సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో రైల్వే టర్మినల్ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై పెరిగిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని గతంలో ప్రతిపాదించిన చర్లపల్లి రైల్వేస్టేషన్ విస్తరణ కోసం కేంద్రం ఈసారి రూ.70 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో తొలిదశ విస్తరణ పనులను చేపట్టనున్నారు. రానున్న రెండేళ్లలో చర్లపల్లి టర్మినల్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. తొలిదశలో వచ్చే రెండేళ్లలో పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసినట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్‌కు ఈసారి కేంద్ర బడ్జెట్‌లో కొత్త రైళ్లు, లైన్‌లు, ఇతరత్రా ప్రాజెక్టుల కోసం ఎలాంటి నిధులను కేటాయించలేదు. గతంలోనే ప్రతిపాదించిన చర్లపల్లికి మాత్రం ఈసారి నిధులను కేటాయించారు. ఎంఎంటీఎస్ రెండో దశ కోసం రూ.10 లక్షలు కేటాయించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ డెవలప్‌మెంట్ పనులను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు జీఎం తెలిపారు. భవిష్యత్తులో వందేభారత్ రైళ్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉంటుందని, ఇక్కడి నుంచి అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు ఈ రైళ్లు నడుస్తాయన్నారు.
చర్లపల్లి విస్తరణ ఇలా..
► మొదటి దశలో రూ.54.58 కోట్ల అంచనాలతో పనులు చేపట్టనున్నారు. రెండు సబ్‌వేలు, 3 ర్యాంప్‌లు, 6 చోట్ల మెట్ల మార్గాలను నిర్మిస్తారు. 5 చోట్ల బ్రిడ్జి పనులతో పాటు, 2 హైలెవల్ ఐలాండ్ ప్లాట్‌ఫామ్‌లను నిర్మించనున్నారు.
► ఇప్పుడున్న అన్ని ప్లాట్‌ఫామ్‌ల ఎత్తు, పొడవు పెంచుతారు. అన్ని ప్లాట్‌ఫామ్‌లకు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు, ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను నిర్మించనున్నారు. మురుగునీటి కాల్వలు, ఇతర పనులను పూర్తి చేస్తారు. (క్లిక్: ప్రతి ఆదివారం.. ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం)
రెండో దశలో...
► సుమారు రూ.62.67 కోట్ల పనులను చేపట్టనున్న పనుల్లో భాగంగా చర్లపల్లి స్టేషన్ ప్రాంగణం విస్తరణ,సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ సబ్‌స్టేషన్, స్టేషన్ నిర్వహణ షెడ్, తదితర పనులు చేపడతారు.
► 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, 5 ఎస్కలేటర్లు, 9 లిఫ్టులు (వాటిలో 3 సబ్‌వేల కోసం, 6 ప్లాట్‌ఫామ్‌లపైన ఏర్పాటు చేస్తారు). కొత్తగా 4 పిట్‌లైన్‌లను నిర్మించనున్నారు. పార్శిల్ షెడ్, బయో టాయిలెట్, తదితర పనులు రెండో దశలో పూర్తి చేయనున్నారు. చర్లపల్లి స్టేషన్ విస్తరణ వల్ల ప్రతి రోజు కనీసం 100 రైళ్లను నిలిపేందుకు
అవకాశం లభిస్తుంది. 50 వేల మందికి పైగా ప్రయాణికులకు ప్రయోజనం ఉంటుంది. (చదవండి: హైదరాబాద్ మెట్రోకు వైరస్ బ్రేక్)
ఎంఎంటీఎస్‌కు నిధుల కొరత..
మరోవైపు రక్షణశాఖ పరిధిలో ఉన్న మౌలాలీ– సనత్‌నగర్ మార్గంలోని 5 కిలోమీటర్లు మినహాయించి ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తయిందని జనరల్ మేనేజర్ తెలిపారు. నిధుల కొరత వల్ల రైళ్ల కొనుగోళ్లు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రూ.129 కోట్లు మాత్రమే అందాయని, మరో రూ.760 కోట్లు రావాల్సి ఉందని అధికారులు వివరించారు. పెండింగ్ నిధుల కోసం ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నిధులు ఇస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లబోదన్నారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ పొడిగింపు కోసం దక్షిణమధ్య రైల్వే రూ.330 కోట్లతో ప్రణాళికలను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు నిధులు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు కూడా నిధుల కొరతే కారణమని అధికారులు స్పష్టం చేశారు. (క్లిక్: సికింద్రాబాద్ స్టేషన్‌కు.. ఎయిర్‌పోర్టు లుక్)
Comments
Please login to add a commentAdd a comment