
ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అంచనా
తీవ్ర అనిశ్చితి పరిస్థితుల నేపథ్యం
వాషింగ్టన్: తీవ్ర అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి అడుగుపెట్టొచ్చని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అభిప్రాయపడ్డారు. వినియోగదారుల వ్యయంలో మందగమనం సంభవించే అవకాశముందని, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులపై తీవ్ర అనిశ్చితి కొన సాగుతోందని వ్యాపార వర్గాల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఫెడ్ చైర్మన్ వ్యా ఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరిగిన ఆర్థిక ఫోరంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.
→ కొత్త ట్రంప్ ప్రభుత్వ విధానాలు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న అంశంపై స్పష్టత వచ్చే వరకు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంలో ఏ మాత్రం తొందరపడబోదు.
→ కొత్త ప్రభుత్వం 4 ప్రధాన రంగాల్లో గణనీయమైన విధాన మార్పులను అమలు చేసే ప్రక్రియలో ఉంది. వాణిజ్యం, వలస, ద్రవ్య, నియంత్రణ విధానాల్లో మార్పులు చోటుచేసుకునే వీలుంది. ఈ మార్పులు, వాటి ప్రభావాలపై అనిశ్చితి తీవ్రంగా ఉంది.
→ పరిస్థితులు ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోవడంపై మేము దృష్టి సారిస్తాము. మేము తొందరపడాల్సిన అవసరం లేదు. స్పష్టత కోసం ఎదురుచూడడానికే మేము మొగ్గు చూపిస్తాము.
→ ఆర్థిక వ్యవస్థ పటిష్ట స్థితిలో ఉంది. అయితే చోటుచేసుకుంటున్న పరిణామాలు భవిష్యత్తులో వ్యయాలు, అలాగే పెట్టుబడులపై ఎలా ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.
→ కీలక సూచీలు స్థిరంగానే ఉన్నాయని. అయితే ద్రవ్యోల్బణం విషయంలో ఇంకా అస్పష్టత కొనసాగుతోంది. ఉపాధి కల్పనలో మాత్రం వృద్ధి ధోరణి కొనసాగుతోంది.
→ ద్రవ్యోల్బణం అంచనాలను మించిన వేగంతో తగ్గినా లేదా ఆర్థిక వ్యవస్థ బలహీనపడినా ద్రవ్య విధానంలో అవసరమైన మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
→ ఫిబ్రవరి నెలలో అమెరికా ప్రభుత్వం 1,51,000 ఉద్యోగాల వృద్ధిని నమోదుచేసింది. అయితే సెపె్టంబర్ నుంచి చూస్తే నెలకు సగ టున 1,91,000 ఉద్యోగ కల్పన జరుగుతోంది.
మార్కెట్లపై ప్రతికూలతలు..
ట్రంప్ ప్రభుత్వం మెక్సికో, కెనడా వంటి ప్రధాన వ్యాపార భాగస్వాములపై భారీ దిగుమతి సుంకాలను ప్రకటించడం, అలాగే చైనా నుండి దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేయడం వంటి పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ మార్చి 18–19 తేదీల్లో జరిపే తన పాలసీ సమావేశంలో 4.25%–4.50% శ్రేణిలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచే అవకాశం ఉంది.
పాలసీ నిర్ణేతలు ఆవిష్కరించే కొత్త ఆర్థిక అంచనాలు.. ట్రంప్ ప్రభుత్వ తొలి రెండు నెలల విధానాలు, ఇవి ద్రవ్యోల్బణం, ఉపాధి, ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్ల మార్గాన్ని ఎలా ప్రభావితం చేశాయనే అంశంపై స్పష్టత నిచ్చే అవకాశం ఉంది. కాగా, మార్కెట్‌లో పెట్టుబడిదారులు ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఫెడ్ మూడు దఫాలుగా పావు శాతం (మొత్తం 0.75%) చొప్పున రేటు కోతలు ఉండే అవకాశం ఉందని భావిస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment