ఫ్యాక్టరీ కోసం డిజైన్ మార్పు
ప్రజ్ఞాపూర్ వద్ద రాజీవ్ రహదారిని క్రాస్ చేయనున్న రీజనల్ రింగ్‌రోడ్డు
అక్కడ నాలుగు లూప్‌ల బదులు మూడింటితోనే ఇంటర్‌చేంజ్ డిజైన్
దశాబ్దాలుగా ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమను తొలగించలేక ఈ నిర్ణయం
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఓ భారీ ప్రైవేటు పరిశ్రమ కోసం రీజనల్ రింగురోడ్డు ఇంటర్‌చేంజ్ డిజైన్ మారింది. ముందుగా ఎంచుకున్న డిజైన్‌లో రింగురోడ్ కూడలి నిర్మిస్తే.. ఆ పరిశ్రమను తొలగించాల్సిన పరిస్థితి. అది స్థానికంగా నిరసనకు కారణమవుతుందన్న ఉద్దేశంతో ఇంటర్‌చేంజ్ డిజైన్‌ను మార్చారు. నాలుగు లూప్‌లతో నిర్మించడానికి బదులు.. ఆ పరిశ్రమ వైపు లూప్ లేకుండా మూడింటితోనే ఇంటర్‌చేంజ్ డిజైన్‌ను ఖరారు చేశారు. - సాక్షి, హైదరాబాద్
రోడ్డు లేఔట్ మార్చే వీలు లేక..
తూప్రాన్ నుంచి గజ్వేల్ పక్కగా వచ్చే రీజనల్ రింగురోడ్డు హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారిని ప్రజ్ఞాపూర్‌కు కాస్త ముందుగా క్రాస్ చేస్తుంది. రాజీవ్ రహదారి మీద వాహనాల రద్దీ ఎక్కువ. ఇలా అధిక రద్దీ ఉన్న రోడ్లను రీజనల్ రింగ్‌రోడ్డు క్రాస్ చేసేచోట.. నాలుగు లూప్‌లతో ఉండే క్లోవర్ లీఫ్ డిజైన్‌తో ఇంటర్‌చేంజ్ జంక్షన్లను నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. ఈ మేరకు ప్రజ్ఞాపూర్ సమీపంలో క్లోవర్ లీఫ్ డిజైన్‌తో ఇంటర్‌చేంజ్ నిర్మించాల్సి ఉంది. కానీ ఇంటర్ చేంజ్‌కు ఉండే నాలుగు లూప్‌లలో ఒక లూప్ కట్టాల్సిన చోట ఓ బ్రేక్ లైనర్స్ తయారీ పరిశ్రమ ఉంది.
అదే డిజైన్‌తో నిర్మిస్తే.. ఆ పరిశ్రమను తొలగించాల్సిన పరిస్థితి. ఇలా జరగకుండా రింగ్‌రోడ్డును కాస్త అటువైపో, ఇటువైపో జరపడానికీ వీలు లేకుండా పోయింది. ఆర్‌ఆర్‌ఆర్‌ను హైదరాబాద్ వైపు జరపాలనుకుంటే.. ఓవైపు కొండపోచమ్మ సాగర్ జలాశయం, మరోవైపు వందల ఎకరాల్లో విస్తరించిన సామాజిక అటవీ ప్రాంతం అడ్డు వస్తున్నాయి. అదే గజ్వేల్ వైపు జరపాలనుకుంటే.. వేల ఇళ్లతో నిర్మించిన పునరావాస కాలనీ, గజ్వేల్ రింగురోడ్డు కూడలి అడ్డు వస్తున్నాయి.
ఒకవేళ పరిశ్రమను తొలగించాలనుకుంటే.. దశాబ్దాలుగా స్థానికులకు ఉపాధినిస్తున్న పరిశ్రమను తొలగిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత రావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. ఇంటర్‌చేంజ్ డిజైన్‌ను మూడు లూప్‌లకు మార్చారు. మరో లూప్‌కు బదులు.. పరిశ్రమ ప్రహరీని ఆనుకుని రెండు కారిడార్లను నిర్మించి, ఇటు రాజీవ్ రహదారికి, అటు ‘రీజనల్’ప్ర«దాన వేకు అనుసంధానం చేసేలా డిజైన్‌ను సిద్ధం చేశారు. అయితే మార్పుల వల్ల అదనంగా కొంత రోడ్డు, రెండు వంతెనలు నిర్మించాల్సి వస్తుందని.. దాదాపు రూ.30 కోట్ల వరకు ఖర్చు పెరుగుతుందని అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment