
ట్రిపుల్ ఆర్ 6 వరుసలతో నిర్మించనున్నందున డిజైన్లలో మార్పు
టెండర్ డాక్యుమెంట్ వివరాల్లో కూడా మార్పులు.. అవసరమైతే కొత్త టెండర్
రింగు రోడ్డులో 11 ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్లు, 3 పెద్ద వంతెనలు, 190 చిన్న వంతెనలు
అన్నీ ఎనిమిది వరుసలుగానే నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)ను నాలుగు వరుసలకు బదులు ఒకేసారి ఆరు వరుసలుగా నిర్మించాలని భావిస్తున్న ఎన్‌హెచ్‌ఏఐ.. ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్లు, వంతెనలు, అండర్‌పాస్‌లున్న చోట మాత్రం 8 లేన్లతో రోడ్డును నిర్మించాలని నిర్ణయించింది. ప్రధాన క్యారేజ్‌వే (రోడ్డు) ఆరు వరుసలుగా నిర్మించటం ఖరారైతే, వంతెనలుండే చోట 8 వరసలుగానే నిర్మించనున్నారు.
ఈ మేరకు అన్ని డిజైన్లు మారుస్తున్నారు. ఇప్పటికే రోడ్డు నిర్మాణానికి సంబంధించి టెండర్లు పిలిచి ఉన్నందున, టెండర్ డాక్యుమెంటులో కూడా వివరాలను మారుస్తున్నారు. టెండర్ పిలిచేనాటికి నాలుగు వరసలుగా మాత్రమే రోడ్డును నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఆలోచన మారినందున, అదే టెండర్‌ను కొనసాగించాలా, కొత్త టెండర్ పిలవాలా అన్న విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
55 మీటర్ల వెడల్పుతో ఇంటర్‌ఛేంజ్‌లు, వంతెనలు
» ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో 11 చోట్ల ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్లు నిర్మిస్తారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే చోట ఈ నిర్మాణాలుంటాయి. ఆయా రోడ్ల నుంచి రింగురోడ్డు మీదకు, రింగురోడ్డు నుంచి ఆయా రోడ్లకు వాహనాలు మారేందుకు వీలుగా లూప్ రోడ్లను అనుసంధానిస్తారు.
» ఇవి కాకుండా 3 నదులపై భారీ ఫ్లైఓవర్లు ఉంటాయి. మూసీ నది మీద వలిగొండ మండలం పొద్దుటూరు వద్ద కి.మీ. నిడివితో, మంజీరా నది మీద పుల్కల్ మండలం శివ్వంపేట వద్ద 600 మీటర్ల నిడివితో, తూప్రాన్ వద్ద హరిద్రా నది(హల్దీవాగు) మీద 500 మీటర్ల పొడవుతో వంతెనలు నిర్మిస్తారు.
» చిన్న రోడ్లు, నీటి కాలువలు క్రాస్ అయ్యే 105 ప్రాంతాల్లో వంతెనలు నిర్మించేందుకు ప్లాన్ చేశారు. ఈ ప్రాంతంలో రోడ్డు 5.5 మీటర్ల ఎత్తుతో ఉంటుంది.
» చెక్‌డ్యామ్స్, చెరువు కాలువలు, గుట్టల నుంచి జాలువారే కాలువలను క్రాస్ చేసే చోట్ల 85 కల్వర్టులుంటాయి. ఈ ప్రదేశాలన్నిటి వద్ద ప్రధాన రోడ్డు 8 వరుసలతో, 55 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారు.
ఒక్కో లేన్ 5.31 మీటర్ల వెడల్పు
ఒక్కోవైపు నాలుగు వరుసలతో మొత్తం ఎనిమిది వరుసలుగా ట్రిపుల్ ఆర్ ఉంటుంది. ఒకవైపు నాలుగు వరసలు కలిపి 21.25 మీటర్ల వెడల్పు ఉంటుంది. అంటే ఒక్కో లేన్ 5.31 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ రెంటి మధ్య సెంట్రల్ మీడియన్ 12.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆర్‌ఆర్‌ఆర్ కింద ఉండే రాష్ట్ర, జాతీయ రోడ్లను అనుసంధానించే లూప్‌లు ఒక్కోవైపు 7.5 మీటర్ల వెడల్పుతో ప్రారంభమవుతాయి. రెండు వైపులా కలిపి 15 మీటర్ల వెడల్పు ఉంటాయి. ఈ లూప్‌లు ఉండే చోట మొత్తం రోడ్డు వెడల్పు ఏకంగా 70 మీటర్లు ఉండనుండటం విశేషం.
150 ఎకరాల వైశాల్యంలో ఇంటర్‌ఛేంజ్ కూడలి
ఉత్తర రింగులో 11 చోట్ల జాతీయ, రాష్ట్ర రహదారులను ట్రిపుల్ ఆర్ క్రాస్ చేస్తుంది. ఆయా ప్రాంతాల్లో ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్లు నిర్మిస్తారు. ఎనిమిది వరుసలతో నిర్మాణం చేపట్టాలని తాజాగా నిర్ణయించినందున ఈ స్ట్రక్చర్లు అతి భారీగా ఉండబోతున్నాయి. ఔటర్ రింగురోడ్డును కూడా 8 వరుసలతో నిర్మించినా, దానిమీద ఉండే ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్లు ఇంత భారీగా లేవు. ఓఆర్‌ఆర్‌ను సాధారణ జాతీయ రహదారి ప్రమాణాలతోనే నిర్మించారు. అయితే రీజినల్ రింగురోడ్డును ఎక్స్‌ప్రెస్‌వే ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. దీనిపై 120 కి.మీ.కు మించి వేగానికి అనుమతి ఉంటుంది.
ప్రధాన క్యారేజ్‌వే నుంచి దిగువ రోడ్లలోకి మారేప్పుడు ఉండే లూప్‌ల మీద వాటి వేగం 60 కి.మీ. నుంచి 80 కి.మీ. వరకు ఉంటుంది. ఓఆర్‌ఆర్ లూప్స్‌లో వేగ పరిమితి 30 కి.మీ. మాత్రమే కావడం గమనార్హం. కాగా 60–80 కి.మీ వేగంలో మలుపు తిరగాలన్నప్పుడు లూప్ వ్యాసార్ధం ఎక్కువగా ఉండాలి. దీంతో ఈ లూప్‌లు కిలోమీటరున్నర దూరం నుంచే ప్రారంభమై వంపు తిరుగుతాయి. ఇందుకోసం ఒక్కో ఇంటర్‌ఛేంజ్ కూడలిని 120–150 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించనున్నారు.