
కేంద్రంలోని ప్రధాన శాఖలతో కూడిన నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూపు భేటీలో పాస్
హైవే మంత్రిత్వ శాఖ ఆమోదం తదుపరి కేంద్ర ఆర్థిక శాఖకు ఫైలు
త్వరలోనే ‘రీజనల్’ఉత్తర భాగానికి ఎక్స్‌ప్రెస్‌వే నంబర్..
ఆ తర్వాత పరిహారం పంపిణీ, టెండర్ల ప్రక్రియ ముందుకు..
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు ఉత్తర భాగాన్ని పట్టాలెక్కించేందుకు మార్గం సుగమమైంది. దేశవ్యాప్తంగా చేపట్టే కీలక ప్రాజెక్టులపై చర్చించి వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు మార్గం చూపే పీఎం గతిశక్తిలోని నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్‌పీజీ) దీనికి పచ్చజెండా ఊపింది. కేంద్ర ప్రభుత్వంలోని ప్రధాన శాఖలతో కూడిన ఈ గ్రూప్ సమన్వయ బృందంగా పనిచేస్తుంది.
సదరు ప్రాజెక్టు వల్ల ఇతర శాఖలు, వాటి పరిధిలోని ప్రాజెక్టులకు ఎదురయ్యే ఇబ్బందులు, ఇతర కీలక ప్రాజెక్టులకు ఏర్పడే ఇబ్బందులపై ఎన్‌పీజీ చర్చించి.. ఎలాంటి అడ్డంకి లేదనుకుంటే ఆమోద ముద్ర వేస్తుంది. రూ.500 కోట్ల కంటే ఎక్కువ వ్యయమయ్యే ప్రాజెక్టులకు దీని ఆమోదం తప్పనిసరి.
శనివారం ఢిల్లీలో జరిగిన ఎన్‌పీజీ భేటీలో 17 ప్రాజెక్టులపై చర్చించారు. అందులో రీజనల్ రింగురోడ్డు ఉత్తర భాగం కూడా ఉంది. ఈ ప్రాజెక్టుతో ఇతర ప్రాజెక్టులకు ఇబ్బంది లేదని తేల్చి, ఓకే చేసినట్టు తెలిసింది.
ఇకపై వేగంగా ప్రక్రియ..
రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి జనవరిలోనే కేంద్రం టెండర్లు పిలిచింది. ఫిబ్రవరి 14న టెండర్లు ఓపెన్ చేసి నిర్మాణ సంస్థను గుర్తించాల్సి ఉంది. కానీ రెండు సార్లు గడువు పొడిగించారు. రీజనల్ రింగు రోడ్డుకు ఇప్పటివరకు ఎక్స్‌ప్రెస్‌వే నంబర్ (హైవే నంబర్) కేటాయించకపోవటమే దీనికి కారణం. ఏదైనా జాతీయ రహదారి ప్రాజెక్టు చేపడుతున్నప్పుడు.. రోడ్డు నంబర్ కీలకం, దాన్ని ఖరారు చేయకుండా పనులు చేపట్టేందుకు వీలుండదు.
రీజనల్ రింగురోడ్డుకు ఇంకా నంబర్ కేటాయించకపోవటంతో.. టెండర్లను తెరిచేందుకు, పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు, నిధులు మంజూరు, భూసేకరణ పరిహారం చెల్లింపు వంటివి చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఎన్‌పీజీ క్లియరెన్స్ రావడంతో, కేంద్ర జాతీయ రహదారుల శాఖ మరోసారి ఆమోద ముద్ర వేసి ఆర్థిక శాఖకు పంపుతుంది. అక్కడ నిధుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో రోడ్డుకు ఎక్స్‌ప్రెస్ వే నంబర్ కేటాయిస్తారు.
‘రీజనల్’దక్షిణ భాగంపై తకరారు!
కేంద్ర ప్రభుత్వం రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగాన్ని భారత్‌మాల పరియోజనలో చేర్చింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పేచీలు, కొ న్ని ప్రక్రియల్లో జాప్యంతో దక్షిణ భాగాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఇప్పుడు దక్షిణ భాగాన్ని కూడా ఉత్తర భాగంతోపాటే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. మూడు రోజుల క్రితం ఢిల్లీలో ప్రధానితో భేటీ అయిన సీఎం రేవంత్ ఈ అంశాన్ని ప్రస్తావించారు.
కానీ అటు కేంద్రా న్ని చేపట్టాలని కోరుతూనే.. దక్షిణ భాగానికి డీపీ ఆర్ తయారీ కన్సల్టెన్సీ సేవల కోసం రాష్ట్ర ప్రభు త్వం టెండర్లు పిలవడం గమనార్హం. ఇది గందరగోళానికి కారణమైంది. తమ పరిశీలనలో ఉన్న ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఎందుకు పిలిచిందో అంతుచిక్కడం లేదని జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) పేర్కొంటుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment