సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, సీతక్క
రింగు రోడ్డు నిర్వాసితుల విషయంలో ఉదారంగా వ్యవహరించండి
వేగంగా ‘ఉత్తర’ భూసేకరణ పూర్తి చేయండి
అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
రైతులతో సమావేశమై రహదారి ప్రయోజనాలను వివరించండి
దక్షిణ భాగం నిర్మాణానికి హెచ్‌ఎండీఏతో అలైన్‌మెంట్ చేయించాలని సూచన
గ్రామీణ రోడ్లకు వెయ్యి కోట్లు కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు భూనిర్వాసితులకు మెరుగైన పరిహారం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పరిహారంలో ఉదారంగా వ్యవహరించాలని... ఆర్బిట్రేటర్లుగా ఉన్న జిల్లా కలెక్టర్లు వీలైనంత మేర దాన్ని ఖరారు చేయాలని సూచించారు. సీఎం రేవంత్ శుక్రవారం రాత్రి రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమీక్షించారు. రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
భూసేకరణ సమయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించాలని, తరచూ రైతులతో సమావేశమై రహదారి నిర్మాణంతో కలిగే ప్రయోజనాలను వివరించాలని సూచించారు. రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగం నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపినందున.. హెచ్‌ఎండీఏతో అలైన్‌మెంట్ చేయించాలని ఆదేశించారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌ను కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగురోడ్డు మధ్య అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
ఇతర ప్రధాన రహదారులపై ఫోకస్
మంచిర్యాల– పెద్దపల్లి– భూపాలపల్లి– వరంగల్– హన్మకొండ– మహబూబాబాద్– ఖమ్మం మీదుగా సాగే నాగ్‌పూర్–విజయవాడ రహదారి... ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల రహదారి.. జగిత్యాల–కరీంనగర్ రహదారుల నిర్మాణంతోపాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల (ఎల్‌డబ్ల్యూఎఫ్) రోడ్ల నిర్మాణంపైనా సీఎం రేవంత్ సమీక్షించారు. ఈ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, అటవీ అనుమతుల్లో ఆటంకాలను అధిగమించేందుకు పలు సూచనలు చేశారు.
ప్రజలకు ఉపయోగపడే రహదారుల నిర్మాణంలో అటవీ శాఖ ఎందుకు కొర్రీలు పెడుతోందని ‘ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (పీసీసీఎఫ్)’డోబ్రియల్‌ను ప్రశ్నించారు. పలు అంశాల్లో నిబంధనలు పాటించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని సీఎంకు పీసీసీఎఫ్ బదులిచ్చారు. దీనితో రాష్ట్రస్థాయిలో తేల్చగల సమస్యలను ఇక్కడే పరిష్కరిస్తామని.. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ వరకు వెళ్లే అంశాలపై వెంటనే నివేదిక రూపంలో సమర్పించాలని సూచించారు.
ఆర్‌అండ్‌బీ, అటవీ శాఖల నుంచి ఒక్కో అధికారిని ప్రత్యేకంగా ఈ సమస్యల పరిష్కారం కోసం కేటాయించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సీఎస్ వారితో పదిరోజులకోసారి సమీక్షించి త్వరగా క్లియరెన్సులు వచ్చేలా చూడాలని... ఇక్కడ కాకపోతే సంబంధిత మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి, అధికారులను కలవాలని స్పష్టం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అండర్ పాస్‌ల ఏర్పాటును విస్మరిస్తుండటంతో రైతులు ఇబ్బందిపడుతున్నారని సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గుర్తుచేశారు. దీనితో ఈ సమస్య ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణంపై...
హ్యామ్ విధానంలో ఆర్‌అండ్‌బీ పరిధిలో 12 వేల కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్లు రహదారులు నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ రహదారుల నిర్మాణానికి సంబంధించి పాత జిల్లాలను యూనిట్‌గా తీసుకోవాలని సూచించారు. కన్సల్టెన్సీల నియామకం, డీపీఆర్‌ల తయారీ, వేగంగా పనులు చేపట్టడంపై దృష్టి సారించాలని... మూడేళ్లలో నిర్మాణం పూర్తికావాలని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని, కూలిన వంతెనలను వెంటనే నిర్మించాలని ఆదేశించారు.
రహదారుల నిర్మాణం, మరమ్మతులకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులు వెంటనే విడుదల చేసి.. కేంద్రం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్‌ను పొందాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు
రాష్ట్రంలో గ్రామీణ రహదారుల నిర్మాణానికి సీఎం రూ.వెయ్యి కోట్లను కేటాయించారు. ఈ నెల నుంచే నెలకు రూ.150 కోట్ల చొప్పున ఈ నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. గతంలో ఎడ్ల బండ్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్ల రాకపోకలకు అనుగుణంగా గ్రామ రోడ్లను నిర్వహించేవారని.. ఇప్పుడు అన్నిచోట్లా కార్లు, ట్రాక్టర్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు తిరుగుతున్నందున వాటి రాకపోకలకు వీలుగా రోడ్లను వెడల్పు చేయాలని సూచించారు.
ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు ఉండాలని, గ్రామాల నుంచి మండలాలకు సింగిల్ రోడ్లు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు కచి్చతంగా ఉండాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రహదారుల నిర్మాణ నాణ్యతలో తేడాలు చూపొద్దని స్పష్టం చేశారు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాలకు సైతం రహదారులు నిర్మించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment