మాస్టర్ ప్లాన్ ఫ్లాప్
మహా బృహత్ ప్రణాళిక (మాస్టర్‌ప్లాన్) అమల్లోకి వచ్చి ఏడాది గడచినా... అభివృద్ధి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అరచేతిలో వైకుంఠం చూపిన సర్కార్.. అసలు దాని గురించే పట్టించుకోక పోవడం శివారు ప్రాంతాలకు శాపంగా మారింది. నగరం చుట్టుపక్కల నాలుగు జిల్లాల్లో పలు ప్రాంతాలను మాస్టర్‌ప్లాన్ పరిధిలో చేర్చడం వల్ల అక్కడి భూములు అమ్ముకోవాలన్నా... కొనాలన్నా నిబంధనలు అడ్డు వస్తున్నాయి.
రీజనల్ రింగ్ రోడ్డుకు కనీసం మార్కింగ్ కూడా చేయకపోవడంతో ఆ రోడ్డులో తమ భూములు, ఇళ్లు ఏ మేరకు పోతున్నాయో కూడా గ్రామీణులకు తెలియని పరిస్థితి. రైల్ టెర్మినళ్లకు ఇంతవరకు రైల్వే శాఖ అసలు చర్యలే తీసుకోలేదు. మొత్తంగా మాస్టర్ ప్లాన్ కాస్త ఫ్లాప్‌గా మారింది. ఈ ప్లాన్ అమల్లోకి రావడంతో తమ ఆస్తులు తమకు కాకుండా పోయాయంటూ ఆయా ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ప్రణాళిక పేరుతో కొత్త ఆంక్షలు విధించి తమను బికారులుగా మార్చారని ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల వేళ నాయకులు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తారో... చూస్తామంటూ శివారు ప్రాంత ప్రజలు శివాలెత్తుతున్నారు. అదిగో అభివృద్ధి... ఇదిగో ఉపాధి అంటూ ఆశలు రేకెత్తించిన అభివృద్ధి ప్రణాళికే (మాస్టర్‌ప్లాన్) ఇప్పుడు ‘ప్రజా ఎజెండా’గా మారింది.
హెచ్‌ఎండీఏ విస్తరిత ప్రాంత మాస్టర్‌ప్లాన్ పరిస్థితి ‘పేరు గొప్ప... ఊరు దిబ్బ’ అన్న చందంగా ఉంది. దేశంలోనే ఇది అతిపెద్దబృహత్ ప్రణాళికగా చెప్పుకోవడం మినహా ఇంతవరకు దీని వల్ల ఒరిగిందేమీ లేదు.
రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 35 మండలాల్లో 849 గ్రామాలను కలుపుతూ రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్ వల్ల 5985 చ.కి.మీ. మేర మహా నగరాభివద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధి విస్తరించింది. ప్రణాళికలో భూ వినియోగాన్ని 12 రకాలుగా గుర్తించి ప్లాన్‌లో పొందుపర్చారు. అయితే... భవిష్యత్ నగరానికి దిక్సూచిగా నిలవాల్సిన మాస్టర్‌ప్లాన్ పాలకుల చేతగానితనం వల్ల ఇప్పుడు పేపర్ ప్లాన్‌గా మారింది. రేపటి తరానికి భవిష్యత్‌నేప్రశ్నార్థకం చేస్తూ మౌలిక వసతుల్లో మరింత సమస్యలు పెరిగేందుకు హేతువుగా మారింది.
అభివృద్ధి జాడేదీ?
భవిష్యత్ అభివృద్ధి ప్రాంతంగా గుర్తిస్తూ ఔటర్ రింగ్‌రోడ్డు గ్రోత్ కారిడార్‌కు, దానికి ఆనుకొని ఉన్న వివిధ ప్రాంతాలను కలుపుకొని రెసిడెన్షియల్ జోన్-1 కేటగిరీగా ప్రణాళికలో పొందుపర్చారు. అయితే... ఇంతవరకు అక్కడ అభివద్ధి ఛాయలు కన్పించట్లేదు. అలాగే మాస్టర్‌ప్లాన్‌లో శాటిలైట్ టౌన్‌షిప్‌లుగా 13 అర్బన్ నోడ్స్‌ను రెసిడెన్షియల్ జోన్-2 కేటగిరీ కింద గుర్తించారు. వాటి అభివద్ధికి సంబంధించి అతీగతీ లేదు. ఇక్కడ అంతర్గత రోడ్లు, విద్యుత్తు, తాగునీటి సరఫరా వ్యవస్థ, పార్కులు, ప్లే గ్రౌండ్స్ వంటి వాటి అభివృద్ధికి ఇప్పటికే బీజం పడాలి. కానీ సర్కార్ నిధులివ్వక పోవడంతో వీటి గురించి కనీసం అధ్యయనం కూడా సాగలేదు.
అలాగే హెచ్‌ఎండీఏ పరిధిలో మొత్తం 46 అర్బన్ సెంటర్స్‌ను గుర్తించారు. ప్రస్తుతం గ్రామ ప్రాంతాలుగా ఉన్న వీటిని అభివృద్ధి చేసి జనాభా కోర్ ఏరియాకు వలసలు పోకుండా చేయాలని భావించారు. అదీ జరగలేదు. మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించిన పారిశ్రామికవాడల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకపోవడంతో నగరంలోని పరిశ్రమలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఔటర్ బయటకు వెళ్లలేదు. ఈ పారిశ్రామిక వాడల అభివృద్ధి బాధ్యతను ఏపీఐఐసీ తీసుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. నిధుల కోసం ఏపీఐఐసీ కూడా సర్కార్ వైపు చూస్తుండటంతో పరిశ్రమలు నగరం వెలుపలికి తరలించే అంశం కార్యరూపం దాల్చలేదు. నరంలో కాలుష్య భూతం ఎప్పటిలాగే కరవాలాన్ని తిప్పుతూ ప్రజా ఆరోగ్యాన్ని హరిస్తోంది.
ఆ రోడ్డు పేపర్ల పైనే...
ఔటర్ రింగ్‌రోడ్డుకు అవతల ప్రతిపాదించిన రీజినల్ రింగ్‌రోడ్డు ఫైళ్లకే పరిమితమైంది. జాతీయ రహదారి తరహాలో 90 మీటర్ల వెడల్పు, 285 కి.మీ. నిడివితో రీజనల్ రింగ్‌రోడ్డును నిర్మించాలన్న యోచన కాగితాల్లోనే మగ్గుతోంది. ఆయా ప్రాంతాల్లో ఇప్పుడున్న ఆర్ అండ్ బి రోడ్లనే ఒకదానికొకటి లింక్ కలుపుతూ రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మించాలనుకున్నారు. కానీ ఈ విషయమై కనీసం సర్వే కూడా జరిపించక పోవడం సర్కార్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రోడ్డు కోసం కనీసం మార్కింగ్ చేసినా... ఆయా ప్రాంతాల్లో భూములు అమ్మేవారికి , కొనేవారికి కొంత స్పష్టత ఉండేది. ఇప్పుడు ఎటూ కాకుండా పోయామంటూ గ్రామీణులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. అలాగే భారీ వాహనాలకు పార్కింగ్ ఇతర సదుపాయాల కోసం పన్నెండు ప్రాంతాల్లో లాజిస్టిక్ హబ్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి కనీసంగానైనా స్పందన లేదు. ఫలితంగా నగరంపై ఒత్తిడి యథావిధిగానే ఉంది.
నిధుల్లేని ప్రణాళిక
మహా ప్రణాళిక అమలుకు సుమారు రూ. లక్ష కోట్ల నిధులు అవసరమని నిపుణుల ప్రాథమిక అంచనా. కానీ సర్కార్ దీని కోసం రూపాయి కూడా విదల్చలేదు. మాస్టర్‌ప్లాన్ అమలుకు ఏటా రూ.30వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించడం అవసరం. నిజానికి ఇందుకు అవసరమయ్యే నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయా..? లేక ఆర్ అండ్ బి భరిస్తుందా? హెచ్‌ఎండీఏ లేదా స్థానిక సంస్థలు సర్దుబాటు చేసుకొంటాయా? అన్నది నేటికీ స్పష్టత లేదు. మాస్టర్‌ప్లాన్ అమలుకు వివిధ శాఖల సమన్వయం తప్పనిసరి. ఇందుకోసం ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కమిటీ లేకపోవడంతో నిధుల సేకరణ జరగట్లేదు. రోడ్లు-భవనాలు, పురపాలక, పంచాయతీరాజ్, రవాణా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీ, నీటిపారుదల, రెవెన్యూ తదితర శాఖలన్నీ సమన్వయంతో సాగితేనే మాస్టర్‌ప్లాన్ అమలు సాధ్యం. అయితే.. రాష్ట్ర విభజన జరగడంతో ఇక మొత్తం ప్రణాళికను పక్కన పడేసినట్లేనన్న వాదనలు విన్పిస్తున్నాయి.