economy System
-
మరో 50 ఏళ్లలో దేశాభివృద్ధి ఎంతంటే..
ప్రపంచంలో 2075 సంవత్సరం వరకు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఎదిగే దేశాలను అంచనావేస్తూ గోల్డ్‌మన్ సాక్స్ నివేదిక విడుదల చేసింది. భారత్ ఇప్పటికే 4 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసిన విషయం తెలిసిందే. చైనా: 57 ట్రిలియన్ డాలర్లు భారతదేశం: 52.5 ట్రిలియన్ డాలర్లు యునైటెడ్ స్టేట్స్: 51.5 ట్రిలియన్ డాలర్లు ఇండోనేషియా: 13.7 ట్రిలియన్ డాలర్లు నైజీరియా: 13.1 ట్రిలియన్ డాలర్లు ఈజిప్ట్: 10.4 ట్రిలియన్ డాలర్లు బ్రెజిల్: 8.7 ట్రిలియన్ డాలర్లు జర్మనీ: 8.1 ట్రిలియన్ డాలర్లు మెక్సికో: 7.6 ట్రిలియన్ డాలర్లు యూకే: 7.6 ట్రిలియన్ డాలర్లు జపాన్: 7.5 ట్రిలియన్ డాలర్లు రష్యా: 6.9 ట్రిలియన్ డాలర్లు ఫిలిప్పీన్స్: 6.6 ట్రిలియన్ డాలర్లు ఫ్రాన్స్: 6.5 ట్రిలియన్ డాలర్లు బంగ్లాదేశ్: 6.3 ట్రిలియన్ డాలర్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి గతంలో చేసిన ప్రకటన ప్రకారం.. 1980–81లో భారత్ ఎకానమీ పరిమాణం 189 బిలియన్ డాలర్లు. దశాబ్దకాలం గడిచే సరికి ఈ విలువ 326 బిలియన్ డాలర్లకు చేరింది. 2000–01 నాటికి 476 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2010–11 నాటికి ఈ విలువ 1.71 ట్రిలియన్ డాలర్లకు చేరగా, 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2.67 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారింది. ఇదీ చదవండి: ప్రముఖ భారత కంపెనీతో టెస్లా ఒప్పందం 2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఈ విలువ 3.75 ట్రిలియన్ డాలర్లు. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98,374) అంచనా. 2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామిగా కొనసాగుతోంది. -
T V Narendren: రానున్న మూడు దశాబ్దాలు భారత్‌కు కీలకం
జంషెడ్పూర్: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌కు రాబోయే మూడు దశాబ్దాలు అభివృద్ధి విషయంలో కీలకమైనవని టాటా స్టీల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. గత 30–40 ఏళ్లలో చైనా వేగంగా అభివృద్ధి చెందిందని, ఇక ఇదే విధమైన వృద్ధి తీరును భారత్ కొనసాగించే సమయం ఆసన్నమైందని ఇక్కడ సింగ్భూమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎస్‌సీసీఐ) సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► ప్రస్తుతం చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి చేసే దేశం. భారత్ రెండవ స్థానంలో ఉంది. ఉక్కు రంగం ఎదుర్కొంటున్న ప్రపంచ సవాళ్లను, ధరలను దృష్టిలో ఉంచుకుని మనం విధాన కల్పనలో ముందుకుసాగాలి. ► భారత్‌లో గత రెండు, మూడేళ్లలో మౌలిక సదుపాయాల రంగం ఊపందుకుంది. దీని ఫలితంగా ప్రైవేట్ స్టీల్ దిగ్గజ సంస్థల ద్వారా సరఫరా పెరిగింది. ► టాటా స్టీల్‌కు చెందిన జంషెడ్పూర్ ప్లాంట్ జనసాంద్రత కలిగిన ప్రాంతంలో ఉన్నందున, ఇక్కడి ప్లాంట్‌ను మరింత విస్తరించే అవకాశం లేదు. ► సింగ్భూమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో టాటా స్టీల్ సంబంధాలు నిరంతరం బలపడుతున్నాయి. ఇది మరింత పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుంది. ► కంపెనీ వృద్ధిలో కారి్మకులు చేసిన త్యాగాలు చిరస్మరణీయం. టాటా స్టీల్ ఒక ‘‘బహుళ తరం కంపెనీ’’. టాటా స్టీల్– టాటా వర్కర్స్ యూనియన్ల మధ్య ఉన్న సత్సంబంధాలు కంపెనీని ముందుకు నడిపించాయి. ప్రపంచ ఆర్థిక, ఫైనాన్షియల్ పరిస్థితులు అనిశి్చతిగా ఉన్నప్పటికీ కంపెనీ విజయాలు గర్వకారణం. ► ఎకానమీ, పరిశ్రమల పురోగతిలో సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కీలకం. ఎంఎస్ఎంఈ నాణ్యమైన ఉత్పత్తులపై ఆధారపడే పెద్ద పరిశ్రమలు పురోగమిస్తాయి. పెద్ద పరిశ్రమలకు ఎంఎస్ఎంఈలే వెన్నెముక. టాటా స్టీల్ ఒక పెద్ద కంపెనీ. దాని వెన్నెముక కూడా ఎంఎస్ఎంఈ యూనిట్లే. ఎంఎస్ఎంఈలకు సంబంధించినంత వరకు జంషెడ్పూర్ ఒక ముఖ్యమైన ప్రదేశం. సంస్థ పురోగతి హర్షణీయం: ఆనంద్ మూన్కా కాగా, సింగ్భూమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ విజయ్ ఆనంద్ మూన్కా తన స్వాగత ప్రసంగంలో నరేంద్రన్ అద్భుత నాయకత్వంలో టాటా స్టీల్ నిరంతరం అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. జంషెడ్పూర్ పరిసరాల్లో విమానాశ్రయం అభివృద్ధికి టాటా స్టీల్ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఏఐ ప్రయోజనాలకు మద్దతుగా నిలవాలి
ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) ప్రయోజనాలను వినియోగించుకోవడానికి వీలుగా నియంత్రణపరమైన కార్యాచరణ మద్దతు అవసరమని, అదే సమయంలో ఆర్థిక వ్యవస్థపై దీని దు్రష్పభావాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ వార్షిక సదస్సుల్లో భాగంగా ఆయన మాట్లాడారు. ఏఐని ప్రతిపాదించే వారు సైతం ఇది భవిష్యత్తును మార్చేదిగా భావిస్తున్నట్టు చెప్పారు. ‘‘పలు బ్యంక్‌లు, నాన్ బ్యాంక్‌లు ఏఐతో ప్రయోగాలు చేస్తుండడాన్ని చూస్తున్నాం. కాకపోతే ఇదంతా బ్యాక్ ఆఫీస్ పనులకు సంబంధించే ఎక్కువగా ఉంటోంది’’అని చెప్పారు. నిబంధనల అమలుకు సంబంధించి, చెల్లింపులు లేదా లావాదేవీల్లో మనీలాండరింగ్ ప్రయత్నాలను గుర్తించేందుకు ఏఐని కొన్ని బ్యాంక్‌లు అమల్లో పెట్టినట్టు తెలిపారు. రుణ వితరణ నిర్ణయాలు, కస్టమర్ గుర్తింపునకు సంబంధించి కూడా కొనఇన సంస్థలు ఏఐ సొల్యూషన్లను వినియోగిస్తున్నట్టు రాజేశ్వరరావు చెప్పారు. మార్పు స్వభావం, సామర్థ్యాల రీత్యా జెనరేటివ్ ఏఐ ఉత్పాదకత, ఉద్యోగులు, ఆదాయం పంపిణీపై బలమైన ప్రభావం చూపించగలదన్నారు. ఆర్థిక వ్యవస్థ, సమాజం, ఆదాయం పెంపు, మళ్లీ మళ్లీ చేయాల్సిన పనుల ఆటోమేషన్‌పై ఏఐ చూపించే ప్రభావాన్ని సైతం పేర్కొన్నారు. అదే సమయంలో ఏఐ నిరుద్యోగాన్ని పెంచుతుందన్న ఆందోళనలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఐటీ రంగం నుంచి ఈ తరహా ఆందోళనలు వస్తున్నాయంటూ, దీనిపై చర్చకు ఇప్పట్లో ముగింపు రాకపోవచ్చన్నారు. -
India Q2 GDP Growth: జీడీపీ.. టాప్‌గేర్!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2023–24 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) అంచనాలను మించి 7.6 శాతంగా నమోదయ్యింది. చైనా వృద్ధి రేటు ఇదే కాలంలో 4.9 శాతంగా నమోదుకావడంతో ప్రపంచంలో తన వేగవంతమైన ఎకానమీ హోదాను సైతం భారత్ మరోసారి ఉద్ఘాటించింది. సమీక్షా త్రైమాసికంలో తయారీ, మైనింగ్, సేవలు చక్కటి పనితీరును ప్రదర్శించాయి. వ్యవసాయ రంగం మాత్రం బలహీన ఫలితాన్ని నమోదుచేసుకుంది. మొదటి త్రైమాసికంలో భారత్ ఎకానమీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదయ్యింది. రెండవ త్రైమాసికంలో ఈ రేటు 6.5 శాతానికి పరిమితం అవుతుందన్న అంచనాలను మించి పటిష్ట ఫలితం నమోదుకావడం పట్ల ఆర్థికవేత్తలు, విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో వృద్ధి 6.2 శాతం కావడం గమనార్హం. 2022–23లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం. 2023–24లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) అంచనావేస్తోంది. 7.6 శాతం వృద్ధి అంటే.. 2011–12 ధరల ప్రకారం (ఈ సంవత్సరం బేస్‌గా ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన రియల్ ఎకానమీ వృద్ధి) 2022–23 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో భారత్ ఎకానమీ విలువ రూ.38.78 లక్షల కోట్లు. 2023–24 ఇదే కాలంలో (సమీక్షా కాలంలో) ఈ విలువ రూ.41.74 లక్షల కోట్లుగా నమోదయ్యింది. అంటే వృద్ధి రేటు 7.6 శాతమన్నమాట. ఇక ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయకుండా కరెంట్ ప్రైస్ పాతిపదిక చూస్తే, ఇదే కాలంలో జీడీపీ వృద్ధి రేటు (నామినల్) రూ.65.67 లక్షల కోట్ల నుంచి రూ. 71.66 లక్షల కోట్లకు ఎగసింది. అంటే నామినల్ వృద్ధి రేటు 9.1 శాతంగా ఉంది. ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకూ చూస్తే... రియల్ జీడీపీ విలువ రూ.76.22 లక్షల కోట్ల నుంచి రూ. 82.11 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఆరు నెలల్లో వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. ఇక ఇదే సమయంలో నామినల్ రేటు 8.6 శాతంగా ఉంది. రంగాల వారీగా వృద్ధి తీరు ఇలా... వస్తువులు, సేవల ఉత్పత్తికి సంబంధించి గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ)విలువల ప్రకారం... జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) రంగాల వారీగా విడుదల చేసిన ఫలితాలు పరిశీలిస్తే... తయారీ: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 78 శాతం వాటా కలిగిన ఈ రంగంలో వృద్ధి భారీగా 13.9 శాతంగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో అసలు వృద్ధిలేకపోగా 3.8 శాతం క్షీణత నమోదయ్యింది. ► గనులు, తవ్వకాలు: ఈ రంగంలో 0.1 శాతం క్షీణత సమీక్ష కాలంలో 10 శాతం వృద్ధిలోకి మారింది. ►విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: వృద్ధి రేటు 6.1 శాతం నుంచి 10.1 శాతానికి ఎగసింది. ►నిర్మాణం: వృద్ధి రేటు 5.7 శాతం నుంచి 13.3 శాతానికి ఎగసింది. ►వ్యవసాయం: ఎకానమీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న ఈ కీలక రంగంలో వృద్ధి రేటు (2022 ఇదే కాలంతో పోల్చిచూస్తే) 2.5 శాతం నుంచి 1.2 శాతానికి తగ్గింది. ►ఫైనాన్షియల్, రియలీ్ట, ప్రొఫెషనల్ సేవలు: 7.1% నుంచి వృద్ధి 6 శాతానికి పడిపోయింది. ►ఎకానమీ పటిష్టతకు ప్రతిబింబం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరీక్షా కాలంలో ఎదురవుతున్న సవాళ్లను భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ట స్థాయిలో తట్టుకుని నిలబడుతోందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరిన్ని అవకాశాలను సృష్టించేందుకు, పేదరికాన్ని త్వరితగతిన నిర్మూలించడానికి, మన ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వేగవంతమైన వృద్ధిని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నాము. – ప్రధాని నరేంద్ర మోదీ -
కొత్త ఉద్యోగాలు సృష్టించాలంటే ఇది తప్పనిసరి
భారతదేశ దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉన్నప్పటికీ, పెరుగుతున్న ఉద్యోగ డిమాండ్‌ను తీర్చడానికి మాత్రం వృద్ధి రేటు ఎనిమిది శాతం కంటే ఎక్కువగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామరాజన్ స్పష్టం చేశారు. చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇతర దేశాలతో పోలిస్తే ప్రస్తుతం భారతదేశం 6-6.5 శాతం ఆర్థిక వృద్ధి నమోదు చేస్తోందని, కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు ఇది సరిపోదని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతోపాటు భారత దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను విశ్లేషిస్తూంటారన్నది మనకు తెలిసిన విషయమే. మరోవైపు భారత్‌లో ఏటా నిరుద్యోగం పెరుగుతోంది. దీనికి తోడు ఏటా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగ వేటలో పడుతున్నవారి సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా దేశం ఏ మేరకు వృద్ధి సాధించాలో ఆయన తన అంచనాలను వెల్లడించారు. ‘జనాభా అవసరాలు తీర్చాలన్నా.. కొత్త ఉద్యోగాలు సృష్టించాలన్నా భారతదేశం 8-8.5 శాతం ఆర్థికవృద్ధి సాధించాలి. ఉత్పాదకతలో చైనా, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడాలి. అందుకు అవసరమయ్యే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. ఐఫోన్ వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులను దేశంలో తయారు చేస్తున్నారు. కానీ వీటి విడిభాగాలు తయారీలో దేశం పురోగతి చెందింది. అయితే పూర్తి స్థాయి సామర్థ్యాలను సాధించడంలో మాత్రం ఇంకా వృద్ధి చెందాలి’ అని రఘురామ్‌రాజన్ అన్నారు. ప్రపంచ బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త ధ్రువ్ శర్మ ఇటీవల మాట్లాడుతూ 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే దాదాపు ఏటా 8 శాతం ఆర్థికవృద్ధి నమోదు చేయాలని సూచించిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం, ఇతర నియంత్రణ చర్యల వల్ల కొవిడ్ తర్వాత దేశం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తున్నప్పటికీ, ఏటా ఉద్యోగాలు కల్పించడంలో మాత్రం సవాళ్లు ఎదుర్కొంటునట్లు నిపుణులు చెబుతున్నారు. నిరుద్యోగిత రేటు అక్టోబర్‌లో 10.05 శాతానికి చేరుకుందని ముంబైలోని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక తెలిపింది. రాబోయే దశాబ్దంలో దేశంలో ఏడు కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించాలని హెచ్ఎస్బీసీ సూచిస్తుంది. -
25 ఏళ్లలో తొలిసారి.. చైనాలో ఏం జరుగుతుందంటే.. నివేదికలో ఆసక్తికర అంశాలు
ప్రపంచ కర్మాగారమని చెప్పుకునే చైనా కథ కీలకమైన మలుపు తిరిగిందా? ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెలాయిస్తున్న పెత్తనానికి బ్రేకులు పడనున్నాయా? అవునంటున్నాయి తాజా నివేదికలు. పాతికేళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తొలిసారి తగ్గుముఖం పట్టడాన్ని దీనికి నిదర్శనంగా చూపుతున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా విదేశీ పెట్టుబడులు తగ్గిన సమాచారం బయటకొచ్చింది. 1998 తరువాత మొట్టమొదటిసారి 2023 మూడో త్రైమాసికంలో చైనాలోని విదేశీ సంస్థాగత పెట్టుబడులు రూ.98 కోట్ల వరకూ తగ్గినట్లు తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ తాజా నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ యాజమాన్య సంస్థల నుంచి డబ్బు ఇతర దేశాలకు ప్రవహించడం మొదలైంది. చైనాలోని విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తగ్గడానికి పశ్చిమ దేశాలతో ఆ దేశ సంబంధాలు బెడిసికొట్టడం, ఇతర దేశాల్లో అధిక వడ్డీ రేట్లు కారణంగా ఎఫ్‌డీఐలు తరలిపోతున్నట్లు నివేదిక తెలిపింది. అమెరికాతోపాటు ఇతర దేశాలకు చెందిన సెంట్రల్బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. అందుకు విరుద్ధంగా మందగిస్తున్న తన ఆర్థిక వ్యవస్థను పెంచడానికి చైనా కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. దాంతో చైనాలో కంటే వడ్డీ ఎక్కువగా ఉన్న ఇతర దేశాల్లోకి పెట్టుబడులు పెట్టడంతో లాభం చేకూరుతుందని విదేశీ పెట్టుబడిదారులు యోచిస్తున్నారు. ఫలితంగా చైనాలో ఎఫ్‌డీఐలు తగ్గిపోతున్నాయి. అయితే గతంలో పరిస్థితులు మెరుగ్గా ఉన్న సమయంలో విదేశీ కంపెనీలు చైనాలో ఆర్జించిన లాభాలను దేశంలో తిరిగి పెట్టుబడి పెట్టేందుకు సుముఖత చూపలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దాంతో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడుతుందన్నారు. ఈ సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 920 బిలియన్ యువాన్లకు (రూ.10లక్షల కోట్లు) చేరుకున్నాయి. ఇది 2022లో ఇదే కాలంతో పోలిస్తే 8.4 శాతం తక్కువ. ఈ ఏడాది యూఎస్ డాలర్‌తో పోలిస్తే చైనా కరెన్సీ విలువ క్షీణించింది. పెరుగుతున్న నిరుద్యోగం, రియల్ ఎస్టేట్ సంక్షోభం కారణంగా డిమాండ్ మందగించడంతో చైనా ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడినట్లు సర్వే తెలిపింది. చైనాలోని రెండో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ ఎవర్‌గ్రాండే ఈ సంవత్సరం ప్రారంభంలో దివాలా కోసం దాఖలు చేసింది. ప్రస్తుతం మరో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ కంట్రీ గార్డెన్ పతనం అంచున ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎగుమతి ఆధారిత, పారిశ్రామిక రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ కంపెనీల లాభాలు ఈ ఏడాది క్షీణించాయని నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి: నోట్ల రద్దు తర్వాత రెట్టింపైన నగదు చలామణి! కారణం ఇదేనా.. చైనా బ్యాంకింగ్ రంగంలో విదేశీ సంస్థాగత పెట్టుబడులు 2021లో రికార్డు స్థాయిలో 4 ట్రిలియన్ యువాన్లు ఉండేవి. అయితే సెప్టెంబర్ చివరి నాటికి 3.19 ట్రిలియన్ యువాన్లకు పడిపోయాయని చైనా సెంట్రల్ బ్యాంక్ డేటాను ఉటంకిస్తూ సర్వే తెలిపింది. ఐఎంఎఫ్ తన తాజా అంచనా నివేదికలో ప్రాపర్టీ సెక్టార్లో కొనసాగుతున్న బలహీనత, మార్కెట్లో డిమాండ్ తగ్గుదల కారణంగా చైనా వాస్తవ జీడీపీ 2023లో 5.4 శాతానికి పెరుగుతుందని, 2024లో 4.6 శాతానికి మందగించవచ్చని చెప్పింది. అక్కడి జనాభా అధికంగా వృద్ధాప్యంతో బాధపడుతుండడంతో పరిశ్రమల్లో ఉత్పాదకత తగ్గి 2028 నాటికి వృద్ధిరేటు క్రమంగా 3.5 శాతానికి పడిపోతుందని అంచనా. -
Vision 2047: 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ప్రణాళిక!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ 2047 నాటికి దాదాపు 30 ట్రిలియన్ డాలర్ల (29.2 ట్రిలియన్ డాలర్లు) ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడానికి తగిన విజన్ ప్లాన్ సిద్ధమవుతున్నట్లు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం వెల్లడించారు. రూపకల్పనలో ఉన్న ఈ విజన్ డాక్యుమెంట్– 2047 భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవసరమైన సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులను సంస్కరణలను నిర్దేశిస్తుందని ఆయన అన్నారు. ఈ ముసాయిదా విజన్ డిసెంబర్ 2023 నాటికి సిద్ధమవుతుందని, వచ్చే మూడు నెలల్లో విజన్ దేశ ప్రజల ముందుకు వస్తుందని వెల్లడించారు. దిగువ మధ్య ఆదాయ స్థితి నుంచి దేశ పురోగతి విజన్ 2047 ప్రధానంగా నిర్దేశించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మే 2023లో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తూ, 2047 నాటికి దేశాన్ని వికసించిన భారత్‌గా (అభివృద్ధి చెందిన దేశంగా) మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచి్చన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియను డిసెంబర్ 2021లో క్యాబినెట్ సెక్రటరీ ప్రారంభించారు. థీమాటిక్, సెక్టోరల్ విజన్లను (రంగాల వారీగా) సిద్ధం చేసే బాధ్యతలను 10 సెక్టోరల్ గ్రూప్స్ ఆఫ్ సెక్రటరీలకు అప్పగించడం జరిగింది. పరిశ్రమ ఛాంబర్లు, ఎగుమతి ప్రోత్సాహక మండలి, విశ్లేషణా నిపుణులు, పరిశోధనా సంస్థలతో పలు దఫాల్లో మేధోమథనం, సంబంధిత సంప్రదింపులు జరిగాయి. అభివృద్ధి చెందిన భారత్ ః2047 కోసం 10 రంగాల దార్శినికత విభాగాలను ఏకీకృతం చేసేందుకు 2023లో నీతి ఆయోగ్ బాధ్యతలు చేపట్టింది. రాష్ట్రాలు కూడా తమ విజన్ డాక్యుమెంట్లను అభివృద్ధి చేస్తున్నాయని నీతి ఆయోగ్ సీఈవో తెలిపారు. అభివృద్ధి చెందిన దేశం అంటే... ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98, 374) అంచనా. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. -
ఇక ముందూ ఇళ్లకు డిమాండ్.. గృహ నిర్మాణంలో పెద్ద ఎత్తున ఉపాధి
కోల్‌కతా: ఇళ్ల కోసం డిమాండ్ ఇక ముందూ కొనసాగుతుందని, ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాలను వెలికితీసే శక్తి ఈ రంగానికి ఉందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డైరెక్టర్ కేకీ మిస్త్రీ పేర్కొన్నారు. గృహ నిర్మాణ రంగం పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇతర విభాగాలతో పోలిస్తే గృహ రుణాలు సురక్షితమని, వీటిల్లో రుణ రిస్క్ చాలా తక్కువని చెప్పారు. బంధన్ బ్యాంక్ వ్యవస్థాపక దినం వేడుకల్లో భాగంగా మిస్త్రీ మాట్లాడారు. గృహ రుణాల్లో అగ్రగామి కంపెనీ హెచ్డీఎఫ్సీ ఇటీవలే హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో విలీనం అవ్వడం గమనార్హం. తక్కువ ఎన్పీఏలతో భారత బ్యాంకింగ్ రంగం మరంత బలంగా ఉన్నట్టు చెప్పారు. అమెరికా, చైనాతో పోలిస్తే గృహ రుణాలు మన దేశంలో చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నట్టు మిస్త్రీ తెలిపారు. మన జీడీపీలో మార్ట్గేజ్ నిష్పత్తి చాలా తక్కువ ఉందన్నారు. ఇళ్లకు నిర్మాణాత్మక డిమాండ్ ఎప్పటికీ ఉంటుందన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ (సీజీ)పై స్పందిస్తూ.. స్వతంత్ర డైరెక్టర్ల పాత్రను మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు. ‘‘కంపెనీలు ఎలా పనిచేస్తున్నాయనే దానికి సీజీ ఒక కొలమానం. దీర్ఘకాలం పాటు నిలదొక్కుకోవాలంటే బలమైన కార్పొరేట్ గవర్నెన్స్ సూత్రాలు తప్పనిసరి. మంచి సీజీ అనేది అనుకూలం. ఇది ఉంటే ఇన్వెస్టర్లు అధిక ధర చెల్లించేందుకు ముందుకు వస్తారు’’అని మిస్త్రీ వివరించారు. వాటాదారులు, నిర్వాహకుల మధ్య ఇండిపెండెంట్ డైరెక్టర్లు వాహకం మాదిరిగా పనిచేస్తారని చెప్పారు. కార్పొరేట్ గవర్నెన్స్‌కు తోడు ఈఎస్జీ సైతం వ్యాపారాలకు కీలకమని మారిపోయినట్టు ప్రకటించారు. ‘‘ఇటీవలి సంవత్సరాల్లో భారత్ వృద్ధి అంచనాలను మించింది. భారత్ వృద్ధి అవకాశాలను విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పుడు గురిస్తున్నారు. యూఎస్, చైనా తర్వాత మూడో అతిపెద్ద వినియోగ మార్కెట్‌గా భారత్ అవతరిస్తుంది’’అని మిస్త్రీ పేర్కొన్నారు. -
ఎకానమీపై ప్రభావం.. చాలా స్వల్పం
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థపై రూ. 2,000 నోట్ల ఉపసంహరణ ప్రభావం ‘‘చాలా చాలా స్వల్పం’’గానే ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. చలామణీలో ఉన్న కరెన్సీలో వీటి వాటా 10.8 శాతమేనని (విలువపరంగా రూ. 3.6 లక్షల కోట్లు) వెల్లడించారు. కరెన్సీ నిర్వహణ కార్యకలాపాల్లో భాగంగానే ఉపసంహరణ ప్రక్రియను చేపట్టినట్లు సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇంతకు ముందు 2013–14లో కూడా ఈ తరహా ప్రక్రియ నిర్వహించినట్లు, అప్పట్లో 2005కు పూర్వం ముద్రించిన నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించినట్లు ఆయన వివరించారు. స్వచ్ఛ నోట్ల విధానంలో భాగంగానే తాజాగా రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు చెప్పారు. ‘‘చలామణీలో ఉన్న కరెన్సీలో రూ. 2,000 నోట్ల వాటా కేవలం 10.8 శాతమే కాబట్టి ఎకానమీపై దీని ప్రభావం చాలా చాలా తక్కువగానే ఉంటుంది. పైగా ఈ నోట్లను లావాదేవీల్లో ఎక్కువగా ఉపయోగించడం లేదని మా పరిశీలనలో తేలింది. కాబట్టి ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావమేమీ ఉండదు’’ అని ఆయన వివరించారు. ప్రస్తుతానికి రూ. 2,000 నోట్ల చెల్లుబాటు యథాప్రకారంగానే కొనసాగుతుందన్న దాస్.. డిపాజిట్ చేసేందుకు, మార్చుకునేందుకు నిర్దేశించిన సెప్టెంబర్ 30 తర్వాత కూడా చెల్లుబాటవడంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దానిపై అప్పుడు తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. 10 నోట్లను మాత్రమే మార్చుకునేందుకు అవకాశం కల్పించడం వెనుక హేతుబద్ధతపై స్పందిస్తూ 2014 జనవరిలో కూడా దాదాపు ఇదే విధానం పాటించినట్లు దాస్ చెప్పారు. ఇక రూ. 1,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టడంపై బదులిస్తూ.. అది ఊహాజనిత ప్రశ్న అని, ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేశారు. పుష్కలంగా నిధులు.. ద్రవ్య నిర్వహణపై ఉపసంహరణ ప్రభావాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజల నుంచి నిధులకు ఉండే డిమాండ్‌ను బట్టి ఇది ఉంటుందన్నారు. ‘‘కొంత మొత్తం బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ అవుతుంది. మరికొంత మొత్తాన్ని మార్చుకుంటారు. మార్చుకున్న కరెన్సీ అంతా తిరిగి ప్రజల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఖాతాల్లో డిపాజిట్ అయిన మొత్తాలను మాత్రం కస్టమర్లు బ్యాంకులోనే అట్టే పెట్టుకోవడమో లేదా తమ అవసరాల కోసం వెనక్కి తీసుకోవడమో జరగొచ్చు. ఏదైనా బ్యాంకింగ్ వ్యవస్థలో పుష్కలంగా నిధులు అందుబాటులో ఉన్నాయి’’ అని దాస్ చెప్పారు. ప్రస్తుత నిబంధనలే కొనసాగింపు... వ్యవస్థలోకి నల్లధనం వచ్చే అవకాశాలపై స్పందిస్తూ.. ఖాతాలో డిపాజిట్ చేయాలన్నా, నోట్లను మార్చుకోవాలన్నా ప్రస్తుతం నిర్దిష్ట ప్రక్రియ ఉందని దాస్ చెప్పారు. దాన్నే కొనసాగించాలని బ్యాంకులకు సూచించామని, అదనంగా కొత్త నిబంధనలేమీ పెట్టలేదని తెలిపారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం రూ. 50,000 దాటి నగదు డిపాజిట్ చేస్తే పాన్ తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందన్నారు. ఇక ఈ కసరత్తుతో కరెన్సీ నిర్వహణ వ్యవస్థపై పడే ప్రభావాలకు సంబంధించిన ప్రశ్నలకు స్పందిస్తూ.. మన వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని శక్తికాంత దాస్ తెలిపారు. తోటి దేశాలతో పోలిస్తే డాలరుతో భారత కరెన్సీ మారకం ఒడిదుడుకులకు లోనవడం చాలా తక్కువేనని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం, సంపన్న దేశాల్లో కొన్ని బ్యాంకుల మూసివేతతో అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో సంక్షోభాలు తలెత్తినప్పటికీ భారతీయ కరెన్సీ స్థిరంగా నిల్చుందని దాస్ తెలిపారు. అప్పుడేం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేను ప్రస్తుతం రూ. 2,000 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటవడం కొనసాగుతుందని దాస్ చెప్పారు. ఎన్ని నోట్లు తిరిగి వస్తాయో వేచిచూడాల్సి ఉంటుందన్నారు. ‘‘ఇప్పటికైతే చాలా మటుకు నోట్లు తిరిగి వచ్చేస్తాయనే అనుకుంటున్నాం. ఎన్ని వస్తాయన్నది చూడాలి. సెప్టెంబర్ 30 (మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు ఆఖరు తేది) దగ్గరయ్యే కొద్దీ తగిన నిర్ణయాలు తీసుకుంటాం. దాని గురించి ఇప్పుడే నేను ఊహాజనిత సమాధానాలు ఇవ్వలేను’’ అని దాస్ వ్యాఖ్యానించారు. నోట్ల మార్పిడికి, బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు బోలెడంత సమయం ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. విదేశీ పర్యటనల్లో ఉన్న వారు, వర్క్ వీసాలతో విదేశాల్లో ఉన్న వారు ఎదుర్కొనే సమస్యలను కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామని, ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా ఈ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడటమే తమ ప్రధాన ఉద్దేశమని దాస్ వివరించారు. నీరు, నీడ కల్పించండి.. రూ. 2,000 నోట్లను మార్చుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు వచ్చే కస్టమర్లకు తగు సౌకర్యాలు కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎండలో పడిగాపులు కాసే పరిస్థితి రాకుండా తగు నీడ, తాగడానికి నీరు వంటి సదుపాయాలు అందించాలని పేర్కొంది. నోట్ల మార్పిడి, డిపాజిట్ల డేటాను రోజువారీ రికార్డులను నిర్వహించాలని ఒక నోటిఫికేషన్లో సూచించింది. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు నోట్లను మార్చుకునేందుకు చాంతాడంత లైన్లలో నిలబడి పలువురు మరణించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆర్బీఐ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పీఎస్బీ చీఫ్‌లతో భేటీ.. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) చైర్మన్లు, డైరెక్టర్లతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం సమావేశమయ్యారు. బ్యాంకుల్లో గవర్నెన్స్, నైతిక విలువలు తదితర అంశాలపై చర్చించారు. -
ఆర్థికశాస్త్రంలో నోబెల్: ఈ ఏడాది ముగ్గురికి పురస్కారం
స్టాక్‌హోమ్: ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్రను వివరించడంలో చేసిన కృషికి గాను ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించింది. అమెరికాకు చెందిన బెన్ బెర్నాంకే, డగ్లస్ డైమండ్ , ఫిలిప్ డైబ్విగ్లకు సోమవారం నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై ఈ ముగ్గురి పరిశోధనలకు గాను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డును ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్ర, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాల సమయంలో, అలాగే ఆర్థిక మార్కెట్లను ఎలా నియంత్రించాలనే దానిపై అవగాహనను గణనీయంగా మెరుగుపరిచినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు జ్యూరీ పేర్కొంది. ఆర్థిక సంక్షోభాల వేళ బ్యాంకుల పాత్ర ఎంత ముఖ్యమైందన్న విషయాన్ని ఈ ముగ్గురూ తమ పరిశోధనల్లో వెల్లడించారు..బ్యాంకులు దివాళా తీయకుండా ఉండేందుకు ఈ స్టడీ చాలా కీలకమైందని పేర్కొంది. BREAKING NEWS: The Royal Swedish Academy of Sciences has decided to award the 2022 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel to Ben S. Bernanke, Douglas W. Diamond and Philip H. Dybvig “for research on banks and financial crises.”#NobelPrize pic.twitter.com/cW0sLFh2sj — The Nobel Prize (@NobelPrize) October 10, 2022 -
కొత్త ఉద్యోగాలు వస్తున్నాయ్
సాక్షి, అమరావతి: ‘కొత్త కొలువులు వస్తున్నాయి. 2021లో దేశంలో 53 శాతం కంపెనీలు కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు సంసిద్ధమవుతున్నాయి.’ అని ‘ఇండియాస్ ట్యాలెంట్ ట్రెండ్స్– 2021’ నివేదిక వెల్లడించింది. బ్రిటన్ ప్రధాన కేంద్రంగా ఉన్న ‘మైఖేల్ పేజ్’ అనే రిక్రూటింగ్ ఏజెన్సీ దీన్ని విడుదల చేసింది. 2021లో ఇతర ఆసియా–పసిఫిక్ దేశాల కంటే భారత్‌లో కొత్త ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. ఆసియా–పసిఫిక్ దేశాల్లోని 42 శాతం కంపెనీలు కొత్త ఉద్యోగాలు కల్పించనున్నాయని అంచనా వేసింది. కరోనా నుంచి కోలుకుని మెల్లగా గాడిలో పడిన దేశ ఆర్థిక వ్యవస్థ జోరందుకోనుందని పేర్కొంది. ఈ నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ.. ► టెక్నాలజీ రంగంలో ఉన్న కంపెనీల్లో ఏకంగా 74 శాతం కంపెనీలు తాము ఉద్యోగుల సంఖ్యను 14 శాతం పెంచుతామని తెలిపాయి. రిమోట్ వర్కింగ్‌కు అవకాశాలు కల్పిస్తామని ఆ కంపెనీలు చెప్పాయి. ► డేటా సైంటిస్టులు, గ్రోత్ హ్యాకర్స్, పెర్ఫార్మెన్స్ మార్కెటర్స్, సేల్స్–బిజినెస్ డెవలపర్స్, రీసెర్చ్ డెవలపర్స్, లీగల్ కౌన్సిల్ మొదలైన ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువ ఉంటుందని పేర్కొంది. ► కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న ఆ 53 శాతం కంపెనీల్లో 60 శాతం కంపెనీలు ఉద్యోగుల జీతాలు పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాయి. ఇక వాటిలో 55 శాతం కంపెనీలు ఉద్యోగులకు బోనస్‌లు ఇచ్చేందుకు సిద్ధపడుతుండగా.. 43 శాతం కంపెనీలు ఒక నెల కంటే ఎక్కువ జీతం బోనస్‌గా ఇవ్వనుండటం విశేషం. ► జీతాల పెంపుదలలో టెక్నాలజీ, ఆరోగ్య సేవల రంగం మొదటి స్థానంలో ఉంది. టెక్నాలజీ రంగంలో 15 శాతం నుంచి 25 శాతం, ఆరోగ్య సేవల రంగంలో 15 నుంచి 20 శాతం వరకు జీతాలు పెరిగే అవకాశాలున్నాయి. రిటైల్ రంగంలో 7.6 శాతం, ఈ–కామర్స్/ఇంటర్నెట్ సేవల రంగాల్లో 7.5 శాతం, తయారీ రంగంలో 5.9 శాతం, నిర్మాణ రంగంలో 5.3 శాతం జీతాలు పెరగవచ్చు. ► ఈ కంపెనీలు తమ ఉద్యోగుల్లో మూడోవంతు మందికి పదోన్నతులు కల్పించనున్నాయి. -
మార్కెట్‌కు ఆర్బీఐ బూస్ట్
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమను ఆదుకోవడానికి రూ.50,000 కోట్లనిధులు అందుబాటులోకి తెస్తామన్న ఆర్బీఐ ప్రకటన సోమవారం స్టాక్ మార్కెట్‌ను లాభాల బాటలో నడిపించింది. ప్రపంచ మార్కెట్లు లాభపడటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం... సానుకూల ప్రభావం చూపించాయి. ఆరంభ లాభాలను కోల్పోయినప్పటికీ సెన్సెక్స్ 31,500 పాయింట్ల పైకి, నిఫ్టీ 9,200 పాయింట్లపైకి ఎగబాకాయి. సెన్సెక్స్ 416 పాయింట్ల లాభంతో 31,743 పాయింట్ల వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు పెరిగి 9,282 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆర్బీఐ అభయం...: మ్యూచువల్ ఫండ్స్‌కు రూ.50,000 కోట్ల నిధులను అందుబాటులోకి తేవడంతో కరోనా వైరస్ కల్లోలంతో అల్లకల్లోలమవుతున్న ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం సాధించడానికి మరిన్ని చర్యలను తీసుకోగలమని ఆర్బీఐ అభయం ఇచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. రోజంతా లాభాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 32,000 పాయింట్లపైకి, నిఫ్టీ 9,300 పాయింట్లపైకి ఎగబాకాయి. ఒక దశలో సెన్సెక్స్ 777 పాయింట్లు, నిఫ్టీ 223 పాయింట్ల మేర లాభపడ్డాయి. ట్రేడింగ్ చివర్లో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో లాభాలు తగ్గాయి. కరోనా వైరస్ కల్లోలంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి జపాన్ కేంద్ర బ్యాంక్ మరోసారి ప్యాకేజీని ప్రకటించడంతో ఆసియా మార్కెట్లు 0.2–2% రేంజ్లో పెరిగాయి. యూరప్ మార్కెట్లు 1–2% రేంజ్ లాభాల్లో ముగిశాయి. మ్యూచువల్ ఫండ్ షేర్ల జోరు... మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు రూ.50,000 కోట్ల నిధులను ఆర్బీఐ అందుబాటులోకి తేనుండటంతో మ్యూచువల్ ఫండ్, ఆర్థిక రంగ షేర్లు జోరుగా పెరిగాయి. నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ 13 శాతం, హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ 8 శాతం, శ్రీరామ్ ఏఎమ్‌సీ 5 శాతం చొప్పున ఎగిశాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మణప్పురం ఫైనాన్స్, ఆదిత్య బిర్లా మనీ క్యాపిటల్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లు 6–11 శాతం రేంజ్లో పెరిగాయి. ► సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో 5 షేర్లు మాత్రమే నష్టపోగా మిగిలిన 25 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. ► ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 6శాతం లాభంతో రూ.407 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఈ షేర్ బాగా పెరిగింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ► యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ ఆ్యంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 5 శాతం మేర లాభపడ్డాయి. ► ఒక్కో షేర్‌కు రూ.320 (3200 శాతం) స్పెషల్ డివిడెండ్‌ను ప్రకటించడంతో ఫైజర్ షేర్ 11 శాతం లాభంతో రూ.4,891 వద్ద ముగిసింది. ► స్టాక్ మార్కెట్ లాభపడినప్పటికీ, ఇంట్రాడేలో వందకు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. సైయంట్, చాలెట్ హోటల్స్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, పీవీఆర్, ఐనాక్స్ లీజర్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► సన్ ఫార్మా, లుపిన్, లారస్ ల్యాబ్స్, సిప్లా షేర్లు ఏడాది గరిష్టాన్ని తాకాయి. -
మార్కెట్లను పునరుద్ధరిస్తాం
వాషింగ్టన్: కోవిడ్ ధాటికి విలవిలలాడుతున్న అగ్రరాజ్యంలో తిరిగి మార్కెట్లు ప్రారంభించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు దశల ప్రణాళికను ప్రకటించారు. దేశంలో నిరుద్యోగ భృతి కోసం మరో 52 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని కార్మిక శాఖ చెబుతున్న నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కోవిడ్ ఉధృతికి మార్చిలో దేశవ్యాప్తంగా 2.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థ 5.9 శాతం కుంచించుకుపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచంలో అతి పెద్దదైన తమ ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దడానికి ట్రంప్ ప్రభుత్వం మార్కెట్లను తెరవాలని అనుకుంటోంది. ఇన్నాళ్లూ మార్కెట్ల పునరుద్ధరణపై అధ్యక్షుడిదే తుది నిర్ణయం అని వాదించిన ట్రంప్ ఇప్పుడు ఆయా రాష్ట్రాల గవర్నర్లే దీనిపై నిర్ణయం తీసుకోవాలంటూ మాటమార్చారు. రాష్ట్ర గవర్నర్లకు ఫెడరల్ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఇందుకోసం మూడు దశల ప్రణాళికను ప్రకటించారు. -
గేరు మార్చు.. స్పీడు పెంచు!
న్యూఢిల్లీ: అయిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం మళ్లీ పుంజుకోనుంది. అయితే, 2024–25 నాటికి నిర్దేశించుకున్న 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగాలంటే మాత్రం... ఇటు పెట్టుబడులకు, అటు సంస్కరణలకు తోడ్పడేలా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. తద్వారా నిలకడగా 8 శాతం స్థాయిలో అధిక వృద్ధి సాధిస్తే తప్ప లక్ష్యాన్ని చేరుకోగలిగే పరిస్థితి లేదు. ఈ దిశగా ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు, ఉద్యోగాల కల్పన పెరగటమనేది చాలా కీలకంగా నిలవనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఈ అంశాలను వెల్లడించింది. బడ్జెట్‌కు ముందురోజు ప్రవేశపెట్టే ఆర్థిక సర్వే... ఇటు ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించడంతో పాటు భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలకు కూడా దిశానిర్దేశం చేసేదిగా ఉంటుంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం (నేడు) పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఎకనమిక్ సర్వేకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. పుంజుకోనున్న పెట్టుబడులు .. ఆర్థిక సర్వే అంచనాల ప్రకారం 2018–19లో 6.8%కి క్షీణించిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2019–20లో 7% స్థాయిలో నమోదు కానుంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వృద్ధి రేటు అయిదేళ్ల కనిష్ట స్థాయి అయిన 5.8%కి పడిపోయింది. ఇది చైనా నమోదు చేసిన 6.4% వృద్ధి కన్నా తక్కువ కావడం గమనార్హం. ఇక 2011–12 నుంచి క్రమంగా తగ్గుతున్న పెట్టుబడుల రేటు.. ప్రస్తుతం కనిష్ట స్థాయికి చేరుకుందని, ఇక నుంచి మళ్లీ పుంజుకోగలదని ఆర్థిక సర్వే ఆశాభావం వ్యక్తం చేసింది. వినియోగదారుల డిమాండ్, బ్యాంకుల రుణాలు సైతం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని సర్వే తెలియజేసింది. అయితే, పన్ను వసూళ్లు, వ్యవసాయ రంగంపై పెరుగుతున్న ప్రభుత్వ వ్యయాల కారణంగా ద్రవ్యపరమైన ఒత్తిళ్లు తప్పకపోవచ్చని వివరించింది. ప్రస్తుతం 2.7 లక్షల కోట్ల డాలర్ల పరిమాణంతో భారత ఎకానమీ ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది. వచ్చే ఏడాది బ్రిటన్ను దాటేసి అయిదో స్థానానికి చేరొచ్చన్న అంచనాలున్నాయి. రుతుపవనాలు కీలకం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019–20)లో చమురు ధరలు తగ్గవచ్చని ఆర్థిక సర్వే తెలిపింది. దేశ జీడీపీలో దాదాపు 60%గా ఉన్న వినియోగానికి ఇది ఊతమివ్వగలదని పేర్కొంది. కాకపోతే వినియోగం మందగించే రిస్కు లున్నాయని హెచ్చరించింది. ‘వ్యవసాయ రం గం రికవరీ, వ్యవసాయోత్పత్తుల ధరలే గ్రామీణ ప్రాం తాల్లో వినియోగానికి కీలకం కానున్నాయి. రుతుపవనాల పరిస్థితి వీటన్నింటినీ నిర్దేశిస్తుంది. కొన్ని ప్రాం తాల్లో సాధారణ స్థాయికన్నా తక్కువగా వర్షపాతం నమోదు కావొచ్చు. ఇది పంటల దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు’ అని సర్వే పేర్కొంది. కార్మిక సంస్కరణలు ప్రధానం .. దేశంలో డిమాండ్‌కు ఊతమివ్వాలన్నా, సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాలన్నా, కార్మిక ఉత్పాదకత పెర గాలన్నా ప్రైవేట్ పెట్టుబడులు కీలకమని సర్వే తెలిపింది. ఇవే కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టేందుకు, ఉద్యోగాల కల్పనకు తోడ్పడగలవని వివరించింది. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు కార్మిక రంగం మొదలైన వాటిల్లో వ్యవస్థాగత సంస్కరణలు అవసరమని పేర్కొంది. ఇక లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు ప్రధానంగా ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఈ రంగం నుంచే వృద్ధికి మరింత ఊతం లభించగలదని ఆర్థిక సర్వే వివరించింది. సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలివీ... ► ఒప్పందాలు సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు న్యాయవ్యవస్థలో సంస్కరణలు తేవాలి. పెట్టుబడులను ఆకర్షించేలా ఉండాలి. ► 2018–19లో ద్రవ్య లోటు 3.4 శాతంగా నమోదు కావొచ్చు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ద్రవ్య లోటు 5.8 శాతంగా ఉండొచ్చని అంచనా. అంతక్రితం ఏడాదిలో ఇది 6.4%. ► రాజకీయ స్థిరత్వం వృద్ధి అవకాశాలకు సానుకూలాంశం. పెట్టుబడులు, వినియోగమే ఎకానమీ వృద్ధికి ఊతమివ్వనున్నాయి. ► 2024–25 నాటికి భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే (ప్రస్తుత స్థాయికి రెట్టింపు) నిలకడగా 8 శాతం వృద్ధి రేటు నమోదు చేయాల్సి ఉంటుంది. పొదుపు, పెట్టుబడులు, ఎగుమతుల ద్వారానే ఇది సాధ్యపడగలదు. ► చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) మరింత ఎదిగేందుకు, ఉద్యోగాలు కల్పించేందుకు, ఉత్పాదకత పెంచుకునేందుకు అనువైన విధానాలు ఉండాలి. ఎప్పటికీ చిన్న స్థాయిలోనే ఉండిపోయే సంస్థల కన్నా భవిష్యత్‌లో భారీగా ఎదిగే సత్తా ఉన్న అంకుర సంస్థలను ప్రోత్సహించాలి. ► వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైద్యంపై పెట్టుబడులు పెంచాలి. రిటైర్మెంట్ వయస్సునూ దశలవారీగా పెంచాలి. ► తక్కువ జీతభత్యాలు, వేతనాల్లో అసమానతలే సమ్మిళిత వృద్ధి సాధనకు అవరోధాలుగా ఉంటున్నాయి. వీటిని సరి చేసేందుకు చట్టపరమైన సంస్కరణలు, స్థిరమైన విధానాలు అవసరం. ► కాంట్రాక్టుల అమలయ్యేలా చూసేందుకు సరైన వ్యవస్థ లేకపోవడమే వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో ర్యాంకులను మెరుగుపర్చుకోవడానికి పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. ► 2018–19లో రూ. 38,931 కోట్ల విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) తరలిపోయాయి. 2017–18లో నికరంగా రూ. 1,44,681 కోట్లు వచ్చాయి. ► 28 ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక వాటాల విక్రయం విషయంలో ఆర్థిక శాఖ గణనీయ పురోగతి సాధించింది. మూడింట్లో వాటాల విక్రయం పూర్తి కూడా అయింది. ► 2021 నాటికి ఉక్కు ఉత్పత్తి 128.6 మిలియన్ టన్నులకు చేరనుండగా, 2023 నాటికి వినియోగం 140 మిలియన్ టన్నులకు చేరనుంది. 2018–19లో ఉత్పత్తి 106.56 మిలియన్ టన్నులు. ► ఉపాధి లేని గ్రామాలను గుర్తించేందుకు, ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) ప్రయోజనాలను కల్పించేందుకు రియల్ టైమ్‌లో వివరాలు లభించేలా ప్రత్యేక సూచీని ఏర్పాటు చేయాలి. ► ప్రజలకు ప్రయోజనం చేకూర్చడంలో డేటా ప్రాధాన్యాన్ని గుర్తించి, దానిపై తగినంత ఇన్వెస్ట్ చేయాలి. ► 2018–19లో దిగుమతులు 15.4 శాతం, ఎగుమతులు 12.5 శాతం వృద్ధి నమోదు చేసి ఉండొచ్చని అంచనా. ► 2018–19లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 283.4 మిలియన్ టన్నుల మేర ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణే ముఖ్యం: సీఈఏ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే రూపకర్త, ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్ స్పష్టం చేశారు. అలా కాకుండా ప్రభుత్వమే భారీగా రుణాలు సమీకరిస్తూ పోతే పెట్టుబడులకు అవకాశాలు దెబ్బతింటాయని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ‘అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. నిధుల లభ్యత బాగుంది. కాబట్టి ఇటు ప్రైవేట్ సంస్థలు, అటు ప్రభుత్వం రుణాల సమీకరణ కోసం అటువైపు దృష్టి పెట్టొచ్చు. 8 శాతం వృద్ధి రేటు సాధించాలంటే జీడీపీలో పెట్టుబడులనేవి 30 శాతానికి పైగా ఉండాలి. చైనాలో ఇది 50 శాతానికి చేరింది. ప్రస్తుతం మన దగ్గర 29.6 శాతంగా ఉన్న పెట్టుబడుల రేటును 35 శాతం దాకానైనా పెంచుకోవాలి‘ అని సుబ్రమణియన్ చెప్పారు. ‘మన వృద్ధి రేటు బాగానే ఉంది. కానీ నిలకడగా 8 శాతం వృద్ధి రేటు సాధించాలంటే మనం గేర్లు మార్చాలి. టేకాఫ్ తీసుకోవడానికి ఇదే సరైన సమయం‘ అని ఆయన పేర్కొన్నారు. టాప్ ట్యాక్స్‌పేయర్స్‌కు ప్రత్యేక వెసులుబాట్లు.. సక్రమంగా పన్నులు చెల్లించడాన్ని ప్రోత్సహించే దిశగా ప్రతి జిల్లాలో టాప్ 10 ట్యాక్స్‌పేయర్స్‌కు ప్రత్యేక గుర్తింపునిచ్చే అంశాన్ని పరిశీలించాలని ఆర్థిక సర్వే సూచించింది. ఇమ్మిగ్రేషన్ కౌంటర్లో డిప్లమాటిక్ తరహా వెసులుబాట్లు, ఎయిర్‌పోర్టుల్లో ఎక్స్‌ప్రెస్ బోర్డింగ్ సదుపాయాలు కల్పించవచ్చని పేర్కొంది. అలాగే ఒక దశాబ్దకాలంలో అత్యధికంగా పన్నులు చెల్లించిన వారి పేర్లను ముఖ్యమైన భవంతులు, రహదారులు, రైళ్లు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులు, విమానాశ్రయాలకు పెట్టే అంశాన్ని కూడా పరిశీలించవచ్చని ఆర్థిక సర్వే సూచించింది. చాలా మంది కోరుకునే సామాజిక హోదాతో పాటు సంఘంలో గౌరవం కూడా లభించేలా ప్రత్యేక క్లబ్స్‌ను ఏర్పాటు చేయొచ్చని పేర్కొంది. వ్యవసాయ రంగానికి తోడ్పాటు.. దేశీయంగా కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనా నేపథ్యంలో వ్యవసాయ రంగంలో నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేలా కొత్త విధానాలు ప్రవేశపెట్టాలని సర్వే సూచించింది. 2050 నాటికి భారత్‌లో నీటి వనరులు ఆందోళనకరంగా అడుగంటుతాయన్న వార్తల మధ్య .. ’భూమిపరమైన ఉత్పాదకత’పై కాకుండా ’సాగు నీటిపరమైన ఉత్పాదకత’ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొంది. నీటి ఎద్దడిని అధిగమించేందుకు రైతాంగం జలవనరులను సమర్ధంగా వినియోగించుకునేలా ప్రోత్సహించాలని సూచించింది. ఇన్ఫ్రాపై ఏటా 200 బిలియన్ డాలర్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే దిశగా ఇన్ఫ్రా రంగంపై భారత్ వార్షిక వ్యయాలను దాదాపు రెట్టింపు చేయాలని, ఏటా 200 బిలియన్ డాలర్లు పెట్టాల్సి ఉంటుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2032 నాటికి 10 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే దానికి తగ్గ పటిష్టమైన మౌలిక సదుపాయాలూ ఉండాలని పేర్కొంది. అయితే ఈ క్రమంలో ప్రైవేట్ పెట్టుబడులు మరిన్ని వచ్చేలా చూడటమే పెద్ద సవాలుగా ఉండగలదని పేర్కొంది. ప్రస్తుతం భారత్ ఏటా కేవలం 100 నుంచి 110 బిలియన్ డాలర్లు మాత్రమే ఇన్ఫ్రాపై వెచ్చించగలుగుతోందని వివరించింది. స్వచ్ఛ భారత్ లక్ష్యాల సాధన.. స్వచ్ఛ భారత్ కార్యక్రమం లక్ష్యాలు చాలావరకూ నెరవేరాయని, పలు రాష్ట్రాల్లో ప్రతీ ఇంటా మరుగుదొడ్ల నిర్మాణంతో బహిరంగ మలవిసర్జన నూటికి నూరు శాతం నిల్చిందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2014 అక్టోబర్‌లో ఈ పథకం ప్రారంభించినప్పట్నుంచీ దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని తెలిపింది. 2019 జూన్ 14 నాటికి 30 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో 100 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయని వివరించింది. రాబోయే రోజుల్లో ఎస్బీఎం కింద ద్రవ, ఘన వ్యర్థాల విసర్జనపై దృష్టి సారించాల్సి ఉంటుందని సూచించింది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సర్వే సూచించింది. వాటిపై పెట్టే వ్యయం తగ్గే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మళ్లేలా చూడొచ్చని పేర్కొంది. ప్రస్తుతం విద్యుత్ వాహనాల వినియోగం నార్వేలో 39 శాతం, చైనాలో రెండు శాతం ఉండగా భారత్‌లో 0.06 శాతమే ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో చార్జింగ్ మౌలిక సదుపాయాలు పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మరోవైపు, విద్యుత్ వాహనాలపై ఆర్థిక సర్వే సూచనలను పరిశ్రమవర్గాలు స్వాగతించాయి. కొత్త మార్కెట్లలో ఐటీకి బాటలు భారత ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు చాన్నాళ్లుగా సర్వీసులు అందిస్తున్న దేశాల్లో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న మార్కెట్లలో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు కొత్త మార్కెట్లపైనా అవి దృష్టి సారించాలి. యూరప్, జపాన్, చైనా, ఆఫ్రికా వంటి మార్కెట్లలో అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతం దేశీ ఐటీ–బీపీఎం (బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్) ఎగుమతులు 2018–19లో 136 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మొత్తం దేశీ ఐటీ–బీపీఎం పరిశ్రమ పరిమాణం 181 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. అటు స్టార్టప్ సంస్థలకు తోడ్పాటునిచ్చేలా పన్నులను క్రమబద్ధీకరించాలని కూడా సర్వే సూచించింది. రిటైర్మెంట్ వయస్సు పెంచాలేమో... భారతీయుల జీవన ప్రమాణాలు పెరుగుతున్న నేపథ్యంలో పదవీ విరమణ వయస్సును కూడా పెంచే అవకాశాలు పరిశీలించాల్సి రావొచ్చని ఆర్థిక సర్వే సూచనప్రాయంగా తెలిపింది. వచ్చే రెండు దశాబ్దాల్లో జనాభా వృద్ధి గణనీయంగా మందగించే అవకాశం ఉందని పేర్కొంది. ఓవైపు యువ జనాభా (0–19 మధ్య వయస్సున్న వారు) సంఖ్య 2041 నాటికి 25 శాతానికి తగ్గనుండగా వృద్ధుల సంఖ్య (60 ఏళ్లు పైబడిన వారు) రెట్టింపై 16 శాతానికి చేరనుంది. ఇక ప్రాథమిక స్థాయి విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతున్నందున పాఠశాలలు లాభదాయకంగా నడవాలంటే కొన్నింటిని విలీనం చేయాల్సి రావొచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. 100 స్మార్ట్ సిటీలు.. స్మార్ట్ సిటీస్ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా దాదాపు 100 నగరాలు తలపెట్టగా, ఈ ప్రాజెక్టుల విలువ సుమారు రూ. 2.05 లక్షల కోట్లు ఉంటుందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ ప్రాజెక్టుల అమల్లో చెప్పుకోతగిన పురోగతి సాధించినట్లు తెలిపింది. నగర ప్రజలకు మెరుగైన జీవన విధానాలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో 2015 జూన్‌లో అయిదేళ్ల వ్యవధికి కేంద్రం స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్సీఎం)ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 100 నగరాల్లో 5,151 ప్రాజెక్టులు అమలవుతున్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణ ప్రాంత) కింద ఇప్పటిదాకా 4,427 నగరాలు, పట్టణాలను చేర్చినట్లు తాజా ఆర్థిక సర్వే పేర్కొంది. ఐబీసీతో పటిష్టంగా రికవరీ.. ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టిన కీలక ఆర్థిక సంస్కరణల్లో దివాలా స్మృతి (ఐబీసీ) ఒకటని, దీనివల్ల మొండిబాకీల రికవరీ వ్యవస్థ మరింత పటిష్టంగా మారిందని ఆర్థిక సర్వే తెలిపింది. ఇప్పటిదాకా దీని కింద రూ. 1.73 లక్షల కోట్ల క్లెయిమ్స్ సెటిల్ అయినట్లు వివరించింది. 94 కేసులు పరిష్కారమైనట్లు పేర్కొంది. మరోవైపు మొండిబాకీల భారం తగ్గడంతో బ్యాంకింగ్ రంగం పనితీరు కూడా మెరుగుపడిందని ఆర్థిక సర్వే వివరించింది. ప్రధాన సూచీ 17 శాతం అప్.. గత ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ 17 శాతం, నిఫ్టీ సుమారు 15 శాతం పెరిగాయని ఆర్థిక సర్వే తెలిపింది. 2018 మార్చి 31న 32,969గా ఉన్న సెన్సెక్స్ గతేడాది మార్చి 31న 38,673 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 10,114 నుంచి 11,624కి చేరింది. ఆచరణాత్మక లక్ష్యం: పరిశ్రమ వర్గాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7 శాతంగా ఉండొచ్చన్న ఆర్థిక సర్వే అంచనాలను.. ఆచరణాత్మక లక్ష్యంగా పరిశ్రమవర్గాలు అభివర్ణించాయి. సర్వేలో పేర్కొన్నట్లుగా 2024–25 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగే క్రమంలో 8 శాతం వృద్ధి రేటు సాధించాలంటే.. ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం లభించాలని, వినియోగం పెరగాలని పేర్కొన్నాయి. అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ఎదుర్కొంటున్న నిధుల కొరత వంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందని సీఐఐ, ఫిక్కీ, అసోచాం తదితర పరిశ్రమ సమాఖ్యలు అభిప్రాయపడ్డాయి. ‘7 శాతం వృద్ధి రేటు అంచనా కాస్త ఆచరణాత్మక లక్ష్యమే. విధానాలపరమైన తోడ్పాటు ఉన్నప్పుడు వచ్చే ఐదేళ్లలో సగటున 8 శాతం వృద్ధి రేటు కూడా సాధించవచ్చు‘ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ‘పెట్టుబడులను ప్రోత్సహించడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కేంద్ర బడ్జెట్లో పెట్టుబడులు, వినియోగం, పొదుపును ప్రోత్సహించేలా నిర్దిష్ట చర్యలు ఉంటాయని ఆశిస్తున్నాం‘ అని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమానీ చెప్పారు. ఎగవేతదారులు నరకానికే! ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వినబడుతున్న మాట ‘ఎగవేత’ అంటే అతిశయోక్తి కాదేమో!! పన్నులు, రుణాలను ఎగ్గొడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. సర్కారు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా పరిష్కారం మాత్రం అంతంతే. బహుశా! అందుకేనేమో!! ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు... ప్రభుత్వం ఎగవేతల కట్టడికి ‘మతం’ మంత్రం జపిస్తోంది. ప్రజలకున్న మత విశ్వాసాలను దీనికి విరుగుడుగా వాడాలని చూస్తోంది. ఆర్థిక సర్వేలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. హిందూ మతం ప్రకారం ఎవరైనాసరే అప్పు తీసుకొని ఎగ్గొట్టడం అంటే పాపం చుట్టుకోవడమేకాదు.. తీవ్రమైన నేరం కూడా!!. ఇక రుణగ్రస్తులుగా కన్ను మూస్తే... ఏకంగా నరకానికి పోతారన్నది నానుడి!! అందుకే ఆ నరకకూపంలోకి పోకుండా చూడాలంటే ఆ అప్పులన్నీ తీర్చాల్సిన బాధ్యత తమ పిల్లలదేనని కూడా పెద్దలు చెబుతుంటారు. ఇస్లాం, బైబిల్లో కూడా ఇలాంటి బోధనలే కనబడతాయి. భారతీయ సంస్కృతిలో అప్పులు ఎగ్గొట్టడం అంటే ఎంత పాపమో, నేరమో అన్నది మన మతాలే చెబుతున్నప్పుడు.. దీన్నే ప్రచారాస్త్రంగా వాడుకోవాలన్నది సర్వే చెబుతున్న సారాంశం. మరి మోదీ సర్కారు చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ఏమేరకు ఫలిస్తుందో ఆ దేవుడికే తెలియాలి!!. -
ఫలితాలు, గణాంకాలే దిక్సూచి..!
ముంబై: ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ ఫలితాల ప్రకటనతో గతేడాది క్యూ4 (జనవరి–మార్చి) సీజన్ ప్రారంభమైంది. శుక్రవారం వెల్లడైన ఈ సంస్థల ఫలితాలు ప్రోత్సాహకరంగా వున్న నేపథ్యంలో.. ఇక మీదట ఫలితాలను ప్రకటించనున్న కంపెనీలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. ఇదే పాజిటివ్ ట్రెండ్ కొనసాగితే.. వచ్చే కొన్ని రోజుల్లోనే నూతన శిఖరాలను చేరవచ్చని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈవారంలో మార్కెట్ కదలికలు ఏవిధంగా ఉండవచ్చనే అంశంపై స్పందించిన ఎడిల్వీస్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్.. ‘సాధారణ ఎన్నికల కారణంగా భారత వీఐఎక్స్ (వొలటాలిటీ ఇండెక్స్) 20 స్థాయిని అధిగమించింది. ఇది రానున్న రోజుల్లో మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉంటుందనేందుకు సంకేతం’ అని విశ్లేషించారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ బాటమింగ్ అవుట్ అవుతోంది. మెరుగైన ఆర్థిక నిర్వహణతో కూడిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సత్ఫలితాలను ఇవ్వనుందని భావిస్తున్నాం. ఈ కారణంగా మార్కెట్ పడిన ప్రతిసారీ కొనుగోళ్ళు జరపడం మంచి స్ట్రాటజీగా సూచిస్తున్నట్లు చెప్పారాయన. ‘సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈనెల 18న రెండో దశ పోలింగ్ ప్రారంభంకానుంది. ప్రస్తుత ఎన్నికల వేడిలో... అధికార పార్టీనే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందనే అంచనాలు బలంగా కొనసాగుతున్నందున మార్కెట్ మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లనుందని అంచనావేస్తున్నాం’ అని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ అన్నారు. అయితే, ఒడిదుడుకులు మాత్రం కొనసాగుతాయని అంచనావేశారు. మరోవైపు ఈవారంలో ట్రేడింగ్ కేవలం మూడు రోజులకే పరిమితమైంది. మహావీర్ జయంతి సందర్భంగా 17న (బుధవారం) మార్కెట్లకు సెలవు కాగా, 19న (శుక్రవారం) గుడ్ ఫ్రైడే సెలవు ఉన్నట్లు ఎక్సే్ఛంజీలు ప్రకటించాయి. ఆర్ఐఎల్ ఫలితాలు ఈవారంలోనే.. మార్కెట్ విలువ పరంగా దేశీ అతిపెద్ద కంపెనీగా ఎదిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఈవారంలోనే క్యూ4 ఫలితాలను ప్రకటించనుంది. ఆయిల్ రిటైల్ నుంచి విభిన్న రంగాల్లో వ్యాపారం కొనసాగిస్తున్న ఈ సంస్థ.. జియో పేరుతో టెలికం రంగంలో దూసుకుపోతోంది. 18న (గురువారం) ఫలితాలను వెల్లడించనుంది. రిఫైనరీ, పెట్రోకెమికల్ విభాగాలు ఫ్లాట్‌గా ఉండేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. టెలికం, రిటైల్ విభాగాలు ఎర్నింగ్స్‌కు ఊతం ఇవ్వనున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈవారం ఫలితాలను ప్రకటించనున్న దిగ్గజ కంపెనీలను పరిశీలిస్తే.. విప్రో (మంగళవారం), మైండ్‌ట్రీ, క్రిసిల్ (బుధవారం).. ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఆర్బీఎల్ బ్యాంక్ (గురువారం), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (శుక్రవారం) ఫలితాలను ఇవ్వనున్నాయి. ఫలితాల సీజన్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. తక్కువ బేస్ ఎఫెక్ట్, కార్పొరేట్ లెండింగ్ బ్యాంకుల లాభదాయకత, ఎనర్జీ రంగ కంపెనీల ఆరోగ్యకర వృద్ధి ప్రధాన సూచీలను నడిపించనున్నాయని షేర్‌ఖాన్ అడ్వైజరీ హెడ్ హేమంగ్ జానీ అన్నారు. స్థూల ఆర్థిక అంశాలపై మార్కెట్ దృష్టి ఈ ఏడాది మార్చి నెల టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటాలను ప్రభుత్వం సోమవారం ప్రకటించనుంది. గురువారం మానిటరీ పాలసీ మినిట్స్, శుక్రవారం విదేశీ మారక నిల్వల డేటా వెల్లడికానున్నాయి. ఇక అంతర్జాతీయ అంశాల పరంగా.. అమెరికా వాణిజ్య గణాంకాలు బుధవారం వెల్లడికానుండగా.. రిటైల్ అమ్మకాల సమాచారం గురువారం వెల్లడికానుంది. జపాన్ సీపీఐ ద్రవ్యోల్బణం శుక్రవారం విడుదలకానుంది. ముడిచమురు ధరల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ శుక్రవారం 0.69 శాతం పెరిగింది. 71.52 డాలర్ల వద్ద ముగిసింది. క్రమంగా పెరుగుతూ 70 డాలర్ల స్థాయిని అధిగమించిన క్రూడ్ ధర మరింత పెరిగితే సూచీల ప్రయాణానికి ప్రతికూల అంశంగా మారుతుందని ఎడిల్వీస్ సెక్యూరిటీస్ ఫారెక్స్ హెడ్ సజల్ గుప్తా అన్నారు. కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపరా కొనసాగుతోంది. ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లు, మార్చిలో రూ.45,981 కోట్లను దేశీ మార్కెట్లలో పెట్టుబడిపెట్టిన వీరు.. ఏప్రిల్‌లో కూడా ఇదే ట్రెండ్‌ను కొనసాగించారు. ఏప్రిల్‌లో ఇప్పటివరకు రూ.11,096 కోట్లను నికరంగా ఇన్వెస్ట్‌చేసినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈనెల 1–12 కాలంలో ఈమేరకు పెట్టుబడి పెట్టినట్లు వెల్లడైంది. -
ఇక బ్యాంకుల వంతు: ఆర్థిక మంత్రి జైట్లీ
న్యూఢిల్లీ : ఆర్బీఐ పాలసీ రేట్లు తగ్గించడాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వాగతించారు. ఇక రేట్ల కోత ప్రయోజనాలను రుణగ్రహీతలకు బదలాయించాలని, తద్వారా పెట్టుబడులకు, ఎకానమీకి ఊతమివ్వడంలో తోడ్పడాలని ఆయన బ్యాంకులకు సూచించారు. రేట్ల తగ్గింపు వల్ల నిధుల సమీకరణ వ్యయాలు తగ్గుతాయని, ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఊతం లభిస్తుందని మంత్రి తెలిపారు. ఎకానమీ కోలుకోవడానికి కావాల్సిన విధానపరమైన మద్దతు ఆర్బీఐ నిర్ణయంతో లభించగలదని జైట్లీ చెప్పారు. పెట్టుబడులు మెరుగుపడితే దేశ వృద్ధి రేటు సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం సాధ్యపడుతుందన్నారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను ఆర్బీఐ 7.6% నుంచి 7.4 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా అంచనాలను సమీక్షిస్తుందని జైట్లీ చెప్పారు. -
ఆర్బీఐ రెపో రెపలు!
వృద్ధికి ‘రఘురామ’ బాణం.. ♦ అనూహ్యంగా అర శాతం రెపో రేటు తగ్గించిన రాజన్ ♦ ఈ తగ్గింపుతో 6.75 శాతానికి దిగివచ్చిన బెంచ్‌మార్క్ రుణ రేటు ♦ ఈ ఏడాది తగ్గింపు ఇది నాలుగోసారి; మొత్తంగా 1.25 శాతం కోత ♦ మార్కెట్లు సానుకూలం; ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాల హర్షం ♦ తగ్గనున్న పారిశ్రామిక, గృహ, వాహన, విద్యా రుణాల భారం ముంబై : బ్యాంకులిచ్చే రుణాలపై వడ్డీ రేట్లకు బెంచ్‌మార్క్‌గా భావించే రెపో రేటును రిజర్వు బ్యాంకు తగ్గించింది. డిమాండ్ పెరగాలంటే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గాలి కనక... రెపో రేటును తగ్గించాలంటూ కొన్నాళ్లుగా డిమాండ్లు, ఒత్తిళ్లు వస్తున్నా అంతగా పట్టించుకోని ఆర్బీఐ గవర్నరు... అనూహ్యంగా మంగళవారం రెపో రేటును ఏకంగా 0.50 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ రేటు 7.25 నుంచి 6.75 శాతానికి చేరింది. ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి. తద్వారా మార్కెట్‌కు కాస్త ముందుగానే దీపావళి బహుమతిని రాజన్ అందజేసినట్లయ్యింది. రెపోకు అనుగుణంగా రివర్స్ రెపో రేటు కూడా 5.75 శాతానికి చేరుకుంది. కాగా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) 4 శాతంగానే ఉండగా... స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) కూడా 21.5 శాతంగానే ఉంది. ఈ రెండింట్లో ఎలాంటి మార్పులూ చేయలేదు. వ్యవస్థలో తగిన లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) ఉందని, అందుకని ఈ రేషియోల్లో మార్పు ఉండకపోవచ్చని ఉన్న అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ వ్యవహరించింది. మంగళవారం నాటి నాల్గవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఒత్తిడి వల్లేనా? నిజానికి రేటు కోత ఉండకపోవచ్చని కొందరు, ఒకవేళ ఉన్నా 0.25 శాతమే ఉంటుందని కొందరు విశ్లేషించారు. అంచనాలు కూడా వేశారు. అయితే రాజన్ నిర్ణయం వీటన్నిటికీ భిన్నంగా ఉండటం గమనార్హం. నిజానికి ఇటీవల హాంకాంగ్, సింగపూర్లలో ఇన్వెస్టర్లనుద్దేశించి మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ... దేశంలో వృద్ధికి దోహదం చేసే చర్యలు తీసుకోవాల్సి ఉందని గట్టిగా చెప్పారు. మరో గమనించాల్సిన సంగతేమిటంటే... మంగళవారం రాజన్ ప్రకటన వెలువడిన 10 నిమిషాలకే ఆర్థిక మంత్రి జైట్లీ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న ప్రకటనను విడుదల చేస్తూ... ఈ నిర్ణయం వృద్ధికి ఊతమిస్తుందని చెప్పారు. ‘‘మరి కేంద్రం ఒత్తిడి వల్లే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుందని భావించవచ్చా?’’ అని విలేకరులడిగిన ప్రశ్నకు జవాబిస్తూ... మీరెలా కావాలంటే అలా ఊహించుకోవచ్చని చెప్పటం గమనార్హం. నిజానికి ఈ ఏడాది రెపో రేటు తగ్గింపు ఇది నాల్గవసారి. తాజా నిర్ణయంతో ఈ ఏడాది ఇప్పటిదాకా మొత్తం 1.25 శాతం రేటు తగ్గించినట్లయింది. అయితే ఇప్పటి దాకా మూడు విడతలుగా కోత వేసిన 0.75 శాతంలో మూడవ వంతు... అంటే దాదాపు 33 శాతాన్ని మాత్రమే బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాయి. ఆర్బీఐ తాజా నిర్ణయం నేపథ్యంలో ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్ సహా పలు బ్యాంకులు తక్షణం కనీస (బేస్) రుణ రేటు కోత నిర్ణయం తీసుకున్నాయి. ఎందుకింత ప్రాధాన్యమంటే... రెపో రేటు తగ్గిస్తే బ్యాంకులకు కొంత తక్కువ వడ్డీకే ఆర్బీఐ నుంచి నిధులు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రయోజనాన్ని రుణాలకు సంబంధించి కస్టమర్లకు బదలాయిస్తే... పారిశ్రామిక రంగానికి, అలాగే రిటైల్ విభాగానికి తక్కువ రుణ రేటుకు నిధులు అందుతాయి. ఈ ప్రక్రియ మొత్తం బ్యాంకింగ్ రుణ వృద్ధికి, పారిశ్రామిక పురోగతికి, వ్యవస్థలో వినియోగం పెరగటానికి ఉపయోగడుతుంది. ఉదాహరణకు తక్కువ వడ్డీకి గనక రుణాలు లభిస్తే ఇళ్లు, వాహనాలు కొనటం... పరిశ్రమలకు రుణాలు తీసుకోవటం వంటివి పెరుగుతాయి. మొత్తంగా ఇవన్నీ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి ఉపకరిస్తాయి. అయితే వ్యవస్థలోకి అధిక నిధులు రావడం వల్ల ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే అందరిదగ్గరా డబ్బులుంటే వస్తువులకు డిమాండ్ ఏర్పడి వాటి ధరలు పెరగటమన్నది సహజం కదా! ఈ కారణంగానే గడచిన రెండు ద్రవ్య, పరపతి సమీక్షల సందర్భంగా ఆర్బీఐ రెపోను తగ్గించలేదు. ముడి చమురు సహా అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తక్కువ స్థాయిలో కొనసాగడం, ఇప్పట్లో ఇవి పెరిగే అవకాశాలు తక్కువగా ఉండడం... అటు టోకు ధరలు ద్రవ్యోల్బణం, రిటైల్ ద్రవ్యోల్బణం చరిత్రాత్మక కనిష్ట స్థాయిల్లో కొనసాగుతుండడం (ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం -4.95 శాతం. రిటైల్ ద్రవ్యోల్బణం 3.66 శాతం), మందగించిన బ్యాంకింగ్ రుణ వృద్ధి, పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిలో ఒడిదుడుకులు వంటి అంశాల నేపథ్యంలో రాజన్ తాజాగా రెపో రేటు కోత నిర్ణయం తీసుకున్నారు. ఆర్బీఐ ప్రకటనలో ఇతర ముఖ్యాంశాలు ... 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనా 7.4%కి తగ్గింపు. ఇంతక్రితం ఈ అంచనా 7.6%. నవంబర్ చివరికల్లా బ్యాంకుల కనీస రుణ రేటు (బేస్‌రేటు) నిర్ణయానికి సంబంధించి మార్గదర్శకాలు. నిధుల సమీకరణ వ్యయం ప్రాతిపదికన ఈ మార్గదర్శకాలు వెలువడతాయి. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు. చిన్న పట్టణాల్లో కార్డు వినియోగ సంస్కృతి పెంపుపై దృష్టి. ఎలక్ట్రానిక్ పేమెంట్ల పెంపునకు సంబంధించి నవంబర్‌కల్లా ఒక అవగాహనా పత్రం విడుదల. ఆర్థిక రికవరీ నెమ్మదిగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి భాగంలో వేగం పుంజుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి. ఆయా అంశాలు భారత్‌కు ప్రతికూలమే. సెప్టెంబర్ నుంచి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2016 జనవరినాటికి సగటున వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 5.8%గా ఉండొచ్చు. 2018కల్లా లక్ష్యం 5.5%. డెట్ సెక్యూరిటీల్లో ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్‌పీఐ) రూపాయి రూపంలో పెట్టే పెట్టుబడుల పరిమితి స్థిరీకరణ. 2018 నాటికి ప్రభుత్వ బాండ్లలో ఎఫ్‌పీఐ పెట్టుబడి పరిమితిని దశలవారీగా 5%కి పెంపు. ప్రస్తుతం ఇది 3.5%. ఈ పెంపు ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల్లోకి అదనంగా రూ.1.2 లక్షల కోట్లు వచ్చే వెసులుబాటు. నా పేరు రఘురామ్ రాజన్..! మీరు నన్ను ఏమని పిలవాలనుకుంటున్నారో నాకు తెలియదు. వరాలిచ్చే ‘శాంటాక్లాజ్’ అని పిలుద్దామని అనుకుంటారో.. లేక కఠినంగా వ్యవహరించే ‘డేగ’ అని పిలుద్దామని అనుకుంటున్నారో.. అది మీ ఇష్టం. దీనిపై నేను ఏమీ మాట్లాడను. నా పేరు రఘురామ్ రాజన్. నేను ఏమి చేయగలనో అది చేస్తాను. సుస్థిర, పటిష్ట ఆర్థికాభివృద్ధికి మేము ఏది చేయగలమో అది చేశాం. భారీగా రేటు తగ్గించామనో లేక.. దీపావళి బోనస్ ఇచ్చామనో నేను భావించడం లేదు, ఫైనాన్షియల్ మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి సైతం తాజా పాలసీ నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నా. రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు త్వరితగతిన కస్టమర్లకు బదలాయించే అంశంపై ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. బ్యాంకులూ ఇందుకు చొరవ చూపాలి. రుణ రేటు బదలాయింపునకు డిపాజిట్ రేటు తగ్గింపు ఒక మార్గం. చిన్న పొదుపు రేట్ల సమీక్ష, కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (నిధుల సమీకరణ వ్యయం) ప్రాతిపదికన కనీస రుణ రేటు నిర్ణయం వంటి అంశాలూ ఉన్నాయి. రుతుపవన పరిస్థితులు, క్రూడ్ ధరలు, చైనా మందగమన ధోరణి ఇతర అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులను అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నాం. ఫెడ్ రేటు పెంపుసహా ఏ ఒక్క అంశం ప్రాతిపదికనో పాలసీ నిర్ణయం ఉండదు. అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల గురించి ఆందోళన పడడంకన్నా... అవకాశాలను అందిపుచ్చుకోవడం ఎలా అన్న అంశంపై దృష్టి పెట్టాలి. తగ్గింపు లాభం... కస్టమర్లకు వడ్డీ రేట్ల తగ్గింపు ఆరంభించిన బ్యాంకులు ముందడుగు వేసిన ఎస్బీఐ; తక్షణం 0.40% కోత ఆంధ్రా బ్యాంక్‌దీ అదే బాట ఐసీఐసీఐ సహా పలు బ్యాంకుల సంకేతాలు పొదుపు రేట్లు కూడా తగ్గాలని మరికొందరు బ్యాంకర్ల వ్యాఖ్యలు... రిజర్వ్ బ్యాంక్ రెపోరేటు కోత ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించే లెక్కల్లో పలు బ్యాంకులు నిమగ్నమయ్యాయి. బ్యాం కింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కనీస రుణ రేటును 0.40 శాతం తగ్గించింది. దీనితో బ్యాంక్ బేస్ రేటు 9.30 శాతానికి చేరింది. అక్టోబర్ 5 నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుంది. కనీస రుణ రేటు కోత నేపథ్యంలో- డిపాజిట్ రేటు కూడా పావు శాతం వరకూ తగ్గించనున్నట్లు ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. వడ్డీరేట్లపై మరికొన్ని బ్యాంకుల నుంచి వస్తున్న సంకేతాలను చూస్తే... ఆంధ్రాబ్యాంక్: తక్షణం అమల్లోకి వచ్చేవిధంగా ఆంధ్రాబ్యాంక్ కనీస రుణ రేటును పావు శాతం తగ్గించింది. ఈ ఏడాది ఆర్బీఐ 1.25 శాతం రెపో రేటు తగ్గిస్తే, ఇందులో 50 బేసిస్ పాయింట్ల ప్రయోజనాన్ని మాత్రమే కస్టమర్లకు బ్యాంక్ అందించింది. ప్రస్తుత బ్యాంక్ కనీస రేటు 9.75. ఐసీఐసీఐ బ్యాంక్: ప్రైవేటు రంగంలో బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కూడా కనీసం పావు శాతం కనీస రుణ రేటు కోత సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు బ్యాంక్ చీఫ్ చందా కొచర్ ఒక ప్రకటన సైతం చేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్: ఇటీవలే బేస్‌రేటును 9.35 శాతానికి తగ్గించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి తాజా కోతకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యా వెలువడలేదు. ఇప్పటి వరకూ ఈ బ్యాంకుదే బ్యాంకింగ్‌లో కనీస రుణ రేటుకు సంబంధించి కనిష్ట స్థాయి. తాజా 0.40% కోతతో ఇప్పుడు ఈ స్థానాన్ని తిరిగి ఎస్బీఐ (తాజా రేటు కోతతో 9.30%) సొంతం చేసుకుం ది. తాజా ఆర్బీఐ నిర్ణయంపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్య పురి మాట్లాడుతూ, పాలసీ రేటు మరింత తగ్గాలని అన్నారు. యాక్సిస్ బ్యాంక్: ప్రైవేటు రంగంలో మూడవ పెద్ద బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ మాత్రం తమ బ్యాంక్ రేటు కోత ఉంటుందని, అయితే దీనికి మరికొంత సమయం పడుతుందని తెలిపింది. చిన్నమొత్తాల పొదుపు డిపాజిట్ రేటు ఇప్పటికీ 8.7%-9.3% శ్రేణిలో ఉంటే, రెపో ప్రయోజనం మొత్తాన్ని బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయించాలనడం సరికాదని సైతం యాక్సిస్ బ్యాంక్ చీఫ్ శిఖా శర్మ వ్యాఖ్యానించడం గమనార్హం. దేనాబ్యాంక్: రుణ రేటు తగ్గింపు, దీనికి అనుగుణంగా డిపాజిట్ రేటు తగ్గింపునకు ఇప్పుడు బ్యాంకింగ్‌కు పెద్ద ఇబ్బంది ఉంటుందని దేనా బ్యాంక్ చీఫ్, ఐబీఏ చైర్మన్ అశ్వనీ కుమార్ పేర్కొన్నారు. పీపీఎఫ్, ఎన్సీఎస్ వంటి చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లు అధికంగా ఉండడమే ఇప్పుడు బ్యాంకింగ్ డిపాజిట్ల విషయంలో ప్రతికూలంగా కనబడుతున్నాయని వివరించారు. కొటక్ మహీంద్రా: చిన్న పొదుపు రేట్లు అరశాతం మేర తగ్గిస్తే (దాదాపు 8.25 శాతం స్థాయికి) అది స్వాగతనీయ అంశం అవుతుందని కొటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఉదయ్ కొటక్ పేర్కొన్నారు. 8 శాతం లోపునకు పొదుపురేటు పడిపోతే అది మానసికంగా మదుపుదారుపై ప్రభావం చూపుతుందని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో నిధుల సమీకరణ కష్టంగా మారుతుందని వివరించారు. రేటు కోత నిర్ణయానికి తమ బ్యాంకుకు మరికొన్ని రోజులు పడతాయని ఆయన అన్నారు. బంధన్ బ్యాంక్: ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడే నిర్ణయం ఇదని బంధన్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డెరైక్టర్ సీఎస్ ఘోష్ అన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా: కనీస రుణ రేటును పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.70 శాతానికి చేరింది. అక్టోబర్ 5 నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుంది. ఆర్బీఐ అస్త్రాలు రెపో: బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే- రెపో. ఒకరకంగా బ్యాంకులు నిర్ణయించే వడ్డీ రేట్లన్నిటికీ ఇదే మూలం. తాజా తగ్గింపుతో ఇది 6.75 శాతానికి చేరింది. రివర్స్ రెపో: బ్యాంకులు తమ వద్ద అదనంగా ఉండే నిధులను రిజర్వ్ బ్యాంక్ వద్ద స్వల్పకాలిక డిపాజిట్లు చేస్తాయి. వీటిపై ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేటే రివర్స్ రెపో. ప్రస్తుతం ఇది 5.75 శాతంగా ఉంది. సీఆర్ఆర్: క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే బ్యాంకులు తమ దగ్గరున్న మొత్తం డిపాజిట్లలో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా ఆర్బీఐ వద్ద ఉంచాల్సి ఉంటుంది. ఇదే సీఆర్ఆర్. దీనిపై ఎటువంటి వడ్డీరాదు. ప్రస్తుతం ఇది 4 శాతంగా ఉంది. ఎస్ఎల్ఆర్: స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ఆర్బీఐ నిర్దేశించే పత్రాల్లో బ్యాంకులు తప్పనిసరిగా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వ్యవస్థలో ద్రవ్య లభ్యత(లిక్విడిటీ), డిమాండ్, ధరల కట్టడి వంటి అంశాలను నియంత్రించడానికి ఆర్బీఐ ఈ ఇన్స్ట్రమెంట్లను వినియోగించుకుంటుంది. ప్రస్తుతం ఇది 21.5%గా ఉంది. పరిశ్రమలు ఖుషీ వృద్ధికి ఊతమిచ్చే దిశగా ఆర్బీఐ తగ్గించిన వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని ఇక బ్యాంకులు.. కస్టమర్లకు బదలాయించాలని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. తద్వారా డిమాండ్ పునరుద్ధరణకు, మళ్లీ పెట్టుబడుల రాకకు తోడ్పాటునివ్వాలని సూచించాయి. ఆర్థిక కార్యకలాపాలు మందగించడాన్ని ఎట్టకేలకు గుర్తించిన ఆర్బీఐ తగు నిర్ణయం తీసుకుని వడ్డీ రేట్ల దిశపై నెలకొన్న సందిగ్ధానికి తెర దించిందని సీఐఐ డెరైక్టర్ జన రల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. ఇది కార్పొరేట్లకు సానుకూలమని పేర్కొన్నారు. రేట్ల తగ్గింపుతో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆశ్చర్యపర్చారని, దీపావళి బోనస్ ఇచ్చారని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ వ్యాఖ్యానించారు. ఎకానమీకి మంచిది.. పండుగల సీజన్ నేపథ్యంలో రేట్ల తగ్గింపు నిర్ణయం సరైన సమయంలో వచ్చినట్లయిం ది. ఇది ఎకానమీకి మేలు చేస్తుంది. రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ మొదలైన వాటి కొనుగోళ్లు పెరగగలవు. దేశ ఆర్థిక వృద్ధికి కూడా ఇది మంచిది. - ఆది గోద్రెజ్, చైర్మన్, గోద్రెజ్ గ్రూప్ డిమాండ్ మెరుగవుతుంది.. ఈ ప్రయోజనాలను బ్యాంకులు .. ఇక ఖాతాదారులకు మళ్లించాలి. దీనివల్ల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గి వివిధ రంగాల్లో డిమాండ్ మెరుగుపడుతుంది. దేశీ కార్పొరేట్లు.. విదేశీ మార్కెట్లలో రూపాయి ఆధారిత బాండ్ల జారీకి అనుమతినివ్వడం కూడా సానుకూల నిర్ణయమే. - హర్షపతి సింఘానియా, వైస్ చైర్మన్, జేకే పేపర్ వృద్ధికి ఊతమిస్తుంది.. ఆర్థిక వృద్ధికి, పెట్టుబడుల రాకకు, భారీ యంత్రాల తయారీ రంగానికి అవసరమైన తోడ్పాటు లభించగలదు. రుణాలపై వడ్డీ రేట్లు కీలకంగా ఉండే పునరుత్పాదక విద్యుత్ రంగానికీ ఇది సానుకూలమే. - తుల్సి తంతి, చైర్మన్, సుజ్లాన్ గ్రూప్ ఎవరిపై.. ఏమిటి ప్రభావం... రిజర్వ్ బ్యాంక్ ఎట్టకేలకు ఏకంగా అర శాతం మేర పాలసీ రేట్లు తగ్గించింది. ఇది ఆర్థిక వ్యవస్థకి ఊతమిస్తుందని, పెట్టుబడుల రాకకు తోడ్పడుతుందని.. విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ రేట్ల కోత వల్ల వివిధ వర్గాలపై ప్రభావాలేమిటంటే .. రుణగ్రహీతలకు... బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తే.. గృహ రుణాలు, వాహన రుణాలు, పర్సనల్ లోన్స్ మొదలైన రుణాలన్నీ కూడా మరింత చౌకగా మారతాయి. తదనుగుణంగా కొనుగోళ్ల కార్యకలాపాలూ పెరిగి, ఆయా రంగాల్లో డిమాండ్ మెరుగుపడుతుంది. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఉపయోగపడగలదు. ఆర్థిక వ్యవస్థ... వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో పాటు రుణాలపై వడ్డీ రేట్లూ ఎక్కువగా ఉన్నందునే తాము పెట్టుబడులు పెట్టలేకపోతున్నామంటూ కంపెనీలు చెబుతూ వస్తున్నాయి. అధిక వడ్డీకి రుణాలు తీసుకుని ఇన్వెస్ట్ చేసినా ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయి నష్టపోవాల్సి వస్తుందన్నది వాటి వాదన. ఇప్పుడు ఆర్బీఐ రేట్లు తగ్గించిన నేపథ్యంలో ఇక ప్రభుత్వం కూడా తన వంతు విధాన నిర్ణయాలు తీసుకుంటే పెట్టుబడులు మళ్లీ రాగలవు.. ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడగలదు. కరెన్సీపై... అధిక వడ్డీ రేటు ఉంటే అధిక రాబడులు వస్తాయన్న ఆశతోనే పెట్టుబడులు వస్తాయి. ఫలితంగా కరెన్సీ మారకం విలువా పెరుగుతుంది. రేట్లు తగ్గితే ప్రయోజనాలూ తగ్గుతాయి కనుక.. ఇన్వెస్ట్మెంట్ల రాక తగ్గి, వచ్చిన పెట్టుబడుల్లో కొన్ని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయే అవకాశం ఉంది. ఫలితంగా కరెన్సీ విలువా తగ్గుతుంది. ఇక అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ గానీ వడ్డీ రేట్లు పెంచిందంటే.. ఇక్కడికి వచ్చిన విదేశీ నిధులు వెనక్కి వెళ్లిపోవచ్చు. పొదుపు ఆర్బీఐ పాలసీ రేట్లు ఎప్పుడు తగ్గించినా.. బ్యాంకులు ముందుగా డిపాజిట్ రేట్లు తగ్గించేస్తుంటాయి. రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాల్సి వచ్చినప్పుడు.. అధిక వడ్డీ ఇచ్చి డిపాజిట్లు సమీకరించేందుకు అవి ఇష్టపడవు. కనుక, తాజా పరిణామంతో సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కావొచ్చు.. ఫిక్సిడ్ డిపాజిట్లు కావొచ్చు... వీటిపై వడ్డీ రేటు తగ్గుతుంది. ఈక్విటీ మార్కెట్లు.. స్టాక్ మార్కెట్లకు అనేక రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి. ముందుగా వడ్డీ రేట్లు తగ్గడం వల్ల కంపెనీలకు రుణాలపై ఆర్థిక భారం కొంత తగ్గి, ఆ మేరకు ఆదాయాలు మెరుగుపడతాయి. వడ్డీ భారం తగ్గుతుంది కనుక లాభాలు, వేల్యుయేషన్లూ పెరుగుతాయి. ఇక డెట్ సాధనాలపై వచ్చే రాబడులు తగ్గిపోతాయి కనుక .. ఆ నిధులు కొంత అధిక రాబడుల ఆశతో స్టాక్ మార్కెట్లలోకి రాగలవు. -
ధరలు పెరుగుతూనే ఉంటాయి.. ఏం చేద్దాం?
ఐదేళ్ల కిందట ఇంజనీరింగ్ చదవటానికి రెండు లక్షలైతే... ఇపుడు ఆరు లక్షలవుతోంది. మరి మరో పదేళ్ల తరవాతో..? చదువే కాదు. పెళ్లి, ఇల్లు, కారు... దేన్ని తీసుకున్నాళ్లు గడిచేకొద్దీ ఖర్చు పెరిగిపోతూనే ఉంటుంది. కారణమేంటంటే... రూపాయి బలహీనపడటం, ధరలు పెరగటం. మరో మాటలో చెప్పాలంటే ద్రవ్యోల్బణం. ఈ ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవాలంటే... పొదుపు చేసేటపుడైనా, పెట్టుబడులు పెట్టేటపుడైనా ఇలా ఏది చేసినా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని కూడా లెక్కగట్టాలి. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న మేరకు ద్రవ్యోల్బణం వచ్చే పదేళ్లలో 5 నుంచి 10 శాతం వరకూ ఉంటుందని భావించవచ్చు. దీన్ని లెక్కగడుతూ భవిష్యత్ అవసరాలను అంచనా వేయటమెలాగో... అందుకు తగ్గ సాధనాలేమిటో చూద్దాం. ఈక్విటీ-డెట్ ఇన్వెస్ట్మెంట్స్: దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ పొందడానికి ఈక్విటీ పెట్టుబడులు మంచివే. ఇందుకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానం (సిప్) ఉత్తమం. దీనికి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులే బెటర్. అయితే మొత్తం సొమ్ము ఈక్విటీల్లోనే పెట్టడం సరికాదు. ఎందుకంటే ఈక్విటీల్లో కొన్ని సందర్భాల్లో రాబడి మాట దేవుడెరుగు... అసలు దక్కని పరిస్థితి ఉంటుంది. రిస్క్-రాబడిని సమతౌల్యంలో ఉంచుకోడానికి డెట్ ఇన్స్ట్రుమెంట్లలో కూడా పెట్టుబడులు పెట్టడం సముచిత నిర్ణయం. ఎప్పటికప్పుడు పరిశీలన: ఏదో ఒక సాధనంలో పెట్టుబడులు పెట్టేసి, ఇక పర్వాలేదనుకుంటూ ఇక దాని గురించి పట్టించుకోకపోవడం ఎంతమాత్రం మంచిది కాదు. ద్రవ్యోల్బణం కదలికలు, ఒకవేళ మీరు ఊహించినదానికన్నా ఈ ద్రవ్యోల్బణం రేటు ఎక్కువగా ఉంటే... లక్ష్యానికి అనుగుణంగా డబ్బు సమకూరడానికి ఇతర పెట్టుబడుల మార్గాలను అన్వేషిస్తుండాలి. ద్రవ్యోల్బణానికి తగినట్లుగా ప్రభుత్వాలు, సంస్థలు ప్రకటించే పథకాలపై దృష్టి పెట్టాలి. అంటే మీ పెట్టుబడులు-ద్రవ్యోల్బణం- లక్ష్యాలను ఎప్పటికప్పుడు మదింపు చేసుకుంటుండాలన్నమాట. బీమాతో ధీమా: జీవితంలో బీమా ధీమా అవసరం. ఇది ఒక కుటుంబ ఆర్థిక ప్రణాళికలు గాడితప్పకుండా కాపాడుతుంది. మీ కుటుంబ లక్ష్యాలకు అనుగుణంగా- తగిన ఆరోగ్య, జీవిత బీమా పాలసీలు ఎంతో మంచివి. ద్రవ్యోల్బణం బారినుంచి రక్షించుకోడానికి తగిన ఆయుధంగా బీమా కవర్ ఉండాలి. దురదృష్ట వశాత్తూ మీరు లేకపోయినా మీ కుటుంబం అనుకున్న లక్ష్యాన్ని సాధించే స్థాయిలో బీమా కవరేజీ ఉండాలి. రిటైర్మెంట్ ప్లాన్: కుటుంబ బాధ్యతలకు సంబంధించి ప్రణాళికలు సరే. పదవీ విరమణ తరువాత సైతం ఖర్చులకు సాధ్యమైనంత తొందరగానే పొదుపు, పెట్టుబడి ప్రణాళికలు రూపొందించుకుని నిధులు సమకూర్చుకోవడం మంచిది. ముందుగానే తగిన ప్రణాళిక ద్వారా ఇక్కడా ధరల సమస్యనుంచి తప్పించుకోవచ్చు. ఉద్యోగం వచ్చిన నాటి నుంచే రిటైర్మెంట్ లక్ష్యంగా కొంత డబ్బు పెట్టుబడుల్లోకి మళ్లించాలి. -
వృద్ధి 7.4-7.6 శాతం ఉండొచ్చు
రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా న్యూఢిల్లీ : భారత్ ఈ ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతం నుంచి 7.6 శాతం వృద్ధిని సాధించగలదని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. అంచనాలను మించిన వర్షాల కారణంగా భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని, ఫలితంగా భారత్ ఈ స్థాయి వృద్ధి సాధిస్తుందని ఇక్రా తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం నుంచి గ్రామీణ ఆర్థికవ్యవస్థ పుంజుకుంటుందని, గ్రామీణ వినియోగం, సెంటిమెంట్లు మెరుగుపడతాయని పేర్కొంది. మద్దతు ధరల్లో స్వల్ప పెరుగుదల కారణంగా ఆహార ద్రవ్యోల్బణం నియత్రణలోనే ఉండొచ్చని వివరించింది. గ్రీస్ సంక్షోభం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచడం వంటి అంశాల కారణంగా విదేశీ మారక ద్రవ్య రేట్లపై ప్రభావం ఉంటుందని పేర్కొంది. -
ఈ ఏడాది మరింత బాగుంటుంది
ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య ముంబై : ఆర్థిక వ్యవస్థలో ఒక మోస్తరు రికవరీ ఇప్పటికే కనిపిస్తున్నందున క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరింత మెరుగ్గా ఉండగలదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతి భట్టాచార్య ధీమా వ్యక్తం చేశారు. పారిశ్రామికోత్పత్తి క్రమంగా ఊపందుకుంటూ ఉండటంతో పాటు సంస్కరణలకు అనుకూల విధానాలు.. ఆశించిన ఫలితాలను సాధించేందుకు తోడ్పాటు అందించగలవని గురువారం సంస్థ షేర్హోల్డర్లకు ఆమె తెలిపారు. అటు ద్రవ్యోల్బణపరమైన ఒత్తిళ్లు తగ్గుతున్నందున దేశీయంగా డిమాండ్‌ను పెంచేందుకు మరింత ఉద్దీపన లభించే అవకాశాలు ఉన్నట్లు భట్టాచార్య పేర్కొన్నారు. జూన్‌లో వర్షాలు తగినంత స్థాయిలో ఉన్నందున వర్షాభావ పరిస్థితులపై ఆందోళనలు తగ్గొచ్చన్నారు. ఇక రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలు రికవర్ అవుతున్నందున ఎగుమతులు పెరగడం, దేశీయంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పెట్టుబడులకు అనువైన పరిస్థితులు ఏర్పడటం వంటివి అధిక వృద్ధికి దోహదపడే సానుకూల అంశాలని ఆమె చెప్పారు. 2013 అక్టోబర్‌లో ఎస్బీఐ చైర్మన్‌గా తాను బాధ్యతలు చేపట్టినప్పుడు.. మొండిబకాయిలు తగ్గించడం, రిస్కు మేనేజ్మెంట్, వ్యయాల నియంత్రణ, మెరుగైన ప్రమాణాలు నెలకొల్పడం, అధిక వడ్డీయేతర ఆదాయ ఆర్జన, సమర్ధంగా టెక్నాలజీని వినియోగించుకోవడం అనే ఆరు లక్ష్యాలను నిర్దేశించుకోగా.. గణనీయమైన పురోగతే సాధించగలిగామన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో నికర మొండిబకాయిలు (ఎన్పీఏ) రూ. 3,505 కోట్ల మేర తగ్గి రూ. 27,591 కోట్లకు పరిమితమయ్యాయని భట్టాచార్య వివరించారు. ఎన్పీఏల నుంచి రికవరీలు 32.33 శాతం మేర పెరిగాయని ఆమె తెలిపారు. -
మొండిబకాయిలతోనే ముప్పు!
ముంబై : స్థూలంగా చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగానే ఉన్నాయని.. ఎలాంటి అనిశ్చితులనైనా ఎదుర్కొనే సామర్థ్యం ఉందని... కానీ బ్యాంకుల మొండిబకాయిలు(ఎన్పీఏ) అంతకంతకూ పెరుగుతుండటం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) పేర్కొంది. పెరుగుతున్న ఎన్పీఏలు ఇటు ప్రభుత్వం, అటు నియంత్రణ సంస్థలకు కూడా సవాలుగా పరిణమిస్తున్నాయని తెలియజేసింది. గురువారం విడుదల చేసిన అర్ధ వార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదిక(ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్)లో ఆర్బీఐ ఈ అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. ‘వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్), ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక అంశాలను చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలోనే ఉంది. రానున్న రోజుల్లో మరింత పుంజుకునే అవకాశం ఉంది. అయితే, వ్యాపార విశ్వాసం పెరుగుతున్న సంకేతాలు మాత్రం అంతగా కనిపించటం లేదు. ఇది ఆందోళనకరం. మరోపక్క, బ్యాంకింగ్ వ్యవస్థ స్థూల ఎన్పీఏలు ఈ ఏడాది మార్చి నాటికి 4.6 శాతానికి ఎగబాకాయి. గతేడాది సెప్టెంబర్ చివరికి ఇవి 4.5 శాతంగా ఉన్నాయి. పునర్వ్యవస్థీకరించిన రుణాలతో కలిపితే మొత్తం మొండిబకాయిలు 10.7 శాతం నుంచి 11.1 శాతానికి ఎగబాకాయి’ అని ఆర్బీఐ వివరించింది. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలోని ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉప సంఘం ఈ నివేదికను రూపొందించింది. కమిటీలో సెబీ, ఐఆర్డీఏ, ఎఫ్ఎంసీ, పీఎఫ్ఆర్డీఏ వంటి ఇతర నియంత్రణ సంస్థలకు చెందిన చీఫ్‌లతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు, ఆర్థిక శాఖ కార్యదర్శి కూడా సభ్యులు. మరింత పెరిగే ప్రమాదం... కాగా, ఎన్పీఏల పెరుగుదలకు అడ్డుకట్టపడే పరిస్థితులు ఇంకా రాలేదని (బాటమ్డ్ అవుట్) ఆర్బీఐ హెచ్చరించింది. మరికొన్ని త్రైమాసికాల పాటు అధిక మొండిబకాయిల భారం కొనసాగే అవకాశముందని.. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడవచ్చని కూడా తేల్చిచెప్పింది. ఇక రంగాల వారీగా చూస్తే.. మైనింగ్, ఇనుము-ఉక్కు, టెక్స్టైల్స్, ఇన్ఫ్రా, విమానయానాల్లో అత్యధికంగా మొండిబకాయిలు పేరుకుపోతున్నాయి. మొత్తం ఎన్‌పీఏల్లో ఈ రంగాల వాటాయే 17.9 శాతంగా ఉంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికానికి స్థూల ఎన్పీఏలు 4.8 శాతానికి ఎగబాకి.. 2016 మార్చి క్వార్టర్‌కు 4.7 శాతానికి చేరే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది. అయితే, స్థూల ఆర్థిక పరిస్థితులు దిగజారితే గనక ఈ ఎన్పీఏలు మార్చినాటికి 5.9 శాతానికి ఎగబాకే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఇక ప్రైవేటు రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. పీఎస్‌యూ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు మార్చి నాటికి 5.7 శాతానికి ఎగసే అవకాశం ఉందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. నివేదికలో ఇతర అంశాలివీ... ► ఈ ఏడాది తొలి 6 నెలల్లో కీలకమైన రెపో రేటును ముప్పావు శాతం తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు సానుకూల ప్రయోజనాన్ని ఆర్బీఐ అందించింది. ► అయితే, రుతుపవన వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండొచ్చన్న అంచనాలు.. ఆహార, తయారీ రంగ ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ► ఇక స్టాక్ మార్కెట్ల విషయానికొస్తే.. ఆల్గోరిథమ్ ట్రేడింగ్ శరవేగంగా పెరుగుతుండటం ఆందోళనకరం. దీనిపై చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. ► వ్యవసాయ రంగంలో బీమా అవసరాలపై తక్షణం దృష్టిసారించాలి. ‘భవిష్యత్తులో అంతర్జాతీయంగా ఎలాంటి ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తలెత్తినా దీటుగా ఎదుర్కొనే సత్తా మనకుంది. గత రెండేళ్లుగా స్థూల ఆర్థిక మూలాలు కూడా బాగానే మెరుగుపడ్డాయి. అయితే, అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు తమ ప్యాకేజీల ఉపసంహరణ, ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ రానున్న కాలంలో వడ్డీరేట్ల పెంపును మొదలెడితే గ్లోబల్ మార్కెట్లు కొంత కుదుపునకు గురికావచ్చు. దేశీయంగా విధానపరమైన చర్యల కారణంగా దీన్ని కూడా మనం సమర్థంగానే ఎదుర్కోగలం’. - ఎఫ్ఎస్ఆర్ ముందుమాటలో ఆర్బీఐ గవర్నర్ రాజన్ -
సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా..
* నేటి నుంచి ‘బ్రిక్స్’ సదస్సు.. బ్రెజిల్‌కు చేరుకున్న మోడీ * ప్రపంచస్థాయి సదస్సులో తొలిసారిగా పాల్గొననున్న ప్రధాని ఫోర్టాలెజా(బ్రెజిల్): ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భాగమైన ఐదు దేశాల కూటమి ‘బ్రిక్స్’ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం బ్రెజిల్‌లోని ఫోర్టాలెజా నగరానికి చేరుకున్నారు. ‘బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా’లతో కూడిన ఈ కూటమి ఆరో సమావేశాలు మంగళ, బుధవారాల్లో జరుగుతున్నాయి. ‘సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి’ ఎజెండాతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో ప్రత్యేక అభివృద్ధి బ్యాంకు, ఆగంతుక నిధి ఏర్పాటు, ఐక్యరాజ్యసమితితో పాటు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో సంస్కరణలపై చర్చించనున్నారు. తొలుత ఢిల్లీ నుంచి బయలుదేరిన మోడీ.. ఆదివారం రాత్రి జర్మనీలోని బెర్లిన్‌కు వెళ్లారు. అక్కడి నుంచి సోమవారం బ్రెజిల్లో సదస్సు నిర్వహిస్తున్న ఫోర్టాలెజా పట్టణానికి చేరుకున్నారు. అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుపైనే.. ఈ సారి ‘బ్రిక్’ సమావేశాల్లో ముఖ్యంగా రూ. 6 లక్షల కోట్లతో ‘బ్రిక్స్’ అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు, ఆగంతుక నిధి ఏర్పాటుపై చర్చలు జరుగనున్నాయి. వీటి ఏర్పాటుకు సంబంధించి సభ్య దేశాల్లో ఎవరెవరు ఎన్ని నిధులు ఇవ్వాలనే అంశంపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ఇవ్వాలా? ఐదు దేశాలూ సమానంగా కేటాయించాలా? అన్నదానిపై ఇంతకు ముందటి భేటీలో చర్చించినా నిర్ణయానికి రాలేదు. భారత్ మాత్రం అన్ని దేశాలూ సమానంగా నిధులను ఇవ్వాలంటోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి తదితర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలను చేపట్టాలనే డిమాండ్‌తోనూ ‘బ్రిక్స్’ సమావేశాల్లో చర్చించనున్నారు. ప్రపంచ స్థాయి నేతలతో తొలిసారిగా.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం.. నరేంద్ర మోడీకి ఎక్కువ మంది ప్రపంచస్థాయి నేతలతో భేటీ అయ్యే అవకాశం ఈ సదస్సు ద్వారా లభిస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ జుమా, బ్రెజిల్ అధినేత దిల్మా రోస్సెఫ్‌లతో మోడీ సమావేశం అవుతారు. అనంతరం బ్రెజిల్ రాజధాని బ్రసిలియాలో పలు లాటిన్ అమెరికా దేశాల అధినేతలతో భేటీ కానున్నారు. -
చేదు మాత్రలు తప్పవు
రాబోయే రెండేళ్లు కఠిన నిర్ణయాలు అవసరం: మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను గత యూపీఏ సర్కారు అధఃపాతాళానికి దిగజార్చింది రాష్ట్రాల ప్రగతితోనే దేశ సుసంపన్నత..కేంద్ర, రాష్ట్రాలు జట్టుగా పనిచేయాలి పణజిలో బీజేపీ కార్యకర్తల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యలు త్వరలో ‘సాగరమాల’కు రూపకల్పన పణజి: రోగగ్రస్తమైన దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలంటే రాబోయే రెండేళ్లలో.. చేదు మాత్రలతో కఠిన నిర్ణయాలు తప్పవని.. ఇవి కొన్ని వర్గాల వారికి మింగుడుపడక పోవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ విషయంలో గత యూపీఏ ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను శనివారం జాతికి అంకితం చేసిన కార్యక్రమం అనంతరం మూడు వేరువేరు కార్యక్రమాల్లో మోడీ పాల్గొన్నారు. మొదట పణజిలో బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తర్వాత ఓ స్టార్ హోటల్లో 150 మంది ప్రత్యేక ఆహ్వానితులైన పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. అనంతరం మాండవి నదిపై వంతెనకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మోడీ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. పణజిలో బీజేపీ కార్యకర్తల సదస్సులో.. ► యూపీఏ హయాంలో పదేళ్ల పాటు అసలు పాలనే లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యపరిస్థితి అధఃపాతాళానికి దిగజారింది. ఖజానా ఖాళీ అయిన పరిస్థితుల్లో దేశ పాలనాపగ్గాలు చేపట్టాను. ఇప్పుడిక దేశ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాల్సి ఉంది. ► ఆర్థిక క్రమశిక్షణను తీసుకురావటానికి.. రాబోయే ఒకటి, రెండు సంవత్సరాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ నిర్ణయాలు అందరికీ నచ్చకపోవచ్చు. దేశం నాకు ఇచ్చిన అపారమైన ప్రేమకు.. ఈ నిర్ణయాలు గండి కొట్టవచ్చని నాకు బాగా తెలుసు. కానీ.. ఈ చర్యల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని నా దేశ ప్రజలు గుర్తించినప్పుడు ఆ ప్రేమను నేను తిరిగి పొందుతాను. ► రాష్ట్రాల సుసంపన్నత దేశ ప్రగతిపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల కోసం, పథకాల కోసం గతంలో మాదిరిగా కేంద్రం వద్ద ప్రాధేయపడాల్సిన అవసరం ఇక లేదు. రాష్ట్రాలు, కేంద్రం ఒక జట్టుగా కలిసి పనిచేయాలి. భారత రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థ గురించి చెప్తోంది. అయితే.. మేం సహకార సమాఖ్య విధానం అనే కొత్త విధానాన్ని రూపొందించాం. పారిశ్రామికవేత్తలతో భేటీలో.. ► పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, నైపుణ్యాల అభివద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. నైపుణ్యం గల సిబ్బంది ప్రోత్సాహానికి అభివద్ధి చెందిన దేశాలు సైతం ప్రాధాన్యం ఇస్తున్నాయి. ► దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వయసున్న వారే. నైపుణ్యాల అభివద్ధికి ప్రోత్సాహమివ్వటం ద్వారా.. చదువుకున్న నిరుద్యోగులకు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ తగినన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ► ఆర్థికాభివద్ధికి తోడ్పాటునందించేందుకు, వ్యయం తగ్గించేందుకు పొదుపు చర్యలు చేపడుతాం. ఆర్థిక రంగ పునరుజ్జీవానికి భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తాం. ► 2022 సంవత్సరానికి దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తవుతాయి. అప్పటికల్లా దేశంలో ప్రతి ఒక్కరికీ నీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలతో కూడిన ఇళ్లను సమకూరుస్తాం. మాండవి నదిపై వంతెనకు శంకుస్థాపన కార్యక్రమంలో.. ► అన్ని తీరప్రాంత నగరాలు, పట్టణాలను రోడ్డు, రైలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలతో అనుసంధానించే ప్రతిష్టాత్మక ‘సాగర్మాల’ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తాం. దీనిద్వారా తీర నగరాల ప్రత్యేకత, ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుంది. నేడు భూటాన్‌కు ప్రధాని: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం భూటాన్ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు వారాల కిందట ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత మోడీ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇది. రెండ్రోజులపాటు సాగనున్న ఈ పర్యటనలో మోడీ వెంట విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్ ఉంటారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్‌చుక్, ప్రధాని షెరింగ్ తోబ్గేలతో మోడీ సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. భూటాన్ ఉభయ సభలను (జాతీయ అసెంబ్లీ, జాతీయ మండలి) ఉద్దేశించి ప్రసంగిస్తారు.