ఒక ట్రిలియన్‌ మేమిస్తాం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Comments On Economy With PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ఒక ట్రిలియన్‌ మేమిస్తాం: సీఎం రేవంత్‌

Published Tue, Jan 7 2025 4:31 AM | Last Updated on Tue, Jan 7 2025 4:31 AM

CM Revanth Reddy Comments On Economy With PM Narendra Modi

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు

భారత్‌ను ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు సహకరిస్తాం

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి 

రాష్ట్రంలో రైల్వేల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి 

ఏపీలోని బందరు పోర్టును డెడికేటెడ్‌ హైవే, రైల్వే లైన్‌తో అనుసంధానించాలి 

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా విజ్ఞప్తి 

రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి ఇవి తోడ్పడతాయన్న సీఎం 

టెర్మినల్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధానమంత్రి

సాక్షి, హైదరాబాద్‌: భారతదేశాన్ని 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చటంలో తెలంగాణ సహకారం గణనీయంగా ఉండనుందని, రాష్ట్రం నుంచే ఒక ట్రిలియన్‌ మేర తోడ్పాటు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారు. ఇది సాధించాలంటే తెలంగాణలో రైల్వేల విస్తరణ చాలా అవసరమని అన్నారు. ఇందుకు కేంద్రం సహకరించి ప్రధాని మోదీ కలలుగంటున్న ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు బాటలు వేయాలని కోరారు. 

హైదరాబాద్‌ నగర శివారు చర్లపల్లిలో కొత్తగా నిర్మించిన రైల్వే టెర్మినల్‌ను సోమవారం మ«ధ్యాహ్నం ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి కూడా వర్చువల్‌గా హాజరై రాష్ట్రంలో రైల్వే, మెట్రో రైల్‌కు సంబంధించిన డిమాండ్లను ప్రధానమంత్రి ముందుంచారు.  

బందరు పోర్టుతో అనుసంధానంతో..
‘తెలంగాణకు సముద్ర తీరం లేనందున హైదరాబాద్‌కు చేరువలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని బందరు పోర్టుతో అనుసంధానం కావాల్సి ఉంది. కాబట్టి రాష్ట్రం నుంచి ఆ పోర్టుకు వేగంగా, నేరుగా చేరుకునేలా డెడికేటెడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, డెడికేటెడ్‌ రైల్వే లైన్‌ ఏర్పాటు చేయాలి. అవి ఏర్పడితే మేము డ్రైపోర్టులు ఏర్పాటు చేసుకుంటాం. 

తద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతికి అవకాశం ఏర్పడుతుంది. దేశ బల్క్‌ డ్రగ్స్‌ ఉత్పత్తిలో 35 శాతం వాటాతో తెలంగాణ ముందంజలో ఉంది. ఆ ఉత్పత్తుల ఎగుమతికి, అవి వేగంగా పోర్టుకు చేరడానికి డెడికేటెడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, డెడికేటెడ్‌ రైల్వే లైన్‌ దోహద పడతాయి. ఆటోమొబైల్‌ పరిశ్రమ, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పరిశ్రమ స్థానికంగా ఎదిగేందుకు కూడా ఇవి తోడ్పడతాయి. 

రీజినల్‌ రింగ్‌ రైలు పనులు చేపట్టండి 
ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి గాను తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు దక్షిణ కొరియా సిద్ధంగా ఉంది. రీజినల్‌ రింగు రోడ్డులో 170 కి.మీ భాగానికి ఇటీవలే కేంద్రం టెండర్లు పిలిచింది. మిగతా భాగాన్ని కూడా చేపట్టడంతో పాటు, రింగు రోడ్డు వెంట రీజినల్‌ రింగ్‌ రైల్‌ పనులు కూడా చేపట్టాలి. కేంద్రం వద్ద పెండింగులో ఉన్న హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు వెంటనే అనుమతినిచ్చి పనులు జరిగేలా సహకరించాలి. 

తెలంగాణను కర్ణాటకతో అనుసంధానించే వికారాబాద్‌–కృష్ణా రైల్వే లైన్‌ పనులకు కూడా అనుమతి మంజూరు చేస్తే, అది ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కాజీపేట ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ మంజూరైన నేపథ్యంలో దాన్ని వేగంగా పూర్తి చేసి ప్రారంభించాలి..’ అని సీఎం రేవంత్‌ కోరారు. 

దక్షిణ మధ్య రైల్వేకు భారీగా నిధులు: గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ 
పదేళ్ల క్రితం 2014లో దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బడ్జెట్‌లో రూ.251 కోట్లు మాత్రమే దక్కాయని, అదే గతేడాది రూ.5,333 కోట్లు కేటాయించారని, రైల్వేల పురోగతిలో వస్తున్న గణనీయ మార్పునకు ఇది నిదర్శనమని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌ ఉన్న దేశాల్లో ఒకటైన భారతీయ రైల్వే ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. 

తెలంగాణకు అన్ని విధాలా సహకారం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 
తెలంగాణకు అన్ని విధాలా సహకరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి దాదాపు రూ.1.20 లక్షల కోట్లను కేంద్రం ఖర్చు చేసిందని, మరో రూ.80 వేల కోట్లతో పనులు చేపట్టనుందని వెల్లడించారు. 

పదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 346 కి.మీ మేర రైల్వే లైన్లను అందుబాటులోకి తెచ్చిందని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకున్నా, సొంత నిధులతో రైల్వే శాఖనే ఎంఎంటీఎస్‌ విస్తరణ పనులు చేపట్టిందని గుర్తుచేశారు. రీజినల్‌ రింగు రోడ్డు కోసం రూ.26 వేల కోట్లు వెచ్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.   

రైల్వేకు ఆధునిక రూపు: కేంద్రమంత్రి బండి సంజయ్‌ 
మెరుగైన వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారానే పురోగతి సాధ్యమని అమెరికా నిరూపించిందని, ఇప్పుడు ఆ మూడు రంగాలను ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్‌ చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్రంలో రైల్వేల అభివద్ధికి కేంద్రం రూ.32 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించి ఆధునిక రూపు తెచ్చిందని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.5 వేల కోట్లకు పైగా వెచ్చించిందని తెలిపారు.  

అప్రోచ్‌ రోడ్డుకు గ్రాంటు ఇవ్వండి: శ్రీధర్‌బాబు 
చర్లపల్లి రైల్వేస్టేషన్‌ భవిష్యత్తులో రద్దీగా, హైదరాబాద్‌కు ముఖ్య స్టేషన్‌గా మారనున్నందున విమానాశ్రయం అప్రోచ్‌ రోడ్డు తరహా అప్రోచ్‌ రోడ్డు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. దీనికి కేంద్రం ప్రభుత్వం తన వంతుగా గ్రాంటు మంజూరు చేసి సహకరించాలని కోరారు.  

ఆ బాధ్యత రాష్ట్రానిదే: కేంద్రమంత్రి 
కేంద్రం చర్లపల్లిలో అంతర్జాతీయ స్థాయి రైల్వే టెర్మినల్‌ను నిర్మించి రాష్ట్రానికి కానుకగా ఇచ్చిందని, దానికి అప్రోచ్‌ రోడ్డు నిర్మించే బాధ్యత మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న స్పష్టం చేశారు. దీనికి సీఎం ఆమోదం తెలిపేలా నచ్చజెప్పాలని సూచించారు. 

కర్ణాటకలో కూడా అప్రోచ్‌ రోడ్డు నిర్మాణ బాధ్యత రాష్ట్రానిదేనని సీఎం సిద్ధరామయ్యకు చెప్పామని సోమన్న వివరించారు. కాగా సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లను రూ.2 వేల కోట్లతో విమానాశ్రయాలో తరహాలో కేంద్రం అభివృద్ధి చేస్తున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement