రీజనల్ రింగ్ రోడ్డు నిర్వాసిత రైతుల్లో తీవ్ర ఆందోళన
చట్ట ప్రకారం చెల్లిస్తామంటున్న అధికారుల తీరుపై విమర్శలు
మా జీవనాధారం కోల్పోతున్నాం.. పరిహారంపై స్పష్టత ఏది?
ఎంతో విలువైన భూములివి.. ఎకరాకు రూ.కోటి చెల్లించాల్సిందే
లేకుంటే భూములు ఇచ్చేదే లేదంటున్న నిర్వాసితులు
ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను కలసి విజ్ఞప్తులు
పరిహారం నిర్ణయం రెవెన్యూ అధికారులే చేస్తారనడంతో నిరాశగా వెనుదిరుగుతున్న తీరు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తమకు ఇచ్చే పరిహారం ఎంతనేది తేల్చకుండానే.. రహదారి నిర్మాణానికి టెండర్లు పిలవడం ఏమిటని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. తరతరాలుగా తమ జీవనాధారమైన భూములను కోల్పోతే ఎలా బతకాలని నిలదీస్తున్నారు. ఎంతో విలువైన ఈ భూములకు కనీసం ఎకరాకు రూ.కోటిపైగా చెల్లించాల్సిందేనని, లేకుంటే భూములు ఇచ్చేదే లేదని పేర్కొంటున్నారు.
త్వరలో భూసేకరణ అవార్డు..
‘రీజనల్’ఉత్తర భాగం కింద 161.581 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఇటీవల టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. తొలివిడతలో సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వరకు.. మొత్తం ఐదు ప్యాకేజీలుగా ఈ రహదారిని నిర్మించనున్నారు. దీని కోసం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో 3,429 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు.
ఈ మేరకు భూములు కోల్పోతున్న రైతుల వివరాలతో ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. సర్వే ప్రక్రియ కూడా పూర్తయింది. పరిహారం నిర్ణయించేందుకు... ఆయా గ్రామాల్లో ఇటీవల జరిగిన భూముల క్రయవిక్రయాల వివరాలను అధికారులు సేకరించి ప్రభుత్వానికి పంపారు. కానీ ఎకరానికి ఎంత మొత్తం చెల్లిస్తారనేది తేలలేదు.
రెవెన్యూ అధికారుల తీరుపై విమర్శలు
ఈ భూసేకరణ ప్రక్రియలో రెవెన్యూ ఉన్నతాధికారుల ధోరణిని రైతులు తప్పుపడుతున్నారు. నిర్వాసితులకు కనీస సమాచారం ఇవ్వకుండా, కేవలం చట్టప్రకారం వ్యవహరిస్తామంటున్నారే తప్ప ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. భూముల విలువలు కొన్నేళ్లుగా భారీగా పెరిగాయని, దానికితోడు తాము జీవనాధారమూ కోల్పోతున్నామని... ఇలాంటి పరిస్థితుల్లో తగిన పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
ప్రాజెక్టు కార్యాలయానికి నిర్వాసితులు..
తమ భూములకు ఇచ్చే పరిహారం తేల్చకుండానే టెండర్ల ప్రక్రియ ప్రారంభమైనా కూడా స్థానిక రెవెన్యూ అధికారులు దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ.. నిర్వాసితులు ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల వద్దకు వెళ్లి నిలదీస్తున్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఉన్న ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు యూనిట్ కార్యాలయానికి పీడీని కలసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. పరిహారంపై నిర్ణయం రెవెన్యూ అధికారులే తీసుకుంటారని వారు చెప్పడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు.
వాళ్లు చెప్పడం లేదు.. వీళ్లు తేల్చడం లేదు..
మా భూముల నుంచి రోడ్డు వేస్తామంటున్నారు. ఈ రోడ్డుకు టెండర్లు కూడా మొదలయ్యాయట. కానీ మా భూములకు ఎంత ఇస్తారో తేల్చడం లేదు. రెవెన్యూ అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదు. నేషనల్ హైవే అధికారులను అడిగితే వారు రెవెన్యూ వారే చెబుతారంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. – గొల్ల కృష్ణ, నిర్వాసితరైతు, గిర్మాపూర్, సంగారెడ్డి జిల్లా
చట్ట ప్రకారం చెల్లిస్తాం
రీజనల్ రోడ్డు భూసేకరణ ప్రక్రియపై త్వరలో అవార్డు ప్రకటిస్తాం. నిర్వాసితులకు చట్టప్రకారం పరిహారం చెల్లిస్తాం. ఎకరానికి ఎంత చొప్పున ఇస్తారని లెక్కించేందుకు ఓ విధానం ఉంటుంది. ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – రవీందర్‌రెడ్డి, భూసేకరణఅధికారి, రీజనల్ రింగ్ రోడ్డు
Comments
Please login to add a commentAdd a comment