భూముల మార్కెట్ విలువ సవరించాలని నిర్ణయం
జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు
ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారి హరిచందన
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డులోని దక్షిణ భాగం పరిధిలో సేకరించే భూములకు పరిహారం భారీగా పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రింగురోడ్డు ఉత్తర భాగాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతుండగా, దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. భూసేకరణ ప్రక్రియలో భాగంగా అవార్డులు పాస్ చేసి పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ భాగంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రింగురోడ్డు అలైన్‌మెంటును ఖరారు చేసే కసరత్తు మొదలుపెట్టింది.
ఆమేరకు భూసేకరణ జరగాల్సి ఉంది. పరిహారం మొత్తం పెంచి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా భూముల మార్కెట్ విలువను పెంచాలని నిర్ణయించింది. మార్కెట్ విలువ పెంచి పరిహారాన్ని భూసేకరణ, పునరావాస చట్టం–2013 ప్రకారం చెల్లించనుంది.
మార్కెట్ విలువలు పెంచేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలంటూ రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మహబూబ్‌నగర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. భూ యజమానులకు చట్టబద్ధంగా పరిహారం అందాలని, నష్టపోయామనే భావన వారిలో ఎక్కువగా కనిపించొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రాజెక్టు నిర్వహణ విభాగం ఏర్పాటు
భారీ రోడ్డు ప్రాజెక్టులు నిర్వహించే ఎన్‌హెచ్‌ఏఐలో మాదిరి దక్షిణ రింగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓఆర్‌ఆర్‌తో రేడియల్ రోడ్ల ద్వారా అనుసంధానాన్ని ఈ విభాగం ఖరారు చేస్తుంది.
ఇందులో పర్యావరణ విభాగానికి సంబంధించి జిల్లా అటవీ అధికారి, సాంకేతిక విభాగంలో ఒక చీఫ్ ఇంజనీర్, ఇద్దరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, పరిపాలన విభాగానికి సంబంధించి అకౌంటెంట్ ఉండనున్నారు. అటవీ, రోడ్లు, భవనాలు, ఆర్థిక శాఖల నుంచి ఈ అధికారులు డిప్యుటేషన్‌పై పనిచేయనున్నారు.
అలాగే, రీజినల్ రింగురోడ్డు పురోగతి పరిశీలనకు ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారి దాసరి హరిచందనను నియమించారు. ఇక దక్షిణ రింగుకు సంబంధించి డీపీఆర్ తయారీ, టెండర్ల వ్యవహారం పర్యవేక్షించేందుకు కన్సల్టెన్సీ సేవలు తీసుకోనుంది. కన్సల్టెన్సీ సంస్థ ఖరారుకు వీలుగా ఆర్‌ఎఫ్‌పీ బిడ్లు ఆహ్వానించాలంటూ రోడ్లు, భవనాల శాఖ ఈఎన్‌సీని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment