ట్రిపుల్‌ ఆర్‌ పరిహారం పంపిణీ షురూ | Distribution of Regional Ring Road compensation begins | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఆర్‌ పరిహారం పంపిణీ షురూ

Published Wed, Apr 2 2025 3:43 AM | Last Updated on Wed, Apr 2 2025 3:43 AM

Distribution of Regional Ring Road compensation begins

ఉత్తర భాగంలో 1,950 హెక్టార్లకు రూ.5,100 కోట్ల పరిహారం 

రాష్ట్రం వాటా రూ.2,550 కోట్లు.. బడ్జెట్‌లో రూ.1,250 కోట్లు  

కేంద్రం పర్యావరణ అనుమతులివ్వటంతో పరిహారం ప్రక్రియ ప్రారంభం 

‘కాలా’ల వారీగా అవార్డుల పాస్‌ మొదలు 

వేగంగా పరిహారం పంపిణీ, భూముల మ్యుటేషన్‌కు చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగురోడ్డు (ట్రిపుల్‌ ఆర్‌) ఉత్తర భాగం అలైన్‌మెంటులో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు మార్గం సుగమమైంది. ఉత్తర భాగానికి తాజా గా కేంద్ర అటవీ శాఖ పర్యావరణ అనుమతులు జారీ చేయటంతో గ్రామాల వారీగా అవార్డులు పాస్‌చేయటం ప్రారంభించారు. త్వరలో పరిహారం డబ్బులు వారి ఖాతాల్లో జమ చేసేందుకు ఎన్‌హెచ్‌ఏఐ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. 

ఉత్తర భాగంలో 1,950 హెక్టార్ల మేర భూమిని సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి నిర్వాసితులకు రూ.5,100 కోట్లను పరిహారంగా అందించాల్సి ఉంది. దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.2,550 కోట్లు భరించాల్సి ఉండగా, ఇటీవలి బడ్జెట్‌లో ట్రిపుల్‌ ఆర్‌కు రూ.1,250 కోట్లు ప్రతిపాదించింది. ఈ మొత్తాన్ని పరిహారం కోసమే వినియోగించనున్నారు. 

కేంద్ర ప్రభుత్వం వాటాకు సంబంధించిన నిధులు ఎన్‌హెచ్‌ఏఐ ఖాతాలో జమ అయ్యాయి. ఇప్పుడు భూసేకరణ ప్రాధికార సంస్థ (కాలా)ల వారీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా డబ్బులు ఉమ్మడి ఖాతాలోకి విడుదల కానున్నాయి. అక్కడి నుంచి రైతుల ఖాతాలకు బదిలీ అవుతాయి. 

రోడ్‌ నంబర్‌ నిబంధన నుంచి మినహాయింపు 
కొత్తగా నిర్మించబోయే జాతీయ రహదారులకు రోడ్‌ నంబర్‌ను కేటాయించిన తర్వాతనే పర్యావరణ అనుమతులు వస్తాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచి్చంది. దీంతో ట్రిపుల్‌ ఆర్‌కు ఎక్స్‌ప్రెస్‌ వే నంబర్‌ కేటాయించటానికి ముందు పర్యావరణ అనుమతులు జారీ చేసేందుకు వీలు కలిగింది. ట్రిపుల్‌ ఆర్‌ బడ్జెట్‌కు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అప్రూవల్‌ రావాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే దానికి నంబర్‌ కేటాయిస్తారు. ఈ ప్రక్రియ పూర్తవటానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. 

ఇప్పటికే ఉత్తరభాగం 162 కి.మీ. నిడివి రోడ్‌ నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచింది. రెండు పర్యాయాలు గడువు కూడా పొడిగించింది. పర్యావరణ అనుమతులు రాకుండా టెండర్లను తెరిచేందుకు వీలుండదు. ఫలితంగా టెండర్ల గడువు పొడిగిస్తూ వెళ్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే పర్యావరణ అనుమతుల జారీకి కేంద్రం ఓకే చెప్పింది.  

80% మ్యుటేషన్‌ అయ్యాకే పనులు..: రోడ్‌ నిర్మించే సంస్థను ఎంపిక చేసేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. అక్కడి సాంకేతిక సమస్యలు పరిష్కరించుకున్న తర్వాత వాటిని ఓపెన్‌ చేసి నిర్మాణ సంస్థను ఖరారు చేస్తారు. అప్పటికి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావాలంటే, మొత్తం అలైన్‌మెంట్‌ నిడివిలో 80 శాతం భూమికి సంబంధించిన మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. వీలైనంత వేగంగా, ఎలాంటి సాంకేతిక, న్యాయ సంబంధిత చిక్కులు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

త్వరలో మ్యుటేషన్‌..
భూపరిహారం జారీకి వీలుగా కాలా (భూసేకరణ ప్రాధికార సంస్థ)ల వారీగా అవార్డుల జారీ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కాలాల పరిధిలోని గ్రామాలవారీగా రైతులు, వారి అ«దీనంలో ఉన్న భూముల వివరాలను అధికారులు సేకరించారు. ఆయా రైతులను కాలా కార్యాలయానికి పిలిపించి అవార్డులపై సంతకాలు తీసుకుంటున్నారు. రైతు భూమి విస్తీర్ణం, ఆ భూముల్లోని నిర్మాణాలు, విలువైన తోటలు, చెట్లు, ఇతర నిర్మాణాలు, కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం వాటికి చెల్లించే మొత్తం.. తదితర వివరాలను తెలుపుతున్నారు. 

ఈ ప్రక్రియ పూర్తి కాగానే వారి ఖాతాల్లో పరిహారం నగదు జమ చేయనున్నారు. మరో నెలన్నరలో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైనా భూ యజమానులు ఈ పరిహారం మొత్తాన్ని తీసుకునేందుకు ససేమిరా అంటే ఆర్బిట్రేషన్‌ ప్రకారం మరోసారి పరిశీలించి తుది మొత్తాన్ని ఖరారు చేస్తారు. 

అప్పటికి కూడా ఆ మొత్తం తక్కువగా ఉందన్న కారణంతో తీసుకునేందుకు నిరాకరించే పక్షంలో కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఖాతాలో జమ చేస్తారు. ఖాతాల్లో జమ చేసిన తర్వాత భూముల దస్తావేజులను అధికారులు సేకరించి భూమి మ్యుటేషన్‌ చేయిస్తారు. దీంతో ఆ భూములు ఎన్‌హెచ్‌ఏఐ అధీనంలోకి వెళ్తాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement