railway terminal
-
చర్లపల్లి టెర్మినల్‌తో గణనీయ అభివృద్ధి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ స్టేషన్‌ను ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రాంతంలో గణనీయ అభివృద్ధి సాకారం కానుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. చర్లపల్లి స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, సౌరశక్తితో నడిచే కార్యకలాపాలతో సహా సుస్థిరమైన మౌలిక ఆధునిక సౌకర్యాలను సృష్టించడంలో ఇది ఒక ముందడుగు అని అన్నారు. ఈ కొత్త టెర్మినల్ సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడలలోని ప్రస్తుత స్టేషన్లపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు ప్రజలకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి ప్రాజెక్ట్‌లు ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంపొందించడమే కాకుండా, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా వ్యాపారాన్ని సులభతరం చేయడాన్ని ప్రోత్సహిస్తాయని మోదీ ఉద్ఘాటించారు. సమష్టిగా ఈ వృద్ధిని మరింతగా వేగవంతం చేసేందుకు తాను నిశ్చయించుకున్నానని ప్రధాని అన్నారు. చర్లపల్లి న్యూ టెర్మినల్ రైల్వే స్టేషన్‌తో పాటు జమ్మూ రైల్వే డివిజన్, ఈస్ట్‌కోస్ట్ రైల్వే రాయగడ రైల్వే డివిజన్ భవనానికి ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. తర్వాత మోదీ మాట్లాడారు. ‘‘జమ్మూకశ్మీర్, తెలంగాణ, ఒడిశాలో రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభంతో పర్యాటకం మరింత పెరుగుతుంది. ఈ ప్రాంతాల్లో సామాజిక–ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది’’ అని అన్నారు.త్వరలోనే తొలి బుల్లెట్ రైలు‘‘ఇవాళ ప్రజలు ఎక్కువదూరాలను తక్కువ సమయంలో పూర్తిచేయాలనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే మేం పనిచేస్తున్నాం. వందేభారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం చూశాక నాకెంతో సంతోషం కలిగింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. భారతదేశంలో మొదటి బుల్లెట్ రైలు పరుగులు తీసే రోజు కూడా ఎంతో దూరంలో లేదు. రాబోయే రోజుల్లో రైల్వేల ప్రయాణం ఓ గుర్తుండిపోయే మధురస్మృతిగా నిలిచిపోయేలా చేస్తాం. దేశంలో 2014లో 74 ఉన్న విమానాశ్రయాల సంఖ్య నేడు 150కి పైగా పెంచాం. 5 నగరాల నుంచి 21 నగరాలకు మెట్రో సేవలు విస్తరించాం. దేశం కలిసికట్టుగా, అంచెలంచెలుగా ముందుకు సాగుతోందనడానికి ఇలాంటి కార్యక్రమం ఒక నిదర్శనం’’ అని అన్నారు. -
ఒక ట్రిలియన్ మేమిస్తాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చటంలో తెలంగాణ సహకారం గణనీయంగా ఉండనుందని, రాష్ట్రం నుంచే ఒక ట్రిలియన్ మేర తోడ్పాటు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారు. ఇది సాధించాలంటే తెలంగాణలో రైల్వేల విస్తరణ చాలా అవసరమని అన్నారు. ఇందుకు కేంద్రం సహకరించి ప్రధాని మోదీ కలలుగంటున్న ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు బాటలు వేయాలని కోరారు. హైదరాబాద్ నగర శివారు చర్లపల్లిలో కొత్తగా నిర్మించిన రైల్వే టెర్మినల్‌ను సోమవారం మ«ధ్యాహ్నం ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి కూడా వర్చువల్‌గా హాజరై రాష్ట్రంలో రైల్వే, మెట్రో రైల్‌కు సంబంధించిన డిమాండ్లను ప్రధానమంత్రి ముందుంచారు. బందరు పోర్టుతో అనుసంధానంతో..‘తెలంగాణకు సముద్ర తీరం లేనందున హైదరాబాద్‌కు చేరువలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని బందరు పోర్టుతో అనుసంధానం కావాల్సి ఉంది. కాబట్టి రాష్ట్రం నుంచి ఆ పోర్టుకు వేగంగా, నేరుగా చేరుకునేలా డెడికేటెడ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే, డెడికేటెడ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి. అవి ఏర్పడితే మేము డ్రైపోర్టులు ఏర్పాటు చేసుకుంటాం. తద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతికి అవకాశం ఏర్పడుతుంది. దేశ బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 35 శాతం వాటాతో తెలంగాణ ముందంజలో ఉంది. ఆ ఉత్పత్తుల ఎగుమతికి, అవి వేగంగా పోర్టుకు చేరడానికి డెడికేటెడ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే, డెడికేటెడ్ రైల్వే లైన్ దోహద పడతాయి. ఆటోమొబైల్ పరిశ్రమ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమ స్థానికంగా ఎదిగేందుకు కూడా ఇవి తోడ్పడతాయి. రీజినల్ రింగ్ రైలు పనులు చేపట్టండి ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి గాను తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు దక్షిణ కొరియా సిద్ధంగా ఉంది. రీజినల్ రింగు రోడ్డులో 170 కి.మీ భాగానికి ఇటీవలే కేంద్రం టెండర్లు పిలిచింది. మిగతా భాగాన్ని కూడా చేపట్టడంతో పాటు, రింగు రోడ్డు వెంట రీజినల్ రింగ్ రైల్ పనులు కూడా చేపట్టాలి. కేంద్రం వద్ద పెండింగులో ఉన్న హైదరాబాద్ మెట్రో రెండో దశకు వెంటనే అనుమతినిచ్చి పనులు జరిగేలా సహకరించాలి. తెలంగాణను కర్ణాటకతో అనుసంధానించే వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ పనులకు కూడా అనుమతి మంజూరు చేస్తే, అది ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కాజీపేట ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ మంజూరైన నేపథ్యంలో దాన్ని వేగంగా పూర్తి చేసి ప్రారంభించాలి..’ అని సీఎం రేవంత్ కోరారు. దక్షిణ మధ్య రైల్వేకు భారీగా నిధులు: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పదేళ్ల క్రితం 2014లో దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బడ్జెట్లో రూ.251 కోట్లు మాత్రమే దక్కాయని, అదే గతేడాది రూ.5,333 కోట్లు కేటాయించారని, రైల్వేల పురోగతిలో వస్తున్న గణనీయ మార్పునకు ఇది నిదర్శనమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్న దేశాల్లో ఒకటైన భారతీయ రైల్వే ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. తెలంగాణకు అన్ని విధాలా సహకారం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణకు అన్ని విధాలా సహకరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి దాదాపు రూ.1.20 లక్షల కోట్లను కేంద్రం ఖర్చు చేసిందని, మరో రూ.80 వేల కోట్లతో పనులు చేపట్టనుందని వెల్లడించారు. పదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 346 కి.మీ మేర రైల్వే లైన్లను అందుబాటులోకి తెచ్చిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకున్నా, సొంత నిధులతో రైల్వే శాఖనే ఎంఎంటీఎస్ విస్తరణ పనులు చేపట్టిందని గుర్తుచేశారు. రీజినల్ రింగు రోడ్డు కోసం రూ.26 వేల కోట్లు వెచ్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. రైల్వేకు ఆధునిక రూపు: కేంద్రమంత్రి బండి సంజయ్ మెరుగైన వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారానే పురోగతి సాధ్యమని అమెరికా నిరూపించిందని, ఇప్పుడు ఆ మూడు రంగాలను ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్రంలో రైల్వేల అభివద్ధికి కేంద్రం రూ.32 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించి ఆధునిక రూపు తెచ్చిందని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.5 వేల కోట్లకు పైగా వెచ్చించిందని తెలిపారు. అప్రోచ్ రోడ్డుకు గ్రాంటు ఇవ్వండి: శ్రీధర్‌బాబు చర్లపల్లి రైల్వేస్టేషన్ భవిష్యత్తులో రద్దీగా, హైదరాబాద్‌కు ముఖ్య స్టేషన్‌గా మారనున్నందున విమానాశ్రయం అప్రోచ్ రోడ్డు తరహా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. దీనికి కేంద్రం ప్రభుత్వం తన వంతుగా గ్రాంటు మంజూరు చేసి సహకరించాలని కోరారు. ఆ బాధ్యత రాష్ట్రానిదే: కేంద్రమంత్రి కేంద్రం చర్లపల్లిలో అంతర్జాతీయ స్థాయి రైల్వే టెర్మినల్‌ను నిర్మించి రాష్ట్రానికి కానుకగా ఇచ్చిందని, దానికి అప్రోచ్ రోడ్డు నిర్మించే బాధ్యత మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న స్పష్టం చేశారు. దీనికి సీఎం ఆమోదం తెలిపేలా నచ్చజెప్పాలని సూచించారు. కర్ణాటకలో కూడా అప్రోచ్ రోడ్డు నిర్మాణ బాధ్యత రాష్ట్రానిదేనని సీఎం సిద్ధరామయ్యకు చెప్పామని సోమన్న వివరించారు. కాగా సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లను రూ.2 వేల కోట్లతో విమానాశ్రయాలో తరహాలో కేంద్రం అభివృద్ధి చేస్తున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు. -
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన పీఎం మోదీ
-
Watch Live: చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం
-
త్వరలో చర్లపల్లి టెర్మినల్ నుంచి 25 రైళ్లు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల అనంతరం చర్లపల్లి రైల్వే టెర్మినల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం కృష్ణా, గోల్కొండ, శాతవాహన, ఇంటర్సిటీ రైళ్లకు చర్లపల్లిలో హాల్టింగ్ సదుపాయం ఉంది. ఇది వినియోగంలోకి వచ్చిన తరువాత 25 రైళ్లను ఇక్కడి నుంచే నడిపించేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను సిద్ధం చేసింది. సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు కొనసాగుతున్న దృష్ట్యా కూడా ప్రస్తుతం ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను చర్లపల్లికి మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల అనంతరం చర్లపల్లి టెర్మినల్‌ను వినియోగంలోకి తేవాలని నిర్ణయించినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. రైల్వేశాఖ సుమారు రూ.430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే. అత్యాధునిక సదుపాయాలతో, ఆరులైన్లతో స్టేషన్‌ను విస్తరించారు. రైళ్లను శుభ్రం చేసేందుకు, నిలిపి ఉంచేందుకు వీలుగా పిట్లైన్లను ఏర్పాటు చేశారు. చర్లపల్లి టెర్మినల్ వినియోగంలోకి వస్తే పలు రైళ్లు సికింద్రాబాద్ వెళ్లకుండా ఇక్కడినుంచే నడుస్తాయి. ఇక్కడినుంచి ప్రతి రోజూ 60 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చని అధికారవర్గాలు చెపుతున్నాయి. చర్లపల్లి ప్రారంభమయ్యాక ఇకనుంచి ఈ రైళ్లు అక్కడినుంచే.. ► కాజీపేట్ నుంచి సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్ల మీదుగా వెళ్లే ముంబై–భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం–షిరిడీ వీక్లీ ఎక్స్‌ప్రెస్, కాకినాడ–షిరిడీ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను చర్లపల్లి టెర్మినల్ నుంచే నడిపించే అవకాశం ఉంది. ► అలాగే బీదర్ నుంచి మచిలీపట్నం వరకు నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ–లింగంపల్లి మధ్య నడిచే గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కాజీపేట – హడప్సర్ (పూణే) ట్రైవీక్లీ, లింగంపల్లి–కాకినాడ మధ్య నడిచే కోకనాడ ట్రైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, టాటానగర్ నుంచి యశ్వంత్‌పూర్ వరకు నడిచే వీక్లీఎక్స్‌ప్రెస్, షాలిమార్–హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్లను చర్లపల్లి నుంచే నడపనున్నారు. ► జమ్ముతావి–తిరుపతి మధ్య నడిచే హమ్‌సఫర్ వీక్లీ, గోరఖ్‌పూర్ నుంచి వచ్చే యశ్వంత్‌పూర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ఎక్స్ ప్రెస్, నిజాముద్దీన్ ఢిల్లీ– బెంగళూరు సిటీ మధ్య నడిచే రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లను కూడా చర్లపల్లి నుంచి నడిపించే ప్రతిపాదనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ► ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా నిర్మించిన మౌలాలి–సనత్‌నగర్ మార్గం ఇప్పటికే పూర్తయింది. ఈ రూట్లో ప్రస్తుతం గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ఈ రూట్లో నడిపించే అవకాశం ఉంది. దీంతో చర్లపల్లి మీదుగా ముంబై, ఢిల్లీ వైపు రాకపోకలు సాగించే రైళ్లు సికింద్రాబాద్‌కు వెళ్లకుండా చర్లపల్లి నుంచి మౌలాలి, సనత్‌నగర్, లింగంపల్లి మీదుగా నడుస్తాయి. సిటీ స్టేషన్లపై తగ్గనున్న ఒత్తిడి.. చర్లపల్లి టెర్మినల్ వినియోగంలోకి వస్తే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపైన ఒత్తిడి తగ్గనుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతి రోజూ 200 రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. 1.86 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ వినియోగంలో ఉన్న 10 ప్లాట్‌ఫామ్‌లపైన ఒత్తిడి పెరగడం వల్ల కొన్ని రైళ్లను నగర శివార్లలోనే నిలిపివేయవలసి వస్తోంది. దీంతో ఉదయం వేళల్లో స్టేషన్‌కు రావలసిన రైళ్లు సకాలంలో చేరుకోవడం లేదు. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు సిటీ శివార్లలోనే పడిగాపులు కాయవలసి వస్తోంది. చర్లపల్లి ప్రారంభమైతే సిగ్నల్ కోసం ఇలా ఎదురుచూడవలసిన అవసరం లేకుండా చర్లపల్లి నుంచే రాకపోకలు సాగించవచ్చు. అలాగే కాచిగూడ, నాంపల్లి స్టేషన్లపైన కూడా ఒత్తిడి తగ్గుతుందని చెపుతున్నారు. -
హైదరాబాదీలకు ఊరట.. నగరంలో మరో రైల్వే టర్మినల్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో రైల్వే టర్మినల్ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై పెరిగిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని గతంలో ప్రతిపాదించిన చర్లపల్లి రైల్వేస్టేషన్ విస్తరణ కోసం కేంద్రం ఈసారి రూ.70 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో తొలిదశ విస్తరణ పనులను చేపట్టనున్నారు. రానున్న రెండేళ్లలో చర్లపల్లి టర్మినల్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. తొలిదశలో వచ్చే రెండేళ్లలో పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసినట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌కు ఈసారి కేంద్ర బడ్జెట్లో కొత్త రైళ్లు, లైన్లు, ఇతరత్రా ప్రాజెక్టుల కోసం ఎలాంటి నిధులను కేటాయించలేదు. గతంలోనే ప్రతిపాదించిన చర్లపల్లికి మాత్రం ఈసారి నిధులను కేటాయించారు. ఎంఎంటీఎస్ రెండో దశ కోసం రూ.10 లక్షలు కేటాయించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ డెవలప్మెంట్ పనులను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు జీఎం తెలిపారు. భవిష్యత్తులో వందేభారత్ రైళ్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉంటుందని, ఇక్కడి నుంచి అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు ఈ రైళ్లు నడుస్తాయన్నారు. చర్లపల్లి విస్తరణ ఇలా.. ► మొదటి దశలో రూ.54.58 కోట్ల అంచనాలతో పనులు చేపట్టనున్నారు. రెండు సబ్‌వేలు, 3 ర్యాంప్‌లు, 6 చోట్ల మెట్ల మార్గాలను నిర్మిస్తారు. 5 చోట్ల బ్రిడ్జి పనులతో పాటు, 2 హైలెవల్ ఐలాండ్ ప్లాట్‌ఫామ్‌లను నిర్మించనున్నారు. ► ఇప్పుడున్న అన్ని ప్లాట్‌ఫామ్‌ల ఎత్తు, పొడవు పెంచుతారు. అన్ని ప్లాట్‌ఫామ్‌లకు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు, ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను నిర్మించనున్నారు. మురుగునీటి కాల్వలు, ఇతర పనులను పూర్తి చేస్తారు. (క్లిక్: ప్రతి ఆదివారం.. ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం) రెండో దశలో... ► సుమారు రూ.62.67 కోట్ల పనులను చేపట్టనున్న పనుల్లో భాగంగా చర్లపల్లి స్టేషన్ ప్రాంగణం విస్తరణ,సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ సబ్‌స్టేషన్, స్టేషన్ నిర్వహణ షెడ్, తదితర పనులు చేపడతారు. ► 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, 5 ఎస్కలేటర్లు, 9 లిఫ్టులు (వాటిలో 3 సబ్‌వేల కోసం, 6 ప్లాట్‌ఫామ్‌లపైన ఏర్పాటు చేస్తారు). కొత్తగా 4 పిట్లైన్లను నిర్మించనున్నారు. పార్శిల్ షెడ్, బయో టాయిలెట్, తదితర పనులు రెండో దశలో పూర్తి చేయనున్నారు. చర్లపల్లి స్టేషన్ విస్తరణ వల్ల ప్రతి రోజు కనీసం 100 రైళ్లను నిలిపేందుకు అవకాశం లభిస్తుంది. 50 వేల మందికి పైగా ప్రయాణికులకు ప్రయోజనం ఉంటుంది. (చదవండి: హైదరాబాద్ మెట్రోకు వైరస్ బ్రేక్) ఎంఎంటీఎస్‌కు నిధుల కొరత.. మరోవైపు రక్షణశాఖ పరిధిలో ఉన్న మౌలాలీ– సనత్‌నగర్ మార్గంలోని 5 కిలోమీటర్లు మినహాయించి ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తయిందని జనరల్ మేనేజర్ తెలిపారు. నిధుల కొరత వల్ల రైళ్ల కొనుగోళ్లు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రూ.129 కోట్లు మాత్రమే అందాయని, మరో రూ.760 కోట్లు రావాల్సి ఉందని అధికారులు వివరించారు. పెండింగ్ నిధుల కోసం ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నిధులు ఇస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లబోదన్నారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ పొడిగింపు కోసం దక్షిణమధ్య రైల్వే రూ.330 కోట్లతో ప్రణాళికలను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు నిధులు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు కూడా నిధుల కొరతే కారణమని అధికారులు స్పష్టం చేశారు. (క్లిక్: సికింద్రాబాద్ స్టేషన్‌కు.. ఎయిర్‌పోర్టు లుక్) -
దేశంలో ఫస్ట్ ఏసీ రైల్వే టర్మినల్
బెంగళూరు రైల్వే టెర్మినల్ ను దేశంలోనే తొలిసారిగా సెంట్రలైజ్డ్ ఎయిర్ కండీషనింగ్, తదితర అధునాతన సదుపాయాలతో నిర్మించారు. దీనికి ప్రఖ్యాత ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరును పెట్టారు. దేశంలోనే మొట్టమొదటి ఏసీ టర్మినల్ నిర్మాణానికి రూ.314 కోట్ల ఖర్చు అయ్యింది. ఈ నెలాఖరులో ప్రారంభించడానికి ఏసీ రైల్వే టర్మినల్ సర్వం సిద్ధమైంది. "భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరుతో బెంగళూరులో నిర్మించిన తొలి ఏసీ రైల్వే టర్మినల్ త్వరలో ప్రజలకు వినియోగంలోకి రానున్నదని" రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. Named after one of the foremost Civil Engineers Bharat Ratna Sir M Visvesvaraya, India's first centralised AC Railway terminal in Bengaluru is all set to become operational soon. pic.twitter.com/L2agyUevd1 — Piyush Goyal (@PiyushGoyal) March 13, 2021 బెంగళూరుతో అనుసంధానానికి మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో బయప్పనహల్లిలో న్యూ కోచ్ టర్మినల్ నిర్మాణానికి 2015-16లో ప్రణాళిక సిద్ధం చేశామని సౌత్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ చెప్పారు. భారతదేశంలో మొట్ట మొదటి ఈ సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్డ్ రైల్వే టెర్మినల్ ను బెంగళూరు విమానాశ్రయం తరహాలో నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజు 50 రైళ్లను నడపనున్నారు. 4,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టర్మినల్ రోజు 50 వేల మంది వరకు స్టేషన్‌ను సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. టెర్మినల్‌లోఏడు ప్లాట్‌ఫారమ్‌లు, 3 పిట్ లైన్లు ఉన్నాయి.ప్రయాణికుల సౌకర్యార్థం రెండు సబ్‌వేలు, ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్లు, వీఐపీ లాంజ్, ఫుడ్ కోర్టు, అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాలు, రియల్ టైం ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టం తదితర వసతులు కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. చదవండి: కొత్త ఏసీ కొనాలనుకునే వారికి షాక్! ఆన్లైన్ లో నకిలీ వస్తువులు అమ్మితే ఇక అంతే! -
చర్లపల్లిలో... చుక్ చుక్..
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి రైల్వే టెర్మినల్ విస్తరణ ప్రాజెక్టుకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలను రిమోట్ కంట్రోల్ లింక్ ద్వారా ప్రారంభించారు. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో ఎర్రగుంట్ల–నంద్యాల సెక్షన్లో విద్యుదీకరణకు శంకుస్థాపన చేశారు. గుంతకల్లు–కల్లూరు మధ్య పూర్తయిన రెండవ లైన్ మార్గం, విద్యుద్దీకరణను జాతికి అంకితం చేశారు. రూ.221 కోట్ల అంచనాలతో చేపట్టిన చర్లపల్లి టెర్మినల్ విస్తరణ వల్ల నిత్యం లక్ష మందికి రవాణా సదుపాయం లభించనుంది. రోజుకు 50 నుంచి 60 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించనున్న ప్రైవేట్ రైళ్ల రాకపోకలకు చర్లపల్లి కేంద్రం కానుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం ఉన్న 3 ప్లాట్‌ఫామ్‌లను 6 ప్లాట్‌ఫామ్‌ల వరకు విస్తరించనున్నారు. హైలెవల్ ఐలాండ్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేస్తారు. రైల్వేస్టేషన్ కొత్త భవనాన్ని నిర్మిస్తారు. స్టేషన్‌కు అప్రోచ్ రోడ్డు ఏర్పాటుతో పాటు స్టేషన్‌లోపల 9 లిఫ్టులను, 6 ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై పెరిగిన ఒత్తిడి, రద్దీని దృష్టిలో ఉంచుకొని 4వ టెర్మినల్‌గా చర్లపల్లి విస్తరణ చేపట్టారు. వచ్చే రెండేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టెర్మినల్‌తో పాటు మరో 4 ఫిట్లైన్లను ఏర్పాటు చేయనున్నారు. చర్లపల్లి టెర్మినల్ వల్ల శివారు ప్రాంతాలకు చెందిన ప్రజలు నగరంలోకి ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఔటర్ మీదుగా రాకపోకలు సాగించవచ్చు. ఘట్కేసర్ నుంచి యాదాద్రికి వెళ్లేందుకు నిర్మించనున్న ఎంఎంటీఎస్ కూడా చర్లపల్లి మీదుగానే వెళ్తుంది. సబర్బన్ రైల్ నెట్ వర్క్‌కు ఇది కేంద్రం కానుంది. పెరగనున్న వేగం గుంతకల్లు–కల్లూరు సెక్షన్లో రూ.322 కోట్ల అంచనాలతో చేపట్టిన 41 కిలోమీటర్ల రెండవ లైన్ మార్గం నిర్మాణం పూర్తయింది. విద్యుదీకరణ పనులను పూర్తి చేశారు. ఈ మార్గాన్ని మంత్రి జాతికి అంకితం చేశారు. దీనివల్ల ఢిల్లీ, ముంబై, సికింద్రాబాద్‌ల నుంచి బెంగళూర్ వైపు వెళ్లే మార్గానికి ఇది అనుసంధానమవుతుంది. ఈ మార్గంలో రైళ్ల వేగం గంటకు 100 కి.మీ. వరకు పెరగనుంది. ఎర్రగుంట్ల–నంద్యాల విద్యుదీకరణ ఎర్రగుంట్ల–నంద్యాల సెక్షన్లో రూ.112 కోట్ల అంచనాలతో చేపట్టనున్న 123 కి.మీ. మేర విద్యుదీకరణ పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. సరుకు రవాణాకు, ప్రయాణికుల రవాణా సదుపాయానికి ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీలోని కర్నూలు, కడప జిల్లాలకు రైల్వేసదుపాయం విస్తరించనుంది. మద్దూరు, బనగానపల్లె, కోయిలకుంట్ల, సంజమల, నొస్సం, ఎస్.ఉప్పలపాడు, జమ్మలమడుగు, పొద్దుటూరు రైల్వేస్టేషన్ల నుంచి రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ సెక్షన్‌ను దక్షిణమధ్య రైల్వే మొట్టమొదటి సౌరశక్తి వినియోగ సెక్షన్‌గా ప్రకటించింది. 427 స్టేషన్లలో ఉచిత హై స్పీడ్ వైఫై దక్షిణమధ్య రైల్వేలో ఉచిత హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని మొట్టమొదట 2016లో సికింద్రాబాద్ స్టేషన్లో ప్రారంభించారు. ఇప్పుడు ఈ స్టేషన్ వైఫై వినియోగంలో దేశంలోనే 4వ స్థానంలో ఉంది. రూ.65 కోట్లతో 427 స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై సౌకర్యాన్ని కొత్తగా ప్రారంభించారు. దీన్ని మంత్రి మంగళవారం సికింద్రాబాద్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతికి అంకితం చేశారు. ఆ రైళ్లు కేటాయించండి: లక్ష్మణ్ తెలంగాణకు తేజస్, హమ్‌సఫర్, అంత్యోదయ రైళ్లను కేటాయించాలని కోరుతూ పీయూష్ గోయల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వినతిపత్రం అందజేశారు. కాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన పీయూష్ గోయల్ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రం x రాష్ట్రం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, పీయూష్ గోయల్‌ల పరస్పర విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం, నిధుల కేటాయింపుల్లో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలను పూర్తిగా విస్మరించిం దని తలసాని ఆరోపించారు. బడ్జెట్లో దక్షిణ భారతదేశానికి అతి తక్కువ నిధులను కేటాయించిందన్నారు. అనంతరం పీయూష్ మాట్లాడుతూ.. కేంద్రానికి ఏ ఒక్క రాష్ట్రం పట్ల ప్రత్యేక అభిమానం ఉండబోదని.. అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు సమానమేనని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టుగా ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.450 కోట్లు ఇవ్వకపోవడం వల్లనే పనులు నిలిచిపోయినట్లు పీయూష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఎంపీలు బండి సంజయ్, సీఎం రమేష్, రఘురామ కృష్ణంరాజు, పి.రంగయ్య, ధర్మపురి అరవింద్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా, ఎన్వీఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
చర్లపల్లిలో రైల్వే టెర్మినల్
సాక్షి, హైదరాబాద్ : రైలు ప్రయాణికులకు మరింత ప్రయోజనకరంగా ఉండేందుకు, హైదరాబాద్‌లోని ప్రధాన రైల్వేస్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు శివార్లలోని చర్లపల్లిలో రైల్వే టెర్మినల్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. సుమారు 150 రైళ్ల రాకపోకలకు అనుగుణంగా ఆరు ప్లాట్‌ఫామ్‌లు, లైన్ల నిర్మాణంతోపాటు ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. ఈ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని, నాలుగేళ్లలోగా పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) వినోద్‌కుమార్ యాదవ్ వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రతిపాదనలు స్వీకరించేందుకు రైల్వే అధికారులు బుధవారం హైదరాబాద్‌లోని రైల్ నిలయంలో ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. పలువురు ఎంపీలు తమ ప్రతిపాదనలను రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న పలు ప్రాజెక్టులను గురించి జీఎం వివరించారు. చర్లపల్లి మెగా టెర్మినల్ పనులను రెండు, మూడు నెలల్లో ప్రారంభించి నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం రైల్వే పరిధిలో ఉన్న 50 ఎకరాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న 100 ఎకరాల విస్తీర్ణంలో టర్మినల్ చేపట్టనున్నామని, దీనికి సుమారు రూ.360 కోట్లు వ్యయమవుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో నాలుగోది.. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడలలో ప్రధాన రైల్వేస్టేషన్లు ఉన్నాయి. నగరానికి రాకపోకలు భారీగా పెరుగుతుండడంతో వీటిలో రద్దీ తార స్థాయికి చేరుకుంది. రోజూ సుమారు 401 రైళ్లు ఈ మూడు స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికులు, వారి కోసం వచ్చేవారు కలిపి.. నాలుగైదు లక్షల మంది రోజూ ఈ స్టేషన్లకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండడంతోపాటు, ప్రధాన స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు చర్లపల్లిలో మెగా టెర్మినల్ నిర్మాణాన్ని చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉండడంతో చర్లపల్లిలో రైల్వే టర్మినల్ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని దీనిని ఎంపిక చేశారు. మొదట ఆరు ప్లాట్ఫారాలతో ప్రారంభించి.. తరువాత 10 ప్లాట్‌ఫారాల వరకు విస్తరించనున్నారు. పూర్తిగా పర్యావరణహితంగా ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేస్తారు. ఢిల్లీ, విజయవాడ, విశాఖ, తిరుపతి, చెన్నై తదితర మార్గాల్లో రాకపోకలు సాగించే 150 రైళ్లను ఇక్కడి నుంచి నడిపేందుకు అవకాశం ఉంటుంది. అటు ముంబై వైపు నుంచి రైళ్ల ఒత్తిడిని తగ్గించేందుకు వట్టినాగులపల్లిలో మరో భారీ టర్మినల్ నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయని జీఎం వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. చర్లపల్లి పనులు ఒక దశకు చేరుకున్న తరువాత వట్టినాగులపల్లి టర్మినల్ నిర్మాణం కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. డిసెంబర్ నాటికి ఎంఎంటీఎస్ రెండో దశ ఎంఎంటీఎస్ రెండో దశ పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి.. పలు మార్గాల్లో రైళ్లను అందుబాటులోకి తేనున్నట్లు జీఎం వినోద్‌కుమార్ తెలిపారు. గత డిసెంబర్ నాటికే ఈ ప్రాజెక్టులో ఒకట్రెండు లైన్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. నిధుల కొరత కారణంగా వాయిదా పడిందని చెప్పారు. ఈ సారి ఎలాంటి జాప్యానికి తావు లేకుండా పూర్తి చేస్తామన్నారు. అలాగే అక్కన్నపేట–మెదక్, మనోహరాబాద్–కొత్తపల్లి, భద్రాచలం–కొత్తపల్లి, సికింద్రాబాద్–మహబూబ్‌నగర్, మంచిర్యాల–పెద్దపల్లి, కాజీపేట–బల్లార్షా తదితర రైల్వేలైన్లను వచ్చే రెండేళ్లలో పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఇక సికింద్రాబాద్ స్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు కొన్ని రైళ్లను లింగంపల్లి, వికారాబాద్ స్టేషన్ల వరకు పొడిగించనున్నట్లు వెల్లడించారు. ఆయా చోట్ల అవసరమైన అదనపు సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. పనుల తీరుపై నిలదీసిన ఎంపీలు రాష్ట్రంలో పలు రైల్వే పనులు జరుగుతున్న తీరుపై ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం రైల్వే జీఎంతో జరిగిన సమావేశంలో ఎంపీలు బండారు దత్తాత్రేయ, మల్లారెడ్డి, కొండా విశేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్య, ఎంపీ వినోద్, బాల్క సుమన్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, కె.కేశవరావు, రాపోలు ఆనందభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని ప్రాజెక్టుల పనులు దశాబ్దాలు గడిచినా ప్రారంభం కావడం లేదని ఈ సందర్భంగా మండిపడ్డారు. నల్లగొండ–మాచర్ల లైన్ కోసం 20 ఏళ్లుగా ప్రతిపాదనలు చేస్తున్నప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదని, ఇప్పుడా ప్రాజెక్టునే నిలిపేశారని గుత్తా ఆవేదన వ్యక్తం చేశారు. మణుగూరు–రామగుండం, ఆర్మూర్–ఆదిలాబాద్, పెద్దపల్లి–జగిత్యాల తదితర లైన్లను వేగంగా పూర్తి చేయాలని ఎంపీ వినోద్ కోరారు. స్టేషన్ ఘన్పూర్ నుంచి పాలకుర్తి మీదుగా సూర్యాపేట వరకు ప్రతిపాదించిన లైన్‌పై ఇప్పటికీ సర్వే పూర్తి చేయకపోవడం పట్ల రాపోలు ఆనందభాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్–ఢిల్లీ వంటి దూర ప్రాంత రైళ్లకు డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో అంతర్రాష్ట్ర సర్వీసులకు ప్రాధాన్యతనివ్వాలని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కోరారు. అన్ని ప్రధాన రైళ్లను భువనగిరి, జనగామలో ఆపేలా చర్యలు తీసుకోవాలని బూర నర్సయ్య కోరారు. పెద్దపల్లి, బెల్లంపల్లి, మంచిర్యాల, మందమర్రి తదితర స్టేషన్లను ఆధునీకరించాలని బాల్క సుమన్ విజ్ఞప్తి చేశారు. -
అద్భుతంగా చర్లపల్లి రైల్వే టర్మినల్
సాక్షి, సిటీబ్యూరో: చర్లపల్లిలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రైల్వే టర్మినల్ ప్రత్యేకతలివి. ఈ దిశగా దక్షిణమధ్య రైల్వే ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఇటీవల నగరంలో పర్యటించిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు గ్రీన్‌ఫీల్డ్ రైల్వే టర్మినళ్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి.. చర్లపల్లి, వట్టినాగులపల్లిలో ఈ తరహా టర్మినళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లిలో నాలుగో టర్మినల్ నిర్మించాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. రూ.360 కోట్ల అంచనా వ్యయంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించనున్న ఈ టర్మినల్ కోసం రైల్వే శాఖ ఇప్పటికే రూ.30 కోట్లు కేటాయించింది. తాజాగా రైల్వే మంత్రి ప్రకటన నేపథ్యంలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో ఈ పర్యావరణహిత టర్మినల్‌ను అంతర్జాతీయ హంగులతో నిర్మించేం దుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ► స్టేషన్ చుట్టూ గ్రీన్‌ఫీల్డ్ (పచ్చని పరిసరాలు) అభివృద్ధి చేస్తారు. కాలుష్యానికి తావులేకుండా ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తారు. బయో టాయిలెట్లు ఏర్పాటు చేస్తారు. ► స్టేషన్ అంతటా సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తారు. సోలార్ విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం. ► భూగర్భ జలాల పెంపు, వాననీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు నిర్మిస్తారు. వాటర్ రీసైక్లింగ్ యూనిట్లూ ఏర్పాటు చేస్తారు. ► కాగిత రహిత స్టేషన్‌గా అభివృద్ధి చేస్తారు. టికెట్ వివరాలు ప్రయాణికులకు ఎస్సెమ్మెస్ రూపంలో పంపిస్తారు. ► రైళ్ల రాకపోకల వివరాలు, ఇతర ప్రకటనలు ప్రయాణికులు తెలుసుకునేందుకు ప్రతీ ప్లాట్ఫామ్లో డిస్ప్లే బోర్డులు ఉంటాయి. ► ఎంటర్టైన్మెంట్, షాపింగ్, విశ్రాంతి గదులు తదితర సదుపాయాలు ఉంటాయి. -
ఈదులనాగులపల్లిలో రైల్వే టెర్మినల్!
పటాన్చెరు: సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో రైళ్ల రద్దీ కారణంగా వాటికి ప్రత్యామ్నాయంగా నగరశివారులోని ఈదులనాగులపల్లి(మెదక్ జిల్లా రామచంద్రాపురం)లో కొత్తగా రైల్వే టెర్మినల్ ఏర్పాటు చేయాలని దక్షిణమధ్య రైల్వే అధికారుల భావిస్తున్నారు. ఇప్పటికే వారు మౌలాలి, ఈదులనాగులపల్లిని పరిశీలించారు. అయితే టెర్మినల్ నిర్మాణానికి కావాల్సిన 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఈదులనాగులపల్లిలో ఉంది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటు కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తూ.. రైల్వే అధికారులకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తూ వచ్చారు. తాజాగా విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కూడా ఈదులనాగులపల్లిలో రైల్వే టెర్మినల్ ఏర్పాటుపై కలెక్టర్‌తో మాట్లాడినట్లు తెలిసింది. ఇక్కడ టెర్మినల్ ఏర్పాటైతే వికారాబాద్, మెదక్ రైతులకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది. దాదాపు సికింద్రాబాద్ స్టేషన్లో ఉండే రైళ్ల రాకపోకల సంఖ్యలో సగం వరకు ఈదులనాగులపల్లికి వచ్చిపోయే అవకాశం ఉంది.కాగా, ఈదులనాగులపల్లిలో రైల్వే టెర్మినల్‌కు అవసరమైన స్థలాన్ని శనివారం కలెక్టర్ రాహుల్ బొజ్జా పరిశీలించారు.