లోక్‌సభ ఎన్నికల అనంతరం దశల వారీగా సేవలు ప్రారంభం
ఇక్కడి నుంచే బయలుదేరనున్న కోణార్క్, గౌతమి, ఈస్ట్‌కోస్ట్, ఇతర ఎక్స్‌ప్రెస్‌లు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల అనంతరం చర్లపల్లి రైల్వే టెర్మినల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం కృష్ణా, గోల్కొండ, శాతవాహన, ఇంటర్‌సిటీ రైళ్లకు చర్లపల్లిలో హాల్టింగ్ సదుపాయం ఉంది. ఇది వినియోగంలోకి వచ్చిన తరువాత 25 రైళ్లను ఇక్కడి నుంచే నడిపించేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను సిద్ధం చేసింది. సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్‌మెంట్ పనులు కొనసాగుతున్న దృష్ట్యా కూడా ప్రస్తుతం ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను చర్లపల్లికి మార్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల అనంతరం చర్లపల్లి టెర్మినల్‌ను వినియోగంలోకి తేవాలని నిర్ణయించినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. రైల్వేశాఖ సుమారు రూ.430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే. అత్యాధునిక సదుపాయాలతో, ఆరులైన్‌లతో స్టేషన్‌ను విస్తరించారు. రైళ్లను శుభ్రం చేసేందుకు, నిలిపి ఉంచేందుకు వీలుగా పిట్‌లైన్‌లను ఏర్పాటు చేశారు. చర్లపల్లి టెర్మినల్ వినియోగంలోకి వస్తే పలు రైళ్లు సికింద్రాబాద్ వెళ్లకుండా ఇక్కడినుంచే నడుస్తాయి. ఇక్కడినుంచి ప్రతి రోజూ 60 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చని అధికారవర్గాలు చెపుతున్నాయి.
చర్లపల్లి ప్రారంభమయ్యాక ఇకనుంచి ఈ రైళ్లు అక్కడినుంచే..
► కాజీపేట్ నుంచి సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్‌ల మీదుగా వెళ్లే ముంబై–భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం–షిరిడీ వీక్లీ ఎక్స్‌ప్రెస్, కాకినాడ–షిరిడీ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను చర్లపల్లి టెర్మినల్ నుంచే నడిపించే అవకాశం ఉంది.
► అలాగే బీదర్ నుంచి మచిలీపట్నం వరకు నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ–లింగంపల్లి మధ్య నడిచే గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కాజీపేట – హడప్సర్ (పూణే) ట్రైవీక్లీ, లింగంపల్లి–కాకినాడ మధ్య నడిచే కోకనాడ ట్రైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, టాటానగర్ నుంచి యశ్వంత్‌పూర్ వరకు నడిచే వీక్లీఎక్స్‌ప్రెస్, షాలిమార్–హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్లను చర్లపల్లి నుంచే నడపనున్నారు.
► జమ్ముతావి–తిరుపతి మధ్య నడిచే హమ్‌సఫర్ వీక్లీ, గోరఖ్‌పూర్ నుంచి వచ్చే యశ్వంత్‌పూర్ వీక్లీ సూపర్ ఫాస్ట్‌ఎక్స్ ప్రెస్, నిజాముద్దీన్ ఢిల్లీ– బెంగళూరు సిటీ మధ్య నడిచే రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లను కూడా చర్లపల్లి నుంచి నడిపించే ప్రతిపాదనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
► ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా నిర్మించిన మౌలాలి–సనత్‌నగర్ మార్గం ఇప్పటికే పూర్తయింది. ఈ రూట్లో ప్రస్తుతం గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ఈ రూట్‌లో నడిపించే అవకాశం ఉంది. దీంతో చర్లపల్లి మీదుగా ముంబై, ఢిల్లీ వైపు రాకపోకలు సాగించే రైళ్లు సికింద్రాబాద్‌కు వెళ్లకుండా చర్లపల్లి నుంచి మౌలాలి, సనత్‌నగర్, లింగంపల్లి మీదుగా నడుస్తాయి.
సిటీ స్టేషన్‌లపై తగ్గనున్న ఒత్తిడి..
చర్లపల్లి టెర్మినల్ వినియోగంలోకి వస్తే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లపైన ఒత్తిడి తగ్గనుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతి రోజూ 200 రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. 1.86 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ వినియోగంలో ఉన్న 10 ప్లాట్‌ఫామ్‌లపైన ఒత్తిడి పెరగడం వల్ల కొన్ని రైళ్లను నగర శివార్లలోనే నిలిపివేయవలసి వస్తోంది. దీంతో ఉదయం వేళల్లో స్టేషన్‌కు రావలసిన రైళ్లు సకాలంలో చేరుకోవడం లేదు. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు సిటీ శివార్లలోనే పడిగాపులు కాయవలసి వస్తోంది. చర్లపల్లి ప్రారంభమైతే సిగ్నల్ కోసం ఇలా ఎదురుచూడవలసిన అవసరం లేకుండా చర్లపల్లి నుంచే రాకపోకలు సాగించవచ్చు. అలాగే కాచిగూడ, నాంపల్లి స్టేషన్‌లపైన కూడా ఒత్తిడి తగ్గుతుందని చెపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment