కరీంనగర్ వరకు పొడిగించిన కాచిగూడ–నిజామాబాద్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఎంపీ కవిత, మంత్రులు మహమూద్ అలీ, పద్మారావు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో రైల్వే శాఖ అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోందని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రాజధాని నగరం హైదరాబాద్‌తో అన్ని ప్రధాన ప్రాంతాలను అనుసంధానించేందుకు కొత్త రైల్వే మార్గాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.9,830 కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. దక్షిణమధ్య రైల్వేలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ మంత్రి పద్మారావుగౌడ్, ఎంపీలు కల్వకుంట్ల కవిత, బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎన్‌వీవీఎస్ ప్రభాకర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ రాంచందర్, దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ దక్షిణమధ్య రైల్వేలోని అన్ని చోట్ల 54 వేల ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. దీనివల్ల ఏటా రెండు మిలియన్ల విద్యుత్ ఆదా కావడమే కాకుండా ఏటా 1,800 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని చెప్పారు. అలాగే విద్యుత్‌పైన చేసే ఖర్చులో రూ.1.7 కోట్లు మిగులుతుందన్నారు. గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా 90 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. దీంతో రూ.45 వేల కోట్ల విద్యుత్ బిల్లులు ఆదా అవుతున్నట్లు పేర్కొన్నారు. ఇంధన వనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకుప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని తెలిపారు. కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన 400 కిలోవాట్ల సోలార్ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ ప్లాంట్ వల్ల ఏటా మరో రూ.21.66 లక్షలు ఆదా అవుతుందన్నారు. పర్యావరణహితమైన బయో టాయిలెట్ల ఏర్పాటును ప్రశంసించారు.
నాలుగో వంతెనకు శంకుస్థాపన
ప్రతిరోజు సుమారు 1.8 లక్షల మంది ప్రయాణికులు, 200 రైళ్ల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి పదో నంబర్ ప్లాట్‌ఫామ్ వరకు ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు రూ.8.8 కోట్ల అంచనాలతో నిర్మించ తలపెట్టిన నాలుగో వంతెనకు మంత్రి పీయూష్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం మూడు వంతెనలు ఉన్నాయి. వీటిలో ఒకటి నిజాం కాలంలో సుమారు వందేళ్ల క్రితం కట్టించిన వంతెన. రోజురోజుకూ ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో వంతెన ఇరుకైపోవడం.. మిగతా రెండింటిపైనే ఎక్కువ ఒత్తిడి ఉండటంతో నాలుగో వంతెనను నిర్మించేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ఈ వంతెన పూర్తయిన తరువాత పురాతన వంతెనను తొలగిస్తారు.
కాచిగూడ–నిజామాబాద్ రైలు కరీంనగర్‌కు పొడిగింపు
కరీంనగర్ వరకు పొడిగించిన కాచిగూడ–నిజామాబాద్ రైలును కూడా పీయూష్ గోయల్ జెండా ఊపి ప్రారంభించారు. చర్లపల్లి స్టేషన్ వద్ద నిర్మించ తలపెట్టిన రైల్వే టెర్మినల్ పనులను త్వరలో ప్రారంభించాలని దక్షిణమధ్య రైల్వే అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో మల్టీలెవల్ కారు పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ప్లాటినం గ్రీన్ రేటింగ్ అవార్డు లభించడం పట్ల అభినందనలు తెలిపారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో ఏర్పాటు చేసిన అదనపు లిఫ్టులు, ఎస్కలేటర్లను ప్రారంభించారు.
కొత్త గనులకు వేగంగా అనుమతులు: పీయూష్
రాష్ట్రంలో కొత్త గనులకు సత్వరమే అనుమతులు ఇస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సింగరేణి నూతన ప్రాజెక్ట్‌లు, వ్యాపార విస్తరణ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం సింగరేణి భవన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. సింగరేణి సంస్థ అభివృద్ధిపై సీఎండీ శ్రీధర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు స్పందిస్తూ జాతీయ స్థాయిలో ఆ సంస్థ గణనీయమైన వృద్ధిని సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. వ్యాపార విస్తరణలో భాగంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల్లో కొత్త బ్లాకులు కేటాయించవల్సిందిగా చైర్మన్ కోరగా పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి: కవిత
60 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర మంత్రిని కోరారు. రైల్వే లో దివ్యాంగుల కోటాను 3 శాతం నుంచి 4 శాతానికి పెంచిన నేపథ్యంలో ఈ సంవత్సరం నుంచే దాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కోటా పెంపు వల్ల దివ్యాంగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. ఏ గ్రేడ్ రైల్వేస్టేషన్ అయిన నిజామాబాద్ స్టేషన్‌లో ప్రయాణికుల సదుపాయాలను పెంచాలని కోరారు. ఎంఎంటీఎస్ రెండో దశను సకాలంలో పూర్తి చేయాలని ఎంపీ బండారు దత్తాత్రేయ కోరారు. దీనికయ్యే నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment