Rail terminals
-
చర్లపల్లికి చేరేదెలా!
సాక్షి, సిటీబ్యూరో/కుషాయిగూడ: చర్లపల్లి టెర్మినల్ సిద్ధమైంది. ఈ నెలాఖరుకు లేదా వచ్చే సెప్టెంబరు మొదటి వారంలో ప్రారంభించేందుకు దక్షిణమధ్య రైల్వే సన్నాహాలు చేపట్టింది. కానీ ఈ స్టేషన్‌కు ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఇప్పటి వరకు రవాణా సదుపాయాలు మాత్రం అందుబాటులోకి రాలేదు. ఎంఎంటీఎస్ రెండో దశ పనులు పూర్తయినప్పటికీ వివిధ మార్గాల్లో చర్లపల్లికి చేరుకొనేందుకు ఎలాంటి సర్వీసులను ప్రారంభించలేదు. అలాగే.. ఆర్టీసీ సేవలు కూడా వినియోగంలోకి రాలేదు. చర్లపల్లి స్టేషన్‌కు చేరుకొనేందుకు రెండు మార్గాల్లో రోడ్ల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా విభాగాల మధ్య సమన్వయలోపం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులు నిలిచిపోయాయి. దీంతో నగరంలోనే నాలుగో టెర్మినల్‌గా వినియోగంలోకి రానున్న చర్లపల్లికి ప్రయాణికులు చేరుకోవడం ప్రశ్నార్థకంగా మారింది. అత్యాధునిక సదుపాయాలతో.. సుమారు రూ.430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్‌ను అభివృద్ధి చేశారు. లిఫ్టులు, ఎస్కలేటర్లు, బుకింగ్ కేంద్రాలు, 9 ప్లాట్‌ఫాంలు తదితర అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన చర్లపల్లి టెర్మినల్ నుంచి నిత్యం సుమారు 50 రైళ్లు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంది. కానీ మొదట 25 రైళ్లతో స్టేషన్‌ను వినియోగంలోకి తేనున్నారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్, శబరి, శాతవాహన తదితర రైళ్లను చర్లపల్లి నుంచి నడపనున్నట్లు రైల్వేబోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు చేరుకొనేందుకు ఎలాంటి సదుపాయాలు లేకపోవడం గమనార్హం. ఎంఎంటీఎస్ ఎప్పుడు? ఎంఎంటీఎస్ రెండో దశ పనులు పూర్తయ్యాయి. మేడ్చల్ నుంచి బొల్లారం మీదుగా ఫలక్‌నుమా, ఉందానగర్ వరకు, లింగంపల్లి నుంచి తెల్లాపూర్ వరకు, సనత్‌నగర్ నుంచి మౌలాలీ మీదుగా చర్లపల్లి, ఘట్కేసర్ వరకు అన్ని మార్గాల్లో పనులు పూర్తి చేసినప్పటికీ ఎంఎంటీఎస్ సరీ్వసులు మాత్రం అందుబాటులోకి రాలేదు. టెర్మినల్ ప్రారంభమైతే లింగంపల్లి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు కూడా ఎంఎంటీఎస్‌లో నేరుగా చర్లపల్లికి చేరుకొని అక్కడి నుంచి ప్రధాన రైళ్లలో బయలుదేరేందుకు అవకాశం ఉంటుంది. ఇటు మేడ్చల్, మల్కాజిగిరి, అటు కాచిగూడ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు కూడా చర్లపల్లికి చేరేలా ఎంఎంటీఎస్ సేవలను విస్తరించాల్సి ఉంది. రెండో దశలో నిర్మించిన మార్గాల్లో ప్రస్తుతం మేడ్చల్– ఫలక్‌నుమా, లింగంపల్లి–తెల్లాపూర్, మేడ్చల్–లింగంపల్లి తదితర రూట్లలో ఉదయం, సాయంత్రం మాత్రమే పరిమితంగా రైళ్లు నడుస్తున్నాయి. గతంలో రోజుకు 121 సర్వీసులు నడిస్తే ఇప్పుడు వాటి సంఖ్య 78కి తగ్గింది. మరోవైపు సికింద్రాబాద్ – చర్లపల్లి, మేడ్చల్– మల్కాజిగిరి– చర్లపల్లి, కాచిగూడ–చర్లపల్లి తదితర మార్గాల్లో సరీ్వసులను ప్రారంభించాలంటే మరిన్ని రైళ్లు అవసరం. కానీ ఈ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళికలు లేవు. విస్తరణకు నోచుకోని రహదారులు.. నగరంలోని వివిధ మార్గాల్లో సుమారు 40 కిలోమీటర్ల పరిధి నుంచి ప్రయాణికులు చర్లపల్లికి చేరుకొనేందుకు రెండు ప్రధాన రహదారులు ఉన్నాయి. మహాలక్ష్మీనగర్ కాలనీ నుంచి చర్లపల్లి రైల్వేస్టేషన్ వరకు ఉన్న 40 ఫీట్ల పాత రోడ్డును 80 ఫీట్లకు విస్తరించాల్సి ఉంది. అలాగే.. చర్లపల్లి టెర్మినల్ ముఖద్వారం నుంచి ఐఓసీఎల్ను కలుపుతూ మరో 100 ఫీట్ల రోడ్డును విస్తరించాలని ప్రతిపాదించారు. ఈమేరకు జీహెచ్ఎంసీ అధికారులు సర్వేలు నిర్వహించారు. మహాలక్ష్మినగర్ రోడ్డును విస్తరించేందుకు 15 చోట్ల ఆస్తులను తొలగించాల్సి ఉంటుందని గుర్తించారు. ఆస్తులు కోల్పోయిన వారికి టీడీఆర్‌లు, పరిహారం చెల్లింపునకు కాప్రా మున్సిపల్ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. స్థలాలు, ఆస్తులను ఇచ్చేందుకు కాలనీవాసులు సుముఖంగా లేకపోవడంతో రోడ్డు విస్తరణ పెండింగ్‌లో పడిపోయింది. ఈ మార్గంలో భూసేకరణపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. మరోవైపు చర్లపల్లి టెర్మినల్ ముఖద్వారం నుంచి ఐఓసీఎల్ రోడ్డును కలుపుతూ ప్రతిపాదించిన 100 ఫీట్ల రోడ్డు విస్తరణలో 80 శాతం భూములను అటవీశాఖ నుంచి, మరో 20 శాతం భూములను చర్లపల్లి ఐలా నుంచి సేకరించాల్సి ఉంది. గత మార్చి నెలలో రోడ్డు నిర్మాణానికి స్థలాలు ఇవ్వాలని కోరుతూ జీహెచ్ఎంసీ అధికారులు అటవీశాఖ అధికారులు, ఐలా అధికారులకు లేఖలు రాసినట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఈ రోడ్డు నిర్మాణ పనులు కూడా స్తంభించాయి. కొరవడిన సమన్వయం.. అప్రోచ్ రోడ్ల నిర్మాణం చేయకుండానే చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైతే పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. సకాలంలో స్టేషన్‌కు చేరుకోవడం కూడా కష్టమే. వివిధ విభాగాల మధ్య సమన్వయం కొరవడడంతోనే రోడ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతుల కోసం నిరీక్షిస్తున్నాం.. చర్లపల్లి రైల్వే టెర్మినల్ అప్రోచ్ రోడ్ల నిర్మాణ స్థల సేకరణకు చర్యలు తీసుకున్నాం. స్థల యజమానులకు నోటీసులు కూడా అందజేశాం. నివేదికలను భూసేకరణ అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు, జీహెచ్ఎంసీకి పంపించాం. ప్రస్తుతం వారి పరిశీలనలో ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచి్చన వెంటనే రోడ్ల నిర్మాణం చేపడతాం. – ముకుంద్‌రెడ్డి, కాప్రా డిప్యూటీ కమిషనర్ -
2023 నాటికి చర్లపల్లి రైల్వే టెర్మినల్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీనిని 2023 నుంచి వినియోగంలోకి తెచ్చేవిధంగా పనుల్లో వేగాన్ని పెంచారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఇటీవల చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. నగరంలో నాలుగో టెర్మినల్‌గా చర్లపల్లి విస్తరణకు దక్షిణ మధ్య రైల్వే అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఇది పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే సుమారు 50 రైళ్ల రాకపోకలకు అవకాశం ఉంటుంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై ప్రయాణికుల ఒత్తిడి తగ్గనుంది. చర్లపల్లి టెర్మినల్ విస్తరణ కోసం రైల్వేశాఖ రూ.220 కోట్ల అంచనాలతో గతేడాది పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది బడ్జెట్లో రూ.70 కోట్లు కేటాయించింది. వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను పరిశీలించిన అనంతరం జనరల్ మేనేజర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో ఇదే వేగాన్ని కొనసాగించాలని, సకాలంలో టెర్మినల్ అందుబాటులోకి వచ్చేవిధంగా కార్యాచరణ ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తూర్పు వైపు రైళ్లకు హాల్టింగ్ ►సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రోజూ 220 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 2 లక్షలమంది ప్రయాణాలు సాగిస్తున్నారు. దీంతో స్టేషన్లో ఉన్న 10 ప్లాట్‌ఫామ్‌లపై రైళ్ల ఒత్తిడి పెరుగుతోంది. శివారు ప్రాంతాల్లో టెర్మినళ్లను విస్తరించాలనే ప్రతిపాదన ముందుకొచ్చింది. ►వట్టినాగులపల్లి, చర్లపల్లిలలో టెర్మినళ్ల విస్తరణకు ప్రణాళికలను రూపొందించినప్పటికీ ప్రస్తుతం చర్లపల్లి స్టేషన్‌కే దక్షిణ మధ్య రైల్వే ప్రాధాన్యతనిచ్చి పనులను పూర్తిచేస్తోంది. ►చర్లపల్లి టెర్మినల్ వినియోగంలోకి వస్తే మరిన్ని కొత్త రూట్లలో రైల్వేసేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ►కాజిపేట్, విజయవాడ తదితర రూట్లలో రోజూ సుమారు 50 రైళ్లను ఇక్కడి నుంచి నడుపుతారు. తుది దశలో పనులు ►టెర్మినల్ విస్తరణలో భాగంగా ప్లాట్‌ఫాంలను పొడిగించారు. ►ఎంఎంటీఎస్ రైళ్ల కోసం ఒక ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేశారు. ►ప్లాట్‌ఫాంల ఎత్తుకు అనుగుణంగా పాదచారుల వంతెన విస్తరణ, తాగునీటి వసతులు, విద్యుత్ సదుపాయం ఏర్పాటు చేశారు. ►త్వరలో రోడ్లు, ఇతర సదుపాయాలను పూర్తి చేసి స్టేషన్‌ను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు. -
ఏపీలో ‘స్మార్ట్’గా రైల్వే సేవలు
సాక్షి, అమరావతి: రైలు టెర్మినళ్ల వద్ద వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రైల్వే శాఖ కొత్త పథకాన్ని తీసుకురానుంది. ఇందుకు గూడ్స్ షెడ్లను ఎంచుకుని అక్కడే వ్యాపారం ఆరంభించేందుకు ‘సర్వీస్ మార్కెట్ ఎట్ రైల్ టెర్మినల్స్’ (స్మార్ట్) అనే పథకం ప్రారంభించనుంది. రైలు టెర్మినళ్ల వద్ద సర్వీస్ మార్కెట్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులను ఆహ్వానించనుంది. అంటే గూడ్స్ షెడ్ల వద్ద సరుకును నేరుగా వినియోగదారులకు అందించేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు అవకాశం కల్పిస్తోంది. ఏపీలో ఈస్ట్‌కోస్ట్ రైల్వే పరిధిలోని వాల్తేరు డివిజన్ ఐదు చోట్ల గూడ్స్ షెడ్ల నిర్మాణం చేపట్టనుంది. ఉత్తరాంధ్రలోని కంటకపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి, విశాఖపట్నంలలో గూడ్స్ షెడ్ల నిర్మాణాలు జరగనున్నాయి. సర్వీస్ ప్రొవైడర్లకు, వినియోగదారులకు మేలు స్మార్ట్ పథకం ద్వారా సర్వీస్ మార్కెట్ చేయాలనుకునే సర్వీస్ ప్రొవైడర్లు తమ సరుకు రైల్ ట్రాన్స్‌పోర్టు ద్వారా గూడ్స్ షెడ్లకు చేరుస్తారు. అక్కడి నుంచి నేరుగా వినియోగదారులకు మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రోడ్డు రవాణా కంటే రైల్ ట్రాన్స్‌పోర్టు ధరలు చౌకగా మారాయి. చౌకగా వినియోగదారులకు సరుకును అందించే అవకాశం ఉంటుంది. సర్వీస్ ప్రొవైడర్లు గూడ్స్ షెడ్ల ద్వారా మార్కెట్ చేయాలనుకుంటే తమ సంస్థ పేరును కానీ, వ్యక్తిగతంగా వివరాల్ని ఫ్రైట్ ఆపరేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎఫ్‌వోఐఎస్) ద్వారా నమోదు చేసుకోవాలి. వినియోగదారుడు ఎవరైనా నేరుగా సర్వీస్ ప్రొవైడర్‌ను స్మార్ట్ పథకం ద్వారా సంప్రదించవచ్చు. ట్రక్కులు, లాజిస్టిక్స్ వ్యాపారులు, రైలు రవాణాను ఉపయోగించే వినియోగదారులకు ప్రయోజకనకరంగా ఉంటుంది. ఇప్పటికే బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లు దక్షిణ మధ్య రైల్వే గతేడాది అన్ని డివిజన్ల పరిధిలో బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లు ఏర్పాటు చేసింది. సరుకు రవాణాలో కీలకంగా ఈ బీడీయూలను భాగస్వామ్యం చేసి ఆదాయం ఆర్జిస్తోంది. రైతులు, చిరువ్యాపారులు సైతం ఇతర రాష్ట్రాలకు రైల్వే వ్యాగన్ల ద్వారా సరుకు రవాణా చేస్తూ తమ ఉత్పత్తులకు మంచి ధరను పొందుతున్నారు. గతేడాది సరుకు రవాణా ద్వారా ఏపీ నుంచి రైల్వే శాఖ రూ.2,600 కోట్ల ఆదాయం పొందింది. అధికశాతం కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల నుంచి సరుకు రవాణాలో భాగస్వామ్యం ఉంది. -
కొత్తగా రెండు భారీ రైలు టెర్మినళ్లు
ఇరుకుగా ఉన్న సికింద్రాబాద్ స్టేషన్‌కు ప్రత్యామ్నాయంగా.. మౌలాలి, వట్టినాగులపల్లి స్టేషన్లలో నిర్మాణం సాక్షి, హైదరాబాద్: అటు ఉత్తరాదికి, ఇటు దక్షిణాదికి కీలకంగా మారిన సికింద్రాబాద్ స్టేషన్ ఇరుకుఇరుకుగా మారడం. రైళ్లరద్దీ, ప్రయాణికుల రద్దీ పెరిగిపోవడంతో ప్రత్యామ్నాయంగా రాష్ట్రరాజధానిలో మరో రెండు భారీ టెర్మినళ్లు నిర్మించేందుకు దక్షిణమధ్య రైల్వే సిద్ధమవుతోంది. వచ్చే బడ్జెట్లో స్థానం కల్పించాలని కోరుతూ రైల్వేబోర్డుకు ప్రతిపాదనలను పంపింది. దాదాపు రూ.120 కోట్ల ఖర్చయ్యే ఈ పనులకు డీపీఆర్‌లను సిద్ధం చేస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా నిత్యం దాదాపు 210 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ ఈ స్టేషన్లో 10 ప్లాట్‌ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. నగరంలో కీలకంగా మారిన ఎంఎంటీఎస్ రైళ్లకు కూడా ఇవే శరణ్యం. దీంతో ప్లాట్‌ఫామ్స్ దొరికేవరకు పలు రైళ్లను మౌలాలి సహా ఇతర శివారు స్టేషన్లలో నిలిపివేస్తున్నారు. కొన్నింటినైతే సుమారు 40 నిమిషాలవరకు ఆపేస్తున్నారు. అందుకే కొత్త టెర్మినళ్లను నిర్మించాలని నిర్ణయించారు. అవి పూర్తయితే ముఖ్యమైన రైళ్లను మాత్రమే సికింద్రాబాద్ వరకు రప్పిస్తారు. మిగతావాటిని కొత్తస్టేషన్లలోనే నిలిపేస్తారు. దీంతో సికింద్రాబాద్‌పై భారం తగ్గుతుందని భావిస్తున్నారు. ఎంఎంటీఎస్ స్టేషన్లలో సీసీటీవీలు... భద్రతదృష్ట్యా నగరంలోని అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లలో కేంద్రీకృత పర్యవేక్షణ వ్యవస్థతోకూడిన సీసీకెమెరాలను ఏర్పాటు చేయాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఈమేరకు నిర్ణయించారు. అన్ని లెవల్ క్రాసింగ్స్ వద్ద గేట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రాధాన్యక్రమంలో పనులు : జీఎం శ్రీవాస్తవ గతంలో మంజూరైన పనులు కూడా చాలావరకు పెం డింగ్‌లో ఉన్నందున ముఖ్యమైన వాటిని ప్రాధాన్యక్రమంలో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ చెప్పారు. గురువారం ఆయన ప్రధాన విభాగాల అధికారులతో సమావేశమయ్యా రు. రూ.5490 కోట్లతో వివిధ దశల్లో ఉన్న 637 పను పెండింగ్ పనులు, ప్రతిపాదనలను సమీక్షించారు. -
మాస్టర్ ప్లాన్ ఫ్లాప్
మహా బృహత్ ప్రణాళిక (మాస్టర్‌ప్లాన్) అమల్లోకి వచ్చి ఏడాది గడచినా... అభివృద్ధి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అరచేతిలో వైకుంఠం చూపిన సర్కార్.. అసలు దాని గురించే పట్టించుకోక పోవడం శివారు ప్రాంతాలకు శాపంగా మారింది. నగరం చుట్టుపక్కల నాలుగు జిల్లాల్లో పలు ప్రాంతాలను మాస్టర్‌ప్లాన్ పరిధిలో చేర్చడం వల్ల అక్కడి భూములు అమ్ముకోవాలన్నా... కొనాలన్నా నిబంధనలు అడ్డు వస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్డుకు కనీసం మార్కింగ్ కూడా చేయకపోవడంతో ఆ రోడ్డులో తమ భూములు, ఇళ్లు ఏ మేరకు పోతున్నాయో కూడా గ్రామీణులకు తెలియని పరిస్థితి. రైల్ టెర్మినళ్లకు ఇంతవరకు రైల్వే శాఖ అసలు చర్యలే తీసుకోలేదు. మొత్తంగా మాస్టర్ ప్లాన్ కాస్త ఫ్లాప్‌గా మారింది. ఈ ప్లాన్ అమల్లోకి రావడంతో తమ ఆస్తులు తమకు కాకుండా పోయాయంటూ ఆయా ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ప్రణాళిక పేరుతో కొత్త ఆంక్షలు విధించి తమను బికారులుగా మార్చారని ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల వేళ నాయకులు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తారో... చూస్తామంటూ శివారు ప్రాంత ప్రజలు శివాలెత్తుతున్నారు. అదిగో అభివృద్ధి... ఇదిగో ఉపాధి అంటూ ఆశలు రేకెత్తించిన అభివృద్ధి ప్రణాళికే (మాస్టర్‌ప్లాన్) ఇప్పుడు ‘ప్రజా ఎజెండా’గా మారింది. హెచ్ఎండీఏ విస్తరిత ప్రాంత మాస్టర్‌ప్లాన్ పరిస్థితి ‘పేరు గొప్ప... ఊరు దిబ్బ’ అన్న చందంగా ఉంది. దేశంలోనే ఇది అతిపెద్దబృహత్ ప్రణాళికగా చెప్పుకోవడం మినహా ఇంతవరకు దీని వల్ల ఒరిగిందేమీ లేదు. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 35 మండలాల్లో 849 గ్రామాలను కలుపుతూ రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్ వల్ల 5985 చ.కి.మీ. మేర మహా నగరాభివద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధి విస్తరించింది. ప్రణాళికలో భూ వినియోగాన్ని 12 రకాలుగా గుర్తించి ప్లాన్‌లో పొందుపర్చారు. అయితే... భవిష్యత్ నగరానికి దిక్సూచిగా నిలవాల్సిన మాస్టర్‌ప్లాన్ పాలకుల చేతగానితనం వల్ల ఇప్పుడు పేపర్ ప్లాన్‌గా మారింది. రేపటి తరానికి భవిష్యత్నేప్రశ్నార్థకం చేస్తూ మౌలిక వసతుల్లో మరింత సమస్యలు పెరిగేందుకు హేతువుగా మారింది. అభివృద్ధి జాడేదీ? భవిష్యత్ అభివృద్ధి ప్రాంతంగా గుర్తిస్తూ ఔటర్ రింగ్‌రోడ్డు గ్రోత్ కారిడార్‌కు, దానికి ఆనుకొని ఉన్న వివిధ ప్రాంతాలను కలుపుకొని రెసిడెన్షియల్ జోన్-1 కేటగిరీగా ప్రణాళికలో పొందుపర్చారు. అయితే... ఇంతవరకు అక్కడ అభివద్ధి ఛాయలు కన్పించట్లేదు. అలాగే మాస్టర్‌ప్లాన్‌లో శాటిలైట్ టౌన్‌షిప్‌లుగా 13 అర్బన్ నోడ్స్ను రెసిడెన్షియల్ జోన్-2 కేటగిరీ కింద గుర్తించారు. వాటి అభివద్ధికి సంబంధించి అతీగతీ లేదు. ఇక్కడ అంతర్గత రోడ్లు, విద్యుత్తు, తాగునీటి సరఫరా వ్యవస్థ, పార్కులు, ప్లే గ్రౌండ్స్ వంటి వాటి అభివృద్ధికి ఇప్పటికే బీజం పడాలి. కానీ సర్కార్ నిధులివ్వక పోవడంతో వీటి గురించి కనీసం అధ్యయనం కూడా సాగలేదు. అలాగే హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం 46 అర్బన్ సెంటర్స్‌ను గుర్తించారు. ప్రస్తుతం గ్రామ ప్రాంతాలుగా ఉన్న వీటిని అభివృద్ధి చేసి జనాభా కోర్ ఏరియాకు వలసలు పోకుండా చేయాలని భావించారు. అదీ జరగలేదు. మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించిన పారిశ్రామికవాడల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకపోవడంతో నగరంలోని పరిశ్రమలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఔటర్ బయటకు వెళ్లలేదు. ఈ పారిశ్రామిక వాడల అభివృద్ధి బాధ్యతను ఏపీఐఐసీ తీసుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. నిధుల కోసం ఏపీఐఐసీ కూడా సర్కార్ వైపు చూస్తుండటంతో పరిశ్రమలు నగరం వెలుపలికి తరలించే అంశం కార్యరూపం దాల్చలేదు. నరంలో కాలుష్య భూతం ఎప్పటిలాగే కరవాలాన్ని తిప్పుతూ ప్రజా ఆరోగ్యాన్ని హరిస్తోంది. ఆ రోడ్డు పేపర్ల పైనే... ఔటర్ రింగ్‌రోడ్డుకు అవతల ప్రతిపాదించిన రీజినల్ రింగ్‌రోడ్డు ఫైళ్లకే పరిమితమైంది. జాతీయ రహదారి తరహాలో 90 మీటర్ల వెడల్పు, 285 కి.మీ. నిడివితో రీజనల్ రింగ్‌రోడ్డును నిర్మించాలన్న యోచన కాగితాల్లోనే మగ్గుతోంది. ఆయా ప్రాంతాల్లో ఇప్పుడున్న ఆర్ అండ్ బి రోడ్లనే ఒకదానికొకటి లింక్ కలుపుతూ రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మించాలనుకున్నారు. కానీ ఈ విషయమై కనీసం సర్వే కూడా జరిపించక పోవడం సర్కార్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రోడ్డు కోసం కనీసం మార్కింగ్ చేసినా... ఆయా ప్రాంతాల్లో భూములు అమ్మేవారికి , కొనేవారికి కొంత స్పష్టత ఉండేది. ఇప్పుడు ఎటూ కాకుండా పోయామంటూ గ్రామీణులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. అలాగే భారీ వాహనాలకు పార్కింగ్ ఇతర సదుపాయాల కోసం పన్నెండు ప్రాంతాల్లో లాజిస్టిక్ హబ్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి కనీసంగానైనా స్పందన లేదు. ఫలితంగా నగరంపై ఒత్తిడి యథావిధిగానే ఉంది. నిధుల్లేని ప్రణాళిక మహా ప్రణాళిక అమలుకు సుమారు రూ. లక్ష కోట్ల నిధులు అవసరమని నిపుణుల ప్రాథమిక అంచనా. కానీ సర్కార్ దీని కోసం రూపాయి కూడా విదల్చలేదు. మాస్టర్‌ప్లాన్ అమలుకు ఏటా రూ.30వేల కోట్లు బడ్జెట్లో కేటాయించడం అవసరం. నిజానికి ఇందుకు అవసరమయ్యే నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయా..? లేక ఆర్ అండ్ బి భరిస్తుందా? హెచ్ఎండీఏ లేదా స్థానిక సంస్థలు సర్దుబాటు చేసుకొంటాయా? అన్నది నేటికీ స్పష్టత లేదు. మాస్టర్‌ప్లాన్ అమలుకు వివిధ శాఖల సమన్వయం తప్పనిసరి. ఇందుకోసం ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కమిటీ లేకపోవడంతో నిధుల సేకరణ జరగట్లేదు. రోడ్లు-భవనాలు, పురపాలక, పంచాయతీరాజ్, రవాణా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీ, నీటిపారుదల, రెవెన్యూ తదితర శాఖలన్నీ సమన్వయంతో సాగితేనే మాస్టర్‌ప్లాన్ అమలు సాధ్యం. అయితే.. రాష్ట్ర విభజన జరగడంతో ఇక మొత్తం ప్రణాళికను పక్కన పడేసినట్లేనన్న వాదనలు విన్పిస్తున్నాయి.