సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) నిర్మాణంపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా 352 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే.. రీజనల్ రింగ్ రోడ్డులో భాగంగా 1,712 కిలోమీటర్ల పొడవునా మొత్తం 60 రేడియల్ రోడ్లను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో తొలి, రెండో దశలో 1,281 కిలోమీటర్ల మేర 32 రేడియల్ రోడ్లను, మూడో దశలో 28 లింక్ రోడ్లను నిర్మించాలని నిర్ణయించింది.
200 అడుగుల వెడల్పుతో..
రేడియల్ రోడ్లు 200 అడుగుల వెడల్పుతో ఉంటాయి. ప్రధాన రేడియల్ రోడ్ వంద అడుగులు కాగా.. భవిష్యత్తు అవసరాల కోసం దానికి ఇరువైపులా 50 అడుగుల చొప్పున బఫర్‌గా ఉంచుతారు. ఉత్తర భాగంలో తూప్రాన్–గజ్వేల్–చౌటుప్పల్‌లను కలుపుతూ 158 కిలోమీటర్లు, దక్షిణ భాగంలో చౌటుప్పల్–షాద్‌నగర్–సంగారెడ్డిలను కలుపుతూ 194 కిలోమీటర్ల మేర రీజనల్ రోడ్డు ఉండనుంది.
లీ అసోసియేట్స్‌కు 10 రేడియల్ రోడ్లు
ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన, సాంకేతిక సేవల బాధ్యతలను కెనడాకు చెందిన లీ అసోసియేట్స్ సౌత్ ఏషియా సంస్థకు అప్పగించింది. ఉత్తర భాగంలో ఓఆర్‌ఆర్, ట్రిపుల్ ఆర్‌ను కలిపేందుకు 10 రేడియల్ రోడ్ల నిర్మాణ పనులను ఈ సంస్థకు అప్పగించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ సంస్థ హెచ్‌ఎండీఏ, టీజీఆర్డీసీ, ఓఆర్‌ఆర్ రోడ్ల నిర్మాణం, మాస్టర్ ప్లాన్ వంటి ప్రాజెక్టులను పూర్తి చేసింది.
మూడు దశల్లో రేడియల్ రోడ్ల స్వరూపమిదీ:
ఫేజ్–1: రేడియల్ రోడ్ల సంఖ్య: 16; రోడ్ల పొడవు: 748 కి.మీ.
» 5 రేడియల్ రోడ్లు ఓఆర్‌ఆర్ నుంచి రీజనల్ రింగ్‌రోడ్డుకు అనుసంధానమై ఉంటాయి. మిగతా 11 రేడియల్ రోడ్లలో 9 జాతీయ రహదారులు, 2 రాష్ట్ర రహదారులను కలుపుతూ ట్రిపుల్ ఆర్, ఓఆర్‌ఆర్ గుండా సాగుతాయి.
» ఓఆర్‌ఆర్‌తో అనుసంధానమయ్యే రోడ్లలో.. యాద్గార్‌పల్లి నుంచి ఇటిక్యాల వరకు, కీసర నుంచి దత్తాయిపల్లి, నాగులపల్లి నుంచి మందాపూర్, నార్సింగి నుంచి చీమలదరి, రాజేంద్రనగర్ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నంబరు–17 నుంచి కంకాల్ వరకు నిర్మించనున్నారు. అలాగే హైదరాబాద్ మీదుగా వెళ్లే మెదక్, నాగ్‌పూర్, ముంబై, వికారాబాద్, బెంగళూరు, శ్రీశైలం, విజయవాడ, మందాపురం, వరంగల్ జాతీయ రహదారులను, నాగార్జునసాగర్, కరీంనగర్ రాష్ట్ర రహదారులను కలుపుతూ ట్రిపుల్ ఆర్ సాగుతుంది.
ఫేజ్–2: రేడియల్ రోడ్ల సంఖ్య: 16; రోడ్ల పొడవు: 533 కి.మీ.
» ఇందులో ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు అవసరాల నిమిత్తం రావిర్యాల నుంచి ఆమన్‌గల్ వరకు 41.5 కిలోమీటర్ల మేర 300 ఫీట్ల వెడల్పుతో గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ ఉంటుంది. ళీ ఇక ఆదిబట్ల నుంచి తుర్కాలకుంట వరకు.. కోహెడ నుంచి కోతులాపురం.. పెద్ద అంబర్‌పేట నుంచి మందోళ్లగూడెం.. కొర్రెముల నుంచి ఎర్రంబెల్లి.. పడమట సాయిగూడ నుంచి దాతర్‌పల్లి.. ధర్మవరం నుంచి చేబర్తి..
మునీరాబాద్ నుంచి రంగంపేట.. ఓఆర్‌ఆర్ ఇంద్రజీత్ మెహతా నుంచి తియల్పూర్.. ఎగ్జిట్ నంబర్–4ఏ నుంచి కాసాల.. ఎగ్జిట్ నంబర్–4 నుంచి శివంపేట.. కర్దనూరు నుంచి గోపులారం.. వెలిమల నుంచి తేలుపోల్.. జన్వాడ ఎస్‌ఆర్‌ఆర్‌సీ క్రికెట్ గ్రౌండ్ నుంచి అక్నాపూర్.. ఎగ్జిట్ నంబర్–15 నుంచి మధురాపూర్.. ఎగ్జిట్ నంబరు–15 నుంచి కేశంపేట వరకు రేడియల్ రోడ్లు ఉంటాయి.
ఫేజ్–3: లింక్ రోడ్ల సంఖ్య: 28; రోడ్ల పొడవు: 431 కి.మీ.
» ఫేజ్–1 లేదా ఫేజ్–2లను కలుపుతూ ట్రిపుల్ ఆర్ వరకు ఉంటాయి.
» ఓఆర్‌ఆర్, ట్రిపుల్ ఆర్‌లను కలుపుతూ 18 లింక్ రోడ్లు. అలాగే ఓఆర్‌ఆర్, గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులను అను సంధానం చేస్తూ 10 లింక్ రోడ్లు ఉంటాయి.
» రావిర్యాల నుంచి గుమ్మడవల్లి.. మాల్ నుంచి వట్టిపల్లి.. గున్‌గల్ నుంచి కొత్తాల.. ఇబ్రహీంపట్నం నుంచి జనగాం.. కొత్తూరు నుంచి చౌలపల్లి.. తుక్కుగూడ నుంచి మహేశ్వరం మీదుగా తలకొండపల్లి.. నేదునూరు క్రాస్‌రోడ్ నుంచి చీపునుంతల.. కడ్తాల్ నుంచి చుక్కాపూర్.. రూప్‌సింగ్ తండా నుంచిపాంబండ.. ఇలా లింక్ రోడ్లు నిర్మిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment