సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీనిని 2023 నుంచి వినియోగంలోకి తెచ్చేవిధంగా పనుల్లో వేగాన్ని పెంచారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఇటీవల చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. నగరంలో నాలుగో టెర్మినల్‌గా చర్లపల్లి విస్తరణకు దక్షిణ మధ్య రైల్వే అత్యధిక ప్రాధాన్యమిస్తోంది.
ఇది పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే సుమారు 50 రైళ్ల రాకపోకలకు అవకాశం ఉంటుంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై ప్రయాణికుల ఒత్తిడి తగ్గనుంది. చర్లపల్లి టెర్మినల్ విస్తరణ కోసం రైల్వేశాఖ రూ.220 కోట్ల అంచనాలతో గతేడాది పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది బడ్జెట్లో రూ.70 కోట్లు కేటాయించింది. వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను పరిశీలించిన అనంతరం జనరల్ మేనేజర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో ఇదే వేగాన్ని కొనసాగించాలని, సకాలంలో టెర్మినల్ అందుబాటులోకి వచ్చేవిధంగా కార్యాచరణ ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
తూర్పు వైపు రైళ్లకు హాల్టింగ్
►సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రోజూ 220 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 2 లక్షలమంది ప్రయాణాలు సాగిస్తున్నారు. దీంతో స్టేషన్‌లో ఉన్న 10 ప్లాట్‌ఫామ్‌లపై రైళ్ల ఒత్తిడి పెరుగుతోంది. శివారు ప్రాంతాల్లో టెర్మినళ్లను విస్తరించాలనే ప్రతిపాదన ముందుకొచ్చింది.
►వట్టినాగులపల్లి, చర్లపల్లిలలో టెర్మినళ్ల విస్తరణకు ప్రణాళికలను రూపొందించినప్పటికీ ప్రస్తుతం చర్లపల్లి స్టేషన్‌కే దక్షిణ మధ్య రైల్వే ప్రాధాన్యతనిచ్చి పనులను పూర్తిచేస్తోంది.
►చర్లపల్లి టెర్మినల్ వినియోగంలోకి వస్తే మరిన్ని కొత్త రూట్‌లలో రైల్వేసేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
►కాజిపేట్, విజయవాడ తదితర రూట్‌లలో రోజూ సుమారు 50 రైళ్లను ఇక్కడి నుంచి నడుపుతారు.
తుది దశలో పనులు
►టెర్మినల్ విస్తరణలో భాగంగా ప్లాట్‌ఫాంలను పొడిగించారు.
►ఎంఎంటీఎస్ రైళ్ల కోసం ఒక ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేశారు.
►ప్లాట్‌ఫాంల ఎత్తుకు అనుగుణంగా పాదచారుల వంతెన విస్తరణ, తాగునీటి వసతులు, విద్యుత్ సదుపాయం ఏర్పాటు చేశారు.
►త్వరలో రోడ్లు, ఇతర సదుపాయాలను పూర్తి చేసి స్టేషన్‌ను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment