వికారాబాద్ జిల్లాలోకి వచ్చేలా అలైన్‌మెంట్ మార్పు
ఎన్‌హెచ్‌ఏఐ ప్రణాళిక ప్రకారం 189.25 కిలోమీటర్లే
రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనలో దక్షిణంతో పాటు ఉత్తర భాగం విస్తీర్ణంలోనూ పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రగతిపై ఎంతో ప్రభావం చూపించే రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మారుతోంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రణాళిక ప్రకారం దక్షిణ భాగం రింగ్‌రోడ్డు విస్తీర్ణం 189.25 కిలోమీటర్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రాథమికంగా రూపొందించిన ప్రతిపాదన ప్రకారం దాని విస్తీర్ణం 194 కిలోమీటర్లకు పెరిగింది. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం (సంగారెడ్డి–తూప్రాన్–చౌటుప్పల్) 158 కిలోమీటర్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూపొందించిన అలైన్‌మెంట్ ప్రకారం 194 కిలోమీటర్ల వరకు పెరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాను కూడా కలుపుతూ దక్షిణ భాగం అలైన్‌మెంట్ రూపొందించినట్లు స్పష్టమవుతోంది. కొత్తగా కొన్ని గ్రామాలను కలపడం వల్ల విస్తీర్ణం పెరిగినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఉత్తర భాగానికి సంబంధించిన భూ సేకరణ కార్యక్రమం కూడా దాదాపు పూర్తయింది. త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉంది. కాగా దక్షిణ భాగం వైపు ఎన్‌హెచ్‌ఏఐ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి 189.25 కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారికి సంబంధించిన మ్యాప్‌లను సిద్ధం చేసింది.
వాటిని ప్రభుత్వ ఆమోదానికి పంపించాల్సిన సమయంలోనే లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భాగం ఆర్‌ఆర్‌ఆర్‌ను తామే నిర్మించుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. అంతేకాక దక్షిణ భాగం ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ పేరిట ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు.
ఎన్‌హెచ్‌ఏఐ రూపొందించిన అలైన్‌మెంట్‌లో పేర్కొన్న పలు గ్రామాలు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మ్యాప్ ప్రకారం రహదారి బయటకు వెళ్లగా, కొన్ని గ్రామాలు లోపలికి వచ్చాయి. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తే ఇందులో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment