆయన సంకేతాలిచ్చారు.
ట్రంప్ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఏడాదికి 1,50,000 డాలర్లు అంటే సుమారు రూ.1.3 కోట్లు కంటే తక్కువ సంపాదించే వారికి పన్ను చెల్లించకుండా మినహాయింపు లభిస్తుంది. ఈ లక్ష్యాన్ని నిజం చేయడమే తన ప్రస్తుత లక్ష్యమని లుట్నిక్ స్పష్టం చేశారు. కెనడా, మెక్సికోలతో కొనసాగుతున్న సుంకాల యుద్ధాలతో సహా ట్రంప్ ఆర్థిక వ్యూహాన్ని సమర్థిస్తూ.. విధానాలు మాంద్యాన్ని ప్రేరేపించే ప్రమాదం ఉన్నప్పటికీ అవి అవసరమని లుట్నిక్ పేర్కొన్నారు.
ఇక పన్ను కోతలతో ముడిపడిన పెరుగుతున్న లోటుల గురించి ఆందోళనలపై స్పందిస్తూ ప్రభుత్వ ఖర్చులు అమెరికన్లకు భారం కాకూడదన్నారు లుట్నిక్. విదేశీ సంస్థలు, విదేశీ పన్ను ఎగవేతదారులను ప్రస్తావిస్తూ 'ఇతర వ్యక్తులు' ఈ వ్యయాన్ని భరించాలి. అంతర్జాతీయ పన్ను లొసుగులను సరిదిద్దడం వల్ల దేశీయ పన్ను ఉపశమనం లభిస్తుందని ఆయన వివరించారు. మరోవైపు ట్రంప్ వివాదాస్పద 5 మిలియన్ డాలర్ల అమెరికా వీసా ప్రతిపాదనకు కూడా లుట్నిక్ మద్దతు తెలిపారు. ఇది అదనపు ఆదాయాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment