భూసేకరణలో రైతుల పట్ల మానవీయకోణంతో వ్యవహరించాలి
రైతులతో కలెక్టర్లు నేరుగా మాట్లాడి ఒప్పించండి
రీజినల్ రింగురోడ్డు భూసేకరణలో వేగం పెంచండి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులకు భూములిచ్చిన రైతుల విషయంలో మానవీయకోణంలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం వచ్చే గరిష్ట పరిహారం రైతులకు దక్కేలా చూడాలన్నారు. తెలంగాణలో రహదారుల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌హెచ్‌ఏఐ(నేషనల్‌హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులు మంగళవారం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. ఆయా అంశాలను కొలిక్కి తెచ్చేందుకు, సంబంధిత జిల్లాల కలెక్టర్లు, విభాగాల ఉన్నతాధికారులతో బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు.
భూసేకరణ ఎందుకు ఆలస్యమవుతోందని అధికారులను సీఎం ప్రశ్నించారు. భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువ ఉండటం, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకురావడం లేదని కలెక్టర్లు ఆయన దృష్టికి తెచ్చారు. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూములను శాశ్వతంగా కోల్పోతున్నప్పుడు రైతుల్లో ఆవేదన ఉంటుందని, దానిని అధికారులు గుర్తించాలన్నారు. రైతులను పిలిచి మాట్లాడి వారిని ఒప్పించాలని సూచించారు. రీజినల్‌రింగురోడ్డు దక్షిణభాగం, ఉత్తరభాగం వేర్వేరుగా చూడొద్దని, ఆ రెండింటికి కలిపి ఒకే ఎన్‌హెచ్ నంబర్ కేటాయించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరగా, ఆయన సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్‌హెచ్‌ఏఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందం (ట్రైపారి్టయేట్ అగ్రిమెంట్) కుదుర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. వెంటనే దానిని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగం భూసేకరణలో ఉన్న ఆటంకాలపై ఆయన ప్రశ్నించారు. అలైన్‌మెంట్ విషయంలో పొరపడి కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారని, దీంతో హైకోర్టు స్టే ఇచ్చిందని యాదాద్రి భువనగిరి కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు.
స్టే తొలగింపునకు వచ్చే శుక్రవారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని సూచించారు. అలాగే ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల, విజయవాడ–నాగ్‌పూర్ కారిడార్‌లకు సంబంధించి అటవీశాఖ భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములు కేటాయించాలని నిజామాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లకు సూచించారు. హైదరాబాద్–మన్నెగూడ రహదారి పనులు త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
రెండునెలల్లో హైదరాబాద్–విజయవాడ విస్తరణ పనులు
హైదరాబాద్–విజయవాడ జాతీయరహదారిని ఆరు లేన్లుగా విస్తరించే పనులను వెంటనే చేపట్టాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్‌హెæచ్‌ఏఐ ప్రాజెక్టు మెంబర్ అనిల్‌చౌదరిని కోరారు. రెండునెలల్లో పనులు ప్రారంభిస్తామని ఆయన బదులిచ్చారు.
సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ఓఎస్డీలు శేషాద్రి, మాణిక్ రాజ్, చంద్రశేఖర్‌రెడ్డి, షానవాజ్ ఖాసిం, మౌలిక వసతుల సలహాదారు శ్రీనివాసరాజు, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి రజాక్, పీసీసీఎఫ్ డోబ్రియల్, ఆర్‌అండ్‌బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, జాయింట్ సెక్రటరీ హరీ‹Ù, మెదక్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్ కలెక్టర్లు పాల్గొన్నారు.
సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలి: భట్టి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నాగపూర్–అమరావతి జాతీయ రహదారి నిర్మాణంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. జాతీయ రహదారుల భూసేకరణ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయం నుంచి సమీక్షించగా, ఖమ్మం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ పాల్గొన్నారు.
జాతీయ రహదారుల వెంట వ్యవసాయ వాహనాలు, రైతులు వినియోగించుకునేలా గ్రావెల్ రోడ్లు నిర్మించాలనే ప్రతిపాదన సమీక్షలో చర్చకు వచ్చి0ది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఎన్‌హెæచ్‌ఏఐ ప్రాజెక్టు మెంబర్ అనిల్‌చౌదరి తెలిపారు. గ్రావెల్ రహదారి నిర్మించడం వల్ల రైతులకు ఉపయోగపడడంతో పాటు భవిష్యత్‌లో రహదారి విస్తరణకు ఇబ్బందులు ఉండవని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత భట్టి మాట్లాడుతూ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నాగపూర్–అమరావతి రహదారిలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం అందించాలని, ధంసలాపురం వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఇవ్వాలని కోరారు. తల్లాడ–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ రహదారి పనులు సాగుతున్నందున, ప్రస్తుతం ఖమ్మం నుంచి అశ్వారావుపేట వరకు ఉన్న జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సూచిస్తున్నారని, దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని, జాతీయ రహదారిగానే దానిని కొనసాగించాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment