దక్షిణ భాగం భూసేకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి
ఉత్తర భాగం ఇప్పటికే చాలావరకు పూర్తయ్యింది
రోజువారీ పురోగతి నాకు తెలియజేయాలి
ఉన్నతాధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ‘సంగారెడ్డి–ఆమన్‌గల్–షాద్‌నగర్–చౌటుప్పల్ (189.20 కి.మీ.) మీదుగా నిర్మించే రీజనల్ రింగు రోడ్డు దక్షిణ భాగానికి సంబంధించి భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించాలి. ఉత్తర భాగంలో ఇప్పటికే భూ సేకరణ చాలావరకు పూర్తయినందున, దక్షిణ భాగం కోసం కూడా ప్రారంభించాలి. భూ సేకరణలో పారదర్శకంగా వ్యవహరించాలి. ఈ రోడ్డు విషయంలో ఏవైనా సాంకేతిక, ఇతర సమస్యలుంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలి. పనుల్లో మాత్రం జాప్యం లేకుండా చూడాలి..’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ట్రిపుల్ ఆర్ పురోగతిపై సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.
‘భవిష్యత్ అవసరాలే ప్రాతిపదికగా దక్షిణ భాగం అలైన్‌మెంట్ ఉండాలి. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. (రోడ్డు అలైన్‌మెంటు మ్యాప్‌ను గూగుల్ మ్యాప్‌తో బేరీజు వేసుకుంటూ ముఖ్యమంత్రి పరిశీలించారు. దక్షిణ భాగం ప్రతిపాదిత అలైన్‌మెంట్‌లో కొన్ని మార్పులను సూచించారు). నేను సూచించిన మార్పులపై క్షేత్ర స్థాయిలో పర్యటించి సమగ్ర నివేదికను త్వరగా అందజేయాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రోజువారీ సమీక్షలు నిర్వహించాలి
‘ఆర్‌ఆర్‌ఆర్ పురోగతిపై రోజువారీ సమీక్షలు నిర్వహించాలి. భూ సేకరణ సహా ఇతర అన్ని అంశాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని నాకు అందజేయాలి. ఉత్తర భాగం విషయంలో రోజువారీ పురోగతి, దక్షిణ భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభానికి ఏర్పాట్లు, ఇతర అంశాల వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిరోజు సాయంత్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలపాలి.
సీఎస్‌తో పాటు మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారు శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి ఓఎస్డీ షానవాజ్ ఖాసీం, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అందులో అప్‌డేట్ చేయాలి. ఒక సమీక్ష సమావేశానికి, మరో సమీక్ష సమావేశానికి మధ్య కాలంలో పురోగతి తప్పనిసరిగా ఉండాలి..’ అని రేవంత్ స్పష్టం చేశారు.
రేడియల్ రోడ్లపై ప్లాన్ సిద్ధం చేయాలి
ఫ్యూచర్ సిటీకి సంబంధించి రేడియల్ రోడ్ల నిర్మాణంపైనా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ‘రేడియల్ రోడ్లు ప్రధాన రహదారులతో ఏయే ప్రాంతాల్లో అనుసంధానం చేస్తే మెరుగ్గా ఉంటుందో, సిగ్నలింగ్ సహా ఇతర సమస్యలు ఎదురు కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్లాన్ సిద్ధం చేయాలి. అవి ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ల అనుసంధానానికి అనువుగా ఉండాలి.
ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న వివిధ పరిశ్రమలు, సంస్థలకు ఉపయోగకరంగా ఉండేలా చూడాలి..’ అని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి ఓఎస్డీ షానవాజ్ ఖాసీం, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు.
15 నాటికి ఉత్తర భాగం భూసేకరణ పూర్తి: మంత్రి కోమటిరెడ్డి
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన మిగతా భూసేకరణ వచ్చేనెల 15 నాటికి పూర్తి చేసి కేంద్రానికి నివేదిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆ వెంటనే టెండర్ నోటిఫికేషన్ జారీ అవుతుందని అన్నారు. ట్రిపుల్ ఆర్ పై సీఎం సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
హైదరాబాద్–విజయవాడ (ఎన్.హెచ్–65) రోడ్డు పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదం తెలిపిందని, రెండు నెలల్లో టెండర్లు పిలిచి నవంబర్ నాటికి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే మన్నెగూడ ఎక్స్‌ప్రెస్‌వే పనులు ప్రారంభించామని, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడర్ పనులు త్వరలో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రెండేళ్లలో రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులను గొప్పగా రూపొందిస్తామని, అవసరమైన సాయం కోసం త్వరలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment