
వెంటనే సిద్ధం చేయాలని సీఎం ఆదేశం
అనుమతులను వేగవంతం చేయాలని సూచన
వందేళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్టు
రహదారులకు భూ సేకరణపై దృష్టి పెట్టండి
ఆర్‌ఆర్‌ఆర్, రహదారులు, మెట్రోపై సమీక్షలో రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రోరైలు ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దాదాపు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతోందని, నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్‌ఖాన్‌పేట వరకు పొడిగించాలని సూచించారు. అందు కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కోరారు.
మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్‌రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్), జాతీయ రహదారులకు భూ సేకరణపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం సీఎం సమీక్ష నిర్వహించారు. హెచ్‌ఎండీఏతో పాటు ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌ఎస్డీఏ)ని మెట్రో విస్తరణలో భాగస్వాములను చేయాలని సూచించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని, ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు సీఎంకు అధికారులు వివరించారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు (36.8 కి.మీ.), రాయదుర్గం–కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్–పటాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీ నగర్–హయత్ నగర్ (7.1 కి.మీ.)ల విస్తరణకు రూ.24269 కోట్ల అంచనాలతో చేపట్టే పనులకు కేంద్రంనుంచి వేగంగా అనుమతులు వచ్చేలా చూడాలని సీఎం పేర్కొన్నారు.
వందేళ్ల అవసరాలు తీర్చేలా డ్రైపోర్టు
వందేళ్ల వరకు అవసరాలను తీర్చేలా డ్రైపోర్టును నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రీజినల్ రింగురోడ్డు సమీపంలో అందుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించాలని సూచించారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి భూ సేకరణ పూర్తి చేయాలని, దక్షిణ భాగానికి సంబంధించి డీపీఆర్‌ను త్వరగా సమర్పించాలని ఆదేశించారు. హైదరాబాద్–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి డీపీఆర్ రూపొందించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించిన నేపథ్యంలో ఆ పనులపై దృష్టిసారించాలని సీఎం సూచించారు. హైదరాబాద్‌ను ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌తో అనుసంధానించేలా జాతీయ రహదారిని ప్రతిపాదించాలని ఆదేశించారు.
హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. జాతీయ రహదారుల నిర్మాణానికి భూ సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై సీఎం ఆరా తీశారు. పలుచోట్ల పంటలు ఉన్నాయని, వాటికి నష్టపరిహారం చెల్లించేందుకు జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అంగీకరించడం లేదని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో పంటకాలం దాదాపు పూర్తికావచ్చినందున రైతులతో మాట్లాడి భూ సేకరణ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
భూ సేకరణ సమస్యలపై జిల్లా కలెక్టర్లతో మాట్లాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచించారు. ఔటర్ రింగు రోడ్డు నుంచి రీజినల్ రింగు రోడ్డు వరకు రేడియల్ రోడ్ల నిర్మాణం, ఆర్‌ఆర్‌ఆర్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్న రహదారుల విస్తరణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం పేర్కొన్నారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ప్రత్యేక కార్యదర్శి హరిచందన, చీఫ్ ఇంజనీర్లు తిరుమల, జయభారతి తదితరులు పాల్గొన్నారు.