చర్లపల్లిలో రైల్వే టెర్మినల్‌ | Railway terminal at Cherlapally soon | Sakshi
Sakshi News home page

చర్లపల్లిలో రైల్వే టెర్మినల్‌

Published Thu, Jan 11 2018 2:49 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

 Railway terminal at Cherlapally soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రైలు ప్రయాణికులకు మరింత ప్రయోజనకరంగా ఉండేందుకు, హైదరాబాద్‌లోని ప్రధాన రైల్వేస్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు శివార్లలోని చర్లపల్లిలో రైల్వే టెర్మినల్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. సుమారు 150 రైళ్ల రాకపోకలకు అనుగుణంగా ఆరు ప్లాట్‌ఫామ్‌లు, లైన్ల నిర్మాణంతోపాటు ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. ఈ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని, నాలుగేళ్లలోగా పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (జీఎం) వినోద్‌కుమార్‌ యాదవ్‌ వెల్లడించారు.

కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రతిపాదనలు స్వీకరించేందుకు రైల్వే అధికారులు బుధవారం హైదరాబాద్‌లోని రైల్‌ నిలయంలో ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. పలువురు ఎంపీలు తమ ప్రతిపాదనలను రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న పలు ప్రాజెక్టులను గురించి జీఎం వివరించారు. చర్లపల్లి మెగా టెర్మినల్‌ పనులను రెండు, మూడు నెలల్లో ప్రారంభించి నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం రైల్వే పరిధిలో ఉన్న 50 ఎకరాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న 100 ఎకరాల విస్తీర్ణంలో టర్మినల్‌ చేపట్టనున్నామని, దీనికి సుమారు రూ.360 కోట్లు వ్యయమవుతుందని తెలిపారు.

హైదరాబాద్‌లో నాలుగోది..
ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడలలో ప్రధాన రైల్వేస్టేషన్లు ఉన్నాయి. నగరానికి రాకపోకలు భారీగా పెరుగుతుండడంతో వీటిలో రద్దీ తార స్థాయికి చేరుకుంది. రోజూ సుమారు 401 రైళ్లు ఈ మూడు స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికులు, వారి కోసం వచ్చేవారు కలిపి.. నాలుగైదు లక్షల మంది రోజూ ఈ స్టేషన్లకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండడంతోపాటు, ప్రధాన స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు చర్లపల్లిలో మెగా టెర్మినల్‌ నిర్మాణాన్ని చేపట్టారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఆనుకుని ఉండడంతో చర్లపల్లిలో రైల్వే టర్మినల్‌ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని దీనిని ఎంపిక చేశారు.

మొదట ఆరు ప్లాట్‌ఫారాలతో ప్రారంభించి.. తరువాత 10 ప్లాట్‌ఫారాల వరకు విస్తరించనున్నారు. పూర్తిగా పర్యావరణహితంగా ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేస్తారు. ఢిల్లీ, విజయవాడ, విశాఖ, తిరుపతి, చెన్నై తదితర మార్గాల్లో రాకపోకలు సాగించే 150 రైళ్లను ఇక్కడి నుంచి నడిపేందుకు అవకాశం ఉంటుంది. అటు ముంబై వైపు నుంచి రైళ్ల ఒత్తిడిని తగ్గించేందుకు వట్టినాగులపల్లిలో మరో భారీ టర్మినల్‌ నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయని జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. చర్లపల్లి పనులు ఒక దశకు చేరుకున్న తరువాత వట్టినాగులపల్లి టర్మినల్‌ నిర్మాణం కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు.

డిసెంబర్‌ నాటికి ఎంఎంటీఎస్‌ రెండో దశ
ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులను ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి.. పలు మార్గాల్లో రైళ్లను అందుబాటులోకి తేనున్నట్లు జీఎం వినోద్‌కుమార్‌ తెలిపారు. గత డిసెంబర్‌ నాటికే ఈ ప్రాజెక్టులో ఒకట్రెండు లైన్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. నిధుల కొరత కారణంగా వాయిదా పడిందని చెప్పారు. ఈ సారి ఎలాంటి జాప్యానికి తావు లేకుండా పూర్తి చేస్తామన్నారు. అలాగే అక్కన్నపేట–మెదక్, మనోహరాబాద్‌–కొత్తపల్లి, భద్రాచలం–కొత్తపల్లి, సికింద్రాబాద్‌–మహబూబ్‌నగర్, మంచిర్యాల–పెద్దపల్లి, కాజీపేట–బల్లార్షా తదితర రైల్వేలైన్లను వచ్చే రెండేళ్లలో పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఇక సికింద్రాబాద్‌ స్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు కొన్ని రైళ్లను లింగంపల్లి, వికారాబాద్‌ స్టేషన్ల వరకు పొడిగించనున్నట్లు వెల్లడించారు. ఆయా చోట్ల అవసరమైన అదనపు సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు.

పనుల తీరుపై నిలదీసిన ఎంపీలు
రాష్ట్రంలో పలు రైల్వే పనులు జరుగుతున్న తీరుపై ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం రైల్వే జీఎంతో జరిగిన సమావేశంలో ఎంపీలు బండారు దత్తాత్రేయ, మల్లారెడ్డి, కొండా విశేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్య, ఎంపీ వినోద్, బాల్క సుమన్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, కె.కేశవరావు, రాపోలు ఆనందభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. కొన్ని ప్రాజెక్టుల పనులు దశాబ్దాలు గడిచినా ప్రారంభం కావడం లేదని ఈ సందర్భంగా మండిపడ్డారు. నల్లగొండ–మాచర్ల లైన్‌ కోసం 20 ఏళ్లుగా ప్రతిపాదనలు చేస్తున్నప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదని, ఇప్పుడా ప్రాజెక్టునే నిలిపేశారని గుత్తా ఆవేదన వ్యక్తం చేశారు.

మణుగూరు–రామగుండం, ఆర్మూర్‌–ఆదిలాబాద్, పెద్దపల్లి–జగిత్యాల తదితర లైన్లను వేగంగా పూర్తి చేయాలని ఎంపీ వినోద్‌ కోరారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి పాలకుర్తి మీదుగా సూర్యాపేట వరకు ప్రతిపాదించిన లైన్‌పై ఇప్పటికీ సర్వే పూర్తి చేయకపోవడం పట్ల రాపోలు ఆనందభాస్కర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌–ఢిల్లీ వంటి దూర ప్రాంత రైళ్లకు డిమాండ్‌ తగ్గుతున్న నేపథ్యంలో అంతర్రాష్ట్ర సర్వీసులకు ప్రాధాన్యతనివ్వాలని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కోరారు. అన్ని ప్రధాన రైళ్లను భువనగిరి, జనగామలో ఆపేలా చర్యలు తీసుకోవాలని బూర నర్సయ్య కోరారు. పెద్దపల్లి, బెల్లంపల్లి, మంచిర్యాల, మందమర్రి తదితర స్టేషన్‌లను ఆధునీకరించాలని బాల్క సుమన్‌ విజ్ఞప్తి చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement